భారీగా వస్తున్న యూరియా


Wed,September 11, 2019 03:08 AM

64485 tonnes urea reached to the telangana

-పోర్టుల నుంచి నేరుగా గ్రామాలకు
-రాష్ట్రానికి చేరిన 64,485 టన్నులు
-కృష్ణపట్నం నుంచి 14,700 టన్నుల తరలింపు
-జడ్చర్ల, గద్వాలకు బయలుదేరిన 3,340 టన్నులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రామాల్లోని రైతులకు యూరియా అందుబాటులోకి వస్తున్నది. వివిధ పోర్టుల నుంచి భారీగా తరలివస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యవేక్షణలో అధికారులు యూరియా సరఫరాకు యుద్ధప్రాతిపాదికన ఏర్పాట్లుచేపట్టారు. వ్యవసాయశాఖ ప్రతి పోర్టులో ఒక ఏడీఏ స్థాయి అధికారిని యూరియా సరఫరా పర్యవేక్షణ కోసం నియమించింది. వీరంతా గంగవరం, వైజాగ్, ట్యూటికోరిన్, కాకినాడ, కరైకల్, కృష్ణపట్నం పోర్టులకు శనివారం చేరకున్నారు. వీరి పర్యవేక్షణలో రాష్ర్టానికి సోమవారం రాత్రి వరకు 64,485 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. వీటితోపాటు గుజరాత్ (హజీరా)లోని క్రిభ్‌కో యూనిట్, చెన్నైలోని మద్రాస్ ఫర్టిలైజర్స్ నుంచి కూడా యూరి యా వివిధ జిల్లాలకు తరలుతున్నది. కృష్ణపట్నం పోర్టు నుంచి అత్యధికంగా ఆది, సోమవారాల్లో 14,700 మెట్రిక్ టన్నుల కోరమండల్ యూరియా రాష్ట్రానికి చేరింది. మంగళవారం సాయంత్రం మరో 3,340.8 మెట్రిక్ టన్నుల యూరియా రోడ్డుమార్గం ద్వారా జడ్చర్ల, గద్వాలకు బయలుదేరినట్టు కృష్ణపట్నం పోర్టులో పర్యవేక్షిస్తున్న వ్యవసాయశాఖ అధికారి శివానంద్ తెలిపారు.

కృష్ణపట్నం నుంచి రేయింబవళ్లు సరఫరా

రాష్ర్టానికి గంగవరం, వైజాగ్, ట్యూటికోరిన్, కాకినాడ, కరైకల్ పోర్టుల నుంచి పగటిపూట మాత్రమే యూరియాను సరఫరాచేస్తుండగా.. కృష్ణపట్నంపోర్టు నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా సరఫరాచేస్తున్నారు. కృష్ణపట్నంలోని రేక్-1నుంచి 2,668 మెట్రిక్ టన్నులు దిగుమతి కాగా.. ఇందులో జగిత్యాలకు 1,334 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లికి 1,334 మెట్రిక్ టన్నులు చేరింది. రేక్-2 నుంచి 2,636.5 మెట్రిక్ టన్నులు దిగుమతి కాగా.. ఇందులో ఆదిలాబాద్‌కు 1,313.5 మెట్రిక్ టన్నులు, మంచిర్యాలకు 1,323 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యింది. దీంతోపాటు రోడ్డుమార్గం ద్వారా లారీలతో నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు 2,716.5 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యింది. జంబోరేక్-3 నుంచి 3,340.8 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి కాగా.. ఇందులో సనత్‌నగర్‌కు 1,670.4 మెట్రిక్ టన్నులు, జడ్చర్లకు 1,670.4 మెట్రిక్ టన్నులు సరఫరా అయ్యింది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జంబోరాక్-4 నుంచి 3,340.8 మెట్రిక్ టన్నులు దిగుమతి కాగా.. జడ్చర్లకు 1,670.4 మెట్రిక్ టన్నులు, గద్వాలకు 1,670.4 మెట్రిక్ టన్నుల యూరియా రోడ్డు మార్గం ద్వారా బయలుదేరింది.

808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles