కాళోజీ బతుకంతా తెలంగాణే


Mon,September 10, 2018 01:32 AM

104 Birth Anniversary Celebrations of Kaloji Held

కాళోజీ జయంతి సభలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి
రవీంద్రభారతి/హిమాయత్‌నగర్: తెలంగాణ భాష కోసం పరితపించిన వ్యక్తి కాళోజీ అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. కాళోజీ బతుకంతా తెలంగాణేనని, ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడని చెప్పారు. కాళోజీది ప్రశ్నించేతత్వమని తెలిపారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో ఆదివారం కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. సృజనాత్మక రచనల్లో తెలంగాణ భాష అంశంపై ఎం నారాయణశర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో 24 మంది కవులు తమ కవితల్ని వినిపించారు. అనంతరం డాక్టర్ లక్ష్మణ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వ బాదరాయణ వ్యాస సమ్మాన్-2016 పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు.

రవీంద్రభారతిలో నేటి నిజం పత్రిక ఆధ్వర్యంలో బైస దేవదాసు సంపాదకత్వంలో వెలువరించిన మట్టిమనిషి ధిక్కార స్వరం కవితా సంకలనాన్ని నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన జరిగిన సభలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కొండపల్లి నిహారిణి పుస్తకాన్ని సమీక్షించారు. కాళోజీ జయంతి సందర్బంగా ఇచ్చిన పిలుపుమేరకు స్పందించిన కవుల కవిత్వాన్ని 4-9-2014న నేటి నిజం పత్రికలో ప్రచురించామని, ఆ కవిత్వాన్ని మట్టిమనిషి ధిక్కార స్వరం కవితా సంకలనంగా వెలువరించామని పత్రిక సంపాదకుడు బైసా దేవదాసు తెలిపారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో కాళోజీ 104వ జయంతిని పురస్కరించుకుని హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీలో తెలంగాణ భాష-సమగ్ర పరిశీలన అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. దీనికి నందిని సిధారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై.. కాళోజీ చూపిన బాటలో సమసమాజ తెలంగాణను నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ భాషావేత్త డాక్టర్ అప్పం పాండయ్యకు కాళోజీ స్మారక పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరి, నీటిపారుదల నిపుణుడు ఎం శ్యాంప్రసాద్‌రెడ్డి, కాళోజీ పురస్కార గ్రహీత డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, డాక్టర్ మల్లారెడ్డి పాల్గొన్నారు.

1202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles