కంటైనర్ బోల్తా.. 12 మంది దుర్మరణం

Sat,November 9, 2019 01:46 AM

-చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద హైవేపై ఘటన
-మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు

అమరావతి, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం వద్ద కంటైనర్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం రాత్రి బంగారుపాళ్యం వద్ద చిత్తూరు-బెంగళూరు హైవేపై మొగిలిఘాట్ వద్ద వాహనాలపై కంటైనర్ బోల్తా పడింది. అతి వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడి డివైడర్ దాటివెళ్లి ఆటో, ఓమ్నీ వ్యాన్, బైక్‌పైకి దూసుకెళ్లింది. దీంతో కంటైనర్ కింద నలిగి 12 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కంటైనర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. క్షతగాత్రులను 108 వాహనంలో పలమనేరు దవాఖానకు తరలించారు. చీకటి పడటంతో మృతదేహాలను గుర్తించడం పోలీసులకు కష్టమైంది. ఘటనాస్థలం నుంచి 12 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

12 మందిలో నలుగురు మహిళలు ఉన్నారు. గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన రెడ్డి శేఖర్ కుటుంబానికి చెందిన 8 మంది.. తెట్టుగుండ్లపల్లిలో బంధువు మృతిచెందడంతో పరామర్శకు ఓమ్నీ వ్యాన్‌లో వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పరామర్శకు వెళ్లినవారు మృతిచెందడంతో మర్రిమాకులపల్లెలో విషాదం అలుముకున్నది. బైక్‌పై వెళ్తూ మృత్యువాతపడినవారు బంగారుపాళ్యం మండలం బలిజపల్లెవాసులుగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని కలెక్టర్ భరత్ గుప్తా సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
accident1
accident2

987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles