అంత బంగారం ఎక్కడిది?

Mon,November 11, 2019 02:01 AM

-డొల్ల కంపెనీల పేరిట సొమ్మును ఏయే ఖాతాల్లోకి మళ్లించారు?
-ఐఎంఎస్ నిందితులపై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం
-రెండోరోజు కస్టడీలో కీలక వివరాలు సేకరణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణం నిందితుల నుంచి ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, జేడీ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ ఇందిర, ఓమ్ని మెడి ఎండీ శ్రీహరిబాబు, ఓమ్ని మెడిలో రిప్రెజెంటేటివ్‌గా పనిచేసిన నాగరాజు తదితరులపై ఆదివారం రెండోరోజు ప్రశ్నల వర్షం కురిపించారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఐదుగురు నిందితులను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఒక్కొక్కరికీ ఒక్కో బృందం చొప్పున ఏర్పడిన అధికారులు ముందస్తుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం పలు అంశాలపై కూపీలాగుతున్నట్టు సమాచారం.

ప్రధానంగా ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి పెద్దమొత్తంలో బంగారం కొనుగోలు చేసినట్టు లభించిన ప్రాథమిక ఆధారాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. రూ.కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏయే జ్యువెలరీల్లో ఆభరణాలు కొనుగోలు చేశారు? నగదు రూపంలో కొంత మొత్తాన్ని బంగారం దుకాణాల నుంచి తీసుకున్నట్టు సేకరించిన ఆధారాలను చూపుతూ ప్రశ్నించినట్టు తెలిసింది. అన్ని ప్రశ్నలకు దేవికారాణి ముక్తసరి సమాధానాలతో సరిపెట్టినట్టు సమాచారం. అదేవిధంగా పెద్దమొత్తంలో ప్రభుత్వ సొమ్ము కాజేసేందుకు డొల్ల కంపెనీలను సృష్టించడంలో పాత్రపై ఓమ్ని మెడి ఎండీ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ, ఆ కంపెనీలో రిప్రజెంటేటివ్‌గా పనిచేసిన నాగరాజు నుంచి వివరాలు సేకరించినట్టు తెలిసింది. డొల్ల కంపెనీల ఖాతాల నుంచి డబ్బును ఏయే బ్యాంకు ఖాతాలకు మళ్లించారన్నదానిపైనా ఏసీబీ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం.

ఈ మొత్తం వ్యవహారంలో జేడీ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ ఇందిరల పాత్రపైనా సమాచారం సేకరించినట్టు తెలిసింది. కస్టడీ సోమవారం ఒక్కరోజే మిగిలి ఉండడంతో మరింత సమాచారం రాబట్టేదుకు ఏసీబీ అధికారులు యత్నిస్తున్నారు. రెండురోజుల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకోవడంతోపాటు ఇప్పటికే లభించిన ప్రాథమిక ఆధారాల సహాయంతో ప్రశ్నావళి రూపొందించుకున్నట్టు తెలిసింది. సోమవారం మరోమారు ప్రశ్నించిన తర్వాత తదరుపరి దర్యాప్తులో ఏమైనా కొత్త కోణాలు వెలుగు చూస్తాయా? అన్నది తేలనున్నది.

1389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles