ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరుస్తాం

Sun,February 17, 2019 03:00 AM

-అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్..
-ఎత్తిపోతల పథకాలకు కరంట్
-పవర్ కోఆర్డినేషన్ కమిటీ భేటీలో నిర్ణయాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నట్టుగానే, రాబోయే కాలంలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను సమర్థంగా నడుపుతామని విద్యుత్ సంస్థలు ప్రతినబూనాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు పునరంకితమవుతున్నట్టు ప్రకటించాయి. హైదరాబాద్‌లో శనివారం తెలంగాణ పవర్ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు అధ్యక్షతన జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రీకమిట్‌మెంట్ టు తెలంగాణ పవర్ సెక్టార్ అనే ప్రధాన ఎజెండాతో ఈ సమావేశం సాగింది. వచ్చే యాసంగి సీజన్‌లో గరిష్ఠ డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. లోటుపాట్లను సవరించుకోవాలని నిర్ణయించారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు నిర్మిస్తున్న పవర్‌ప్లాంట్ల నిర్మాణం పురోగతిపై చర్చించారు.

మార్చి 2, 3 తేదీల్లో విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారుచేశారు. ఈ ఏడాది వానకాలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని పంపింగ్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున, విద్యుత్‌సరఫరా వ్యవస్థ సర్వసన్నద్ధం కావాలని నిర్ణయించారు. విద్యుత్ గరిష్ఠ డిమాండ్‌ను తట్టుకొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారుచేశారు. క్రమబద్ధీకరించిన ఆర్టిజన్ల సర్వీసు నిబంధనలపై చర్చించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో విద్యుత్‌సంస్థలు ఇప్పటికే ఘన విజయాలు సాధించాయని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ మెరుగైన సేవలు అందించేందుకు పునరంకితం కావాలని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రారంభోపన్యాసంలో కోరారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో జేఎండీ సీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కే గోపాలరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

POWER2

ప్రభాకర్‌రావుకు ఘనసత్కారం

విద్యుత్‌రంగంలో కిందిస్థాయి ఉద్యోగిగా చేరి అంచలంచెలుగా సీఎండీ స్థాయికి ఎదిగిన ప్రభాకర్‌రావును విద్యుత్‌సంస్థల ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించారు. శనివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు, డైరెక్టర్లు కుటుంబ సభ్యులతో కలిసి సత్కరించారు. 50 ఏండ్లపాటు చేసిన సేవలను కొనియాడారు.

త్వరలో ఆర్టిజన్ల సర్వీస్ క్రమబద్ధీకరణ

విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీసులను త్వరలోనే క్రమబద్ధీకరించనున్నట్టు ట్రాన్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు చెప్పారు. హైదరాబాద్ మింట్‌కాంపౌండ్‌లో రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్-327 ఆధ్వర్యంలో విద్యుత్‌రంగంలో 50 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ప్రభాకర్‌రావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. కార్మికశాఖ సహకారం తీసుకుని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్‌తోపాటు యూనియన్ నేతలు డాక్టర్ జీ సంజీవరెడ్డి, ముత్తయ్య, విద్యుత్ సంస్థల నాయకులు, అన్నిజిల్లాల నాయకులు పాల్గొన్నారు.

1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles