త్వరలో రోడ్డెక్కనున్న వజ్ర ఏసీ మినీ బస్సులుWed,January 11, 2017 01:44 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వజ్ర ఎయిర్ కండీషనర్ మినీ బస్సులు ఈ నెలాఖరులో రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఏసీ బస్సులను సీఎం కేసీఆర్ చేతులు మీదుగా ప్రారంభించేందుకు తెలంగాణరాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సన్నాహాలు చేస్తున్నది. 22 సీట్ల సామర్ధ్యంతో ఏసీ మినీబస్సులను, 40 సీట్ల సామర్ధ్యంతో నాన్‌ఏసీ బస్సులను టీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టనున్నది.
Luxery-Bus
వంద బస్సుల్లో 60 బస్సులు ఇప్పటికే సంస్థకు చేరాయి. మిగతా బస్సులు ఈ నెల 25వరకు చేరే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాన్ ఏసీ బస్సులను నడిపేందుకు ఇప్పటికే టీఎస్‌ఆర్టీసీ రూట్లను ఎంపిక చేసింది. కాగా, వజ్ర ఏసీ బస్సుల కోసం గతంలో ప్రతిపాదించిన మూడు రూట్లలో తొలి విడతలో బస్సులను నడిపించనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. సంస్థకు ఇప్పటికే 60 మినీబస్సులు చేరడం, మిగతా బస్సులను ఈ నెలాఖరు నాటికి అందిస్తామని బస్సుల తయారీ కంపెనీ భరోసా ఇవ్వడంతో వజ్ర ఏసీ మినీ బస్సులను ఈ నెల 31లోగా ప్రారంభించేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నది.

తొలి విడత రెండు రూట్లలో..


వజ్ర బస్సులను తొలి విడతగా హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ రూట్లో ట్రయల్ రన్‌గా ప్రారంభిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రతిరోజు హైదరాబాద్-వరంగల్ రూట్లో 60 ట్రిప్పులు, హైదరాబాద్- నిజామాబాద్ రూట్లో 36 ట్రిప్పులు ఏసీ వజ్ర బస్సులు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో తొలిసారిగా ఈ బస్సులు ప్రయాణికులు నివసించే సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బోర్డింగ్ పాయింట్ల నుంచి ప్రయాణికులను పికప్ చేసుకుని గమ్యస్థానాల్లో ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసే కేంద్రం వద్ద ప్రయాణికులను విడిచిపెట్టనున్నాయి. దీంతో ప్రయాణికులకు సమయంతో పాటు, బస్సుల కోసం బస్‌స్టేషన్లకు చేరుకునేందుకు రవాణా ఖర్చులు కూడా తగ్గనున్నాయి.

150 బోర్డింగ్ పాయింట్లు:


తొలి విడతలో హైదరాబాద్- వరంగల్, హైదరాబాద్- నిజామాబాద్ రూట్లలో ఎంపిక చేసిన రూట్లలో ఈ బస్సులు సేవలు అందించనున్నాయి. వరంగల్‌కు నాలుగు, నిజామాబాద్‌కు మూడు రూట్లను ఎంపిక చేసి హైదరాబాద్ నుంచి మొత్తం 150 బోర్డింగ్ పాయింట్ల ద్వారా ఈ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రూ.300, హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు రూ. 350 చొప్పున ప్రయాణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్- వరంగల్ రూట్‌కు సంబంధించి హైదరాబాద్‌లో నాలుగు రూట్లు, 100 బోర్డింగ్ పాయింట్లు, వరంగల్‌లో మూడు రూట్లు 46 బోర్డింగ్ పాయింట్లను ఎంపిక చేశారు. అలాగే హైదరాబాద్- నిజామాబాద్ రూట్‌కు సంబంధించి హైదరాబాద్‌లో మూడు రూట్లలో 50 బోర్డింగ్ పాయింట్లు, నిజామాబాద్‌లో మూడు రూట్లలో 39 బోర్డింగ్‌పాయింట్లను ఎంపిక చేశారు. ఇంటికి సమీపంలో ఉండే బోర్డింగ్ పాయింట్ నుంచి ప్రయాణీకులకు వారి వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా టీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకున్నది. ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.

2644
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS