ఏకమైన భూలక్ష్మి క్యాంప్


Tue,January 22, 2019 02:11 AM

60 year problems with the formation of new panchayats

- కొత్త పంచాయతీల ఏర్పాటుతో అరవై ఏండ్ల సమస్య పరిష్కారం
- తొలి పాలకవర్గం ఏకగ్రీవం

బోధన్, నమస్తే తెలంగాణ: ఏపీలోని ఒంగోలు ప్రాంతం నుంచి దశాబ్దాల క్రితం వలసవచ్చి స్థిరపడినవారితో ఏర్పడిన చిన్నగ్రామం అది. వ్యవసాయంతోపాటు, పాల ఉత్పత్తిలో ప్రత్యేకతను చాటుకొన్నది. అలాంటి గ్రామాన్ని రోడ్డును హద్దుగా చేసుకొని రెండుగా విడదీశారు. ఆ రెండింటినీ రెండు వేర్వేరు పంచాయతీల్లో ఉం చి అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేలా చేశారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో రెండుగా ముక్కలైన ఆ గ్రామం నేడు ఒకే గ్రామపంచాయతీగా ఏర్పడింది. తొలి పాలకవర్గాన్నే ఏకగ్రీవంగా ఎన్నుకొని తామంతా ఒక్కటే అంటూ ఆ గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారు. ఆ గ్రామమే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో నూతనంగా ఆవిర్భవించిన భూలక్ష్మి క్యాంప్.

60 ఏండ్ల నాటి సమస్య

భూలక్ష్మి క్యాంప్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఆవిర్భావం నుంచి రెండు వేర్వేరు పంచాయతీల పరిధిలో ఉంటూ వచ్చింది. రామాలయం నుంచి వెళుతున్న రోడ్డును సరిహద్దుగా చేసుకొని రెండుగా విభజించారు. రోడ్డుకు ఒకవైపు ఉన్న భాగాన్ని పెగడాపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో.. మరోవైపు భాగాన్ని పెంటాకలాన్ పంచాయతీలో ఉంచారు. దీంతో గ్రామమంతటికీ వర్తించే సమస్యలను రెండు పంచాయతీల్లో ఎవరూ పట్టించుకొనేవారు కాదు. రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. రెండు పంచాయతీల్లోనూ ఈ గ్రామం నుంచి ఇప్పటివరకు సర్పంచ్‌గా ఎన్నికైన వారెవరూ లేరు. గ్రామాన్నంతటినీ ఒకే పంచాయతీలో ఉంచాలంటూ అరవై ఏండ్లుగా గ్రామస్థులు చేసిన విజ్ఞప్తులను గత పాలకులు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో రెండు ముక్కలుగా ఉన్న భూలక్ష్మి క్యాంప్ ఒక్కటయింది. గత ఆగస్టు 6న భూలక్ష్మి క్యాంప్ గ్రామ పంచాయతీ పేరిట ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. దీంతో గ్రామస్థుల సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి.

తొలి ఎన్నికలోనే ఆదర్శంగా ఏకగ్రీవం:

ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించిన భూలక్ష్మి క్యాంప్ తొలిసారి జరిగిన ఎన్నికల్లోనే ఆదర్శంగా నిలిచింది. గ్రామం లో 656 ఓటర్లు ఉండగా, 8 వార్డులను ఏర్పాటుచేశారు. సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వ్ అయింది. ఏకగ్రీవ ఎన్నికలు జరుపుకోవాలని నిర్ణయించుకొన్న గ్రామస్థులు బెజ్జం వెంకట్‌రెడ్డిని సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. 8 మంది వార్డుసభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
Venkat-Reddy

సీఎం కేసీఆర్ నిర్ణయం వల్లే..

కొత్త పంచాయతీలను ఏర్పాటుచేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రెండు వేర్వేరు పంచాయతీల్లో ఉన్న మా గ్రామం ఒకే స్వతంత్ర పంచాయతీగా ఏర్పడింది. సీఎం కేసీఆర్‌కు, స్థానిక ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గతంలో రెండు పంచాయతీలు కూడా మా గ్రామ సమస్యలను పట్టించుకోకపోవటంతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ప్రత్యేక పంచాయతీగా ఏర్పడటంతో సమస్యలు తొలగిపోయినట్టే. తొలి ఎన్నికలోనే ఏకగ్రీవంగా ఎన్నుకొన్నందుకు గ్రామస్థులందరికీ ధన్యవాదాలు.
- బెజ్జం వెంకట్‌రెడ్డి, ఏకగ్రీవ సర్పంచ్, భూలక్ష్మి క్యాంప్

817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles