ముమ్మరంగా ప్రగతి యజ్ఞం

Sun,September 15, 2019 03:13 AM

-రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న కార్యక్రమాలు
-పల్లెల్లోనే కలెక్టర్లు, అధికార యంత్రాంగం
-ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్న ప్రజాప్రతినిధులు
-ఊరి బాగుకోసం ముందుకొస్తున్న ప్రజలు
-అభివృద్ధి పనులకు విరివిగా విరాళాలు

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొమ్మిదో రోజు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు సందడిగా మారాయి. ప్రజాప్రతినిధులతోపాటు కలెక్టర్లు, అధికార యంత్రాంగం గ్రామాల్లోనే ఉంటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పల్లెలను అభివృద్ధి కేంద్రాలుగా చేయాలన్న ముఖ్యమంత్రి స్వప్నం సాకారం చేసేందుకు ప్రజలు ఉత్సాహంగా శ్రమదానం చేస్తున్నారు. తమ ఊరి బాగు కోసం విరివిగా విరాళాలు ఇవ్వడంతోపాటు అభివృద్ధి పనులకు భూములను దానమిస్తున్నారు.
Palle-Pragathi
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. పల్లెల సుందరీకరణకు ప్రజలు శ్రమదానం చేస్తున్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కేశప్పగూడెంలో జెడ్పీ సీఈవో మధుసూదన్‌రాజు, టేకులపల్లి మండలం సీతారాంపురంలో జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు పర్యటించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లూరు, ఎర్రుపాలెం మండలం శఖునవీడు గ్రామాల్లో జరుగుతున్న పనులను జెడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్, కలెక్టర్ ఆర్వీకర్ణన్ పరిశీలించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండార గ్రామం, పాడిబండ పంచాయతీ పరిధిలోని దాంపూర్‌లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ పర్యటించారు.

సందడిగా పల్లెసీమలు

ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాలు సందడిగా మారాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారంలో జెడ్పీ చైర్‌పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ పర్యటించి పనులను పర్యవేక్షించారు. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కలలో జిల్లా పంచాయతీ అధికారి హనోక్, ఎంపీపీ హరికృష్ణ శుక్రవారం రాత్రి పల్లెనిద్ర చేశారు. శనివారం ఉదయం గ్రామంలో ముండ్లపొదలను తొలగించారు. గ్రామంలోని వీధులను శుభ్రపరిచారు. నర్సాపూర మండల కాగజ్‌మద్దూర్ గ్రామంలో డీఎల్‌పీవో రమణమూర్తి ఆధ్వర్యంలో పల్లె నిద్ర చేశారు. రంగారెడ్డి జెడ్పీచైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి శనివారం మహేశ్వరం మండలంలోని సిరిపురం, గంగారంలో పర్యటించి కలెక్టర్ హరీశ్‌తో కలిసి జిల్లా నోడల్ అధికారులతో సమీక్షించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండ, పాలకుర్తి మండలం శాతాపురంలో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పర్యటించారు. నర్మెట, తరిగొప్పుల మండలాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులతో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ప్రగతి పనుల ప్రతిపాదనలను సమీక్షించారు. తుర్కపల్లి మండలం ముల్కపల్లిలో కలెక్టర్ అనితారామచంద్రన్, ఆత్మకూరు(ఎం) మండలం సర్వపల్లిలో ఆర్డీవో వెంకటేశ్వర్లు 30 రోజుల ప్రణాళిక అమలుతీరును పరిశీలించారు. బొమ్మలరామారంలో కలెక్టర్ అనితారామచంద్రన్, గుండాలలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, మోటకొండూర్ మండలంలో డీఆర్‌డీఏ పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి సమీక్ష జరిపారు.

ఉత్సాహంగా శ్రమదానం

ఊరి బాగుకోసం ముందుకురావాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంగా శ్రమదానం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజలు శ్రమదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామసభలో జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఏదులాపూర్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి శ్రమదానం చేశారు. మూసాపేట, భూత్పూరు మండలాల్లో 30 రోజుల ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మోహన్‌గూడలో జెడ్పీ చైర్మన్ రాథోడ్‌జనార్దన్ గ్రామస్థులతో కలిసి పిచ్చిమొక్కలు, వ్యర్థాలను తొలగించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్‌లో కలెక్టర్ సత్యనారాయణ రోడ్లను శుభ్రం చేశారు.

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లిలో ప్రజలు స్వచ్ఛందంగా శ్రమదానం చేసి రోడ్లను శుభ్రం చేశారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి, మందమర్రి మండలం అందుగులపేటలో కలెక్టర్ భారతి హోళికెరి శ్రమదానం చేశారు. మందమర్రి మండలం ఆదిల్‌పేట, చెన్నూరు మండలం అక్కెపల్లిలో జెడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మొక్కలు నాటారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో జిల్లా ఫ్లయింగ్ అధికారి డీఎఫ్‌వో జోజి శనివారం ఆకస్మిక తనిఖీచేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు చెత్తను ఎ త్తి కాలువల్లోని మురికి నీటిని తొలగించారు. జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి కాటారం గ్రామంలో శ్రమదానంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కురవి, గార్ల మండలాల్లో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పర్యటించారు.
Palle-Pragathi22

కలెక్టర్ల పర్యటన

30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుతీరును జిల్లాల కలెక్టర్లు స్వయంగా పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో పలు వీధుల్లో కలెక్టర్ రామ్మోహన్‌రావు పర్యటించారు. నల్లగొండ మండలం కంచనపల్లి, మునుగోడు మండలం గూడపూర్, చండూర్ మండలం ఉడుతపల్లి గ్రామాల్లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పర్యటించారు. జగిత్యాల మండలం ధరూర్, నర్సింగాపూర్ గ్రామాల్లో జగిత్యాల కలెక్టర్ శరత్ పర్యటించారు. గ్రామాల్లో డ్రైనేజీలను పరిశీలించి, వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలోని పలుగ్రామాల్లో కలెక్టర్ అమయ్‌కుమార్ పర్యటించారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలంలోని లక్ష్మీనగర్ తండా, రాళ్లగుడుపల్లిలో కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి పర్యటించారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండ లం పెంబర్తి, నాగారం గ్రామాల్లో జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌తో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. నారాయణపేట మండలం కొల్లంపల్లి, చిన్నజట్రం, మరికల్ మండల కేంద్రంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు. కలెక్టర్ పర్యటనలో పలువురు దాతలు విరాళాలు అందజేశారు.

మొక్కలు నాటి భావితరాలను కాపాడుకుందాం

-హరితహారం కమిషనర్ ఆశ
మొక్కలునాటి భావితరాలను కాపాడుకుందామని హరితహారం కమిషనర్ ఆశ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అనాజీపురంలో ఆమె పర్యటించి 30రోజుల ప్రణాళికలో భాగంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించాలని, గ్రామంలో పారిశుధ్ధ్య పనులను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. సర్పం చ్ ఈదునేరి ప్రేమలత మల్లేశంకు పలు సూచనలు చేశారు.

ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కండి

-మంత్రి ఎర్రబెల్లి
30 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో తనను కలిసిన జనగామ జిల్లా పాలకుర్తి మండల సర్పంచులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమై మాట్లాడారు.

30 రోజుల ప్రణాళికపై సీఎంవో ఆరా

-పరిగి ఎంపీడీవోకు వీడియో కాల్ చేసి వివరాల సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆరా తీశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మురళీధర్ అనే అధికారి వికారాబాద్ జిల్లా పరిగి ఎంపీడీవో కృష్ణకుమార్‌కు శనివారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఎక్కడున్నారని ఎంపీడీవోను ప్రశ్నించగా నస్కల్ గ్రామం వెళ్తున్నట్లు చెప్పారు. దీంతో నస్కల్ గ్రామంలో అమలవుతున్న 30 రోజుల కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామసభ నిర్వహించి స్థాయీ సంఘాల ఏర్పాటు.. తర్వాత గ్రామంలో తిరుగుతూ సమస్యలు గుర్తిస్తున్నామని ఎంపీడీవో తెలిపారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను వీడియో కాల్ ద్వారా చూపించారు. గ్రామంలో చెత్త సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి పొడి చెత్తను, ప్లాస్టిక్ వస్తువులు సేకరించి అక్కడ ఉంచామని వివరించారు. ఈక్రమంలో ఓ దగ్గర భూమి చదును చేస్తున్న దృశ్యం చూసి వివరాలు అడిగారు. కాగా కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలం చదును చేస్తున్నామని మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మేడిద రాజేందర్ తెలిపారు. అనంతరం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరు బాగుందని మురళీధర్ అభినందించినట్టు ఎంపీడీవో తెలిపారు.
Palle-Pragathi11

విరాళాల వెల్లువ

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడి గ్రామంలో ట్రీ-గార్డుల ఏర్పాటు కోసం గ్రామస్థులు మచ్చర రమేశ్ రూ.25 వేలు, గంగోళ్ల ప్రళయ్‌తేజ్ రూ.10 వేలు, ఉప సర్పంచ్ మణిగౌడ్ రూ.5 వేలు, ప్రసాద్‌గౌడ్ రూ.7,500 మొత్తం రూ.47,500 జెడ్పీ సీఈవో చేతుల మీదుగా సర్పంచ్ లావణ్యకు అందజేశారు.
-నాగర్‌కర్నుల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి గ్రామస్థులు లక్షా 65వేలు, బల్మూరు మండలం తుమ్మెన్‌పేట గ్రామస్థులు రూ.29వేల విరాళాలు ప్రకటించారు.
-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం చేడ్వాయి,కొత్తగూడ గ్రామానికి చెందిన కేర్‌కరి రాజన్న గ్రామాభివృద్ధి కోసం రూ. 21 వేలు విరాళంగా ఇచ్చారు.

జరిమానాల పర్వం

-హరితహారంలో నాటిన మొక్కల కంచెలను దొంగిలించిన వ్యక్తులకు అధికారులు రూ.20వేలు జరిమానా విధించారు. రామగుండలం నగరపాలక సంస్థ పరిధిలోని యైటింక్లయిన్ కాలనీకి చెందిన నిందితులు కుడుదుల లచ్చయ్య, మాలోతు బాలాజీలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా వేశారు.
-పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో పాఠశాల ఆవరణలో హరిత హారం మొక్కలను మేసిన ఎడ్ల యజమాని మాచిడి సమ్మయ్యకుపంచాయతీ పాలకవర్గం శనివారం రూ.వెయ్యి జరిమానా విధించింది.
-మంచిర్యాల జిల్లా హాజీపూర్ బస్టాండ్ నుంచి పడ్తన్‌పల్లికి వెళ్లే దారిలో ఉన్న బాలజీ వైన్స్‌వద్ద ప్లాస్టిక్, చెత్తాచెదారం ఉండడంతో అధికారులు రూ.2వేల జరిమానా విధించారు. నంనూర్‌లోని హనుమాన్ వైన్స్ వద్ద కూడా చెత్త ఉండడంతో రూ.వెయ్యి జరిమానా వేశారు.
-జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో రోడ్డుపై చెత్త వేసిన బేకరి యజమానికి గ్రామపంచాయతీ రూ.2 వేల జరిమానా విధించింది.

నిర్లక్ష్యానికి మూల్యం

30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ, మాదారం, సూర్యాపేట మండలం రామారం సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ అమయ్‌కుమార్ శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
-నారాయణపేట జిల్లా బొమ్మన్‌పాడు గ్రామంలో విధులు సక్రమంగా నిర్వహించడం లేదని నలుగురు వీఆర్వోలను కలెక్టర్ వెంకట్రావు సస్పెండ్ చేశారు.
Palle-Pragathi33

574
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles