నీళ్లగిరి..నల్లమల


Fri,November 13, 2015 10:33 AM

?????????..??????

జీవితంలో ఒక్కసారైనా గోవా వెళ్లాలనుకుంటాం. వీలుచూసుకుని కేరళ తీరాలను తనివి తీరా చూడాలని కలలు కంటాం. కానీ వాటిని తలదన్నే అందాలను తనలో నింపుకున్న కష్ణమ్మ సొగసులు... ఆధునిక సదుపాయాలేవీ లేకపోయినా కల్మషం లేని మమకారం వెల్లివిరిసే తండాలు... మన చెంతనే ఉన్నా చూడలేకపోతున్నాం.. నల్లగొండజిల్లాలోని కష్ణమ్మతో కూడిన నల్లమల అందాలను చూస్తే ఎవరైనా ఇదే మాట చెప్తారు. సూర్యుడిలోని ప్రకాశం, పువ్వుల్లోని సుగంధం, ప్రకతిలోని సౌందర్యం... వీటన్నింటిని కలగలుపుకొన్న ఈ ప్రాంతం పర్యటించే వారికి ఎన్నో అనుభూతులను మిగుల్చుతోంది. ఆకట్టుకునే పరిసరాలు, సహజసిద్ధ అందాలతో పర్యాటకానికి అవసరమైన అన్ని హంగులనూ సొంతం చేసుకున్న చందంపేట అందాలపేటలా అలరిస్తుంది.

water

నల్గొండ జిల్లా కేంద్రానికి దూరంగా విసిరేసినట్లుగా ఉంటుంది చందంపేట మండలం. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఈ ప్రదేశంలో 80శాతం వరకు గిరిజనులే నివసిస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యప్రాంతంగా పోలీసుల రికార్డులకు ఎక్కిన ఈ ప్రాంతంలో ఆ ఛాయలు నేడు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇక్కడ అనాదిగా సాగుతున్న ఆడపిల్లల అమ్మకాలు, భ్రూణహత్యలు నాణేనికి ఓవైపు అయితే... సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకతి అందాలు.. కనువిందు చేసే కష్ణమ్మ పరవళ్లు నాణేనికి మరోవైపు..! హైదరాబాద్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకొండకు కేవలం 45కి.మీ. దూరంలో సాగర్ లోతట్టు ప్రాంత అందాలు కనువిందు చేస్తాయి. సాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న కొండమల్లేపల్లి నుంచి పెండ్లిపాకల, కొత్తపల్లి, పెద్దమునిగల్ మీదుగా 25కి.మీ. ప్రయాణించి కూడా కష్ణా పరివాహక ప్రాంతాలను సందర్శించుకోవచ్చు.

అబ్బురపరిచే అందాలెన్నో...

దేవరకొండ నుంచి డిండికి వెళ్లే దారిలో పోలెపల్లి గేటు మీదుగా వెళ్తే తిమ్మాపురం, నేరేడుగొమ్ము, కొత్తపల్లి, పెద్దమునిగల్, చిన్నమునిగల్, బుగ్గతండా ఆవాసాలు వస్తాయి. బుగ్గతండా వద్ద గుట్టలపై నుంచి జాలువారే జలపాతం నాగార్జునసాగర్ ఎత్తిపోతలను తలపిస్తుంది. బుగ్గతండా నుంచి కేవలం 5కి.మీ. ఘాట్‌రోడ్డుపై ప్రయాణిస్తే సాగర్ బ్యాక్‌వాటర్ అందాలు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. కష్ణా పరివాహక ప్రాంతం తీరం వెంట గుట్టలపై ఎన్నో గిరిజన తండాలు తారసపడుతాయి. వైజాగ్‌కాలనీ నుంచి బోటులో కష్ణానదీ మీదుగా ప్రవహిస్తే గుట్టల అంచువెంట ఉన్న సుద్దబాయితండా, బిల్డింగ్‌తండా, మంగలితండా, గువ్వలగుట్ట, నక్కదుబ్బతండా తూర్పుతండా, మొసంగడ్డతండా ఆవాస ప్రాంతాలు కనువిందు చేస్తాయి.
water1

మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలను వేరుచేస్తూ ప్రవహించే డిండి వాగు వెంట ఉన్న ఉస్మాన్‌కుంట, యల్మలమంద, చాపలగేటు, తెల్దేవర్‌పల్లి, బొల్లారం, బండకిందితండా, కంబాలపల్లి, పొగిళ్ల ప్రాంతాలు ఇక్కడ కన్పిస్తాయి. బోటు ప్రయాణంలో వెళ్లినా, రోడ్డు మార్గాన బయల్దేరినా అక్కడక్కడ పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, జింకలు, కొండముచ్చులు, మనుబోతులు, హైనా వంటి అడవి జంతువులు తారసపడుతుంటాయి.

ఉల్లాసంగా సాగే ఘాట్‌రోడ్డు ప్రయాణం...

రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు విస్తరించి ఉన్న చందంపేట అటవీ ప్రాంతంలోని ఘాట్‌రోడ్డుపై ప్రయాణం ఎంతో ఉల్లాసంగా సాగుతుంది. తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని పెద్దరాజుబాయి వద్దకు వెళ్లేసరికి ప్రారంభమయ్యే ఘాట్‌రోడ్డు చిత్రియాల ప్రాంతంలోని ఎల్లమ్మగట్టు వరకు 3కి.మీ. మేర సాగుతుంది. కాకునూటితండా నుంచి రేకులగడ్డ వరకు 4కి.మీ. మేర, బుగ్గతండా నుంచి సుద్దబాయితండావరకు 4కి.మీ., ఉస్మాన్‌కుంట నుంచి చౌటుట్ల మీదుగా రేకులగడ్డ వరకు 6కి.మీ., డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కంబాలపల్లి మీదుగా పొగిళ్ల వరకు 12కి.మీ. మేర సాగే ఘాట్‌రోడ్డు ప్రయాణం మరిచిపోలేని మధురానుభూతిని మిగుల్చుతుంది. దారి పొడవునా పర్చుకున్న పచ్చదనం, ఎత్తయిన గుట్టలు, అక్కడక్కడా గుట్టలపై విసిరినట్లుగా కొలువుదీరిన తండాలు, పక్షుల కిలకిలరావాలు ఆద్యంతం ప్రకతి అందాలను సాక్ష్యాతర్కరిస్తాయి.
water2/></div></br><div class=మరో వైజాగ్...

చందంపేట మండలం చిన్నమునిగల్ పంచాయతీ పరిధిలోని వైజాగ్ కాలనీ మరో వైజాగ్‌ను తలపిస్తుంది. సాగర్ రిజర్వాయర్ నిర్మాణం సమయంలో వైజాగ్ నుంచి వచ్చిన కొన్ని మత్స్యకార్మిక కుటుంబాలు ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. చుట్టూ కొండలు... వాటి మధ్యన పరవళ్లు తొక్కుతూ ప్రవహించే కష్ణమ్మ హొయలు ఆద్యంతం ఆహ్లాదం పంచుతాయి. సాగర్ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం గోవా, కేరళ తీర ప్రాంతాల అందాలను గుర్తుకు తెస్తుంది. కష్ణానదీతీర ప్రాంతం వెంట ఉన్న ఇసుక దిబ్బల్లో సేదతీరుతూ సాగర్ అందాలను ఆస్వాదించడం మరువలేని అనుభూతి. వివిధ ప్రాంతాలకు చెందిన రకరకాల విహంగాలు ఇక్కడకు వస్తుంటాయి. సూర్యకాంతితో మిలమిల మెరిసే కష్ణమ్మ నీళ్లు... తీరం ఒడ్డున చేపల కోసం నిరీక్షించే పక్షులను చూస్తే ఎవరైనా చిన్నపిల్లలుగా మారిపోవాల్సిందే.. ఈ ప్రాంత అందాలు తెలిసిన ప్రకతి ప్రేమికులు సెలవు దినాల్లో ఇక్కడకు వస్తుంటారు. రోజంతా కష్ణాతీరం ఒడ్డున గడపడంతోపాటు ఇక్కడి మత్స్యకార్మికులు ఉపయోగించే మరబోట్లలో షికారు చేసి సాగర్ బ్యాక్‌వాటర్ అందాలు, ప్రకతి సౌందర్యాన్ని తిలకిస్తుంటారు. బోటు షికారు అనంతరం రకరకాల చేపల రుచులను సైతం ఆస్వాదించవచ్చు. ఎండబెట్టిన చేపలకు ఉప్పుకారం దట్టించి నూనెలో వేయించి మత్స్యకారులు సందర్శకులకు అందిస్తుంటారు. వర్షాకాలంలో బ్యాక్‌వాటర్ ఎక్కువగా ఉన్న సమయంలో పర్యటన మరింత బాగుంటుంది.

లాంచీ స్టేషన్‌కు అనుకూలం

పర్యాటకశాఖ నాగార్జునసాగర్ లాంచీస్టేషన్ నుంచి నందికొండకు, శ్రీశైలానికి లాంచీలను నడుపుతోంది. లాంచీస్టేషన్ నుంచి 20కి.మీ. దూరంలో ఉన్న వైజాగ్‌కాలనీ వద్ద లాంచీ స్టేషన్‌ను ఏర్పాటుచేస్తే పర్యాటకులు మరిన్ని ప్రకతి అందాలను ఆస్వాదించే వీలుంటుంది. చందంపేట మండలం కంబాలపల్లి పరిసర ప్రాంతాలను ఆనుకుని ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో గుట్టలపై ఏలేశ్వరం దేవాలయం ఉండేది. ప్రకాశం, గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాలకు కేంద్రంగా ఈ దేవాలయం ఉండడంతో ఆయా ప్రాంతాల నుంచి భక్తులు వాహనాల్లో, కాలినడకన వచ్చి ఇక్కడి శివుణ్ని దర్శించుకునేవారు. శివరాత్రి, ఏకాదశి, కార్తీకమాసం సందర్భాల్లో పెద్దఎత్తున జాతర కూడా సాగేది. కానీ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ఏలేశ్వరం పరిసర ప్రాంతాలు ముంపునకు గురై, పలు ఆవాసాలు జలగర్భంలో కలిసిపోయాయి.

దీంతో ఏలేశ్వరానికి వెళ్లాలంటే భక్తులకు బోటు ప్రయాణమే శరణ్యమైంది. ముఖ్యమైన పర్వదినాల్లో ఇప్పటికీ భక్తులు బోట్లలో దేవాలయానికి వెళ్తుంటారని స్థానికులు చెప్తున్నారు. చందంపేట మండలం పెద్దమునిగల్‌లో గిరిజనుల ఆరాధ్య దైవమైన తుల్జాభవాని జాతర యేటా పెద్దఎత్తున సాగుతుంది. దసరా పండుగకు ఒకరోజు ముందు మొదలై, రెండ్రోజులపాటు సాగే ఈ జాతరలో అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల భక్తులు తరలివస్తారు. మహారాష్ట్రలోని తుల్జాభవాని దేవాలయాన్ని సందర్శించుకునేందుకు వీలుపడని వారు ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ఈ జాతర సమయంలోనే వర్షాలు సమద్ధిగా కురుస్తుండడంతో సాగర్ బ్యాక్ వాటర్ నీళ్లు వచ్చి దేవాలయాన్ని తాకుతాయి. స్థానిక మత్స్యకారులు మర బోట్లను ఏర్పాటుచేసి భక్తులను సాగర్ జలాలపై విహరింపజేసి ఆదాయం పొందుతారు.

దేవాలయం పక్కనే ఏర్పాటుచేసిన వీర శివాజీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రక్షణ కొరవడిన ప్రైవేటు బోట్లలో ప్రయాణిస్తుండడంతో గతంలో ప్రమాదాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకశాఖ వైజాగ్‌కాలనీ వద్ద లాంచీ స్టేషన్‌ను ఏర్పాటుచేస్తే పురాతన ఆలయాలకు ప్రాచుర్యం కల్పించడంతోపాటు, పర్యాటక ఆదాయాన్ని కూడా సమకూర్చుకునే వీలుంది. ఆంజనేయస్వామి మాలాధారులు నల్లమలలోని బక్కలింగాయపల్లి, అక్కారం, జంగిరెడ్డి, ఇప్పలపల్లిలోని మూడు ఎత్తయిన గుట్టలను దాటుకుని 70కి.మీ. కాలినడకన వెళ్లి మహబూబ్‌నగర్ జిల్లాలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకుంటుండడం విశేషం.

అపారమైన మత్స్య సంపద

సాగర్ లోతట్టు ప్రాంతంలోని కాచరాజుపల్లి కష్ణా పరివాహక ప్రాంతంలో అపారమైన మత్స్య సంపద ఉంది. వైజాగ్‌కాలనీతోపాటు, పెద్దమునిగల్, చిన్నమునిగల్ తదితర ప్రాంతాలకు చెందిన 300కిపైగా కుటుంబాలు చేపల వేటనే వత్తిగా చేసుకుని జీవనం గడుపుతున్నాయి. ఇక్కడి చేపలు కేరళ, కలకత్తా తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. యేటా రూ.లక్షల వ్యాపారం జరుగుతుండగా.. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన మత్స్యకార్మికులదే సాగర్ రిజర్వాయర్‌పై పెత్తనం సాగుతోంది. మత్య్సశాఖ అలివివలలపై నిషేధాన్ని విధించినప్పటికీ, ఆంధ్రకు చెందిన మత్స్యకార్మికులు అవే వలలను వినియోగించి తమ పొట్టగొడుతున్నారని ఇక్కడే పుట్టి పెరిగిన స్థానిక మత్స్యకార్మికులు ఆవేదన చెందుతున్నారు. పర్యాటకశాఖ సాగర్ లోతట్టు ప్రాంతఅందాలపై దష్టిపెడితే ఈ ప్రాంతం పర్యాటకంగా విశేష అభివద్ధి సాధించడం ఖాయం.

7250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles