ఆత్మహత్యల్లేని తెలంగాణ ఇదే మా లక్ష్యం


Wed,November 14, 2018 02:11 AM

A state where there is no hunger no suicides has been developed

-పేదరికాన్ని తరిమికొట్టడానికే ప్రాధాన్యం
-2014 మ్యానిఫెస్టోను వందశాతం అమలుచేశాం
-మ్యానిఫెస్టోలోలేని 76 పథకాలనూ అందించాం
-ఎకనమిక్ టైమ్స్ ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్
-ప్రపంచస్థాయి పోటీ తట్టుకునేలా తెలంగాణ విద్యార్థి తయారుకావాలి
-24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు, రైతుబీమాతో రైతాంగంలో ఆత్మైస్థెర్యం
-ఇక్కడ స్థిరపడినవారంతా మావారే
-ఎవరిపట్లా మాకు ద్వేషభావన లేదు
-రుణాలు.. అభివృద్ధికి పెట్టుబడులు
-వాటిని భారంగా పరిగణించరాదు
-దేశంలో గుణాత్మక మార్పు రావాలి
-రొటీన్‌గా కాకుండా.. ప్రజాబడ్జెట్లు ప్రవేశపెట్టాలి
-వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏకు అధికారం కల్ల
-పలు రాష్ర్టాల్లో బలంగా ప్రాంతీయపార్టీలు
-2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ది ముఖ్య భూమిక

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆకలిచావులు, ఆత్మహత్యల్లేని తెలంగాణ రాష్ట్రమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. సమైక్య రాష్ట్రంలో అనేకరంగాల్లో అణచివేత, అన్యాయానికి గురైన తెలంగాణను పునర్నిర్మించేందుకు గత నాలుగున్నరేండ్లలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికామని, ఈ క్రమంలో సవాళ్లను అవకాశాలుగా మలచుకొని అనేక విజయాలు సాధించామని తెలిపారు. ఆంగ్ల దినపత్రిక ఎకనమిక్ టైమ్స్ బ్యూరో ప్రతినిధి సీఆర్ సుకుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి కేసీఆర్.. గత నాలుగేండ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపథాన్ని కండ్ల ముందుంచారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయానికి సైతం 24 గంటలపాటు కోతల్లేని నాణ్యమైన విద్యుత్తును అందించడంతోపాటు రైతుబంధుద్వారా రైతులకు వ్యవసాయ పెట్టుబడి, రైతుబంధు వంటి పథకాలతో తెలంగాణ రైతాంగంలో ఆత్మైస్థెర్యాన్ని నెలకొల్పామన్నారు. ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మనోగతం ఇలా ఉంది..

మ్యానిఫెస్టో వంద శాతం అమలు..

2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. మ్యానిఫెస్టోలో పెట్టని, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఆవశ్యకమని భావించిన 76 అదనపు ప్రభుత్వ పథకాలను కూడా విజయవంతంగా అమలుచేశాం. ఈ క్రమంలోనే రైతుబంధు పథకం కింద ఎకరానికి ఏటా రూ.8వేల పంటసాయం అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాం. ఆడపిల్లలకు వివాహం చేసేందుకు పేద కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. వారికి ఆ కష్టాలు లేకుండా కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కింద ఆర్థిక సహాయం అందించాం. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, సురక్షితమైన నదీజలాలను నల్లాల ద్వారా అందించాం.

పేదరికాన్ని రూపుమాపేందుకు కార్యాచరణ..

తెలంగాణలో పేదరికాన్ని రూపుమాపేందుకు అనేకమార్గాల్లో పేదలకు సహకారాన్ని అందించేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేశాం. ఇకముందు కూడా ఈ పథకాలను కొనసాగిస్తాం. రాష్ట్ర ఆదాయం ఏయేటికాయేడు పెరుగుతున్నది. 17% వృద్ధిరేటు ఉంది. ఈ క్రమంలో సంపదను సృష్టించడంతోపాటు అది పేదలకు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ నుంచి పేదరికాన్ని తరిమికొట్టాలనేదే నా లక్ష్యం. ఇందుకోసం భవిష్యత్తులో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లనున్నాం. రానున్న రోజుల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబాన్ని గుర్తించి, ఆయా కుటుంబాలను ఎలా పైకి తీసుకురావాలనే ప్రణాళిక రూపొందించుకొని అమలుచేయబోతున్నాం.

ప్రపంచ యవనికపై తెలంగాణ విద్యార్థి..

విద్య, వైద్యరంగాల్లో చాలా పురోగతి సాధించాల్సి ఉంది. ఇందుకోసం ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే 663 గురుకుల స్కూళ్లు ప్రారంభించాం. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ కింద రూ.20 లక్షల చొప్పున సహకారం అందించాం. వృత్తి విద్యాకోర్సులను అభ్యసించేవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థికి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనేదే మా లక్ష్యం. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడైనా పోటీని ఎదుర్కొని నిలబడేలా తయారుచేయాలనేదే మా స్వప్నం. మా కల సాకారానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. ఇకముందు కూడా తీసుకుంటాం.

మెరుగైన వైద్య సేవలే మా ప్రాధాన్యం..


వైద్యారోగ్యరంగ అభివృద్ధి కోసం ప్రతి ప్రభుత్వ దవాఖానల్లో అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాం. ముఖ్యంగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేందుకుగాను ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్ పథకాన్ని విజయవంతంగా అమలుచేశాం. దీంతో నవజాత శిశుమరణాలు గణనీయంగా తగ్గాయి. ప్రభుత్వ దవాఖానల్లో పడకల ఆధారంగా నిధులు విడుదలచేశాం. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో డయాలసిస్ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటుచేశాం. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్యసేవలు, మౌలిక సదుపాయాలు కల్పించాలనేది మా ప్రథమ ప్రాధాన్యం.

జోడెడ్లుగా.. అభివృద్ధి- సంక్షేమం..

గత 52 నెలలుగా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అనతికాలంలోనే గణనీయ పురోగతి సాధించింది. పలురంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. వ్యవసాయరంగాన్ని బలోపేతంచేయడం వల్ల రైతుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపాం. 24 గంటలపాటు వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన కరంటును అందించడంతోపాటు రైతు సమన్వయ సమితుల ఏర్పాటుతో వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళలకు రిజర్వేషన్ల అమలు, భూ రికార్డుల ప్రక్షాళన, చనిపోయిన రైతు కుటుంబానికి రైతు బీమా కింద రూ.5 లక్షల ఆర్థిక చేయూత, కులవృత్తులవారికి ఆర్థిక సహాయం, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ ప్రగతి నిధి, మైనార్టీలకు అనేకరకాల సంక్షేమ పథకాలు, కేసీఆర్ కిట్లు.. ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేశాం. ప్రజలు ముఖ్యంగా పేదలకు సామాజిక భద్రత కల్పించాం. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే రైతులు, నిరుపేదల అభివృద్ధి, సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తుందో అక్కడ ఆకలి చావులు.. రైతు ఆత్మహత్యలు ఉండవు. మా ప్రభుత్వం కూడా గత నాలుగున్నరేండ్లుగా ఈ లక్ష్యం కోసమే పనిచేసింది.

2019లో జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కీలక పాత్ర

మూడు దశాబ్దాలుగా జాతీయస్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. 2014లో మాత్రం బీజేపీ మెజార్టీ సాధించగలిగింది. అయినా.. ప్రస్తుతం కేంద్రంలో కూటమి అధికారంలో ఉంది. 2019లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితులు లేవు. దేశంలోని పలు రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ 2019 పార్లమెంటు ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాలను గెలుచుకొని జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించనుంది.
KCR1

నెరవేరని విభజన చట్టం హామీలు

గత నాలుగున్నరేండ్లలో ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రం వ్యవహరించిన తీరు, కేంద్రం పాత్రపై నేను సంతృప్తిగా లేను. నేను స్వయంగా ప్రధానితోపాటు పలువురు కేంద్ర మంత్రులకు పలు సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులు కూడా సరిగా అమలుకాలేదు. అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇప్పటికీ హైకోర్టు విభజన కాలేదు. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఇవ్వాల్సిన రాయితీలపై కేంద్రం దృష్టిసారించలేదు. రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నదీజలాల పంపిణీ సమస్యల్ని కూడా పరిష్కరించకపోవడంతో ఇప్పటికీ అసమాన పంపిణీ జరుగుతున్నది.

సవాళ్లను అవకాశాలుగా మలుచుకున్నాం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అనేకరంగాల్లో అణచివేతకు, అన్యాయానికి గురైంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు ఆయారంగాలకు పునర్జీవం తీసుకురావాలనేది 2014లో నాతోపాటు తెలంగాణ ప్రభుత్వం ముందున్న సవాలు. ముఖ్యంగా తెలంగాణను ఎలా పునర్నిర్మించాలనేది అతి పెద్ద సవాలు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి ఈ సవాళ్లను అధిగమించేందుకు మథనం చేశాం. ఉన్న ఆదాయవనరులు.. రాష్ట్ర బడ్జెట్.. నిధుల సమీకరణ.. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం.. ఫీజు రీయింబర్స్‌మెంట్, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు, ప్రాధాన్యక్రమంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, ఇంటింటికీ నల్లా ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా, కోతల్లేని విద్యుత్, నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, ఉద్యోగాల కల్పన, సింగిల్ విండో పాలసీ, పోలీసుశాఖలో సంస్కరణలు, హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్, హరితహారం, దళితులు, ఇతరులకు భూ పంపిణీ.. ఇలా అనేక కోణాల్లో తెలంగాణను ముందుకు తీసుకుపోయేందుకు చర్యలు తీసుకున్నాం. గతంలో ఇన్ని కోణాల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిన దాఖలాలు లేవు. కానీ గత నాలుగున్నర సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ అన్ని కోణాల్లో చారిత్రక ప్రారంభానికి నాంది పలికింది. సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవడంతోనే మేం విజయాన్ని సాధించగలిగాం.

ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ..

ప్రభుత్వ విధానాలు, పనితీరుకు ఆకర్షితులై దేశ, విదేశాల పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చారు. ముఖ్యంగా టీఎస్- ఐపాస్ విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది. పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడమనేది చారిత్రాత్మకం. రాష్ట్రంలో ఇప్పుడు కోతల్లేని 24 గంటల నాణ్యమైన కరంటు అందిస్తున్నాం. ఉద్యోగాల విషయానికొస్తే.. ప్రభుత్వరంగంలో లక్ష ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. రానున్న టర్మ్‌లోనూ ఇది కొనసాగుతుంది. ఉద్యోగాలంటే ప్రభుత్వపరమైనవే కాదు.. ఈ భావన మారాలి. ప్రైవేటురంగంలోనూ అసంఖ్యాకమైన అవకాశాలున్నాయి. ప్రభుత్వ సహకారంతో పారిశ్రామిక, ఐటీరంగాలు గణనీయంగా విస్తరించాయి. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

గంగా- జమునా తహజీబ్ సంస్కృతి మాది..

హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు.. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వ్యాపారం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకోసం ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు. అనేక దశాబ్దాలుగా వారంతా సురక్షితమైన జీవనాన్ని సాగిస్తున్నారు. హైదరాబాద్‌ది గంగా- జమునా తహజీబ్ సంస్కృతి. ఏ ఒక్కరికీ ఎలాంటి సమస్య లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారంతా తెలంగాణవారే. హైదరాబాద్‌లో స్థిరపడినవారంతా హైదరాబాదీలే. మాకు ఏ ఒక్కరిపట్లా ద్వేషభావన లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలోగానీ, హైదరాబాద్‌లోగానీ స్థిరపడినవారిపట్ల అమర్యాదగాగానీ, వేధించిన సందర్భాలుగానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్కటీ లేదు. అందరూ తమ తమ వ్యాపారాలు,l ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు.

ఆ అవార్డు యావత్తు తెలంగాణది..

ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు అనేది నా ఒక్కడికి దక్కింది కాదు.. యావత్తు తెలంగాణకు దక్కిన అవార్డు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు రికార్డు స్థాయిలో స్థిరంగా 17.17 శాతంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. జాతీయ ఎజెండా మారాలి. ప్రతి ఏటా రొటీన్‌గా పెట్టే బడ్జెట్ కాకుండా.. ప్రజా ఆధారిత బడ్జెట్లు రావాలి. దశాబ్దాలుగా వస్తున్న విధానాల్లో మార్పురావాలి.. పాత (సంప్రదాయ) ఆలోచనల నుంచి దూరం కావాలి. రాష్ర్టాలు కీలక పాత్ర పోషించాలి. కేంద్ర ప్రభుత్వం చాలా అధికారాలు, నిధులను రాష్ర్టాలకు బదలాయించాల్సి ఉంది. గతంలో ప్రణాళిక సంఘం ఉండేది. దాని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. ప్రధాని చైర్మన్‌గా అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు అందులో ఉన్నారు. దానిని టీం ఇండియా అంటాం. ఈ క్రమంలో అందరం కలిసి దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలి.

రుణాలు భారం కాదు.. పెట్టుబడులు..

అభివృద్ధి కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకోవద్దనే అభిప్రాయం సరైనది కాదు. అది అభివృద్ధికి వ్యతిరేకం. అప్పులను ప్రతికూల దృక్పథంతో చూడొద్దు. అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, చైనా వంటి ఆర్థికశక్తులు కూడా రుణాలు తీసుకుంటున్నాయి. భారత్ కూడా తీసుకుంటుంది. అంతేగానీ.. ఒక రాష్ట్రం కేవలం తన సొంత ఆదాయంతో అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమనేది సాధ్యం కాదు. ముఖ్యంగా ఈ రుణాలను భారంగా చూడొద్దు. అవి పెట్టుబడులు. అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజల కొనుగోలు సామర్థ్యమే కాదు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఉదాహరణకు.. వివిధ బ్యాంకుల ద్వారా తెచ్చిన రుణాలతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం వల్ల అదనంగా లక్షల ఎకరాల భూములు సాగులోకి వస్తాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. రైతులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వారి కొనుగోలు సామర్థ్యం, పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. అందుకే రుణాలను అభివృద్ధికి పెట్టుబడులుగా మాత్రమే చూడాలి.

ప్రపంచ ప్రశంసలు అందుకున్న టీఎస్ ఐపాస్

ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1,35,045 కోట్ల పెట్టుబడులు కలిగిన 8,330 పరిశ్రమలకు చిన్న ఇబ్బందులు లేకుండా అనుమతులుఇచ్చాం. తద్వారా 8,55,328 మందికి ఉపాధి లభించింది. ఇందులో ఇప్పటికే 6,009 పరిశ్రమలు ప్రారంభం అయ్యాయి. మిగిలినవాటిలో 659 ప్రారంభదశకు చేరువలో ఉండగా.. 578 ప్రాథమికదశలో ఉన్నాయి. నయాపైసా అవినీతి లేకుండా.. కించిత్తు ఇబ్బంది లేకుండా ఈ పరిశ్రమలకు అనుమతులు, లైసెన్సులు ఇచ్చాం. దేశంలోని పారిశ్రామికవేత్తలే కాదు.. ఇతర దేశాల వారు కూడా టీఎస్- ఐపాస్‌ను ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ మొదటి ర్యాంకు సాధించింది. ఐటీరంగంలో అనేక కొత్త కంపెనీలు రావడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడింది.

1540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS