కొర్రీల కాంగ్రెస్!


Tue,July 17, 2018 06:10 AM

164 cases on irrigation projects till now

-ఇప్పటిదాకా సాగునీటి ప్రాజెక్టులపై 164 కేసులు
-ఒక్క కాళేశ్వరం మీదనే 88 కేసులు
-కేసులు, స్టేలతో పనుల్లో జాప్యం.. భారీగా ప్రజాధనం వృథా
-కోర్టులు మొట్టికాయలేస్తున్నా హస్తం నేతల్లో మార్పు శూన్యం
-పుట్టినగడ్డకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
-నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేసులు
-నేడు అభివృద్ధిని అడ్డుకొనేందుకూ కుట్రలు
ప్రాజెక్టు అనే మాట వింటే చాలు కాంగ్రెస్ ఉలిక్కిపడుతున్నది. కేసులంటూ కలవరిస్తున్నది. ప్రజాక్షేత్రాన్ని వదిలిపెట్టి కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది. తెలంగాణ దాహార్తిని తీర్చి కరవుగడ్డను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన ప్రాజెక్టులపై కన్నెర్ర చేస్తున్నది. అజేయమైన జలప్రవాహాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తున్నది. కూర్చున్న కొమ్మనే నరుక్కునే వెర్రిమొర్రి ఆలోచనలతో కుట్రలు పన్నుతున్నది. కోర్టులు వేసే మొట్టికాయలతో అపహాస్యం పాలవుతున్నా బుద్ధి మార్చుకోవడం లేదు. తన మూర్ఖపు ఎత్తుగడలతో వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నది.

గుండాల కృష్ణ - హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అధికారంలో ఉన్నపుడు అభివృద్ధిని నమ్ముకోవాలి. ప్రతిపక్షంలో కూర్చున్నపుడు ప్రజాసమస్యల పరిష్కారానికి పనిచేయాలి. ప్రజాజీవితంలో ఉండే రాజకీయ నాయకులు పాటించాల్సిన కనీస సూత్రమిది. కానీ కాంగ్రెస్ నాయకులు ఏనాడూ వీటిని నమ్ముకోలేదు. అధికారంలో ఉన్ననాడు ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమాన్ని కేసులతో అణచివేయాలనుకున్నారు. అన్నదాతల దశాబ్దాల గోస తీర్చేందుకు తెలంగాణ సర్కారు చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను సైతం నేడు కేసులతోనే అడ్డుకోవాలనుకుంటున్నారు. అయినా.. అప్పుడు.. ఇప్పుడు.. ఏనాడూ ఆ పార్టీ నేతలు అనుకున్నది సాధించలేకపోయారు. గోడకు కొట్టిన బంతిలా అప్పుడు తెలంగాణ ఉద్యమం మరింత ఉవ్వెత్తున లేచి రాష్ట్రసాధన లక్ష్యాన్ని ముద్దాడిందే తప్ప కాంగ్రెస్ నాయకుల కేసులకు తలొగ్గలేదు. ఇప్పుడూ అంతే! వందల కేసులు వేసినా తెలంగాణ సర్కారు వాటిని సమర్థంగా తిప్పికొడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందే తప్ప ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో వెనుకడుగు వేయడం లేదు. మరి.. కేసులనే నమ్ముకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సాధించింది ఏమున్నది?! అహర్నిశలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పనులకు ఆటంకం కల్పించడం.. ప్రాజెక్టు సైట్ల వద్ద పనుల్ని పర్యవేక్షించాల్సిన ఇంజినీర్లను కోర్టులు, ట్రిబ్యునల్స్ చుట్టూ తిప్పడం.. పనుల జాప్యంతో అంచనా పెరిగి ప్రజాధనం వృథా కావడం.. అంతిమంగా బీడు భూములను ఇప్పటికే తడపాల్సిన సాగునీటికి మోకాలడ్డుతూ అన్నదాత నోటికాడి ముద్దకు గండికొట్టడం.. వెరసి కేసులను మాత్రమే నమ్ముకున్న కాంగ్రెస్‌తో తెలంగాణ సమాజానికి ఏనాడూ ఒరిగిందేమీ లేదు.

సర్కారు చిత్తశుద్ధి.. విపక్షం కుటిలబుద్ధి

ఒక ప్రాజెక్టు కట్టాలంటే సర్వేలు, డిజైన్లు, టెండర్లు.. ఆపైనే పనులు. వీటికే దశాబ్దాలు పట్టిన గతచరిత్ర మనది. కానీ చిత్తశుద్ధి ఉంటే వీటిని నెలల్లోనే పూర్తిచేయొచ్చని రుజువు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అందుకు నిదర్శనాలే కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల పథకాలు. వీటిని ఊహించని వేగంగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నది. ప్రకృతి సహకరించినపుడే పనులను వేగంగా పూర్తిచేసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో లక్షల క్యూసెక్కులతో పరవళ్లు తొక్కే గోదావరికి అడ్డంగా బరాజ్‌లు, వాటి చెంతనే పంపుహౌజ్‌ల నిర్మాణం చేపట్టాలంటే ఏడాదిలో గరిష్ఠంగా ఆర్నెల్లు మాత్రమే సాఫీగా పనిచేయడం సాధ్యమవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విధానాలతో పనులను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేసినా సాధారణ రోజుల్లో జరిగేంత వేగంగా నదిలో ప్రవాహం ఉన్నపుడు కుదరదు. అందుకే అనువైన ఆర్నెల్లలోనే రేయింబవళ్లు మూడుషిఫ్టుల్లో పనులను చేసినందునే దశాబ్దాలు పట్టే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కేవలం రెండు, రెండున్నర సంవత్సరాల్లోనే నీటిని ఎత్తిపోసే స్థాయికి తీసుకువచ్చారు. పనులు సాఫీగా జరిగే సమయంలో ఒక్కరోజు పని నిలిచినా, పనులను పర్యవేక్షించాల్సిన ఇంజినీర్లు ఇతర పనుల్లో నిమగ్నమైనా ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాదు.. ఆర్థికంగా కూడా నష్టాన్ని మోయాల్సి వస్తుంది.

ఓటమిపాలై కేసుల బాట

గతంలోనూ సాగునీటి ప్రాజెక్టులపై న్యాయస్థానాలను ఆశ్రయించిన ఉదంతాలు ఉన్నాయి. కాకపోతే సహేతుక కారణాలతో బాధితులుగానీ.. నిబంధనలన్నీ ఉల్లంఘిస్తూ ప్రభుత్వం ముందుకుపోతే పర్యావరణానికి హానికరమంటూ సామాజిక కార్యకర్తలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం సహజమే. కానీ సుమారు గత మూడేండ్లలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నమోదైన కేసులెన్నో తెలుసా? అక్షరాలా నూట అరవైనాలుగు! ఇవేవో బాధితులు, పర్యావరణవాదులు వేసినవి కాదు. కేవలం రాజకీయ లబ్ధికోసం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నాయకులు వేసినవే 90 శాతానికి పైగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు అనేకమంది ఉండగా... 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయిన హర్షవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి వంటి వాళ్లు కూడా ఉండటం గమనార్హం. ఈ కేసుల్లో కేకే మహేందర్‌రెడ్డి ఎనిమిది కేసుల తరపున న్యాయవాదిగా వ్యవహరిస్తుంటే.. ఒక మహిళా న్యాయవాది ఏకంగా 37 కేసులకు న్యాయవాదిగా ఉండటం కుట్రల ముఠాతీరును చెప్పకనే చెప్తుంది.

వివిధ ప్రాజెక్టులపై ఇప్పటివరకు కోర్టుల్లో వేసిన కేసులు

kaleshwaram-project2

చిత్రవిచిత్రంగా కేసులు

కాంగ్రెస్ నాయకులు కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో వేసిన కేసులను పరిశీలిస్తే.. ఏ స్థాయికి దిగజారి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారో అర్థమవుతుంది. వాటిల్లో కొన్ని..
- మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా చనిపోయిన, ఉపాధి కోసం గల్ఫ్‌కు పోయినవారి పేర్ల మీద కూడా కాంగ్రెస్ నాయకులు హైకోర్టుల్లో కేసులు వేశారు. చివరకు అభాసుపాలయ్యారు.
- సాధారణంగా దక్షిణాది రాష్ర్టాలకు చెన్నైలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉంది. మహారాష్ట్రకు సంబంధించి పూణెలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ, మహారాష్ట్రలతో ముడిపడి ఉన్నందున.. పిటిషనర్లు పోతే చెన్నై, లేకపోతే పుణెలోని ట్రిబ్యునళ్లను ఆశ్రయించాలి. కానీ రెండురాష్ర్టాల పరిధితో సంబంధంలేని ఢిల్లీలోని హరిత ట్రిబ్యునల్‌లో కేసువేశారు.
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో అడవుల్లేని చోట అడవులను నరికివేస్తున్నారంటూ, సాధారణ జంతువులు లేనిచోట కూడా పులులున్నాయంటూ తప్పుడు కేసులు వేయడం ఆ పార్టీ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమన్న విమర్శలున్నాయి.

రెండు ప్రాజెక్టులపైనే 123 కేసులు

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో మూడింట రెండొంతుల ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. దాదాపు 37 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాత పాలమూరు జిల్లా సహా 12.30 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. అంతేకాకుండా పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ తదితర ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరుతాయి. ఈ రెండు ప్రాజెక్టులపైనే కాంగ్రెస్ నాయకులు ఏకంగా 123 కేసులు వేశారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 88 కేసులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మీద 35 కేసులువేసి పనుల్ని నిలిపివేయాలంటూ కోర్టులను కోరారు.

ప్రతీ క్షణం కోట్లల్లో భారం

కాంగ్రెస్ కుట్రల్ని ఛేదించేందుకు ప్రభుత్వం ఎంతో సమయాన్ని వెచ్చించాల్సి వస్తున్నది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి కోర్టుకు వివరాలు అందించడం, రోజుల తరబడి పనులు ఆగిపోవడం వంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరువేల మంది ఇంజినీర్లు, 25 వేల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కరోజులోనే కేవలం మేడిగడ్డ వద్ద 7 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేసి రికార్డు సృష్టించారు. ఆ ప్రాజెక్టు పరిధిలో అన్ని సైట్లవద్ద ఒక్కరోజు పని ఆగిందంటే 25 వేల మంది కార్మికులు ఖాళీగా ఉండాలి. వేలకోట్ల రూపాయలు వెచ్చించి ప్రొక్యూర్ చేసిన యంత్రాలూ నిలిచిపోవాలి. తద్వారా వచ్చే కోట్లాది రూపాయల నష్టాన్ని భరించేదెవరు? దీన్ని ప్రజలు కట్టే పన్నుల నుంచే చెల్లించాలి కదా. కాంగ్రెస్ నాయకుల కేసుల వల్ల అంతిమంగా ప్రజలకే నష్టం వాటిల్లుతున్నది.

2178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS