ఏపీ డీఎస్పీ డ్రగ్స్ దందా!


Thu,March 14, 2019 05:03 AM

1 crore seized drug racket busted in Hyderabad

-రాచకొండ పోలీసులకు చిక్కిన నెల్లూరు ముఠా
-విచారణలో ఏపీ అధికారి సూరిబాబు పేరు వెల్లడి
-రూ.కోటి విలువైన కొకైన్, హెరాయిన్ స్వాధీనం
-ఐదుగురు అరెస్టు.. పరారీలో మరికొందరు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:రాజధానిలో నెల్లూరు డ్రగ్స్ ముఠా కలకలం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డీఎస్పీ స్థాయి అధికారి ప్రత్యక్షంగా డ్రగ్స్ సరఫరా చేశాడని రాచకొండ పోలీసుల విచారణలో నిందితులు సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ కేసులో రూ.కోటి విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా, ఐదుగురిని అరెస్టు చేశారు. బుధవారం రాచకొండ కమిషనరేట్‌లో ప్రెస్‌మీట్‌లో కమిషనర్ మహేశ్‌భగవత్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా, స్విఫ్ట్ కారు (ఏపీ 31టీవీ 6815)లో ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. కారును సోదా చేసేందు కు పోలీసులు ఆపగా అందులోని ఇద్దరు పారిపోయారు. కారు నడుపుతున్న కనకరాజు అలియాస్ రాజును అదుపులోకి తీసుకొన్నా రు. తనిఖీల్లో తెల్లని పదార్థం ఉన్న ప్యాకెట్లు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా, మాదకద్రవ్యాలైన కొకైన్, హెరాయిన్‌లో కలిపే రసాయనంగా తేలింది. విచారణలో కనకరాజు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఓంకార్, రాజశేఖర్, షేక్ అబేద్‌ల సమాచారం ఇచ్చాడు. నెల్లూరులోని వారి ఇండ్లలో పోలీసులు సోదాలు జరిపి మరిన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని సైతం అదుపులోకి తీసుకొన్నారు. మరింత సమాచారం రాబట్టి వరంగల్‌కు చెందిన పూజారి చక్రధరాచార్యులును అదుపులోకి తీసుకొన్నారు. వీరి నుంచి రూ. కోటి విలువైన కొకైన్ (325 గ్రాములు), హెరాయిన్ (575 గ్రాములు), డైల్యూట్ పౌడర్(600 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగించిన కారు, మొబైల్ ఫోన్లను జప్తు చేశారు.
Mahesh-bhagwat

ఏపీ పోలీసు అధికారి నుంచే డ్రగ్స్ సరఫరా

నిందితులను రాచకొండ ఎస్వొటీ, సరూర్‌నగర్ పోలీసులు విచారించినప్పుడు డ్రగ్స్ ఎలా వచ్చాయో వివరించారు. ఏపీలోని నెల్లూరు జిల్లా రంగనాయకులపేటకు చెందిన అబేద్ బీడీ కార్మికుడు. అతనికి స్థానికుడైన అమ్జద్‌తో పరిచయం ఉన్నది. పోలీసు ఆఫీసర్ సూరిబాబుతో తనకు సాన్నిహిత్యం ఉన్నదని, ఆయ న దగ్గర రూ.కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని అమ్జద్ తెలిపాడు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుందామని చెప్పగా అబేద్ ఒప్పుకున్నాడు. సూరిబాబు నుంచి కేజీన్నర కొకైన్, హెరాయిన్, వాటిలో కలిపే రసాయన పదార్థాన్ని అమ్జద్ తీసుకొచ్చి అబేద్‌కు నెల్లూరులో అందజేశాడు. విషయాన్ని బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఓంకార్, కృష్ణపట్నం పోర్టు ప్రాంతానికి చెందిన రాజశేఖర్‌కు అబేద్ వివరించాడు. డ్రగ్స్ విక్రయిస్తే భారీగా కమీషన్ ఇస్తానని, వీటి ధర గ్రాము పదివేలు ఉంటుందని చెప్పాడు.
డ్రగ్స్ పరిశీలించిన ఓంకార్, రాజశేఖర్ వైజాగ్‌లో ఉన్న స్నేహితుడు కనకరాజును సంప్రదించారు.కనకరాజు వరంగల్‌కు చెందిన పుజారి చక్రధరాచార్యులుకు సమాచారమిచ్చారు. వీరంతా కలిసి వైజాగ్, హైదరాబాద్‌లో డ్రగ్స్ కొనేవారి కోసం వెతికారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ కోనుగోలు చేసే వ్యక్తి దొరికాడని, కేజీన్నర డ్రగ్స్‌ను రూ.35 లక్షలకు అడుగుతున్నాడని పూజారి చక్రధరాచార్యులు చెప్పాడు.
Car
రూ.కోటి విలువైన డ్రగ్స్‌ను రూ.35 లక్షలకు విక్రయించేందుకు అబేద్ తొలుత నిరాకరించినా, తర్వాత సరేనన్నాడు. దీంతో ఈ నెల 9న నెల్లూరులో అబేద్ నుంచి కనకరాజు, ఓంకార్, రాజశేఖర్ డ్రగ్స్‌ను తీసుకొని హైదరాబాద్‌కు వచ్చి కర్మాన్‌ఘాట్‌లో పోలీసులకు పట్టుడ్డారు. రాజశేఖర్, ఓంకార్ పారిపోగా కనకరాజు పోలీసులకు చిక్కాడు. విచారణలో ఏపీ పోలీసు అధికారి సూరిబాబు పేరు బయటికి వచ్చింది. నిందితులు చెప్పిన విషయాలను ధ్రువీకరించుకొనేందుకు కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ కొనేందుకు సిద్ధమైన వ్యక్తిని గుర్తించేపనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. ఏపీ పోలీసుశాఖలో సూరిబాబు డీఎస్పీ స్థాయిలో పనిచేస్తున్నాడనే ప్రాథమిక సమాచారం పోలీసుల వద్ద ఉన్నదని తెలిసింది. నిందితులు ఓంకార్, రాజశేఖర్ గతంలో బంగారం స్మగ్లింగ్‌లో నిందితులని దర్యాప్తులో తెలిసింది. ముఠాను పట్టుకున్న ఎస్వొటీ, సరూర్‌నగర్ పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు అందించి అభినందించారు. సమావేశంలో ఎస్వొటీ అదనపు డీసీపీ సురేందర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్‌రావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

5257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles