ప్రకతిబిడ్డ నారదగడ్డ


Fri,November 13, 2015 10:31 AM

??????????? ????????

naradagaddaపచ్చని భూదేవి నడుముకి తళతళమెరిసే జల ఒడ్డాణం చుట్టినట్టు ఉంటుంది ఆ ప్రాంతం! కష్ణమ్మ రెండు పాయలుగా చీలి వినమ్రంగా పక్కకు తప్పుకొని భగవంతుడికి దారిచ్చినట్టుగా కనపడుతుంది ఆ దశ్యం! ఇదేదో దివిసీమ దశకాదు.. మన తెలంగాణ ఇంకా మాట్లాడితే మహబూబ్‌నగర్‌జిల్లా మహద్భాగ్యం! ఇవ్వాళ్టి డిస్కవరీ తెలంగాణకు దొరికిన ఆ భాగ్యమే నారదగడ్డ...

అటు కర్ణాటక, ఇటు తెలంగాణ సరిహద్దుల్లో... మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలంలోని ముస్లాయపల్లి సమీపంలో కష్ణానది రెండు పాయల మధ్య ప్రశాంత వాతావరణంలో కొలువై ఉన్నది నారదగడ్డ! నాలుగు వందల సంవత్సరాల కిందట నారద మునీశ్వరుడు తన శాప విముక్తి కోసం ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం వల్లే ఈ ప్రాంతానికి నారదగడ్డ అనే పేరు వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉన్నది. అంతేగాక ఇక్కడ నారదుడు లింగాకారంలో కొలువు దీరినట్లు కూడా వాడుకలో ఉన్నది. ఆ తర్వాత చెన్నబసవేశ్వరుడు అనే మునీశ్వరుడు సజీవ సమాధి కావడంతో ఆ ప్రాంతం నారదగడ్డ శ్రీ చెన్నబసవేశ్వరస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఏడాది పొడవునా ప్రతి సోమవారం, ప్రతి అమావాస్యకు భక్తులు పుట్టిలో వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు. అంతేకాదు ప్రతి ఏడాది ఇక్కడ జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు.

పురాణ కథ...

శ్రీశైలం అడవుల్లోని కాలభైరవ పట్టణానికి చెందిన శ్రీ చెన్నబసవేశ్వరస్వామి అనే మునీశ్వరుడు అక్కడి నుంచి మొదటగా అలంపూర్ జోగులాంబను దర్శనం చేసుకుని అనంతరం తన ప్రయాణంలో జూరాల దగ్గరున్న పెద్దచింతరేవుల ఆంజనేయస్వామిని దర్శనం చేసుకున్నాడట. ఆ సందర్భంలో ఆయన సాక్షాత్తు ఆంజనేయస్వామితో మాట్లాడినట్లు ఇక్కడి ప్రజలు కథలుగా చెప్పుకుంటుంటారు. అయితే అక్కడి నుంచి ప్రశాంత జీవనం కోసం నారదగడ్డకు చేరుకునే క్రమంలో కష్ణానది మధ్యలో ఉన్న గడ్డకు వెళ్లేందుకు ఒడ్డున ఉన్న పుట్టి నడిపేవారిని నారదగడ్డకు చేర్చమని అడిగాడట. దానికి వాళ్లు నిరాకరించడంతో మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఆగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే తన వెంట తెచ్చుకున్న గొంగళిని కష్ణానదిలోకి విడిచి అదే గొంగళిపై ప్రయాణం చేసి నారదగడ్డకు చేరుకున్నట్లు పూర్వీకుల కథనం.

ఇలా చేరుకున్న ఆ మునీశ్వరస్వామి ఈ ఆలయంలో 41 రోజుల పాటు తపస్సు కొనసాగిస్తానని అప్పటి వరకు తనకు ఎవరూ తపోభంగం కలిగించరాదని అక్కడి వారిని ఆయన ఆజ్ఞాపించాడట. అయితే ఆలయ పూజారులు 11 రోజులకే ఆలయాన్ని తెరిచి చూడగా శ్రీ చెన్నబసవేశ్వరస్వామి అప్పటికే ఆలయంలో సమాధైన విషయాన్ని గమనించి అప్పటి నుంచి ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారని పూర్వీకులు చెబుతుంటారు. నాటినుంచి స్వామివారిని శ్రీ నారదగడ్డ చెన్నబసవేశ్వరస్వామిగా కొలుస్తూ వస్తున్నారు. పక్కనే లింగాకారంలో కొలువు దీరిన నారదుడి ఆలయం, మరో పక్కన శ్రీ చెన్నబసవేశ్వర స్వామి సమాధి అయిన ఆలయాలు ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం సత్రాలు కూడా వెలిశాయి.

తప్పని పుట్టి ప్రయాణం

ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి పూర్వం కష్ణానదిలో నీరు తక్కువగా ఉన్న సమయంలో భక్తులు ఎడ్ల బండ్లపై నారదగడ్డకు చేరుకొని ఉత్సవాల్లో పాల్గొనేవారు. ప్రాజెక్టు నిర్మాణంతో ఏడాది మొత్తం కూడా నారదగడ్డ చుట్టూ నీరు పారుతూంటుంది. దీంతో అటు కర్ణాటక నుంచి వచ్చే భక్తులు, ఇటు తెలంగాణ నుంచి వచ్చే భక్తులు ఒడ్డు వరకు చేరుకొని అక్కడ ఉండే పుట్టీల్లో 20 నిమిషాలు ప్రయాణం చేసి నారదగడ్డకు చేరుకుంటున్నారు.

జాతర ఉత్సవాలు

ప్రతి ఏడాది మహాశివరాత్రి తర్వాత వచ్చే పంచమి తిథి నుంచి పౌర్ణమి వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి పల్లకీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు రథోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అదే విధంగా లంకాదహనం, డోలారోహణ ఉత్సవాలను నిర్వహించి పౌర్ణమిరోజు కామదహనంతో ఉత్సవాలను ముగింపజేస్తారు.

ఇక్కడి గొంగళ్లకు యమాక్రేజు

నారద మునీశ్వరుడు గొంగళిపై కష్ణానదిలో ప్రయాణించినట్లు స్థానికులు చెబుతుండటంతో ఉత్సవాలకు వచ్చే భక్తులు, ఉత్సవాల్లో విక్రయించే గొంగళ్లను కొనేందుకు అమితాసక్తి కనబరుస్తుంటారు. ప్రతి ఏడాది జరిగే జాతర ఉత్సవాల సందర్భంగా కర్నూలు, అనంతపూర్, హైదరాబాద్‌తో పాటు కర్ణాటకలోని రాయచూరు వ్యాపారులు ప్రత్యేకంగా రూపొందించిన గొంగళ్లను ఇక్కడికి తీసుకు వచ్చి విక్రయిస్తుంటారు.

>ండు రాష్ర్టాల మధ్య నలుగుతూ..

కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలకు నట్టనడమ ఉన్న ఈ ఆలయాన్ని ఏ పాలకులూ పట్టించుకోకపోవడంతో పెద్దగా అభివద్ధికి నోచుకోలేదనే చెప్పాలి. 2011లో ఆలయానికి కరెంట్ సౌకర్యం కల్పించారు. అటు కర్ణాటక భక్తులు, ఇటు తెలంగాణ భక్తులు ఎవరికైనా ఈ ఆలయ సందర్శనకు పుట్టీలే ఏకైక మార్గం. నీటి ఉధతి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కోసారి ప్రమాదాలూ జరుగుతుంటాయ్. అయినా రెండు రాష్ర్టాల పాలకులు గాని, అధికారులు గానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

మార్గం

నారదగడ్డకు వెళ్లాలంటే మహబూబ్‌నగర్ నుంచి మక్తల్‌కు బస్సులు ఉంటాయి. మహబూబ్‌నగర్ నుంచి మక్తల్‌కు 65 కిలోమీటర్ల ప్రయాణం. మక్తల్ నుంచి ముస్లాయపల్లి 22 కిలోమీటర్లు! మక్తల్ నుంచి ముస్లాయపల్లికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం, ప్రైవేటు వాహనాల సదుపాయం ఉన్నది. అక్కడి నుంచి పుట్టిలో నారదగడ్డకు చేరుకోవచ్చు. పుట్టి యజమానులు అవతలి ఒడ్డుకు వెళ్లి తిరిగి ఇవతలి ఒడ్డుకు వచ్చేందుకు ఒక్కొక్కరికి రూ.50 చార్జి వసూలు చేస్తుంటారు. ముస్లాయపల్లికి చెందిన పలువురు ఒక వైపు చేపల వేట కొనసాగిస్తూనే అప్పుడప్పుడు వచ్చే భక్తులను పుట్టిలో ఇటు నుంచి అటు తిరిగి అటు నుంచి ఇటు తీసుకొస్తూ ఆ వచ్చే డబ్బులతో జీవనం కొనసాగిస్తుంటారు.

5213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles