శ్రీరంగ క్షేత్రం

Wed,November 18, 2015 11:23 AM

మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలట! మరి భూలోక సురులుగా భావించే రాజులు కళాపోషకులైతే.. అద్భుతమైన కట్టడాలు.. అబ్బురపరిచే నిర్మాణాలకు కొదువుంటుందా? గతంలో మహబూబ్‌నగర్‌ని పాలించిన రాజులూ అలాంటి కళాపిపాసులే! అందుకే జిల్లాలోని శ్రీరంగాపూర్ ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా.. ఐదువందల సంవత్సరాల చారిత్రాత్మక రూపాలకు సాక్ష్యంగా నిలుస్తుంది!
మహబూబ్‌నగర్‌జిల్లా వనపర్తి పట్టణం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరం కొలువై ఉంది శ్రీరంగాపూర్ రంగనాథస్వామి ఆలయం. జాతీయ రహదారిలోని పెబ్బేరు నుంచైతే కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీరంగాపురం.

చారిత్రక నేపథ్యం

వనపర్తి సంస్థానాధీశులైన బహిరి గోపాల్‌రావు 1657 నుంచి 1675వ సంవత్సరం వరకు పరిపాలన కొనసాగించాడు. స్వతహాగా కవి. ఎనిమిది భాషల్లో పట్టుకలిగిన బహుముఖ సాహితీప్రియుడు, మంచి పాలనాదక్షుడు. 1662వ సంవత్సరం దక్షిణ భారతదేశంలోని పుణ్య క్షేత్రాల్ని దర్శించుకునే క్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నం చేరుకున్నాడు. అక్కడ శ్రీరంగనాయకులు కొలువై ఉన్న శ్రీరంగ క్షేత్రమును దర్శించాడు. ఆ ఆలయ నిర్మాణం, శిల్పకళను చూసి ముగ్ధుడయినాడు. తన రాజ్యం వనపర్తిలోనూ శ్రీరంగనాయకుల ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు.

srp-templఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇంకో కథనంకూడా ప్రచారంలో ఉంది. ఇదే బహిరి గోపాల్‌రావు.. శ్రీరంగ క్షేత్రంలోని గర్భగుడిలో మూలవిరాట్టు దర్శనమవ్వలేదని అనంతరం ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో స్వయానా రంగనాయకులు ప్రత్యక్షమై వనపర్తి సంస్థాన పరిధిలోగల కొరివిపాడులో ఆలయాన్ని నిర్మించి పరిపాలన కొనసాగించమని ఆదేశించినట్లు చెబుతారు. క్రీ.శ.1670వ సంవత్సరంలో ప్రారంభమైన ఆలయ నిర్మాణం 1804 నాటికి పూర్తయింది. గోపాల్‌రావుతోపాటు మొదటి రామక్రిష్ణారావు, అతని భార్య శంకరమ్మ, శ్రీకష్ణ దేవరాయల పాత్రకూడా ఉంది ఈ నిర్మాణాన్ని పూర్తిచేయడంలో!

ఆలయ కళా వైభవం

సుమారు 600 మంది శిల్పులు, కళాకారులు, ఆగమనశాస్త్ర పండితులు, వేలమంది కార్మికులు కలిసి నిర్మించిన ఈ అద్భుత ఆలయం పాలమూరు జిల్లాకే మణికిరీటంలా వెలుగొంది, ఆధ్యాత్మిక ప్రాంతంగా ఉన్నతికెదిగింది. ఆలయం కోసం క్రష్ణా, తుంగభద్ర నదీతీరాలలో ప్రత్యేకంగా లభించే ఇసుక రాయిని, నల్లని నాపరాయిని ఉపయోగించారు. తమిళనాడులోని తంజావూరు, తిరుచినాపల్లి, కంచితిరువనంతపూర్ నుంచి రాతి పనిలో నిష్ణాతులైన శిల్పులు.. విష్ణుమూర్తి దశావతారాలతోపాటు సామాజిక వైవాహిక, దాంపత్యం, తదితర కళాఖండాలను చెక్కారు. ఆలయానికి మూడుదిక్కులా రంగసముద్రం చెరువు ఉండటం వలన మరింత సౌందర్యంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం. ఆలయ ముఖద్వారంలో నిర్మించిన 60 అడుగుల ఎత్తైన గాలిగోపురంలో శిల్పకళాచాతుర్యం ఉట్టిపడుతుంది. గాలిగోపురం గడప పక్కనే ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి శిలాప్రతిమ గమనించదగినది.

srp-templ2
కష్ణ విలాస్

ఆలయ సప్తప్రాకారాలకు ఆనుకొని ఉన్న శ్రీరంగ సముద్రం నీటి మధ్యలో సేద తీర్చుకునేందుకు కష్ణ విలాస్ అనే అందమైన భవంతిని రాణి శంకరమ్మ నిర్మించారు. ఆమె మనుమడైన శ్రీకష్ణ దేవరాయలు పేరుమీద కష్ణ విలాసం నిర్మించినట్లు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి.

దక్షిణద్వారప్రవేశం

భక్తులకు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున ఆలయ దక్షిణ ద్వార ప్రవేశం తెల్లవారు జామున జరుగుతుంది. దక్షిణ ద్వారం ద్వారా రంగనాయకుల దర్శనం, సూర్యోదయ కాలంలో చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతోంది. ఈ దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.

కొఠాయి మండపం

బహు సుందరంగా, ఆలయానికి మధ్య భాగంలో నిర్మించిన ఈ మండపం లతలు, పుష్పాలు, దేవతల శిల్పాలు, నాగబంధం కుండలి, మానవుల రూప శిల్పాలతో అత్యద్భుతంగా ఉంటుంది. రంగసముద్రం అలల ఆహ్లాదం ఇక్కడ నుంచి వీక్షిస్తే రెండు కళ్లు చాలవంటే నమ్మండి!

కొనేరు, రత్నపుష్కరిణి

ఆలయానికి 200మీటర్ల దూరంలో 12 మూలలు కలిగి, నక్షత్రాకారంలో పూర్తిగా రాతి కట్టడంలో నిర్మాణమయిన ఈ కోనేరులో ఇప్పటివరకు నీరు ఎండిపోలేదు. రంగసముద్రంలో మునిగిపోయిన గుండుబావి(రత్నపుష్కరిణి) తాగునీటి బావిగా ప్రసిద్ధి గాంచింది.

తంజావూరు కళాఖండాలు

తిరుమల, తమిళనాడులోని తంజావూరు నుంచి వచ్చిన మేటి స్వర్ణకారులు, చిత్రకారులు రకరకాల లోహాలతో ఏళ్లతరబడి శ్రమించి దశావతారాలు, ఇతర ఆధ్యాత్మిక చిత్రాలు, తిరువళ్వార్లు తదితర అంశాలపై వందలాది కళాఖండాలను రూపొందించారు. ఇలాంటివి ఎన్నో వెలకట్టలేని చిత్రరూపాలు ఈ ఆలయ నేల మాళిగలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఆలయం నిర్మాణం ఒక మైలురాయిగా చరిత్రలో నిలిచి పోవటం ఒక ఎత్తయితే, చినజీయర్ స్వామి రాకతో మరింత ప్రచారం లభించింది. ఇక్కడ శేషనాయకుడు అయిన రంగనాయక స్వామి, నాభికమలం బ్రహ్మరూపం కల్గి భక్తుల కోర్కెలు తీర్చే రంగనాయకులుగా విలసిల్లుతున్నాడు.

కొరవడిన భద్రత

సుమారు 400 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కల్గి సర్వాంగ సుందరంగా, అత్యంత విలువైన విగ్రహసంపద, కోట్లు విలువ చేసే తంజావూర్ కళాఖండాలు కల్గిన ఈ ఆలయంలో భద్రత కరువై గతంలో పలుమార్లు దొంగతనాలు జరిగాయి. గోదాదేవి పంచలోహ విగ్రహం, తంజావూర్ చిత్ర కళాఖండాలు, గాలిగోపురం పైన ఉన్న బంగారు కుమ్మీలు దొంగలపాలయ్యాయి. అయినప్పటికీ ఆలయ సిబ్బంది, పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోకపోవటం విడ్డూరం! సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఆలయ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

7478

More News

Featured Articles

Health Articles