ప్రగతిపథంలో భూపాలపల్లి


Mon,July 22, 2019 02:32 AM

93 percent of land problems are solved

-ఫలిస్తున్న జిల్లాల పునర్విభజన
-రెండుసార్లు నీతి ఆయోగ్‌ ర్యాంకులు
-93 శాతం భూ సమస్యల పరిష్కారం
-నేటినుంచి రైతుల చెంతనే భూ పరిష్కార వేదిక

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అడవుల జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. దేశంలోనే ప్రత్యేకతను చాటుకుంటున్నది. పరిపాలనా వికేంద్రీకరణ జరిగితే జిల్లాలు మరింత అభివృద్ధి చెందుతాయని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. గతంలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలకు పెంచడం సత్ఫలితాలనిస్తున్నది. పరిపాలన చేరువై అభివృద్ధి ప్రజల దరికి చేరింది. కొత్త జిల్లాలు ప్రగతిపథంలో సాగుతున్నాయనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా.
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత భూపాలపల్లి పరిస్థితి మారిపోయింది. విద్య, వైద్యం, పర్యావరణం, పరిశుభ్రత అంశాల్లో జిల్లా అధికార యంత్రాంగం జాతీయస్థాయిలో రికార్డులకెక్కుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా.. నీతి ఆయోగ్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌లో రెండుసార్లు ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నది. దేశవ్యాప్తంగా 115 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధిపై నీతి ఆయోగ్‌ చేసిన సర్వేలో 2019 మార్చిలో భూపాలపల్లికి మొదటి ర్యాంకు వచ్చింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభత్ర, ఆర్థిక సేవలు ఇలా చాలా అంశాల్లో భూపాలపల్లి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి బహుమానంగా జిల్లాకు నీతి ఆయోగ్‌ రూ.30 కోట్లు మంజూరు చేసింది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా విద్యా ప్రగతికి కృషి చేస్తుండటంతో దేశవ్యాప్తంగా నాలుగోస్థానంలో నిలిచింది.

భూ సమస్యల పరిష్కారంలో ముందంజ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్న జయశంకర్‌ భూపాలపల్లి కొత్త జిల్లాగా మారడంతో జిల్లా కలెక్టరు ప్రతి గ్రామానికి వెళ్లి స్వయంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను పర్యవేక్షించగలిగారు. ప్రస్తుత కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ప్రజల చెంతకే పరిపాలనకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భూ సమస్యలు పరిష్కరించడంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. 93 శాతం భూ సమస్యలను పరిష్కరించిన జిల్లాగా భూపాలపల్లి ముందువరుసలో ఉన్నది. మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి సోమవారం నుంచి జిల్లా, మండల రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో రైతుల చెంతకే వెళ్లి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. అత్యధికశాతం అడవులున్న ఈ జిల్లాలో ఎకో-టూరిజం నంబర్‌వన్‌గా ఉన్నది. రామప్ప దేవాలయం, మహాదేవ్‌పూర్‌, పాండవుల గుట్ట, కాళేశ్వరం ప్రాజెక్ట్‌, కాళేశ్వరం ముక్తివనం, ప్రతాపగిరి కోటలు, మైలారం, కాపురం గుట్టలు ఇలా వారసత్వ, సాంస్కృతిక కట్టడాలు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

వందశాతం ఓడీఎఫ్‌ జిల్లాగా భూపాలపల్లి

భూపాలపల్లి జిల్లాలో 85,244 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం ద్వారా బహిరంగ విసర్జన లేని పరిశుభ్ర జిల్లాగా మారింది. ఓపెన్‌ డిఫకేషన్‌ ఫ్రీ (ఓడీఎఫ్‌) జిల్లాగా అధికారులు సైతం ప్రకటించారు. ఓడీఎఫ్‌లో భాగంగా కలెక్టర్‌ స్వయంగా గోరికొత్తపల్లిలో మరుగుదొడ్డి నిర్మాణ పనుల్లో పాల్గొనడం విశేషం. వచ్చే నీతి ఆయోగ్‌ సర్వేలో జిల్లా దేశంలోనే తిరిగి మొదటిస్థానంలో నిలుస్తుందని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు విశ్వాసం వ్యక్తంచేశారు.

311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles