ఎకరం 42.59 కోట్లు!


Fri,May 19, 2017 03:25 AM

42.59 crore an acre

గజం రూ.88 వేలతో సరికొత్త చరిత్రను సృష్టించిన రాయదుర్గం భూములు
ప్రభుత్వ భూముల వేలానికి భారీ స్పందన.. ఐదు ఎకరాల విక్రయాలతో రూ.185 కోట్లు జమ

Rayadurgam
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల రేట్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎకరం భూమికి రూ.42.59 కోట్ల ధర పలికింది. పదేండ్ల క్రితం ఉమ్మడిపాలనలో తొలిసారి రాయదుర్గం భూములకు వేలం నిర్వహించారు. అప్పుడు రియల్ ఎస్టేట్ బూమ్ బాగా ఉన్నప్పటికీ ఎకరానికి రూ.20 కోట్లు కూడా రాలేదు. గత సంవత్సరం టీఎస్‌ఐఐసీ వేలంలో ఎకరానికి రూ.29 కోట్లు మాత్రమే లభించాయి. హైదరాబాద్‌లో భూముల కొనుగోలుకు కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు ముందుకొస్తుండటంతో ఏడాది లోపలే రికార్డుస్థాయి ధరలు నమోదవుతున్నాయి. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో గురువారం ఆన్‌లైన్ ద్వారా భూముల విక్రయాలు చేపట్టారు. రాయదుర్గంలోని రెండు బిట్లకు టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో రాయదుర్గంలోని ఎస్‌బీహెచ్ దగ్గర ఉన్న రెండెకరాల 84 సెంట్లను ఎకరానికి రూ.42.59 కోట్లతో ఆదిత్య గౌర బిల్డర్స్ దక్కించుకుంది. అంటే గజం భూమి రూ.88వేలు పలికింది. ఐకియా షోరూం దగ్గర ఉన్న రెండెకరాల 15 సెంట్లలో ఎకరానికి రూ.29.33 కోట్లు చొప్పున ధర పలికింది. దీనిని ఎంఎస్‌ఎన్ లైఫ్‌సైన్సెస్ దక్కించుకుంది. రెండింటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.185 కోట్లు జమయ్యాయి. మొత్తం ఐదెకరాల వరకు భూ విక్రయాలు జరిగాయి. రాయదుర్గం, ఖానామెట్ ప్రాంతంలో భూముల వేలానికి టీఎస్‌ఐఐసీ ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 15 ఎకరాల భూమికి ఈ-టెండర్ కమ్ ఈ-యాక్షన్ పద్ధతిలో వేలం జరుగగా రెండింటికి టెండర్లు దాఖలయ్యాయి. 15.43 ఎకరాలల్లో (74,717 గజాల) స్థలాన్ని వేలం పెట్టారు. ఈ స్థలాలను బహుళ ప్రయోజనాలకు వినియోగించుకునే (మల్టీ యూజ్) విధంగా వెసులుబాటు కల్పించారు. గతంలో టీఎస్‌ఐఐసీ మూడుసార్లు నిర్వహించిన భూముల వేలానికి భారీగా స్పందన వచ్చింది. ప్రముఖ సంస్థలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు భూములు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. గతంలో నిర్వహించిన వేలంలో ఖానామెట్ ప్రాంతంలో ఎకరానికి రూ.29 కోట్ల ధర పలికింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రజల్లో ఉన్న గందరగోళం, అపోహలు తొలిగిపోయాయి. పరిపాలనపరంగా, ప్రభుత్వ విధానాల కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్నది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావ డం, బెస్ట్ లివబుల్ సిటీగా, శాంతిభద్రతలపరంగా హైదరాబాద్ టాప్‌లో నిలువడం భూముల ధరలు పెరుగడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సుస్థిరపాలన, ముందుచూపు ఉన్న ప్రభుత్వంగా జాతీయ స్థాయి సంస్థల గుర్తింపు పొందడం కూడా కారణమని అంచనా వేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్ల్లాట్ల విక్రయాలు పెరుగుతున్నాయని అనేక సంస్థలు తమ సర్వేల్లో వెల్లడించాయి. దీంతో క్రమక్రమంగా భూముల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. భూములకు భారీగా ధరలు పలుకుతాయని అంచనా వేసినా ఏకంగా 42 కోట్లకు ఎకరం భూమి అమ్ముడుపోవడంతో అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

6020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS