రైతుబంధుతో సిరుల పంట


Mon,June 17, 2019 02:41 AM

138 crore acreage of government investment

-1.38 కోట్ల ఎకరాలకు సర్కారు పెట్టుబడి సాయం
-1.24 కోట్ల ఎకరాలకు చేరనున్న పంట విస్తీర్ణం
-ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 1.28 కోట్ల టన్నులు
-గత ఏడాదితో పోలిస్తే 2 లక్షల టన్నులు అధికం
-ఈ ఏడు 6 లక్షల ఎకరాలకుపైగా పెరుగనున్న వరిసాగు
-2019-20 వ్యవసాయశాఖ ప్రణాళికలో వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ఉత్పత్తి గణనీయంగా పెరుగనున్నది. చాలా ప్రాంతాల్లో ఇప్పటివరకు నిరుపయోగంగా ఉన్న భూమి సైతం సాగులోకి రానున్నది. రైతులకు సర్కారు ఎకరాకు రూ.5 వేల చొప్పున 1.38 కోట్ల ఎకరాలకు ముందస్తు పెట్టుబడి అందిస్తుండటం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడంతో బీడు భూములు సైతం బాగుపడి సిరులు కురిపించనున్నాయి. ప్రాజెక్టులు, నాణ్యమైన 24 గంటల కరంట్, మిషన్ కాకతీయ తదితర సంక్షేమ పథకాలతో వ్యవసాయానికి మంచి ఊపు వచ్చిందని స్వయంగా రైతులే చెప్తున్నారు. సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగేందుకు ముఖ్యంగా రైతుబంధు పథకం దోహదం చేస్తున్నదని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుత వానకాలం, యాసంగి సీజన్లలో 1.28 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా నిర్దేశించుకున్నది. వానకాలం 78.7 లక్షల టన్నులు, యాసంగిలో 49.3 లక్షల టన్నులు లక్ష్యంగా ఉన్నది. మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండి ఆయకట్టుకు సాగునీరందితే ఈ స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్తి ఉంటుందని అంచనా వేస్తున్నది. గత ఏడాది లక్ష్యంతో చూస్తే రెండు లక్షల టన్నులు అధికం. ఈ మేరకు వ్యవసాయశాఖ 2019-20 ప్రణాళికలో పొందుపర్చింది.

నైరుతి ఆలస్యమైనా.. సాగు, ఉత్పత్తి ఘనం

నైరుతి వర్షాలు ఆలస్యమైనప్పటికీ 97 శాతం వానలు కురుస్తాయని వాతావరణశాఖ ఇప్పటికే తెలిపింది. ఈ ఏడాదే కాళేశ్వరం ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు, మరికొన్ని ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని ప్రభుత్వం ధీమాగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా పంటల సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలకు పెరుగుతుందని భావిస్తున్న వ్యవసాయశాఖ.. ఆహారధాన్యాల దిగుబడి పెరిగి, ఉత్పత్తి కూడా అమాంతం అధికమవుతుందని అంచనా వేస్తున్నది. వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి ఒక్క వరి ఉత్పత్తి 97.9 లక్షల టన్నులు వస్తుందని అంచనా. 2018-19లో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 126.21 లక్ష ల టన్నులు ఉండగా, అంతకుముందు ఏడా ది 90.89 లక్షల టన్నులుగా ఉన్నది. ప్రస్తుత వానకాలం, యాసంగి సీజన్లలో వరిసాగు విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాలపైగా పెరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. గత ఏడాది అంచనాతో పోలిస్తే దాదాపు 3 లక్షల ఎకరాలు అధికం. ఈసారి కూడా పత్తిసాగు పెరుగొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
Land

గతంలో అంచనాలు చేరని లక్ష్యం

గత ఏడాది వ్యవసాయశాఖ 126.21 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా ప్రణాళికలో పేర్కొన్నది. నెల కిందట అర్థగణాంకశాఖ విడుదలచేసిన మూడో ముందస్తు అంచనాల ప్రకారం.. 91.87 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇప్పటివరకు అంచనాల కంటే 34 లక్షల టన్నులు తగ్గింది. నాలుగో ముందస్తు అంచనాల తర్వాత ఈ మొత్తం పెరుగొచ్చని అధికారులు చెప్తున్నారు.

10559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles