జాలువారే అందాలు..పొచ్చెర జలపాతం

Wed,November 18, 2015 11:32 AM

ఎండాకాలం ఎర్రమందారంలా..
వానాకాలం ఆకుపచ్చని సంపంగిలా విచ్చుకొని...
చలికాలం మంచుదుప్పట్ల కింద మల్లెమొగ్గలా ముడుచుకుపోయే
ఆదిలాబాద్ జిల్లా సోయగాన్ని వర్ణించ అక్షరాలు చాలవ్! సహ్యావూదిపర్వతాల్లోంచి జాలువారే ఆ అందాలను చూసి తరించాల్సిందే! ఇప్పటివరకు ఒక్క ‘కుంటాల’ తప్ప పొచ్చెర, మిట్టె, గుత్పల, కొరిటికల్, సమితులతో పాటు ఇక్కడి అటవీగర్భంలో దాగిన మరెన్నో సుందర జలపాతాలు పర్యాటక పుటల్లోకి ఎక్కకపోయినా అవి


పంచుతున్న మధురానుభూతులను మూటగట్టుకొని రావాల్సిందే..!
ఆదిలాబాద్‌జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతంలాగే బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దగ్గరకు వెళ్లి చూస్తే ఆకాశ గంగే కిందకు దూకుతున్న భావన కలిగిస్తుంది. నేరడిగొండ నుంచి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో కుంటాల జలపాతం ఉంటే, బోథ్ ఎక్స్‌రోడ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో పొచ్చెర జలపాతం ఉంది. ఈ రెండు మండలాల్లోనే ఇంకా గాయత్రి, సవతుల గుండం, కనకదుర్గ, బుంగనాల, గన్‌పూర్ జలపాతాలున్నాయి. ఈ ఏడింటినీ కలిపి ‘సప్తగుండాలు’గా వ్యవహరిస్తారు. వీటిని సందర్శించాలంటే గుట్టలు, వాగులు దాటాల్సి ఉంటుంది.


మినీ నయాగరా
ఇక నేరడిగొండ నుంచి జాతీయ రహదారి మీదుగా నిర్మల్‌వైపు కేవలం పది కిలోమీటర్లదూరం వెళ్లగానే రోడ్డుకు అతిసమీపంలో ఉండే కొరిటికల్ జలపాతం చెప్పనలవిగాని సొబగులతో కనువిందు చేస్తుంది. దీనికి ‘మినీ నయాగరా’ అని పేరు. నేరడిగొండ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీవూపాంతంలో ఉండే గుత్పల జలపాతం కూడా సందర్శకులను కట్టిపడేస్తుంది. కానీ ఇక్కడికి వెళ్లేందుకు సరైన రోడ్డు వసతి లేదు. ఇకపోతే సిర్పూర్(యూ) మండల కేంద్రం నుంచి సరిగ్గా 12 కిలోమీటర్ల దూరంలో ఉండే మిట్టె జలపాతం కూడా తన ఒంపుసొంపులతో పర్యాటకులను ఇటే కట్టిపడేస్తుంది.


అయితే ఇక్కడికి సిర్పూర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉండే పిట్టగూడకు వచ్చి మళ్లీ అక్కడి నుంచి 3 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. దారి పొడువునా ఎన్నో అనుభూతులను మూటకట్టుకోవచ్చు. ఆసిఫాబాద్ మండలం మొవాడ్ అటవీ ప్రాంతంలో మరో కనువిందు చేసే జలపాతం ఉంది. దీనిని ‘సమితుల గుండం’గా వ్యవహరిస్తారు. ఆసిఫాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలోఉన్న ఈ జలపాతానికి చక్కని రోడ్డుసౌకర్యం ఉండడంతో దీనికి సందర్శకుల తాకిడి ఎక్కువే! అలాగే నార్నూర్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని కుండాయి వాగు, కాసిపేట మండలంలో దేవాపూర్ మార్గమధ్యలో ఉండే సల్పలవాగు ఎంతగానో ఆకట్టుకుంటాయి.


ఇంకెన్నో సందర్శక స్థలాలు..
ఖానాపూర్ పట్టణానికి అతి సమీపంలో ఉండే సదర్‌మాట్ జలాశయం ఆకుపచ్చని అడవుల నడుమ ఆహ్లాదకరంగా ఉంటుంది. కడెం సమీపంలోని కడెం ప్రాజెక్టు కూడా మంచి పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. సహ్యాద్రి పర్వతాల్లోంచి ప్రవహించే కడెం వాగుమధ్యలో పెద్దూర్‌వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు. సాయంసంధ్య వేళ ఇక్కడ బోట్ షికారు ఒక మరువలేని మధురానుభూతి. దీనికి 12 కిలోమీటర్ల దూరంలోనే జన్నారం మండలంలో కవ్వాల్ అభయారణ్యముంది. ఇక్కడి జింకల సంరక్షణ కేంద్రం చూసి తీరాల్సిందే! నిర్మల్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోని స్వర్ణ ప్రాజెక్టు.. తాచుపాములాగా మెలికలు తిరిగి కనిపించే నేరడిగొండ మండలంలోని మహబూబ్ ఘాట్ కూడా ప్రముఖ దర్శనీయ స్థలాలు.

నూకల దేవేందర్
టీ మీడియా, ఆదిలాబాద్
ఫోటోలు: బొంగురాల గంగాధర్

7782

More News

Featured Articles

Health Articles