జలక్షేత్రం.. మల్లెలతీర్థం

Wed,November 18, 2015 11:25 AM

ప్రకతి సోయగాలు.... సహజ వనరులు... చెట్లు చేమలు... గుట్టలుపుట్టలు.. వన్యప్రాణుల అరుపులు... ఇవన్నీ నల్లమల సొంతం. మహబూబ్‌నగర్ జిల్లా, అమ్రాబాద్ మండలంలోని మల్లెలతీర్థం ఆ నల్లమల ఒడిలోనే ఒదిగి ఉంది!

కొండల మధ్య దట్టమైన ఆడవిలో సహజసిద్ధంగా వెలసిన పుణ్యక్షేత్రం. మైదానభూమి నుంచి సుమారు 500 అడుగుల లోతున ఒక పెద్దలోయ. ఈలోయపై భాగంలో మళ్లీ మైదాన ప్రాంతం. దీనికి సమీపంలో ఉన్న కుడిచింతలబైలు గ్రామస్తులు ఈ మైదానాన్ని వ్యవసాయ యోగ్యంగా చేసుకొని పంటలు పండిస్తున్నారు. ఈ పంటపొలాల మధ్య నుంచే లోయకు వాహనాలు వెళ్లేందుకు దారి ఉంది. లోయపైనా, లోపల పచ్చని ప్రకతి యాత్రికులను తన్మయత్వం చేస్తుంది. 500 అడుగుల ఎత్తు నుంచి దూకే జలపాతం యాత్రికులకు ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఈ కాలం, ఆకాలం అని కాకుండా మూడు కాలాలూ అంతెత్తునుంచి జాలువారుతుంది! అయితే ఇందులో స్నానం చేయడానికి వీలుండదు. ఆ నీటిదెబ్బకు తట్టుకోలేరు. కేవలం ఆనీటి తుంపరులతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

అంతవేగంగా దూకే ఆ జలపాతంపైన (భూమిపైన), చుట్టుపక్కన చూస్తే ఎక్కడ చుక్క నీరుండదు. పైన నీరు లేక జనం అల్లాడిపోతుంటారు. లోయ లోపల చూస్తే మహాద్భుతంలా ఈ జల ఊట... ప్రకతిలీలకు ప్రతిబింబంలా! ఇంతటి దివ్యానుభూతి కలిగించే ఈ జలపాతం తుంపరలతో తడిసిముద్దయి పక్కనే ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు పర్యాటకులు, భక్తులు. ఈ లింగం పక్కనే ఉన్న అమ్మవారి విగ్రహానికి అర్చనకావించి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న శివలింగానికి గాని, అమ్మవారి విగ్రహానికి గాని ప్రత్యేకమైన ఆలయాల్లేవు. మామూలుగా దరికింద ఉన్నయంతే! యాత్రికులు ఎవరెంతటికి వారే టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటుంటారు. అప్పుడప్పుడు సాధు సన్యాసులు వచ్చి అర్చకత్వం నిర్వహిస్తుంటారు తప్ప ప్రత్యేకంగా పూజారులు కూడా లేరు!

ఇదీ మల్లెలతీర్థం చరిత్ర
పూర్వం అర్జునుడు మల్లెపూలతో పరమేశ్వరుడిని అర్చించినందున ఈ క్షేత్రానికి మల్లెలతీర్థమని పేరు వచ్చిందని చెప్తారు స్థానికులు. మల్లికార్జునుడు శ్రీశైలం వెళ్లేటప్పుడు మల్లెలతీర్థం గుండంలో స్నానమాచరించినాడని లోకోక్తి కూడా ఉంది. రాజరాజనరేంద్రుడు సారంగధరుని కాళ్లుచేతులు నరికించగా మల్లెలతీర్థం గుండంలో మునగడంతో తిరిగి కాళ్లుచేతులు వచ్చాయని పురాణ కథ. అదేవిధంగా పూర్వం విశ్వామిత్రుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి సిద్ధిపొందాడనే కథనమూ ప్రచారంలో ఉంది. స్కంధపురాణంలో శ్రీశైల ఖండంలో మల్లికాతీర్థ ప్రస్తావనలోని మల్లికాతీర్థమే ఈ మల్లెలతీర్థమనీ చెప్తుంటారు. పూర్వం ఈ క్షేత్రానికి సమీపంలో చంద్రగుప్త సామ్రాజ్యం ఉండేదట. చంద్రగుప్తునికి లేక లేక ఒక కూతురు పుడుతుంది. ఆమె పేరు చంద్రవతి. దినదిన ప్రవర్థమానంగా పెరిగి పెద్దదవుతుంది. నిత్యం పరమశివుడిని ధ్యానిస్తూ.. తమ సామ్రాజ్యంలో ఉన్న ఈలోయలోని శివలింగంను మల్లెలతో ఆరాధిస్తూ ఉండేదట. ప్రతిరోజు మల్లెలతో అభిషేకించడం వల్ల వాటి పరిమళాలతో ఆప్రాంతమంతా గుబాళించేదని, అందుచేతనే దీనికి మల్లెలతీర్థమని పేరు వచ్చిందని ఇంకో మాట చెప్తారు. ఇలా మల్లెలతీర్థం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఎలా వెళ్లాలి?
నల్లమల అడవుల్లో కొలువై ఉన్న ఈ మల్లెలతీర్థం హైదరాబాద్‌కు 158కిలోమీటర్లదూరంలో ఉంటుంది. ఈక్షేత్రం నుంచి శ్రీశైల మల్లన్న ఆలయం 58కిలోమీటర్లే. హైదరాబాద్ నుంచి వస్తుండగా మన్ననూర్ ఘాట్‌రోడ్డు దాటగానే పచ్చదనంతో నిండిన కొండలు, అడవులు స్వాగతం పలుకుతాయి. మన్ననూర్ నుంచి శ్రీశైలం వెళ్లేదారిలో వటవర్లపల్లి గ్రామం నుంచి ఎడమవైపు(ఉత్తరంవైపు) గ్రామంలోకి వెళ్లే దారిగుండా ఊరి తూర్పుకు వెళ్లి అటునుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్లదూరంలోని కుడిచింతలబైలుకు చేరుకోవచ్చు. దీనినే పొగచారు అనికూడా అంటారు. ఈ పొగచారు గ్రామాన్ని దాటి మరో రెండు కిలో మీటర్లదూరం పంటపొలాల గుండా మల్లెలతీర్థం పైభాగం వరకూ వాహనాలు వెళ్తాయి. వాహనాలు దిగి కాలిబాటన 380మెట్ల ద్వారా లోయలోకి దిగాలి. గతంలో లోయలోకి దిగేందుకు డొంకదారులను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ఈమధ్యకాలంలో నలుగురు వ్యక్తులు కాలినడకన వెళ్లేవిధంగా మెట్లు ఏర్పాటు చేశారు.

ఆకట్టుకునే లోయ
ఈ లోయ మూడు కొండల నడుమ ఉంటుంది. దీని లోపల రెండుమూడు విశాలమైన గుండాలు ఉన్నవి. దక్షిణం వైపు నుంచి 500 అడుగుల ఎత్తులో జలపాతం జాలువారుతుంటుంది. జలపాతంలోని నీళ్లు లోయలో పడి గుండముల ద్వారా ఉత్తరవైపుగా వివిధ పేర్లతో ప్రవహిస్తూ చివరికి కష్ణానదిలో కలుస్తాయి. నిత్యం జలపాతం పారుతుండడంతో ఈలోయ ప్రాంతమంతా చల్లగా ఉంటుంది. ఈస్థలాన్ని చూడడానికి ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. ఇంతకుపూర్వం యాత్రికులు శివరాత్రి, తొలిఏకాదశి ఉత్సవాల్లో మాత్రమే వెళ్లి దర్శించుకునేవారు. గత పదిహేడేళ్ల నుంచి మాత్రం త్రికాలాలూ భక్తుల రద్దీ ఉంటోంది. అంతకుముందు నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే చదునైన భూభాగంలో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. ఈ పొలాల పక్కనే ఉన్న అడవిలో ఒక్కో చెట్టుకింద ఒక్కో విగ్రహం చొప్పున అనేక విగ్రహాలు ఉన్నాయి. మల్లెలతీర్థాన్ని ఇప్పటికీ సమీపగ్రామాల్లో రాములపాదాలు అని వ్యవహరిస్తున్నారు.

అటవీశాఖ ఆధీనంలో క్షేత్రం
మల్లెలతీర్థం క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షేత్రంబయట యాత్రికుల కోసం విడిది, పార్కింగ్ స్థలం, ఇరువైపుల ఆకట్టుకునే చిన్నపాటి గార్డెన్‌నూ ఏర్పాటు చేశారు. బాత్‌రూమ్‌లు, మంచినీటి వసతులూ ఉన్నాయ్. లోయలోకి వెళ్లేందుకు పదిరూపాయల టికెట్‌ను పెట్టారు. 12మంది చెంచుయువకులకు నెలకు మూడువేల రూపాయలు జీతంగా చెల్లిస్తూ సెక్యూరిటీగార్డులుగా నియమించారు. రమణీయ దశ్యాలతో అల్లుకున్న ఈ మల్లెలతీర్థం క్షేత్రంలో గతంలో అనేక సినిమా షూటింగ్‌లు జరిగాయి. ఇలాంటి ప్రకతి కమనీయంపైన వచ్చే ప్రభుత్వమైనా శ్రద్ధపెట్టి చక్కటి పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేస్తే పర్యాటకులకు పసందునే కాదు, ప్రభుత్వానికి మంచి ఆదాయాన్నీ పంచుతుంది!

8548

More News

Featured Articles

Health Articles