ఫంక్షన్‌హాల్ గోడకూలి నలుగురు మృతి

Mon,November 11, 2019 03:06 AM

-అంబర్‌పేటలో ఫంక్షన్‌హాల్ గోడకూలి నలుగురి దుర్మరణం
-మరో ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
-పిల్లర్లు లేకుండానే ఎత్తయిన గోడ నిర్మాణం
-పునఃప్రారంభం తర్వాత మొదటి రోజే దుర్ఘటన
-నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు
-రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మేయర్

హైదరాబాద్ సిటీబ్యూరో/అంబర్‌పేట, నమస్తే తెలంగాణ/గోల్నాక: ఓ ఫంక్షన్‌హాల్ యజమాని నిర్లక్ష్యం పెండ్లికి వచ్చిన నలుగురి ప్రాణాలను బలిగొన్నది. మరమ్మతుల సమయంలో ముందు చూపులేకుండా, కనీస ప్రమాణాలు పాటించకుండా, పిల్లర్లు లేకుండా నిర్మించిన ఎత్తైన గోడ కూలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ దుర్ఘటన హైదరాబాద్ అంబర్‌పేట గోల్నాక శాంతినగర్‌లోని పెరల్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం పెండ్లి వేడుకలు జరుగుతుండగా సంభవించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నల్లకుంట నర్సింహబస్తీకి చెందిన సదానంద్ కుమార్తె స్వప్న, మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఎన్మన్‌గండ్లకు చెందిన అంజమ్మ కొడుకు చంద్రశేఖర్‌ల పెండ్లిని గోల్నాకలోని పెరల్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు.

మధ్యాహ్నం 12:45 గంటలకు ముహూర్తం ఉండగా, అబ్బాయి తాళిబొట్టుకట్టడంతో అందరూ అంక్షితలు వేసి, భోజనాలు చేస్తున్నారు. ఇలా వచ్చిపోయేవారితో ఫంక్షన్‌హాల్ సందడిగా ఉన్నది. అందరూ పెండ్లి సంబురాల్లో ఉండగా మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఫంక్షన్‌హాల్ ప్రవేశద్వాదానికి పైభాగాన ఇటీవలె నిర్మించిన 14 అడుగుల ఎత్తు, 40 అడుగుల పొడవున్న గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పటికే భోజనాలుచేసిన కొందరు బయలుదేరేందుకు ప్రవేశద్వారం ముందు భాగంలోనే వాహనాలు పార్క్‌చేసినచోట నిలబడి ఉండగా, వారిపై ఈ గోడ కూలింది. ఈ ప్రమాదంలో నల్లకుంటకు చెందిన విజయలక్ష్మి (60), దేవరకద్రకు చెందిన కృష్ణయ్య (23), నందనవనంకాలనీకి చెందిన సురేశ్ (29), అంబర్‌పేటకు సోహెల్ (30) ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, విజయలక్ష్మి ఉస్మానియా దవాఖానకు తరలిస్తుండగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన మాజిద్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నది. వెంకటేశ్ అనే వ్యక్తిని చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. విషయం తెలుసుకున్న అంబర్‌పేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, జీహెచ్‌ఎంసీకి సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ ఆలస్యంగా వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఈస్ట్‌జోన్ జాయింట్ సీపీ రమేశ్‌రెడ్డి, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ బిట్టుమోహన్‌కుమార్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఫంక్షన్‌హాల్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదుచేస్తున్నట్టు జాయింట్ సీపీ తెలిపారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఘటనాస్థలిని సందర్శించారు. ఈ ఘటనలో రెండు ఆటోలు, పది బైక్‌లు కూడా ధ్వంసమయ్యాయి.
fanshan-hall1

కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం

ఈ పెరల్ గార్డెన్‌ను 15 ఏండ్ల కింద నిర్మించారు. యజమాని కాచిగూడకు చెందిన హర్షద్ అడ్డా మూడునెలలుగా మరమ్మతులు చేయిస్తున్నారు. మరమ్మతుల్లో భాగంగా ప్రవేశద్వారం అందంగా కనిపించేందుకు అప్పటికే ఉన్న తొమ్మిది అడుగుల గోడపై మరో 14 అడుగుల ఎత్తు గోడను 40 అడుగుల పొడవుతో నిర్మించి, దానికి సపోర్టుగా ఒక బీమ్‌ను ఏర్పాటుచేశారు. దానికి అద్దాలు కూడా బిగించారు. మరమ్మతుల అనంతరం సదానంద్ కుమార్తె పెండ్లితోనే ఆదివారం ఈ ఫంక్షన్‌హాల్ తిరిగి ప్రారంభమైంది. ఎలాంటి ముందు చూపులేకుండా, కనీస ప్రమాణాలు పాటించకుండా ఈ గోడను నిర్మించారు. పిల్లర్లు వేసి దానికి సపోర్టుగా ఇనుపచువ్వలను ఉపయోగించాలి. కానీ అలాంటివేవీ లేకుండానే కేవలం ఇటుకలతోనే గోడను నిర్మించారు. ఈ క్రమంలోనే ఆదివారం పెండ్లి జరుగుతుండగా, వేడుకకు వచ్చిపోయేవారితో సందడి నెలకొని ఉన్నది. ఇంతలో సుందరీకరణ కోసం నిర్మించిన గోడ కుప్పకూలింది.

రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

-మేయర్ బొంతు రామ్మోహన్
గోల్నాక ఫంక్షన్ హాల్ ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున అందిస్తామని చెప్పారు. ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలతోపాటు క్షతగాత్రులను డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్ పరామర్శించారు.

2376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles