ప్రకతి సోయగం..జఫర్‌గఢ్ ఖిల్లా!

Wed,November 18, 2015 11:26 AM

ప్రకతి సోయగం..
రక్షణాత్మక ప్రాంతం..
అందుకే నిర్మించారు అక్కడో దుర్గం!
పక్కపక్కనే మసీదు.. దేవాలయాలు..
తెలియజేస్తాయి పరమత సహనం!
కావల్సినంత జలకళ..
కళ్లతో తాగుతారో, చల్లగా
ఆస్వాదిస్తారో మీ ఇష్టం!
కోటని పాలించరమ్మని
మీకిదే మా ఆహ్వానం..

వరంగల్ జిల్లా కేంద్రానికి 45కిలోమీటర్ల దూరంలో జఫర్‌గఢ్‌లోని కొండపై 1853వ సంవత్సరంలో నిర్మించిన కోట నేటికీ చెక్కుచెదరని అందంతో సందర్శకులను ఆకర్షిస్తోంది! అభిముఖంగా ఉన్న పర్వతపంక్తుల మధ్య పచ్చని తివాచీ పరిచినట్లుండే పరిసరాలు.. ప్రకతి రమణీయత.. పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి! సర్వమత సమానత్వ ప్రతీకలు అనేకం ఈ కోటలో కనిపిస్తాయి! ప్రాచీన ఆలయాలు, మసీదులు, అబ్బురపరిచే శిల్పాలు, యుద్ధాల్లో ఉపయోగించిన రాతి ఫిరంగులు, కొండచుట్టూ నిర్మించిన భారీ ప్రహరీ, లోతైన కందకాలు..

ఇవన్నీ జఫర్‌గడ్ కోటకు వన్నెతెచ్చేవే! ఓరుగల్లు పేరు చెప్పగానే కాకతీయుల నిర్మాణాలు తళుక్కున మదిలో మెదలుతాయి. వేయిస్తంభాల దేవాలయం, రామప్పగుడి, వరంగల్ కోట వంటివి స్మతిపథంలో కదలాడుతాయి. అయితే నవాబుల కాలంలోనూ ఓరుగల్లు వైభవోపేత నిర్మాణాలకు వేదికైందన్నది చరిత్ర చెక్కిన సత్యం. రాజరికపు వైభవానికి సాక్ష్యాలుగా నిలిచే ఎన్నో అద్భుత కట్టడాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. అలాంటివాటిల్లో ఒకటి జఫర్‌గఢ్ ఖిల్లా. జాగీర్దారుల నుంచి కప్పం వసూలు చేసేందుకు వచ్చిన నవాబుల సర్దారు జాఫరుద్దీన్‌దౌలా.. ఈ బహత్తర నిర్మాణానికి కారకుడు. ఈ కారణంగానే అలనాటి వేల్పుగొండ గ్రామం పేరు జఫర్‌గఢ్‌గా మారింది!

కప్పంతో కట్టిన కోట
నిజాం నవాబు ఆధీనంలోని వేల్పుగొండ ప్రాంతంలో ప్రజల నుంచి వసూలు చేసిన కప్పం రాజుకు పంపే జాగీర్దార్లు.. ఓసారి వసూలు చేసిన మొత్తాన్ని పంపకపోవడంతో నాల్గవ నిజాం నసీర్-ఉద్-దౌలా ఆగ్రహం వ్యక్తంచేస్తాడు. తన బంధువు, సైన్యాధికారి అయిన జాఫర్-ఉద్-దౌలాను వేల్పుగొండకి వెళ్లి విషయం చక్కబెట్టమని ఆదేశించాడు. మందీమార్బలంతో వచ్చిన జాఫరుద్దౌలా జాగీర్దార్ల మెడలు వంచి బకాయిలు వసూలు చేశాడు. అప్పటి నుంచి తరుచూ ఇక్కడకు వచ్చే సర్దార్.. తూర్పు, పడమటి కొండల మధ్య పచ్చగా కళకళలాడే ప్రకతి రమణీయతకు ముగ్ధుడై, ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకొని కోట నిర్మించాలనుకుంటాడు. ఇందుకోసం నవాబుకు పంపవలసిన పైకాన్ని వినియోగించాడు. మెల్లగా రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. వేల్పుగొండకు జఫర్‌గడ్‌గా నామకరణంచేసి నిజాంకు సామంతుడిగా ఉండిపోయాడని చరిత్రకారులు చెబుతారు. రెండు కొండల్ని కలుపుతూ విస్తరించిన కోటలో అడుగడుగునా సరస్సులు, బావులు కనిపిస్తాయి. విశాలమైన రాతి గోడలు, వాటిపైన ఇటుక, డంగుసున్నంతో నిర్మించిన గోడలు, 35అడుగుల ఎత్తైన రాతిదర్వాజలు, గోడల్ని మలిచి రూపొందించిన కిటికీలు కోట నిర్మాణ వైశిష్ట్యాన్ని పట్టిచూపుతాయి.

అడుగడుగునా గుడి..
పరమత సహనాన్ని చాటేలా పలు నిర్మాణాలు చేశారు జఫర్‌గఢ్ పాలకులు! సర్వమత సమానత్వాన్ని ప్రబోధించేలా ఆలయాలు, మసీదులు నిర్మించారు. గంటలగుడి, శివాలయం, వైష్ణవాలయం, కొండ వెనుక భాగంలో కొండసింగమయ దేవాలయం ఉన్నాయి. ప్రస్తుతం ఆలనాపాలనా కరువై శిథిలావస్థకు చేరుకున్నాయి! కోట పరిసరాల్లో పురాతన కాలం నాటి బావుల్లో ఒకటి తులశంబావి కాగా, మరొకటి భోగంబావిగా పిలుస్తారు. ఒకటి పూజాదికాలకు అవసరమైన నీటికి, మరొకటి రాచ స్త్రీలు స్నానాల కోసం ఉపయోగించే వారట! వీటికి సమీపంలో ఎత్తయిన కొండపై లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ మాత్రం నేటికీ నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ కొండపై దేవునిగుండం ఉంది. రాతిపై నీటిమడుగు ఎప్పుడూ ఎండిపోలేదని చెబుతుంటారు స్థానికులు! ఇక్కడే.. రాతిపై తొలిచిన నరసింహస్వామి పాదాలు అగుపిస్తాయి. అక్కాచెళ్లెళ్ల గుండాలని పిలిచే మరో రెండు కోనేర్లు ఎప్పుడూ నీటితో కళకళలాడుతూ ఉంటాయి! కొండకు ఎదురుగా ఉన్న బయ్యన్నగుట్టపై జమ్మిగుండం, పందిగుండం అనే కోనేర్లున్నాయి. బయ్యన్న దేవుడు కొలువై ఉన్న కారణంగానే ఈ గుట్టకి ఆ పేరు వచ్చింది! రాతిపొరల మీద నిర్మితమైనా పుష్కలమైన నీటివనరులు ఉండటం వల్లే నిత్యం పచ్చదనంతో అలరారుతోందీ జఫర్‌గఢ్ కోట!

సంపదని కాపాడాలి..
రెండు కొండల మధ్య ఉన్న గ్రామాన్ని శత్రుదుర్భేద్యంగా మలిచారు నాటి రాచపాలకులు! శత్రువుల అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు మూడువైపులా పెద్దపెద్ద ద్వారాలు కట్టించారు. వాటి దిశను బట్టి హన్మకొండ దర్వాజ, పట్నం దర్వాజ, ఖమ్మం దర్వాజలుగా పిలుస్తుంటారు. గ్రామం చుట్టూ మట్టితో కట్టలు వేసి కందకాలు తవ్వించి నీటితో నింపేవారు. చుట్టూ ఉన్న కోట గోడలపై బతేరాలు నిర్మించారు. వీటిపై పంచలోహాలతో తయారు చేసిన ఫిరంగులు పెట్టారు. దీన్ని బట్టి శత్రువులు చొరబడితే వారి కదలికలు గమనించి మెరుపుదాడి చేసేవారు. ప్రస్తుతం.. పదుల సంఖ్యలో ఫిరంగులు, కలప దర్వాజలు దొంగలపాలవగా, ఉన్నవాటిని పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ప్రాచీన దేవాలయం గంటల గుడిలో 45అడుగుల ఎత్తున్న ధ్వజ స్థంభంపైన ఉన్న త్రిముఖ పంచలోహ విగ్రహాన్ని దొంగలు అపహరించారు. అంతే కాకుండా గుప్తనిధుల కోసం ఈప్రాంతంలో అనేక సార్లు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. గ్రామం చుట్టూ నిర్మించిన కందకాల మట్టిని స్థానిక అవసరాలకోసం తరలిస్తుండటంతో చారిత్రక కట్టడం కాలక్రమేణా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది! 161 ఏళ్ల జఫర్‌గఢ్ ఖిల్లాని టూరిస్ట్‌స్పాట్‌గా మలిచేందుకు పర్యాటకశాఖ కొన్ని ప్రయత్నాలు చేసింది. పర్వతారోహణ కేంద్రాన్ని డెవలప్ చేయాలనే ప్రణాళికలు ఫైళ్లలోనే మగ్గుతున్నాయి! ఇక్కడి సుందరకట్టడాలు, కళా సంపద.. తెలంగాణ రాష్ట్రంలోనైనా విరాజిల్లాలని ఆశిద్దాం!

ఎన్. ఆర్. అనిల్‌కుమార్, టీ మీడియా, జనగామ
ఫోటోలు: గొట్టె వెంకన్న

6800

More News

Featured Articles

Health Articles