స్వచ్ఛందంగా.. సమిష్టిగా

Fri,September 20, 2019 02:25 AM

-అభివృద్ధి కోసం కదులుతున్న పల్లెజనం
-గ్రామాల్లో జోరుగా 30 రోజుల ప్రణాళిక
-మొక్కలతో కళకళలాడుతున్న వీధులు
-శుభ్రంగా మెరుస్తున్న రహదారులు
-గ్రామాల్లోనే ఉంటూ పర్యవేక్షిస్తున్న కలెక్టర్లు
-అభివృద్ధి పనులకు భారీగా విరాళాలు
-కొనసాగుతున్న జరిమానాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రగతి కార్యాచరణలో ప్రజలు స్వచ్ఛందంగా, సమిష్టిగా పాల్గొంటున్నారు. తమతమ గ్రామాల అభివృద్ధి కోసం ఒక్కటవుతున్నారు. ఏండ్లుగా వేధిస్తున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకుంటున్నారు. ప్రధానంగా మురుగుకాల్వల శుభ్రం, విద్యుత్ సమస్యల పరిష్కారం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఇందుకోసం ఆర్థిక సాయంతోపాటు పలు గ్రామాల్లో అవసరమైన భూములను విరాళమిస్తున్నారు. 14వ రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలు జోరుగా సాగాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతోపాటు ప్రత్యక్షంగా పనుల్లో పాల్గొంటూ ఉత్సాహం నింపుతున్నారు.
-నమస్తే తెలంగాణ నెట్‌వర్క్

Clean-village5
30రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. వికారాబాద్ జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో కలెక్టర్ మస్రత్‌ఖనమ్ ఆయేషా పర్యటించారు. ప్రజలకు తడిచెత్త- పొడిచెత్త, ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించారు. ధారూర్ మండ లం కొండాపూర్‌లో జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, పరిగి మండలం జాఫర్‌పల్లిలో డీఆర్డీవో జాన్సన్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని వెంకటరత్నాపూర్‌లో జెడ్పీచైర్‌పర్సన్ ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్ శ్రమదానంలో పాల్గొని పిచ్చిమొక్కలను తొలగించారు. మెదక్ మండలం చిట్యాల, మంబోజిపల్లిలో కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించి పనులను పరిశీలించారు.

మొక్కలు నాటి.. చెత్త డ్రమ్ములు పంచారు

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, టేకుర్తి గ్రామాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేశారు. వీణవంక మండ లం రెడ్డిపల్లిలో చెరువుకట్టపై మొక్కలు నాటా రు. రామడుగు మండలం వెలిచాల గ్రామసభలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ 30 రోజుల ప్రణాళికపై అవగాహన కల్పించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి, కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు పర్యటించారు. డంపింగ్ యార్డులను, మంకీ ఫుడ్‌కోర్టు స్థలాలను పరిశీలించారు. ముందుగా కామారెడ్డి జిల్లాకేంద్రంలోని రాశివనంలో కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ఆయన మొక్కలు నాటారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్, భైంసా, లోకేశ్వరం మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంతి పర్యటించి, పల్లె ప్రణాళికపై ప్రజలకు అవగాహన కల్పించారు. హవర్గ గ్రామంలో చెత్తకోసం డ్రమ్ము లను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని సూరేపల్లి, ఆకుతోటబావితండాలో కలెక్టర్ అనితారామచంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ సందర్శించారు.
Clean-village3

వానలోనూ జోరుగా పనులు

30 రోజుల ప్రణాళిక పనులు వర్షంలోనూ జోరుగా సాగాయి. నారాయణపేట జిల్లాలోని నర్వ, సీపూర్, కల్వాల, పెద్దకడుమూర్, పాతర్‌చేడ్ గ్రామాల్లో కలెక్టర్ వెంకట్రావు పర్యటించి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండలం చెన్నారంలో డీపీవో సురేష్‌మోహన్ ప్రణాళిక పనులను తనిఖీచేశారు. వెల్దండ మండలం బ ర్కత్‌పల్లిలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని గ్రామస్థులు ప్రతిజ్ఞచేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదానంలో కలెక్టర్ శ్వేతామొహంతి, ఎస్పీ అపూర్వరావు, ఎంపీపీ మేఘారెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటతోపాటు మహబూబ్‌నగర్ రూరల్ మం డలం జైనల్లీపూర్‌లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ శ్రమదానంలో పాల్గొని పిచ్చిమొక్కలను తొలగించారు. ఖమ్మం జిల్లాలో జోరువానలకు తెలంగాణకు హరితహారం కార్యక్రమం మరిం త ఊపందుకున్నది. వైరా, మధిర, ఏన్కూర్ మండలాల్లో జెడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు విస్తృతంగా పర్యటించి పనులను పర్యవేక్షించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ముదిగొండ మండలంలో ప్రగతి పనులను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మం డలంలోని మోరంపల్లి బంజర, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలను కలెక్టర్ రజత్‌కుమార్‌శైని తనిఖీ చేశారు.

ఊరూరా శ్రమదానాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లి, కోరెం, స్తంభంపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ కృష్ణభాస్కర్ పర్యవేక్షించారు. ఊరి బాగుకోసం కలిసికట్టుగా శ్రమదానం చేయడంపై స్థానికులను అభినందించారు. కోనరావుపేట మండలకేంద్రంలో జెడ్పీచైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేశారు. గంభీరావుపేట మండలంలోని గజసింగవరంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీటీసీ విజయ, ఎంపీపీ కరుణతో కలిసి ఆయన మొక్కలు నాటారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవల్లి, మద్దులపల్లి, పెగడపల్లి, నందగిరిలో కలెక్టర్ శరత్ పర్యటించి, పల్లె ప్రగతి పనులను తనిఖీ చేశారు. ఆరవల్లిలో స్థానికులతో కలిసి పారిశుద్ధ్య పనులు చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం ఇట్యాల, కొత్మీర్, బీబ్రా, కాగజ్‌నగర్ మండలం భట్టుపల్లి, అందవెల్లి, బోడపల్లి, జగన్నాథ్‌పూర్ గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యటించారు.
Clean-village4
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో కలెక్టర్ భారతి హోళికేరి పర్యటించారు. ఇండ్ల ముందు చెత్తాచెదారం కనిపించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని అన్‌సాన్‌పల్లి, నాచారం గ్రామాల్లో జరిగిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అన్‌సాన్‌పల్లిలో జేసీబీ నడిపి పాఠశాల శిథిలాలను తొలగించారు. కాటారం మండ లం గంగారంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జెడ్పీ సీఈవో శిరీష శ్రమదానం చేసి పిచ్చిమొక్కలను తొలగించారు. మేడ్చల్ జిల్లా లో పల్లె ప్రగతి పనులు జోరుగా సాగుతున్నా యి. ఆయా గ్రామాల్లో గురువారం మొక్కలు నాటారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ లంలోని నర్కుడ, రామంజాపూర్, మల్కా రం, నానాజిపూర్‌లో జిల్లా ఇంచార్జి కలెక్టర్ హరీశ్ పర్యటించారు. ప్రతి పల్లెను పచ్చద నంతో హరితవనంలా తయారుచేయాలని పిలుపునిచ్చారు.

అధికారుల పల్లెనిద్ర

-జనగామ జిల్లాలో 12 మండలాల్లోని 36 గ్రామాల్లో బస
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక స్ఫూర్తితో గురువారం నుంచి జిల్లా అధికారుల పల్లె నిద్ర కార్యక్రమానికి జనగామ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. తొలివిడుతలో జిల్లాలోని ఒక్కో మండలం నుంచి మూడుగ్రామాలను ఎం పికచేశారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, తాసిల్దార్ పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజల సమస్యలను తెలుసుకొంటారు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. ఇలా జిల్లాలోని 12 మండలాల్లో ఎంపికచేసిన 36 గ్రామాల్లో గురువారం రాత్రి నుంచే అధికారులు పల్లెనిద్ర కార్యక్రమా న్ని ప్రారంభించారు. మరోవైపు పల్లె ప్రగతి కార్యక్రమం జిల్లావ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. ఎక్కడికక్కడ గ్రామాల్లో స్థానికులతో కలిసి అధికారులు శ్రమదానాలు చేస్తున్నారు. బచ్చన్నపేట, జనగామ మండల కేంద్రాల్లో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై జెడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు.

పరిశుభ్రత అందరి బాధ్యత

పల్లెల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. రోగాలు రాకుండా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాం. హోదా, పదవులు పక్కన పెట్టి గ్రామాల అభివృద్ధికి ముందుకురావడం బాగుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని పరిరక్షించినప్పుడే భవిష్యత్‌కు మంచి వాతావరణాన్ని ఇవ్వగలుగుతాం.
- సిడాం దేవ్‌రావ్, రాయ్‌సెంటర్ ఝరి, కెరమెరి మండలం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా
Clean-village7

సర్పంచ్‌కు ఎంపీ సంతోష్‌కుమార్ అభినందన

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) సర్పంచ్ గాడిగే మీనాక్షి 30 రోజుల ప్రణాళికలో రోజువారీగా అమలుచేస్తు న్న కార్యక్రమాల వివరాలు, ఫొటోలను ట్విట్టర్ ద్వారా రాజ్యసభసభ్యుడు సంతోష్‌కుమార్‌కు నివేదించా రు. ఎంపీ వెంటనే స్పందించారు. సర్పంచ్‌ను ట్విట్టర్‌లో అభినందించారు. ఐదువేల మొక్క లు నాటి సంరక్షించడం, పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం అభినందనీయమని, ముక్రా(కే).. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
- ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ

ఊరికోసం రెండెకరాల భూమి విరాళం

గ్రామంలో శ్మశానవాటిక ఏర్పాటుకు రెండెకరాల భూమిని దానమిస్తున్నట్టు వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం సర్పంచ్ పింగిళి రవళి ప్రకటించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఈ సందర్భంగా సర్పంచ్ రవళిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధి కోసం దాతలు సాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
- కమలాపూర్(వరంగల్ అర్బన్)
Clean-village8

చెట్లను నరికించినందుకు రూ.3 వేల జరిమానా

చెట్లను నరికించినందుకు రూ.3వేల జరిమానా విధించింది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొన్కల్ పంచాయతీ పాలకవర్గం. రెండోవిడుత హరితహారంలో భాగంగా దొన్కల్‌కు వెళ్లే రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా ఎదిగాయి. తన పొలం వద్ద ఉన్న చెట్లను రైతు ఏలేటి పెద్దరాజేశ్వర్ నరికి వేయించాడు. సర్పంచ్ కత్తి లావణ్య, ప్రత్యేకాధికారి విక్రమ్‌రాజ్, కార్యదర్శి ఖాన్.. రాజేశ్వర్‌కు రూ.3 వేల జరిమానా విధించారు.
-మోర్తాడ్

సర్పంచ్, అధికారులకు మెమోలు

30 రోజుల ప్రణాళిక అమలులో నిర్లక్ష్యంవహించిన పలువురికి సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు మెమోలు జారీచేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని మన్‌సాన్‌పల్లిని గురువారం హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీచేశారు. పారిశుద్ధ్య చర్యలపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశా రు. సర్పంచ్ సుజాత, ఉపసర్పంచ్ నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ సంతోష్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి మనోజ్, లైన్‌మెన్ అంబయ్యకు మెమోలు జారీచేశారు.
- అందోల్, నమస్తే తెలంగాణ
Clean-village6
Clean-village1

733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles