ఏపీకి మిగిలేది 55 టీఎంసీలే


Tue,September 11, 2018 01:29 AM

55 TMCs left for AP

-కృష్ణాబోర్డుకు ఏపీ ఈఎన్సీ భారీ ఇండెంట్
-నవంబర్ నాటికే 156 టీఎంసీలు కావాలంటూ లేఖ
-అప్రమత్తమైన తెలంగాణ నీటిపారుదలశాఖ
-వాటా లెక్కలు కచ్చితంగా అమలయ్యేలా బోర్డుపై ఒత్తిడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:వాస్తవ వినియోగం ఉన్నదా.. లేక తెలంగాణ 52.50 టీఎంసీల కృష్ణా జలాల విడుదల ఉత్తర్వులు సాధించిందనే అక్కసో తెలియ దు? కానీ ఆంధ్రప్రదేశ్ తనవాటా కృష్ణాజలాల వినియోగంకోసం భారీ ఇండెంట్ కోరుతూ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. ఇప్పటివరకు వాడుకున్న జలాలు కాకుండా నవంబర్ వరకు 156 టీఎంసీలు కావాలంటూ బోర్డుకు ఇండెంట్ సమర్పించింది. కృష్ణా బేసిన్‌లో తాజా నీటి సంవత్సరానికిగాను ఆ రాష్ర్టానికి వచ్చేవాటా 210.829 టీఎంసీల్లో 84శాతం నవంబర్ నాటికే వాడుకునేందుకు సిద్ధమైంది. బోర్డు ఈ ఇండెంట్‌కు ఓకే చెపితే ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చేఏడాది మే వరకు ఇక ఏపీకి మిగిలేది 55 టీఎంసీలు మాత్రమే. కృష్ణా బేసిన్‌లో కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు ఈసారి నిండాయి. ఈ క్రమంలో చురుకుగా వ్యవహరించాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డులో నిర్లిప్తత నెలకొన్నది. 52.50 టీఎంసీలు కావాలంటూ తెలంగాణ నీటిపారుదలశాఖ ఇండెంట్ పెట్టినా ఉత్తర్వులు ఇవ్వకుండా కాలయాపన చేసింది. అదేసమయంలో నీటికోసం లేఖలు రాయాలంటూ బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం ఏపీ జలవనరులశాఖకు పదేపదే లేఖలు రాసింది. తెలంగాణ అధికారుల ఒత్తిడితో ఇటీవల బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీచేయడంతో.. ఇన్నాళ్లూ బోర్డు లేఖలను పట్టించుకోని ఏపీ తాజాగా పెద్దఎత్తున స్పందించింది. నవంబర్ వరకు ఏకంగా 156 టీఎంసీలు కావాలంటూ ఇండెంట్ ఇచ్చింది. పోతిరెడ్డిపాడుకు 50 టీఎంసీలు, హంద్రీనీవా-18 టీఎంసీలు, సాగర్ కుడికాల్వ-60 టీఎంసీలు, ఎడమకాల్వ-10 టీఎంసీలు, కృష్ణాడెల్టాకు 18 టీఎంసీలు కావాలంటూ లేఖలో కోరింది. గతంలో వివిధ ప్రాజెక్టుల కింద బోర్డు 35 టీఎంసీలకు నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వగా.. తాము మాత్రం అనుమతి లేకుండానే అదనంగా 65.993 టీఎంసీలు వాడుకున్నామని, వాటిని కూడా లెక్కల్లోకి తీసుకోవాలంటూ ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు తన లేఖలో పేర్కొన్నారు.

ఏపీ వాడుకున్నది 127.411 టీఎంసీలు

ఏపీ బోర్డుకు లేఖరాసిన ఈ నెల 6వ తేదీ నాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఎండీడీఎల్ ఎగువన వాడుకునేందుకు 320.94 టీఎంసీల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆ తేదీ నాటికే రెండు రాష్ర్టాలు 170.614 టీఎంసీలు వాడుకున్నాయి. దీనికి మధ్యతరహా ప్రాజెక్టుల కింద 20.925 టీఎంసీలను జోడిస్తే.. మొత్తంగా కృష్ణా బేసిన్‌లో వాడుకునేందుకు అందుబాటులో ఉన్న జలాలు 512.48 టీఎంసీలు. ఇప్పటివరకు తెలంగాణ 43.203 టీఎంసీలు, ఏపీ 127.411 టీఎంసీలు వాడుకున్నాయి. గతేడాది అమలైన 66:34 దామాషా ప్రకారం రెండు రాష్ర్టాల మధ్య జలాలను పంపిణీ చేస్తే.. తెలంగాణకు 174.24 టీఎంసీలు, ఏపీకీ 338.24 టీఎంసీల వాటా వస్తుంది. రెండు రాష్ర్టాలు ఇప్పటివరకు వినియోగించుకున్న జలాలను మినహాయిస్తే తెలంగాణ ఇంకా 131.037 టీఎంసీలు, ఏపీకి 210.829 టీఎంసీలు వాడుకునేందుకు హక్కు ఉన్నది. తాజాగా ఏపీ నవంబర్ అవసరాలకే 156 టీఎంసీలు కావాలంటూ ఇండెంట్ సమర్పించినందున ఆ రాష్ట్ర వాటాగా ఉన్న 210.829 టీఎంసీల నుంచి వాటిని మినహాయిస్తే ఇక మిగిలింది 55 టీఎంసీలు మాత్రమే.

బోర్డు నిలువరించాలి

ఏపీ భారీ ఇండెంట్‌పై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ వచ్చే ఏడాది మే వరకు 55 టీఎంసీలతోనే నెట్టుకొస్తుందా? లేక శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో ఎండీడీఎల్ కంటే దిగువకు వెళదామంటూ కొత్తపాట పాడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఇండెంట్‌ను కృష్ణాబోర్డు తెలంగాణ నీటిపారుదలశాఖకు పంపనున్నట్టు తెలిసింది. రెండు రాష్ర్టాల మధ్య ఒప్పందం మేరకు ఆయారాష్ర్టాలు తమ వాటాల్ని బేసిన్‌లో ఎక్కడైనా, ఎప్పుడైనా వాడుకునేందుకు వెసులుబాటు ఉన్నది. ఏపీ తన వాటాకు లోబడి వాడుకునే హక్కు ఉన్నప్పటికీ.. లెక్కలు పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో వాడుకునేందుకు అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తెలంగాణకు రావాల్సిన వాటా లెక్కలపై బోర్డుకు స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, ఈసారి కృష్ణా బేసిన్‌లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ.. రానున్న వేసవిలో ఎండీడీఎల్ దిగువకు వెళ్లే పరిస్థితుల్లోకి నెట్టేలా ఏపీ అధికారుల ఇండెంట్ ఉన్నదని.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

278
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles