కృష్ణమ్మ జలజాతర


Tue,August 13, 2019 04:12 AM

26 gates of Nagarjuna Sagar lifted due to heavy inflow

-ఆల్మట్టి నుంచి బంగాళాఖాతం దాకా కళకళలాడుతున్న పరీవాహక ప్రాంతం
-ఎగువనుంచి కొనసాగుతున్న వరద ఉధృతి
-కృష్ణలో తుంగభద్ర సంగమం
-అలంపూర్ బ్యాక్‌వాటర్‌లో కలిసిన రెండు లక్షల క్యూసెక్కుల వరద
-నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత
-పులిచింతల నుంచి దిగువకు నీటి విడుదల

హైదరాబాద్/మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి/జోగుళాంబ గద్వాల ప్రతినిధి/ హాలియా, నమస్తే తెలంగాణ: గత కొన్నేండ్లుగా సంక్షోభానికి వేదికగా నిలిచిన కృష్ణాబేసిన్‌లో సుదీర్ఘకాలం తర్వాత జలజాతర కనిపిస్తున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి దిగువన పులిచింతల దాకా కృష్ణానదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టుల్లోనూ కృష్ణమ్మ సంపూర్ణంగా నిండి.. కడలి ఒడికి చేరుతున్నది. నిరుడు ఆగస్టు 28న శ్రీశైలం గేట్లు తెరుచుకోగా.. ఈ ఏడాది ఆగస్టు 12నే నాగార్జునసాగర్ గేట్లను ఎత్తివేయడం గత పదేండ్లలో మొదటిసారి కావడం విశేషం. ఎగువనుంచి కొనసాగుతున్న వరద ఉధృతిని నియంత్రించడంలో భాగంగా అధికారులు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల మీదుగా దిగువకు భారీమొత్తంలో జలాలను విడిచిపెడుతున్నారు. అలంపూర్‌వద్ద బ్యాక్‌వాటర్‌లో తుంగభద్ర కృష్ణలో సంగమించింది. ఈ క్రమంలో ప్రకాశం బరాజ్‌లో పెద్దగా నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి దిగువన సముద్రంలోకి కృష్ణాజలాలను వదులుతున్నారు. ప్రతి ఏడాది లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలువడం సాధారణం. కానీ కృష్ణాజలాలు అన్ని ప్రాజెక్టులను నింపి భారీస్థాయిలో సముద్రం ఒడికి చేరడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

బేసిన్‌లో స్థిరంగా కొనసాగుతున్న వరద

కృష్ణాబేసిన్‌లో ఎగువనుంచి వరద స్థిరంగా కొనసాగుతున్నది. నిన్నటిదాకా ఆల్మట్టి జలాశయానికి వరద మోతాదు పెరుగుతూనే ఉండగా.. సోమవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 6.41 లక్షల నుంచి 5.70 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దీంతో కర్ణాటక అధికారులు ఆల్మట్టి జలాశయంలో నీటినిల్వను 97 టీఎంసీల నుంచి 106 టీఎంసీల వరకు పెంచి.. అవుట్‌ఫ్లోను నియంత్రించారు. సోమవారం సాయం త్రం ఆల్మట్టి వద్ద అవుట్‌ఫ్లో 5.40 లక్షలుగా నమోదైంది. దిగువన నారాయణపుర జలాశయానికి సోమవారం 5.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగింది. ఈ క్రమంలో అవుట్‌ఫ్లోను కూడా అదేస్థాయిలో నిర్వహిస్తున్నారు.

ఉజ్జయిని నుంచి లక్ష క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్న దరిమిలా భీమా ద్వారా వచ్చే వరద కలిసి జూరాలకు వస్తున్న వరద ఎనిమిది లక్షల పైచిలుకు కొనసాగుతుండగా అవుట్‌ఫ్లో కూడా అదేస్థాయిలో ఉన్నది. జూరాల 62 గేట్లు ఎత్తి సుమారు ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భీమా నది నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. నారాయణపుర నుంచి తగ్గిన ఇన్‌ఫ్లో ప్రభావం మంగళవారం రాత్రి నుంచి కనిపించే అవకాశమున్నది. ఒకవేళ ఎగువ నుంచి ఆల్మట్టికి వరద పెరిగితే జూరాల ఇన్‌ఫ్లోలో తేడా ఉండకపోవచ్చు.

శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం

జూరాల నుంచి గత రెండురోజులుగా ఎనిమిది లక్షల పైచిలుకు అవుట్‌ఫ్లో ఉండటంతో శ్రీశైలం జలాశయానికి సోమవారం మధ్యాహ్నం వరకు ఎనిమిది లక్షల క్యూసెక్కులలోపు ఉన్న ఇన్‌ఫ్లో రాత్రయ్యేసరికి పది లక్షలకు పైగా పెరిగింది. తుంగభద్ర నుంచి మూడురోజుల కిందట విడుదలైన వరద.. సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకోవడంతో జలాశయానికి ఇన్‌ఫ్లో ఏకంగా 10,29,861 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలానికి మంగళవారం వరద పరిమాణం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు జలాశయం నీటిమట్టాన్ని తగ్గించి.. వరదను నియంత్రిస్తున్నారు. పది గేట్ల ద్వారా సుమారు ఎనిమిదిన్నర లక్షల పైచిలుకు క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్‌కు సోమవారం సాయంత్రానికి 7.66 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. మంగళవారం ఇది ఎనిమిదిన్నర లక్షల వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

సంగమించిన తుంగభద్ర

కృష్ణా, తుంగభద్ర సంగమమయ్యాయి. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో సుంకేశుల బరాజ్ నుంచి వదిలిన 2లక్షల క్యూసెక్కుల వరద అలంపూర్ సమీపంలోని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో కలువడంతో రెండు నదుల సంగమం జరిగింది. రెండింటి కలయికతో పెద్దఎత్తున వరదరావడంతో శ్రీశైలం ప్రాజెక్టు మహాసాగరాన్ని తలపిస్తున్నది. రెండు నదుల పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తంచేశారు. ఇప్పటికే పలుగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల అధికార యంత్రాంగం వరద పరిస్థితిపై 24 గంటలపాటు అప్రమత్తంగా పనిచేస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా గుర్రంగడ్డ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.

విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకొన్న స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సోమవారం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో ప్రయాణించి గ్రామానికి చేరుకొన్నారు. గ్రామస్తులకు ధైర్యం చెప్పి.. భరోసా కల్పించారు. తుంగభద్ర డ్యాంకు 2.51 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 25 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 1.15 లక్షల క్యూసెక్కులను విడుదలచేస్తున్నారు. సుంకేశులకు పదినెలల తర్వాత భారీగా వరదనీరు వచ్చిచేరింది. దీంతో సుంకేశుల ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేశారు.

కొనసాగుతున్న కరంట్ ఉత్పత్తి

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ హైడల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 6 యూనిట్లలో 900 మెగావాట్ల కరంట్ ఉత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఇక ఏపీ పరిధిలోని కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కరంట్ ఉత్పత్తికి 28,956 క్యూసెక్కులను విడుదలచేస్తున్నారు. వరద ఉధృతి పెరిగిన తర్వాత జూరాలలో సాంకేతిక కారణాలతో కరంట్ ఉత్పత్తిని ఆపేశారు.

krishna-water4

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగాపర్యాటకుల రాక

వరుసగా మూడోరోజు సెలవుదినం కావడంతో సోమవారం సైతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద సందర్శకులు సందడిచేశారు. 42 అడుగుల మేర గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పొంగి పొర్లుతూ సాగర్ దిశగా వెళ్లే సుందర దృశ్యం చూసేందుకు పర్యాటకులు ఎంతో ఉత్సాహం చూపించారు. ఇటు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి సైతం పెద్దఎత్తున సందర్శకులు తరలివచ్చారు. వేలాదిగా వస్తున్న వాహనాలను అదుపుచేయడం వారికి తలకు మించిన భారం అవుతున్నది. సింగిల్ రోడ్డుపై ఒకేసారి రెండు మూడు వాహనాలు రావడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతున్నది.

పులిచింతల నుంచి నీటి విడుదల

సాగర్‌నుంచి భారీఎత్తున దిగువకు వరద వస్తుండటంతో పులిచింతలలోనూ ముందుజాగ్రత్తచర్యగా కొంతనీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి వస్తున్న వరదతో నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండటంతో పులిచింతల నాలుగు గేట్ల ద్వారా దిగువకు 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ జలాలు ప్రకాశం బరాజ్‌కు చేరుకుంటున్నాయి. ప్రకాశం బరాజ్‌లో ఇప్పటికే 2.58 టీఎంసీల (పూర్తిస్థాయి నీటిమట్టం 3.07 టీఎంసీలు) నీటిమట్టం ఉన్నది. పులిచింతల నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో ముందుగానే పదివేల క్యూసెక్కుల నీటిని ప్రకా శం బరాజ్‌నుంచి కిందకు వదులుతున్నారు.

సాగర్ 26 గేట్లు ఎత్తివేత

శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లోలు నమోదవుతుండటంతో సాగర్ ప్రాజెక్టు అధికారులు జలాశయం పూర్తిస్థాయి నిల్వకు చేరుకోకముందే గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా దిగువకు నీటిని వదలడం ప్రారంభించారు. జలాశయ నీటిమట్టం 559 అడుగుల స్థాయిలోనే సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రాజెక్టులోని 12వ గేటును ఎత్తి నీటి విడుదల మొదలుపెట్టిన అధికారులు.. తర్వాత వరుసగా 13, 14, 15 గేట్లను ఎత్తారు. మధ్యాహ్నం సమయానికి మొత్తం 26 గేట్లను ఎత్తి 3.94 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు విడుదలచేశారు.

ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 568.20 అడుగులస్థాయిలో (పూర్తిస్థాయి 590 అడుగులు).. నీటినిల్వ 252.06 టీఎంసీలుగా (పూర్తిస్థాయి 312.05 టీఎంసీలు) ఉన్నది. ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పాదక కేంద్రంలోని ఎనిమిది టర్బైన్ల ద్వారా 375 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తున్నారు. సాగర్ గేట్లు ఎత్తడంతో తెలుగు రాష్ర్టాలకు చెందిన పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వారాంతపు సెలవుతోపాటు బక్రీద్ కూడా రావడంతో పెద్దఎత్తున పర్యాటకులు సాగర్‌ను సందర్శించారు. సాగర్‌ను చూసేందుకు వచ్చిన సందర్శకుల్లో ఒకరు స్నానానికి దిగి వరద ప్రవాహానికి నదిలో గల్లంతయ్యారు.
krishna-water2

krishna-water31

krishna-water53

4521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles