పిడుగుపాటుకు పదిమంది మృతి

Thu,October 10, 2019 04:07 AM

- ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో బీభత్సం
- పలువురికి తీవ్ర గాయాలు
- మూగజీవాలు మృత్యువాత
- గ్రేటర్‌లో మూడురోజులు అప్రమత్తం
- మొదలైన రుతుపవనాల తిరోగమనం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పండుగ పూట రాష్ట్రంలో పిడుగుల మోత మోగింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతోపాటు, పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల పిడుగులు పడి పదిమంది మృత్యువాత పడ్డారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో మూగజీవాలు బలయ్యాయి. ఖమ్మం జిల్లాలో నలుగురు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐదుగురు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతిచెందారు. గాయాలపాలయినవారు దవాఖాల్లో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ సమీపంలోని వేపచెట్టుపై మంగళవారం సాయంత్రం పిడుగు పడటంతో దానికింద ఉన్న ఇరుకు శ్రీను(20), గుద్దేటి నవీన్‌ (19), బలంతు ప్రవీణ్‌(19) అక్కడికక్కడే మృతిచెందారు. ఉసికల గోపికి తీవ్రగాయాలయ్యాయి. కారేపల్లి మండలం చిన్నకట్టుగూడెం గ్రామానికి చెందిన లకావత్‌ రవి(33) పక్క గ్రామం మల్లన్నగూడెంలో ఓ రైతు మిర్చితోటలో పాటుచేయడానికి వెళ్లాడు. పిడుగుపడడంతో రవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌లో పిడుగు పడటంతో పొలంవద్ద ఉన్న వెంకటయ్య (50) మృతిచెందాడు. టంకర గ్రామంలో అంజిలయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. భూత్పూరు మండలం తాటిపర్తికి చెందిన కుమ్మరి శ్రీను (26) పశువులను మేతకు తీసుకెళ్లగా.. సాయంత్రం పిడుగుపాటుకు బలయ్యాడు. నవాబ్‌పేట మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన కర్నెగొళ్ల గోపాల్‌ (58) సాయంత్రం తన వ్యవసాయ పొలంలో చెట్టు కింద కట్టేసిన ఎద్దును ఇంటికి తీసుకెళ్లే క్రమంలో అకస్మాత్తుగా ఈదురుగాలులు రావడంతో చెట్టుపై పిడుగు పడింది. దీంతో గోపాల్‌తోపాటు ఎద్దు కూడా మృతిచెందింది.
thunderbolt1
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల పరిధిలోని సింగవట్నంకు చెందిన చుక్కా బాలస్వామి కూతురు అనురాధ(23) ఎద్దులను కొట్టంలో కట్టేందుకు వెళ్లగా అదే సమయంలో పిడుగుపడింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఆమెను కొల్లాపూర్‌ దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. వనపర్తి జిల్లా రేవల్లి మండలకేంద్రానికి చెందిన కుంటోళ్ల శివ (22) బుధవారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందగా, ఆయన తండ్రి బాలయ్య ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం బోడంపహాడ్‌కు చెందిన మంగళి నరేశ్‌(17) పిడుగు పాటుకు మృతి చెందగా, చాకలి అంజయ్య(29), ముజాఫర్‌(18)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్‌పల్లిలో మంగళవారం రాత్రి పిడుగు పడి తాళ్ల అశోక్‌గౌడ్‌కు చెందిన మూడు ఆవులు, ఒక లేగ దూడ మృత్యువాత పడ్డాయి. ఆమనగల్లు మండలంలోని శంకర్‌కొండ తండా పంచాయతీ పరిధిలో ఇస్లావత్‌ లాలుకు చెందిన పాడి ఆవు, చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో రైతు యాదయ్యకు చెందిన బర్రె, షాద్‌నగర్‌మండలం విఠ్యాల గ్రామానికి చెందిన టీకే నాయక్‌కు చెందిన ఆవు మృతిచెందాయి. మొయినాబాద్‌ మండంల సురంగల్‌-నజీబ్‌నగర్‌ రెవెన్యూ శివారులో పిడుగుపడి పశువుల మేత దహనమయింది. ఏపీలోని గుంటూరు జిల్లా మండలం వెదుళ్లపల్లె రైల్వేట్రాక్‌ సమీపంలో పిడుగుపడి 150 గొర్రెలు మృతిచెందాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ..

రాజధాని హైదరాబాద్‌లోనూ పలుచోట్ల పిడుగులు పడ్డాయి. చాదర్‌ఘాట్‌లోని ఇల్లు పిడుగుపాటుకు పూర్తిగా దెబ్బతిన్నది. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 వరకు గ్రేటర్‌లోని ఉప్పల్‌లో అత్యధికంగా 6 సెం.మీలు, అల్కాపురి, నాగోల్‌లలో 4.6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌లోకి వరద నీరు చేరింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పిల్లర్‌ నం.180-190 మధ్య ఉన్న ర్యాంప్‌ వద్ద వరద నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంబించింది.

నెలాఖరుదాకా నైరుతి ప్రభావం!

వచ్చే రెండురోజుల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 3.6 కిలోమీటర్‌ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. అక్కడి నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్‌ల ఎత్తులో కామెరూన్‌ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనిప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. వాయవ్య భారతదేశంలో పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ రాష్ర్టాలలోని కొన్ని ప్రాంతాల నుంచి బుధవారం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలైంది. తెలంగాణలో రుతుపవనాల తిరోగమనం మూడోవారంలో మొదలై ఈ నెలాఖరులో పూర్తవుతుందని అధికారులు అంచనావేస్తున్నారు.

4719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles