రామ్‌గిరీ నహీ.. ఆరామ్‌గిరీ హై..!

Wed,November 18, 2015 11:29 AM

యే రామ్‌గిరీ నహీ.. ఆరామ్‌గిరీ హై..! తన ఆస్థాన పండితుడు షేక్ మొహియొద్దీన్ మాటలతో ఔరంగజేబు ఈ లోకంలోకి వచ్చాడు.. అప్పటిదాకా రెప్పవాల్చకుండా అక్కడి ప్రకతి రమణీయతను ఆస్వాదించడంలో తలమునకలైన ఆ మొఘల్ బాద్‌షా, ఒక్కసారిగా పండితుడి వైపు తిరిగి, బేషక్.. సహీ కహా..! అంటూ కితాబిచ్చాడు.. అంతటితో ఆగని చక్రవర్తి, మొహియుద్దీన్ కోరికమేరకు రామ్‌గిరీ పేరును అలనాడే ఆరామ్‌గిరీగా మార్చాడు.1656లో జరిగిన ఈ ఘటన తర్వాత మొఘలుల పరిపాలన కాలమంతా ఆరామ్‌గిరీగానే కొనసాగిన రామ్‌గిరీ, నేడు రామగిరిఖిల్లాగా వినతికెక్కి, పర్యావరణ ప్రేమికులు, సాహసయాత్రికుల స్వర్గధామంగా విలసిల్లుతోంది..!

కరీంనగర్‌జిల్లా కమాన్‌పూర్ మండలంలోని బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల గ్రామాల నడుమ విస్తరించిన రామగిరిఖిల్లా సుప్రసిద్ధ గిరిదుర్గం. శత్రుదుర్భేద్యమైన ఈ కోట, అరుదైన శిల్పకళ, ప్రకతి సోయగాలకు నెలవు. విశేష వనమూలికలు, అపార వక్ష సంపదకు నిలయం. ఆయుర్వేద వైద్యులు, వక్ష శాస్త్రవేత్తలు యేటా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తరలివచ్చి, తమకు కావాల్సిన మూలికలను సేకరించుకెళతారు. వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూడా బొటానికల్ టూర్ల పేరిట వచ్చి పరిశోధనలు సాగిస్తారు. చెట్టు-పుట్ట-గుట్టలతో కూడిన క్లిష్టమైన మార్గంలో పది కిలోమీటర్ల మేర సాగే రామ్‌గిరీ అధిరోహణ నిజంగా ఓ సాహసయాత్ర. శ్రావణమాసం ఇందుకు పూర్తి అనుకూలం. అందుకే ఆ 30 రోజులపాటు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు రామ్‌గిరిఖిల్లాను సందర్శించి, మూటగట్టుకెళ్లిన ఆ మధురానుభూతులను జీవితాంతం నెమరేసుకుంటారు.

చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రం..
మతసామరస్యానికి ప్రతీకగా ఉన్న రామగిరి ఖిల్లా, పటిష్ఠమైన రాతి కట్టడం. కోటగోడలు, బురుజులు, భవనాలు, సమాధులు, మసీదులు, బావులు, కొలనులతో నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. శ్రీరాముడు తన వనవాసంలో భాగంగా ఇక్కడ బస చేశాడని స్థానికుల నమ్మకం. ఇందులో భాగంగానే ఇక్కడ వెలసిన సీతారాముల ఆలయం, రామప్రతిష్ఠాపిత లింగం, శ్రీరామ పాదాలు, సీతమ్మ పాదాలు, సీతమ్మ కొలను భక్తులతో విశేష పూజలందుకుంటున్నాయి. దుర్గాంతర్భాగంలో కాకతీయప్రతాపరుద్రుడి ఆధ్వర్యంలో నిర్మించిన కోట, అశ్వశాల, దర్బారు, చెరసాల, గజశాల, భోజనశాలలు, రహస్యమార్గాలు, సొరంగాలు, తోపులు, ఫిరంగులు, ఫిరంగి గుండ్లు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఇంకా చిత్రకోట, తాటికోట, నిమ్మకోట, నగారాఖానా, మందుగదులు, తోపుబావి, నల్లకయ్యబావి, పసరుబావి, హరిబావి, అచ్చమ్మబావి, అమ్మగారి బావి, దేవస్థలాలు, సప్తద్వారాలు, చౌకీలు.. ఇలా ఎటు చూసినా లెక్కలేనన్ని ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాలతో రామగిరి సందర్శకుల మనసు దోచుకుంటోంది.

ప్రకతి రమణీయతకు నెలవు..
ఎత్తైనకొండల మీద పచ్చనిచెట్లతో అలరారే రామగిరిఖిల్లా ప్రకతి సోయగాలకు పుట్టినిల్లు. ఓ వైపు గోదావరి, మరోవైపు మానేరు నదుల గలగలలు.. అరుదైన వక్షాలు.. ముచ్చటగొలిపే తీగలు.. వాటికి రంగురంగుల పూలు.. అవి వెదజల్లే పరిమళాలు.. పక్షుల కిలకిలారావాలు.. సెలయేర్ల హొయలు.. చూసి తీరాల్సిందే తప్ప ఇలా ఎంత వర్ణించినా తక్కువే!

ఇదీ చరిత్ర..
శాతవాహనుల తొలిరాజధాని కోటిలింగాల... మరో నగరం ధూళికట్ట(ఈ రెండూ కరీంనగర్ జిల్లాలోని శాతవాహనుల స్థావరాలు)కు అత్యంత సమీపంలో ఉండడం వల్ల క్రీ.పూ.2వ శతాబ్దం నాటికే రామగిరి, శాతవాహనుల రహస్య స్థావరంగా ఉండి ఉంటుందని తెలంగాణ చరిత్రకారులు భావిస్తున్నారు. అప్పటి నుంచి వివిధ రాజవంశాలకు చెందిన రాజులు ఎవరికి తోచిన రీతిలో వారు కొండపై నిర్మాణాలు చేపడుతూ వచ్చారు. కళ్యాణి చాళుక్యుల కాలంలో నకీ.శ.973- క్రీ.శ.1189) ఓరుగల్లు కాకతీయ రెండో ప్రోలరాజు.. క్రీ.శ.1138లో మంథని గుండరాజు, రామగుండం ఏడరాజుపై దండెత్తగా, వారిద్దరూ రామగిరి దుర్గాన్ని రక్షణగా చేసుకొని యుద్ధం చేశారు. వీరిద్దరూ పరాజయంపాలవడంతో రామగిరి కాకతీయుల వశమైంది. అనంతరకాలంలో రేచర్ల పద్మనాయక రాజు అనపోతనాయకుడు దీనిని ఆక్రమించి, ముప్పభూపాలుడు అనే సామంతుడిని తన ప్రతినిధిగా నిలిపాడు. ఇతడు రామగిరి కేంద్రంగా రాజ్యపరిపాలన చేశాడు. క్రీ.శ. 1433లో బహమనీ సుల్తాన్ మొదటి అహ్మద్‌షా తెలంగాణపై దండెత్తడంతో రామగిరి దుర్గం అతని వశమైంది. కుతుబ్‌షాహీ వంశస్థాపకుడైన కులీకుతుబుల్ ముల్క్(1518-1543), బహమనీల ప్రతినిధి ఖివాముల్ ముల్క్‌ను ఓడించి రామగిరిని వశపరుచుకున్నాడు. క్రీ.శ.1656లో గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా ఔరంగజేబు రాజప్రతినిధి చేతిలో ఓడిపోయి, తన కుమార్తెను ఔరంగజేబు కొడుకుకు ఇచ్చి, కట్నం కింద రామగిరి కోటను అప్పగించాడు.

ఇలా వెళ్లాలి..
కరీంనగర్ నుంచి మంథని వెళ్లే మార్గంలో బేగంపేట క్రాస్‌రోడ్స్(నాగపెల్లి) వద్ద దిగి, ఆటోలో బేగంపేట గ్రామం చేరుకోవాలి. అక్కడి నుంచి సుమారు పది కిలోమీటర్లు కాలినడకన వెళ్తే గుట్టపైకి చేరుకోవచ్చు. నిజంగా ఇది ఒక అద్భుత సాహసయాత్ర. వద్ధులు, హద్రోగులు, పదేళ్లలోపు చిన్నారులు అస్సలు వెళ్లొద్దు. సరిపడా మంచినీరు, పండ్లు, పండ్ల రసాలు, బిస్కెట్ల లాంటి అల్పాహారంతో ఉదయమే బయలుదేరితే సాయంత్రం కల్లా తిరిగి క్రాస్‌రోడ్స్ చేరుకోవచ్చు. శ్రావణమాసంలో పర్యటించడం ఉత్తమం.

నిర్లక్ష్యపు నీడలో..
సీమాంధ్ర సర్కారు వివక్ష చారిత్రక రామగిరిఖిల్లాకు శాపంగా పరిణమించింది. ఏనాడూ నయాపైసా కేటాయించకపోవడంతో శిథిలావస్థకు చేరుకుని, కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. రాబోయే తెలంగాణ రాష్ట్రంలోనైనా కొత్తసర్కారు మేలుకొని, అభివద్ధి చేస్తే రామగిరి ఖిల్లా.. నిస్సందేహంగా దక్షిణ భారతదేశంలోకెల్లా గొప్ప పర్యాటక కేంద్రమవుతుంది.
చిల్ల మల్లేశం
ఫోటోలు: బండ సాయిశంకర్, బుర్ర తిరుపతి గౌడ్
టీ మీడియా, కరీంనగర్

8860

More News

Featured Articles

Health Articles