200 మంది రైతులకు పాస్‌బుక్‌లు లేవు

Mon,June 17, 2019 02:26 AM

-అధికారుల నిర్లక్ష్యంతో అందని రైతుబంధు
-రైతు సంక్షేమ పథకాలకూ దూరం
-ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో రైతుల ఆందోళన
-పైసలిచ్చినా రెవెన్యూ అధికారులు పనిచేస్తలేరని ఆగ్రహం
-తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ విలేకరుల ఎదుట మొర

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం 200 మంది రైతుల పాలిట శాపంగా మారిం ది. పాత పట్టాదార్ పాస్‌పుస్తకాలతోపాటు భూమికి సంబంధించిన అన్ని పత్రాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో అందాల్సిన కొత్త పాస్‌పుస్తకాలు అందలేదు. దీంతో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడుకుచెందిన అన్నదాతలు రైతుబంధుతోపాటు రైతుబీమాపథకాలను పొందలేకపోతున్నారు. ఏడాదిన్నరగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదు. చివరికి అధికారులు అడిగిన లంచం డబ్బులు ఇచ్చినా పాస్‌పుస్తకాలు అందలేదని అన్నదాతలు ఆదివారం గ్రామ కూడలిలో ఆందోళనకు దిగారు. విలేకరులను పిలిపించి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
Dharmaganta
బోనకల్లు: ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడు రెవెన్యూలోని రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించడంలో వీఆర్వో, తాసిల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తాము ప్రభు త్వం అందించే రైతుబంధు పెట్టుబడి సాయా న్ని నష్టపోయామని బాధితులు ఆందోళనకు దిగారు. ఆదివారం సుమారు 200 మంది రైతులు ఆళ్లపాడు గ్రామ కూడలికి చేరుకొని విలేకరులను పిలిపించుకొని వారి సమస్యలను వివరించారు. ఆళ్లపాడు రెవెన్యూ పరిధిలో రాయన్నపేట, రావినూతల, కలకోట, గోవిందాపురం, బోనకల్లు గ్రామాలకు చెందిన రైతులు ఉన్నప్పటికీ ఒక్క ఆళ్లపాడులోనే సుమారు 200 మందికిపైగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదంటూ వారి వద్ద ఉన్న ఆధారాలు చూపుతూ ఆవేదన వ్యక్తంచేశారు. వీఆర్వో చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో, తాసిల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు.

పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు అధికారులు డబ్బులు డిమాండ్ చేసినా ఇచ్చామని, అయినా పాస్‌పుస్తకాలు అందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం అధికారులపై తక్షణమే చర్య లు తీసుకొని, తమకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించాలని వేడుకొన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు, రైతుబీమా వంటి రైతు సంక్షేమ పథకాలు వర్తించేలా చూడాలని కోరారు. ఈ ఆందోళనలో గ్రామానికి చెందిన రైతులు అల్లిక లక్ష్మీనారాయణ, అల్లిక రాములు, మరీదు ధనమూర్తి, బుంగా నరసింహా, దొంతుబోయిన గురవయ్య, మర్రి నర్సయ్య, పారా నాగమణి, చెన్నకేశవ నాగరాజు, సలీంబీ పాల్గొన్నారు.

ఎంత తిరిగినా పట్టించుకోలేదు


అల్లిక లక్ష్మీనారాయణ

రెవెన్యూ అధికారుల చుట్టూ పాస్‌పుస్తకాల కోసం కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదు. 5 ఎకరాల భూమి కొని చలానా కట్టినప్పటికీ ఆన్‌లైన్ చేయకుండా వీఆర్వో నిర్లక్ష్యంచేశారు. కేవలం 3 ఎకరాలు మాత్రమేచేసి మరో రెండు ఎకరాలను పెండింగ్‌లో పెట్టారు. ఈ భూమి ఆన్‌లైన్ కోసం రూ.13,500 చలానా తీశా. అయినా నేటికీ పాస్‌పుస్తకం అందించకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు సాయం నష్టపోయా. వీఆర్వోపై వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తించేలా చూడండి.


ఫైల్ పోగొట్టి ఆన్‌లైన్ చేయడం లేదు


పారా నాగమణి

నాకున్న భూమికి పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఆ ఫైల్‌ను వీఆర్వో పోగొట్టి ఆన్‌లైన్ చేయకపోవడంతో రైతుబంధు పథకం కోల్పోయాను. ఫైల్ అక్కడున్నది.. ఇక్కడ ఉన్నది అంటూ కాలయాపనచేయడం తప్ప.. నాకు మాత్రం పాస్‌పుస్తకం ఇవ్వలేదు. ఈ విషయాన్ని తాసిల్దార్‌కు తెలియజేసినప్పటికీ వారు కూడా పట్టించుకోలేదు. నాకు న్యాయంచేసి పాస్‌పుస్తకం అందించాలని కోరుతున్నాను.


రైతుబంధు సాయం కోల్పోయా


బుంగా నరసింహా

ఆళ్లపాడు రెవెన్యూలో 2 ఎకరాల భూమి నా పేరిట వారసత్వంగా వస్తున్నది. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ఇంతవరకు ఆన్‌లైన్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం రాకపోవడం వల్ల రైతుబంధు సాయం అందకుండా పోయింది. పాత రికార్డుల్లో నా పేరున 2 ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ భూమిని నాపేరున ఆన్‌లైన్ చేయలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయంచేయండి.


రెవెన్యూ వ్యవస్థలో మార్పు వస్తున్నది


సక్రునాయక్, బుడ్డోనితండా

నమస్తే తెలంగాణ చేపట్టిన ధర్మగంటతో రెవెన్యూ వ్యవస్థలో మార్పు వస్తున్నది. రెవెన్యూ అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో రైతులకు చాలా మేలు జరిగింది. ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్‌రావు అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటుండటంతో భూసమస్యలు సత్వర పరిష్కారానికి నోచుకుంటున్నాయి.
- సక్రునాయక్, బుడ్డోనితండా, చందంపేట మండలం, నల్లగొండ జిల్లా


రెవెన్యూశాఖ ప్రక్షాళన శుభపరిణామం


కే నర్సింహారెడ్డి, వేములపల్లి, నల్లగొండ జిల్లా

రైతులు, సామాన్య ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్‌శాఖలను ప్రక్షాళనచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. ముఖ్య మంత్రి నిర్ణయాలతో రెవెన్యూ అధికారులు రైతు సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల నేడు రైతుల భూసమస్యలు త్వరగా పరిష్కారానికి నోచుకొంటున్నాయి. ధర్మ గంటను ఇలాగే కొనసాగించాలి.


లంచం అంటేనే భయపడుతున్నారు


కర్నాటి సైదిరెడ్డి, రైతు, హాలియా, నల్లగొండ జిల్లా

నమస్తే తెలంగాణలో ధర్మగంట పేరిట వస్తున్న పలు కథనాలతో రెవెన్యూ అధికారులు లంచం తీసుకోవాలంటే భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం భూరికార్డుల ప్రక్షాళన ద్వారా ఏండ్ల తరబడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. రెవెన్యూశాఖను ప్రక్షాళన చేస్తే అక్కడ అవినీతి పూర్తిగా అంతమవుతుందని భావిస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు.ధర్మంవైపే ధర్మగంట


శిఖ నర్సింహులు, మల్లాపురం

రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూ అధికారులపై విచారణ గంట మోగిస్తున్న ధర్మగంట తీరు చాలా భేష్. దశాబ్దాలుగా వీఆర్వోలు, ఆర్‌ఐలు, సర్వేయర్లు, తాసిల్దార్లు చేస్తున్న నిర్లక్ష్యంతో ఎంతో మంది రైతులు భూ సమస్యలతో తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఒకరికి పట్టా ఉంటే, కాస్తులో మరొకరు ఉంటారు. భూమిని సర్వే చేయమని ప్రభుత్వానికి డబ్బులు కడితే, ఏడాది గడిచినా సర్వేయర్ రారు. దీంతో ప్రభు త్వ పథకాలు అందక రైతులు ఆవేదనచెందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. నమస్తే తెలంగాణ చేపట్టిన ధర్మగంట కూడా ధర్మంవైపే నిలువడం అభినందనీయం.
- శిఖ నర్సింహులు, మల్లాపురం, యాదగిరిగుట్ట మండలం

3082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles