చెరువుల మురిపెం!

Thu,November 14, 2019 04:23 AM

-వర్షాలు, ప్రాజెక్టుల నీటితో ఉట్టిపడుతున్న జలకళ
-రాష్ట్రవ్యాప్తంగా నిండుకుండల్లా దాదాపు సగం చెరువులు
-ప్రాజెక్టుల నీటి మళ్లింపుతో వేల చెరువులకు జీవం
-పాలమూరు ప్రాజెక్టు కింద జలకళతో 969 చెరువులు
-సాగుకు ఆదెరువుగా నిలుస్తున్న చిన్ననీటి వనరులు
-యాసంగికి 16 లక్షల ఎకరాల్లో పంటలకు కార్యాచరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:ఊరికి జీవంపోసేది చెరువు! ప్రజల జీవన స్థితిగతులను మార్చేది చెరువు! సమైక్యపాలనలో ఏండ్ల తరబడి కరడుగట్టిన నిర్లక్ష్యంతో పూడుకుపోయిన మహత్తరమైన చిన్ననీటి వనరులు.. స్వీయపాలనలో చేపట్టిన చర్యలతో పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. వరుణుడి కరుణ.. కరువు పరిస్థితుల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చెరువులకు జీవంపోయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం.. వెరసి రాష్ట్రంలోని వేల తటాకాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. ఇప్పటికే చెరువుల కింద వానకాలం పంటల్ని విస్తారంగా పండించిన రైతన్నకు యాసంగికి సైతం సాగునీరు సిద్ధంగా ఉంచడంతో రాష్ట్ర సాగునీటి చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయింది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్లలో ఉన్న 43వేలకు పైగా చెరువుల్లో ఏకంగా 40% చెరువులు నిండుకుండలను తలపిస్తుండగా.. మరో 10-15 శాతం సగానికంటే ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యంతో కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులకు మంచి ఇన్‌ఫ్లోలు ఉన్నందున ఖాళీ అయిన చెరువులకు వెంటనే ఆ నీటిని మళ్లించే ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. దీంతో యాసంగిలో చెరువుల కింద 16 లక్షల ఎకరాల్లో ఏరువాక సాగేలా నీటిపారుదలశాఖ పక్కా ప్రణాళిక రూపొందించింది.

చెరువులకు పూర్వవైభవం

ఒకప్పుడు తెలంగాణలో చెరువులే సాగుకు ఆదెరువు. అందుకే కాకతీయుల కాలంలో పెద్దసంఖ్యలో గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. అవి తెలంగాణ మాగాణాన్ని సుసంపన్నం చేశాయి. కానీ.. సమైక్యపాలనలో తెలంగాణ ప్రాంతంలోని చెరువులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. వర్షాలు పడితేనే చెరువులకు నీళ్లు.. లేకపోతే క్రీడామైదానాలను తలపిస్తాయనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని చెరువులు పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. చెరువు ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏండ్ల తరబడి నిర్లక్ష్యంతో పూడుకుపోయిన చెరువులను పునరుద్ధరించడంతోపాటు.. వర్షాలు లేని ప్రాంతాల్లోని చెరువులను కూడా నిండుకుండల్లా మార్చేలా సాగునీటి ప్రాజెక్టులకు అనుసంధానం చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వాటికి పూర్వవైభవం వస్తున్నది. గొలుసుకట్టు చెరువులను సాధ్యమైనంత మేరకు సాగునీటి ప్రాజెక్టుల పరిధుల్లోకి తెచ్చేందుకు నీటిపారుదలశాఖ నిరంతరం కృషిచేస్తున్నది. ఇప్పటికే చాలా ప్రాజెక్టుల కింద ఈ పనులు సత్ఫలితాలనిచ్చా యి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మంచి వర్షాలు పడటంతోపాటు సాగునీటి ప్రాజెక్టులకు కూడా భారీఎత్తున వరదలు వచ్చాయి. దీంతో వర్షాలు, తద్వారా చెరువుల్లోకి వచ్చిన నీటితో వానకాలం పంటలను విస్తారంగా పండించారు. అయినప్పటికీ ప్రాజెక్టుల పరిధిలోని చెరువుల్లో నీటినిల్వలు తరిగిపోకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు అన్ని ప్రాజెక్టుల పరిధిలో చెరువులకు ప్రాజెక్టుల నీటిని మళ్లించే ప్రక్రియపై నీటిపారుదలశాఖ యంత్రాంగం పూర్తిస్థాయిలో నిమగ్నమవడంతో వేల సంఖ్యలో చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి.

నిండుకుండల్లా 14 వేల చెరువులు

రాష్ట్రవ్యాప్తంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో 43,759 చెరువులు ఉన్నాయి. ఇప్పటికీ ఇందులోని వేల చెరువుల్లో భారీస్థాయిలో నీటినిల్వలు ఉండటం విశేషం. నీటిపారుదలశాఖ తాజా నివేదిక ప్రకారం.. గోదావరి బేసిన్‌లోని 20151 చెరువులకుగాను 2614 చెరువులు అలుగు పోస్తున్నాయి. 11,120 చెరువులు పూర్తిస్థాయి నిల్వతో నిండుకుండల్లా ఉన్నాయి. మరో 2839 చెరువుల్లో వాటి పూర్తిస్థాయి సామర్థ్యంలో 50 శాతానికిపైగా నీటితో నిండి ఉన్నాయి. మరోవైపు కృష్ణాబేసిన్‌లో 23,608 చెరువులకుగాను 1167 చెరువులు అలుగుపోస్తున్నాయి. 2372 చెరువుల్లో పూర్తిస్థాయి నిల్వతో జలకళ ఉట్టిపడుతున్నది. మరో 2121 చెరువులు 50 శాతానికిపైగా నిల్వ సామర్థ్యంతో ఉన్నాయి. అయితే 50 శాతంతోపాటు అంతకంటే తక్కువ నిల్వ సామర్థ్యం ఉన్న చెరువులు ఆయా సాగునీటి ప్రాజెక్టు పరిధిలో ఉన్నట్లయితే వాటిని నింపేందుకు అధికారులు చర్య లు తీసుకుంటున్నారు. ఇలా రెండు బేసిన్లలో కలిపి.. 43,759 చెరవులకుగాను 40% వరకు అంటే.. 17,272 చెరువులు పూర్తిస్థాయిలో నిండి ఉన్నాయి. 50 శాతానికిపైగా నిండినవాటిని లెక్కిస్తే రాష్ట్రంలోని సగానికిపై గా చెరువులు నీటి నిల్వలతో కళకళలాడుతున్నాయని అధికారులు స్పష్టంచేశారు.

ఇది.. సరికొత్త అధ్యాయం..

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని నిర్దేశిత ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించడం ఆనవాయితీగా వచ్చింది. ప్రాజెక్టుల్లోని నీటిని చెరువులకు మళ్లించడం అంటే అదో అరుదైన దృశ్యంగానే ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటిరంగాన్ని గాడిలోకి తెచ్చింది. ఒకవైపు ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టడంతోపాటు గత రెండేండ్లుగా ప్రాజెక్టుల నీటిని చెరువులకు మళ్లించే అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సమీక్షాసమావేశాలు నిర్వహించి.. సాధ్యమైన మేర ఎక్కువ గొలుసుకట్టు చెరువులను ప్రాజెక్టుల పరిధిలోకి తీసుకురావాలని, అందుకు ఓటీలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. నిధులను కూడా విడుదలచేశారు. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల పరిధిలో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే శ్రీరాంసాగర్‌-1 పరిధిలో 800 చెరువులను నింపేందుకు మాత్రమే అవకాశం ఉండగా.. అదనపు ఓటీలను ఏర్పాటుచేసి మరో 382 చెరువులను నింపేందుకు మార్గం సుగమంచేశారు. ఈ పనులు ఇంకా కొనసాగుతుండటంతో వచ్చే ఏడాది మరిన్ని చెరువులు ఈ జాబితాలోకి రానున్నాయి. మిగిలిన ప్రాజెక్టుల పరిధిలోనూ గతంలోని చెరువుల కంటే అదనపు చెరువులను ప్రాజెక్టుల పరిధిలోకి తీసుకువస్తున్నారు. దీంతో తాజాగా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఒకవైపు నిర్దేశిత ఆయకట్టుకు భరోసా కల్పించడంతోపాటు వేల సంఖ్యలో చెరువులను నింపే ప్రక్రియ కూడా కొనసాగుతుండటం విశేషం.
List

చెరువులతోనే మారిన పాలమూరు తలరాత

మొన్నటిదాకా వలసలకు నిలయంగా మారిన పాత పాలమూరు జిల్లాలో గత 2-3 సంవత్సరాలుగా రివర్స్‌ వలసలు పెద్ద ఎత్తున సాగుతుండటానికి ప్రధాన కారణం.. ప్రాజెక్టుల నీటితో చెరువులకు జీవం పోసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడమే. పాత పాలమూరు జిల్లాలోని భీమా, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, కల్వకుర్తి, జూరాల, ఆర్డీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1152 చెరువులు ఉన్నాయి. దీంతో కృష్ణాజలాలు తెలంగాణ సరిహద్దు దాటి దిగువకు వచ్చింది మొదలు.. సీఎం కేసీఆర్‌ ఆదేశంతో అధికారులు చెరువులను నింపే కార్యక్రమాన్ని ప్రత్యేక కార్యాచరణగా ఎంచుకున్నారు. దీంతో ఎప్పటికప్పుడు చెరువుల నీటి సామర్థ్యాన్ని బేరీజు వేసుకుంటూ అవసరమైనపుడు నీటిని మళ్లిస్తూ.. నేటికీ ఆ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ నెల 11వ తేదీనాటి అధికారుల నివేదిక ప్రకారం.. ఈ ప్రాజెక్టుల పరిధిలో 869 చెరువులు ప్రాజెక్టుల నీటితో నిండుకుండల్లా మారాయి. 101 చెరువులను నింపే ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇంకా 182 చెరువులను నింపాలనే లక్ష్యాన్ని అధికారులు పెట్టుకున్నారు. ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోనే 574 చెరువులు ఉండగా.. 401 చెరువుల్ని పూర్తిస్థాయిలో నింపడం మరో విశేషం.
List1

పలు ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో చెరువులను నింపే ప్రక్రియ పురోగతి ఇలా..

-శ్రీరాంసాగర్‌ మొదటిదశ పరిధిలో భారీఎత్తున చెరువులను నింపే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ పరిధిలో గతంలో 800 చెరువులను నింపేందుకు ఆస్కారం ఉండేది. అయితే సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం కాల్వలపై ప్రత్యేకంగా ఓటీలను ఏర్పాటుచేసి అదనపు చెరువులను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు అదనంగా 383 చెరువులను అనుసంధానించారు. ఇలా 1182 చెరువుల్ని నింపే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో చాలావరకు 50 శాతానికి పైగా నిండినవే ఉండటం విశేషం.
-శ్రీరాజరాజేశ్వర (మిడ్‌ మానేరు) జలాశయం పరిధిలో 24 చెరువులను పూర్తిస్థాయిలో నింపారు.
-శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం పరిధిలో 114 చెరువులను (పెద్దపల్లి-1, కరీంనగర్‌-25, జగిత్యాల-28, రాజన్న సిరిసిల్ల-60) అధికారులు పూర్తిస్థాయిలో నింపారు.
-ఎస్సారెస్పీ వరదకాల్వ పరిధిలో 56 చెరువులు (0-34 కి.మీ. - 17, 34-73 కి.మీ.-14, 73-122 కి.మీ. - 25) ప్రాజెక్టుల నీటితో కళకళలాడుతున్నాయి.
-శ్రీరాంసాగర్‌-2 పరిధిలో 489 చెరువులు (వర్ధన్నపేట-09, పాలకుర్తి-83, డోర్నకల్‌-65, తుంగతుర్తి-157, సూర్యాపేట-88, కోదాడ-15) ప్రాజెక్టుల ద్వారా మళ్లించిన నీటితో నిండుకుండలను తలపిస్తున్నాయి. పాలేరు పరిధిలోని 72 చెరువులను భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి నింపారు. శ్రీరాంసాగర్‌-2 పరిధిలో మరో 103 తటాకాలను నింపే ప్రక్రియ కొనసాగుతున్నది.
-ఎస్సారెస్పీ-2 పరిధిలోని డీబీఎం-54 నుంచి 61, 63, 65, 67, 69, 70, 71ల కింద 520 చెరువులు ఉండగా.. 200 చెరువులను పూర్తిస్థాయిలో నింపారు. 217 చెరువులను నింపే ప్రక్రియ కొనసాగుతున్నది. మరో 103 చెరువులు నింపే ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది. ప్రధానంగా చివరి భూముల పరిధిలోని చెరువులను కూడా ఈసారి పూర్తిస్థాయిలో నింపడంతో టెయిల్‌ఎండ్‌ సమస్య అనేది ఉత్పన్నం కావడంలేదు.
-దేవాదుల ప్రాజెక్టు పరిధిలో 418 చెరువులను నింపారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌- 107, వరంగల్‌ తూర్పు, పడమర- 12, వర్ధన్నపేట- 18, హుస్నాబాద్‌- 20, హుజూరాబాద్‌- 01, పాలకుర్తి- 66, జనగాం- 154, ఆలేరు- 32, గజ్వేల్‌- 8 చెరువుల్ని నింపారు. ఇంకా 74 చిన్ననీటి వనరులను నింపే ప్రక్రియ కొనసాగుతున్నది.
-రాజీవ్‌ భీమా ప్రాజెక్టు పరిధిలో 248కిగాను 194 చెరువులను పూర్తిగా నింపా రు. 27 చెరువులను నింపే ప్రక్రియ కొనసాగుతున్నది. మరో 27 చెరువులను నింపాల్సి ఉన్నది.
-కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలో మొత్తం 574 చెరువులకుగాను 401 చెరువులను నింపారు. 54 చెరువులను నింపే ప్రక్రియ కొనసాగుతున్నది. మరో 119 చెరువులను నింపేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
-కోయిల్‌సాగర్‌ లిఫ్టు పరిధిలో మొత్తం 37 చెరువులకుగాను 25 చెరువులను పూర్తిస్థాయిలో నింపారు. 12 చెరువులను నింపే ప్రక్రియ కొనసాగుతున్నది.
-జూరాల ప్రాజెక్టు పరిధిలో మొత్తం 185 చెరువులు ఉండగా.. 144 చెరువులను పూర్తిస్థాయిలో నింపారు. ఏడింటిని నింపే ప్రక్రియ కొనసాగుతున్నది. మరో 34 చెరువులను నింపాల్సి ఉన్నది.
-రాజోలిబండ డైవర్షన్‌ స్కీం పరిధిలో మొత్తం ఐదు చెరువులకు.. అన్నింటినీ పూర్తిస్థాయిలో నింపారు.
-నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో మొత్తం 103 చెరువులు ఉండగా.. వంద చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. ఒక చెరువును నింపుతున్నారు. మరో రెండింటిని నింపాల్సి ఉన్నది.
-ఆసిఫ్‌నగర్‌ ప్రాజెక్టు పరిధిలో 66 చెరువులు ఉండగా.. అన్నింటినీ పూర్తిస్థాయిలో నింపారు.
-మూసీ ప్రాజెక్టు పరిధిలో 44 చెరువులకుగాను 42 చెరువులను పూర్తిస్థాయిలో నింపారు. మరో రెండింటిని నింపే ప్రక్రియ కొనసాగుతున్నది.
-ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో 99 చెరువులు ఉండగా.. ఇందులో 80 చెరువులను పూర్తిస్థాయిలో నింపారు. మరో 19 చెరువులు నింపుతున్నారు.
-నాగార్జునసాగర్‌ లోలెవల్‌ కెనాల్‌ పరిధిలో 62 చెరువులు ఉండగా.. ఇప్పటికే 60 చెరువులను పూర్తిస్థాయిలో నింపా రు. మరో రెండింటిని నింపే ప్రక్రియ కొనసాగుతున్నది.

1757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles