కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి

Tue,February 19, 2019 03:27 AM

-తెలంగాణకు భారీగా నిధులు కేటాయించాలి
-ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చేయూతనివ్వాలి
-15వ ఆర్థిక సంఘాన్ని కోరిన వివిధ పార్టీలు
-14వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకపోవడంతో సంక్షోభంలో పరిషత్తులు
-కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ
-పంచాయతీలకు, పరిషత్‌లకు సమాన నిధులివ్వాలని విజ్ఞప్తులు
-ప్రాజెక్టులను అభివృద్ధికోణంలో పరిశీలించాలి

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఉన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపును పెంచాలని, అతి భారీనీటిపారుల ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని వివిధ పార్టీలు పదిహేనవ ఆర్థికసంఘాన్ని కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తిచేశాయి. పద్నాలుగవ ఆర్థికసంఘం నిధులు విడుదలచేయకపోవడంతో మండల, జిల్లా పరిషత్తులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయని కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆర్థికసంఘం దృష్టికి తెచ్చారు. ఈసారి వీటికోసం ప్రత్యేకంగా నిధులు సమకూర్చి, సమర్థ నిర్వహణతో ఆర్థికసుస్థిరత కల్పించాలని కోరా రు. సోమవారం మాదాపూర్‌లోని హోటల్ ఐటీసీ కోహినూర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులతో పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్‌సింగ్, కార్యదర్శి అరవింద్ మెహతా, సభ్యులు అనూప్‌సింగ్, అశోక్‌లాహిరి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రత్యేక నిధుల ఆవశ్యకతపై బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, సీపీఐ నాయకులు ఆర్థికసంఘానికి నివేదికలు సమర్పించారు. దేశంలోనే చిన్న వయస్సు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు భారీ నిధులు అవసరమని బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రారావు, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి, అధికార ప్రతినిధి అనుగుల రాకేశ్‌రెడ్డి ఆర్థికసంఘం సభ్యులకు వివరించారు. ఉమ్మ డి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గోదావరిపై ఒక్క శ్రీరాంసాగర్ తప్ప పెద్ద ప్రాజెక్టులేమీ లేవన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం చేపట్టిందని, వీటికి భారీగా నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం అం దించాలని కోరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. ఈ ప్రాజెక్టులను ప్రజాకర్షక పథకాలుగా కాకుండా.. అభివృద్ధి కోణంలో పరిశీలించాలని కోరారు.

kaleshwaram-project

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలి

తెలంగాణ వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి ప్రత్యేక నిధులను మంజూరు చేయాల్సిన అవసరముందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత మల్లుభట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆర్థిక సంఘానికి చెప్పారు. పోలవరం తరహాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే రాష్ర్టానికి భారం తగ్గుతుందని తెలిపారు. జాతీయ ఉపా ధి హామీ పథకం నిధుల విడుదలలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఫ్లోరోసిస్ ప్రభా వం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యుడు టీ నరసింహన్ ఆర్థిక సంఘానికి చెప్పారు. స్థానిక సంస్థలకు నిధులను కేటాయించడంలో 14వ ఆర్థిక సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాజ్యాంగంలోని 73, 74 అధికరణల ప్రకారం స్థానికసంస్థలకు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్ట్‌కు జాతీయహోదా కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.

kaleshwaram-project2

సంక్షేమ పథకాలకు చేయూతనివ్వాలి: ఎంఐఎం

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం అవసరమని ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్‌ఉల్‌హసన్ జాఫ్రీ, ప్రజాసంబంధాల అధికారి మహమ్మద్ తౌసిఫ్ ఆర్థికసంఘానికి చెప్పారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాల వల్ల ఎన్నో పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని డిమాండ్ చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ బిల్లులు, ఇతర భారాన్ని కేంద్రమే భరించాలని కోరారు.

రాష్ట్రంలోని జెడ్పీలు, మండల పరిషత్తులకు 13వ ఆర్థిక సంఘం భారీ మొత్తంలో నిధులను మంజూ రు చేయడంవల్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి సాధ్యమైందని, కానీ 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ జీ రాజేశంగౌడ్ కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధి బృందానికి వివరించారు. 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక నిధులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పురపాలకశాఖ కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ పాల్గొన్నారు.

kaleshwaram-project3

గ్రాండ్ కాకతీయలో సీఎం విందు

పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారంరాత్రి గ్రాండ్ కాకతీయ హోటల్‌లో విందు ఇచ్చారు. మర్యాదపూర్వకంగా ఈ విందు ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. కాగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం జూబ్లీహాల్‌లో ఆర్థికసంఘం సమావేశం జరుగనున్నది. మధ్యాహ్నం రెండుగంటలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సంఘానికి పూర్తి నివేదికను అందించనున్నారు. రాష్ట్రంలో ప్రగతి, ఇతర రాష్ర్టాలకు తెలంగాణకు ఉన్న ప్రత్యేక పరిస్థితులు, అవసరాలను వివరించనున్నారు.

జిల్లా, మండల పరిషత్తుల్లో ఆర్థిక సంక్షోభం

14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించకపోవడం వల్ల జిల్లా, మండల పరిషత్తులు ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈసారి వీటికోసం ప్రత్యేకంగా నిధులు సమకూర్చి, సమర్థవంత నిర్వహణతో ఆర్థిక సుస్థిరత కల్పించాల్సి ఉంది. తెలంగాణలో తొమ్మిది జెడ్పీలే ఉన్నాయి. ప్రస్తుతం 33 జిల్లాలు ఏర్పడ్డాయి. మిగతా 24 జిల్లాల్లో జెడ్పీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలి. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కూడా గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్తుల బలోపేతానికి 70ః10ః20 నిష్పత్తిలో ప్రతి ఆర్థికసంవత్సరానికి నిధులు కేటాయించాలి. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నది. ఈ నిధులను జిల్లా, మండల పరిషత్తుల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించాలి.
- తుల ఉమ, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్

హరితహారం వంటి కార్యక్రమాలను గుర్తించాలి

సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రతి పథకం రికార్డు సృష్టిస్తున్నది. ఆ పథకాలే రెండోసారి టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టాయి. దీనిలో ఒకటి హరితహారం. దీనిద్వారా అడవులు అభివృద్ధి కావటమేకాకుండా.. కాలుష్యమయంగా ఉన్న పట్టణ ప్రాంతాలు గ్రీన్‌సిటీలుగా మారుతున్నాయి. పట్టణ ప్రజల ఆరోగ్యానికి ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి వాటిని కేంద్రం గుర్తించి ఎక్కువ నిధులివ్వాలి. మున్సిపాలిటీల్లో గతంలో 5% వ్యాట్ ఉండేది. ఇప్పుడు జీఎస్టీ 12% శాతం పడుతున్నది. దీన్ని తగ్గించాలి. లేకుంటే మిగిలిన 7 శాతాన్ని కేంద్రం భరించాలి. పన్నుల వసూళ్లపై పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటుచేస్తే పట్టణ ప్రాంతాలు అభివృద్ధిలో ముందుకెళ్తాయి.
- సర్దార్ రవీందర్‌సింగ్, మేయర్, కరీంనగర్.

పంచాయతీల్లో నిధులు పెంచాలి

గ్రామపంచాయతీలకు నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీనితోపాటు రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కూడా కేటాయిస్తున్నారు. అయితే కేంద్రం నుంచి అదనంగా నిధులు రావాల్సి ఉంది. ఆర్థికసంఘం నిధుల నుంచి విద్యుత్‌బిల్లుల వంటివి చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. కొత్త గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. ఇప్పటివరకు గ్రామంలో జనాభా ప్రకారం ఒక్కొక్కరికి రూ.4 చొప్పున ఆర్థిక సంఘం నిధులు ఇస్తున్నారు. వాటిని రూ.8కి పెంచాలి.
- సర్పంచ్‌లు విజయభాస్కర్‌రెడ్డి, వెంకట్, మాధురి, గజానంద్‌నాయక్, యుగంధర్‌రెడ్డి

ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారు

గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు 13వ ఆర్థిక సంఘం వరకు నిధులు సమానంగా వచ్చేవి. కానీ 14వ ఆర్థిక సంఘం మండల, జిల్లా పరిషత్తులకు కనీస నిధులు కూడా ఇవ్వలేదు. దీంతో ఇవన్నీ నిర్వీర్యమయ్యాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. గ్రామీణాభివృద్ధి కోసం, గ్రామప్రజల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి పరిషత్ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను సమానంగా ఇవ్వాలి. మరిన్ని నిధులు పెంచి విడుదల చేయాలి.
- పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు
చింపుల సత్యనారాయణరెడ్డి, అధికార ప్రతినిధి మెంటపల్లి పురుషోత్తంరెడ్డి

2110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles