రాజీవ్‌ రహదారిపై ఘోరం

Tue,October 22, 2019 03:12 AM

- కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు
- ముగ్గురి దుర్మరణం.. నలుగురి పరిస్థితి విషమం
- వీరంతా కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

గజ్వేల్‌టౌన్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ సమీపంలో రాజీవ్‌ రాహదారిపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటెయినర్‌ లారీని కారు ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణంచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గజ్వేల్‌ పట్టణ సీఐ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం వేగురుపల్లికి చెందిన ఏడుగురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమ స్నేహితుడి కారులో హైదరాబాద్‌లోని షేక్‌పేటలో జరిగిన మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కొత్తగా తీసిన ‘తుపాకి రాముడు’ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌కు హాజరయ్యారు. అనంతరం రాత్రి కారులో తిరిగి స్వగ్రామం బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ రాణే కంపెనీ ఎదుట రోడ్డు పక్కన నిలిపి ఉన్న కంటెయినర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా ఢీకొట్టింది.
rajiv-Highway1
కారులో ఉన్న కనుకుంట్ల మల్లేశం(49), జంగ ప్రభాకర్‌రెడ్డి(58), అలుగువెల్లి జనార్దన్‌రెడ్డి(45) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు నిట్టురి పుల్లయ్య, డ్రైవర్‌ పబ్బతి దేవేందర్‌రెడ్డి, కోల శంకర్‌, గోవర్ధన్‌గౌడ్‌కు తీవ్రగాయాలు కావడంతో వారిని గజ్వేల్‌ దవాఖానకు, అక్కడినుంచి గాంధీ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ గజ్వేల్‌ దవాఖానకు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రులు గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేల రసమయి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు మృతుల స్వగ్రామానికి వెళ్లి నివాళులర్పించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు.
rajiv-Highway2

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు మల్లేశం, జంగ ప్రభాకర్‌రెడ్డి, అలుగువెల్లి జనార్దన్‌రెడ్డి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదే ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్‌ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న గోవర్ధన్‌, పుల్లయ్యలను ఆయన పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
rajiv-Highway3

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles