కలియుగ కైలాసం

Tue,November 17, 2015 10:28 AM

నల్లమల కొండల మధ్య..
అన్నికాలాలూ పచ్చదనంతో పరవశించే ప్రాంతం...
ప్రకృతి మధ్య సహజసిద్ధంగా వెలసిన పుణ్యతీర్థం... ఉమామహేశ్వర క్షేత్రం!
ఈ వారం డిస్కవరీ తెలంగాణలో...

tree
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు 8 కిలోమీటర్లున్న రంగాపూర్ గ్రామం నుంచి దక్షిణ దిశగా నాలుగు కిలో మీటర్లదూరంలోని 500 అడుగుల ఎత్తయిన పర్వత కనుమల మీద నెలకొనుంది ఉమామహేశ్వరక్షేత్రం. నల్లమలలోని ఈ కొండ ఎగువన ఉమామహేశ్వరం, దిగువన భోగమహేశ్వరం ఉన్నాయి. పైకి పోవడానికి మెట్లదారే కాక ఘాట్‌రోడ్డూ ఉంది. ప్రత్యేక బస్సు సదుపాయాలు లేవు కానీ సొంత వాహనాలపై వెళ్లొచ్చు.


చరిత చిత్రం

ఈ పర్వత కనుమలు ధనస్సు ఆకారంలో వంపులు తిరిగి చూడముచ్చటగా ఉంటాయి. స్కంధ పురాణంలో వర్ణించిన శ్రీశైల క్షేత్రానికి ఉమామహేశ్వరం ఉత్తర ద్వారం కాగ అలంపూర్ క్షేత్రం పశ్చిమ ద్వారమై, కర్నూలుజిల్లాలోని త్రిపురాంతకం తూర్పు ద్వారంగాను, కడప జిల్లాలోని సిద్ధవట క్షేత్రం దక్షిణ ద్వారంగానూ ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడి రుద్రధారలో స్నానంచేసి మహేశ్వరుని దర్శిస్తే మరల జన్మ ఉండదట. అంతేకాదు.. వారికి ముందున్న పది తరాలవారు తరిస్తారు. ఈ క్షేత్రంలో అణువంత బంగారం దానమిచ్చినా భూమినంతటిని దానమిచ్చిన ఫలాన్ని పొందుతారని, ఇక్కడ పట్టెడన్నం పెడితే లెక్కలేనంతమందికి అన్నదానం చేసిన ఫలం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒకరాత్రి నిద్రపోతే కాశీ, ప్రయాగాది పుణ్యక్షేత్రాలలో అనేక లక్షల సంవత్సరాలు నివసించిన ఫలాన్ని పొందుతారట. ఇక్కడ మరణించిన జీవులు అగ్నిలో ఆహుతులవలె ఈశ్వరుడిలో ఐక్యం అవుతాయని విశ్వాసం. ఈ ద్వారాన్ని కుబేరుడు రక్షిస్తూ ఉంటాడని ప్రతీతి. ఇక్కడ ఆయన రాజధాని అయిన చంద్రప్రభా నగరం ఉంది. ఇది సిద్ధులైన మహర్షులకు మాత్రమే కనిపిస్తుందని పురాణవిశేషం. ఈ ఉమామహేశ్వరక్షేత్రం అయిదామడల వెడల్పు, పదామడల పొడవు కలిగి రుద్రధార, విష్ణుధార, బ్రహ్మధార, ఇంధ్రధార, దేవదార అనే పంచతీర్థాలతో అలరారుతుంది. ఇక్కడ చాళుక్యుల శిల్ప రీతిలో కట్టిన ఆలయం ఉంది. ఇది క్రీ.శ 7వ శతాబ్దం నాటిదని శాసనాలు తెల్పుతున్నాయి. పూర్వం అనేక రాజవంశీయులు వేయించిన శిలాశాసనాల ద్వారా ఇది మిక్కిలి పురాతనమైన క్షేత్రంగా అవగతమవుతున్నది. చాళుక్యులు, చోళులు, కాకతీయులు, పద్మనాయకులు, సామంత దండ నాయక మాండలీకులు, భాండాగారీకులు మొదలైన రాజవంశీయులు దీనికి సంబంధించి అనేక శిలాశాసనాలు వేయించినారు.

శ్రీశైలఖండంలో...

శ్రీరాముడు రావణుని చంపిన తర్వాత శ్రీశైల ప్రదక్షిణను ఇక్కడి నుంచే ప్రారంభించాడని పురాణంలో ఉన్నది. ఈ ప్రాంతంలోని కొండదారుల్లో అనేక లింగాలు కనబడుతుంటాయి. పండితారాధ్యుని శిష్యుడు దోనమయ్య ఉమామహేశ్వరంక్షేత్రం ద్వారా శ్రీశైలానికి వెళ్లినట్లు పండితారాధ్య చరిత్ర చెప్తున్నది. కాకతీయులకాలంలో ఈ క్షేత్రం గొప్పగా వెలుగొందినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. చంద్రప్రభానగరాన్ని రాజధానిగా చేసుకొని కుబేరుడు సపరివారంతో ఉమామహేశ్వర క్షేత్రాన్ని రక్షిస్తాడు. శివరాత్రి మహాపర్వదినం నాడు మహేశ్వరుని సేవించేందుకు ఇక్కడికి ముల్లోకాలనుంచి సకలదేవతాగణాలతో దేవకన్యలు వస్తారని, ఈ స్వామిని సేవించేవారికి శివసాయుజ్యం లభిస్తుందని శ్రీశైలఖండం పేర్కొన్నది.

మహాతీర్థములు

స్థలపురాణాన్ని బట్టి క్షేత్రంలోని రుద్రధార, విష్ణుధార మొదలైన పంచతీర్థాలతో పాటు ఏకాదశ తీర్థాలున్నట్లు పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో పేర్కొన్నాడు. మహేశ్వరం, గుప్తమహేశ్వరం, చరుకేశ్వరం, సంధ్యేశ్వరం, గురుడేశ్వరం, కాలహ్రదేశ్వరం, పాపనాశనం, గణేశ్వరం, దేవహ్రదేశ్వరం, సిద్ధేశ్వరం, నీలహ్రదం అని పదకొండు తీర్థాల్ని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇక్కడి ఆలయానికి సమీపంలోని కొండలపై నుంచి ప్రవహించే జలధారలను రుద్రధార, భస్మధార, గౌరీకుండం, పాపనాశనంగా పేర్కొంటున్నారు. ఇవి మాత్రమే ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ నిరంతరం కొండల నుంచి పారే జలధారలే. వేసవిలో కూడా ఈ జలధారలు చల్లని తుంపురులతో యాత్రికులను ఆనందపరుస్తాయి.

ఆలయవాస్తు.. శిల్పాలు..

ఉమామహేశ్వరక్షేత్రానికి ఉమామహేశ్వరుడు క్షేత్ర పాలకుడిగా ఉండి లింగరూపంలో ఆరాధన పొందుతున్నాడు. దానికిందనే మహేశ్వరుడు లింగరూపంలో పుట్టినందువల్ల దీనికి స్వయంభూ లింగమని పేరు వచ్చింది. ఆ మహాశిలయే పై కప్పుగా, చుట్టూ మూడు పక్కలు గోడలుండి ఉత్తరాధిముఖంగా ఉమాదేవి, మహేశ్వరుల గర్భగుళ్లు ఉన్నాయి. ఈగర్భగుళ్లముందు మహాశిల్ప విన్యాసం తీర్చిదిద్దిన నల్లరాతి శిలాస్తంభాలు ఆకట్టుకుంటాయి. విశాలమైన మండపం, నేలపై భూప్రస్తార శిలాశ్రీచక్రమూ ఉన్నాయి. ఉమామహేశ్వరుడి ఎదురుగా మండపంలో శిల్పకళ ఉట్టిపడే నందీశ్వర విగ్రహం ప్రతిష్ఠించి ఉంది. మండపంలో శిల్పాస్తంభాలపై బ్రహ్మ, నగ్ననృత్యబాలికలు, పుష్పధారిణులు, ద్విభుజదేవీమూర్తులు, మహాశిలను మోస్తున్న గరుడ, హనుమంతులు, కోతిని కరచిపట్టిఉన్న నృత్యసుందరి, గజవాహనుడైన ఇంద్రుడు మొదలైన శిల్పకళావిన్యాసం చూపరుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇవన్నీ కాకతీయులవాస్తు, శిల్పపద్ధతికి చెందినవని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం.

పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు

స్వామివారికి ప్రతిరోజు పూజలు.. ప్రతి సంవత్సరం ఉత్సవాలూ నిర్వహిస్తారు. ఆషాడశుద్ధ ఏకాదశినాడు అభిషేకాలు, విశేషపూజలు జరుగుతాయి. సంక్రాంతి, శివరాత్రి, దసరారోజు.. ఆలయంలో ప్రధానోత్సవాలు ఉంటాయి. యేటా పుష్యశుద్ధ పాడ్యమికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అచ్చంపేట పట్టణంలోని భ్రమరాంబ ఆలయం దేవాలయం నుంచి పార్వతీపరమేశ్వరుల ఉత్సవవిగ్రహాలను అలంకరణతో ఊరేగింపు తీసుకెళ్లి ఉమామహేశ్వరక్షేత్రంలో కల్యాణం జరిపించే ఆనవాయితీ ఉంది. ఈ ఉత్సవానికి పరిసర గ్రామాల భక్తులు ప్రభలు కట్టుకొని వచ్చి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈసందర్భంగా వారంరోజుల పాటు జాతర కొనసాగుతుంది. భక్తులు శివునికి అభిషేకాలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటుంటారు. శివరాత్రి, బ్రహోత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

ప్రకృతి సౌందర్యం

మండు వేసవిలో కూడా మంచుకొండలా హాయినిస్తూ యాత్రికుల్ని ఆనంద పరవశంలో ముంచెత్తుతుంది ఈ క్షేత్ర వాతావరణం. వెనుకవైపు, ఉభయ పార్శాల్లో పెద్దపెద్ద పర్వతశ్రేణులు, ముందుభాగాన లోతైన లోయ, దూరంగా పచ్చని పంటపొలాలు.. నీటి కుంటలతో నిండిన ఈ ప్రాంతం వేసవికి చక్కని విడిది. ఆకట్టుకునే అందం ఇక్కడి ప్రకృతి సొంతం. శ్రీశైలం, మద్దిమడుగు, మల్లెలతీర్థం, సలేశ్వరం, నిజాంకాలంనాటి ఫరహాబాద్ వ్యూపాయింట్ తదితర దర్శనీయప్రదేశాలు నల్లమలలో ప్రధానరహదారి మధ్య ఉండడం వల్ల ప్రతిరోజు రాష్ట్రం నలుమూలల నుంచేకాక రాష్ట్రేతర ప్రాంతాల నుంచీ ఉమామహేశ్వరం క్షేత్రానికి వస్తుంటారు సందర్శకులు. శ్రీశైలం వచ్చివెళ్లే భక్తులు తప్పనిసరిగా ఉమామహేశ్వరక్షేత్రాన్ని సందర్శించుకుంటారు.

క్షేత్రంలో ఆధునిక సౌకర్యాలు..

యాత్రికుల సౌకర్యార్థం అప్పటి దేవస్థాన కమిటీ అధ్యక్షుడు మర్యాద గోపాల్‌రెడ్డి ఎగువ ఉమామహేశ్వరం వరకు ఘాట్‌రోడ్డు వేయించాడు. ఇప్పుడు రాష్ట్ర అంతటా దూరప్రాంతాల నుంచి ప్రతిరోజూ అనేక వాహనాలు వచ్చిపోతూ ఎప్పుడు మిక్కిలి రద్దీగా ఉంటుంది. యాత్రీకుల రక్షణ కోసం లోయవెంట దారిపొడుగునా సుమారు అరకిలోమీటరు వరకు గోడ ఉంటుంది. అంతే దూరాన నేలను చదును చేసి సందర్శకుల సౌకర్యం కోసం ప్రధాన దేవాలయం నుంచి పాపనాశనం వరకు బండలు పరిచారు. అదేవిధంగా వాహనాలు నిలిపేందుకూ ప్రధాన దేవాలయం పడమర భాగాన కొండచరియను విశాలపరచి పార్కింగ్ ఏర్పాటు చేశారు. క్షేత్రంలో ఎల్లప్పుడూ యజ్ఞయాగాదులు, చాతుర్మాస్యవ్రతాలు, ధార్మిక సమ్మేళన సమావేశాలు నిర్వహిస్తుంటారు. దీన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా మలచడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది.

16462

More News

Featured Articles

Health Articles