చూడాల్సిందే..తరించాల్సిందే... అమ్మపల్లి!

Tue,November 17, 2015 10:34 AM

హైదరాబాద్ అనగానే హెవీ ట్రాఫిక్...
కాంక్రీట్ జంగలే గుర్తొస్తాయి..
తరచి చూడాలేగానీ.. ఈ హైటెక్ నగరంలో హాయిగొల్పే సుందరప్రదేశాలు చాలానే ఉన్నాయి!
ఆహ్లాదానికి చిహ్నమైన పచ్చని చెట్లు..
ప్రశాంతతకు ప్రతీకైన ఆలయాలు
మనసును మైమరపిస్తాయి..
ఆధ్యాత్మిక చింతనకు చిగురు తొడుగుతాయి!
అలాంటి మూడు కోవెలలు కొలువైన ప్రదేశమే అమ్మపల్లి!
తీరికలేని పట్నవాసులను సేదతీర్చే ఆ పల్లెమీదే ఈ వారం డిస్కవరీ తెలంగాణ ఫోకస్...


templeఈ ఆలయాన్ని చూస్తే ఎక్కడో చూసినట్లు ఉందే అని ప్రతిఒక్కరికీ అనిపించకమానదు. ఎందుకంటే ఈ ఆలయం టీవీ సీరియళ్లలోనే కాదు, చాలా సినిమాల్లోనూ కనిపిస్తుంది. ఇక్కడ సినిమా తీస్తే హిట్టవుతుందనే నమ్మకం సినీ ప్రముఖుల్లో ఉందంటే ఈ ఆలయ గొప్పదనమేమిటో ఇట్టే అర్థమవుతోంది. మరి ఇంతటి ప్రాశస్థ్యమున్న ఆలయాన్ని ప్రతిఒక్కరూ చూసి తరించాల్సిందే! వెయ్యేళ్ల చరిత్ర, పురాతన కట్టడాలు.. గొప్ప శిల్పకళా సంపద ఈ ఆలయం సొంతం. పూర్వం శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యవాసం చేసినప్పుడు అలసిపోయి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని స్థల పురాణం చెబుతోంది. అరణ్యవాసం చేసిన సందర్భంలో రాముడికి ఆంజనేయుడు తారసపడలేదు. అందుకే ఈ ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించి ఉన్నాయి. 13వ శతాబ్దంలో వేంగిచాళుక్యల కాలంలో ఈ సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా మకరతోరణం, దశావతారంతో కూడిన ఆరేడు విగ్రహాలు అమ్మపల్లి దేవాలయంలో ఉండడం విశేషం. ఎక్కడైనా విగ్రహాలు రాగి, ఇత్తడితోదర్శనమిస్తాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా రాతితో తయారుచేసిన విగ్రహాలు కనిపిస్తాయి. స్థలపురాణంలో శ్రీరాముడు కుడిచేతిలో బాణం ధరించి ఉండడం వల్ల కోదండరాముడిగా పేరొందాడు. మండపంలో కూర్మావతార ప్రతిమ కూడా ఉంటుంది. ఉత్తర ముఖాన మునీశ్వరులు తపస్సు చేశారని గ్రామపెద్దలు చెబుతుంటారు. 2010లో పురావస్తు శాఖాధికారులు అమ్మపల్లి ఆలయాన్ని సందర్శించి దీనికెంతో ప్రాధాన్యం ఉందని, అవి పురాతన కట్టడాలని తేల్చి చెప్పారు. గోపురం, చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడి స్థల నిర్మాణంపై కూడా పరిశోధనలు చేశారు. మున్ముందు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత ఆధునీకరిస్తామన్నారు. ఎన్నో విగ్రహాలను తయారు చేసిన శిల్పులు కూడా ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి విగ్రహాలు వెయ్యి సంవత్సరాల కిందటివని గుర్తించారు. ఏకశిలతో విగ్రహాలు ఉండడం చాలా అరుదని వారు స్పష్టం చేశారు. అమ్మపల్లి ఆలయాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ కట్టడ నిర్మాణం నవాబులకాలంలోనే జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

సీన్... సెంటిమెంట్

templeఈ గుడికి రెండు నీటి గుండాలున్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతారు. ప్రతినెలా స్వామివారికి మాసకల్యాణం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు సత్యనారాయణమూర్తి, అన్వేష్‌శర్మ, శ్రీనివాస్ అయ్యంగార్ తెలిపారు. పునర్వసు నక్షత్రం రోజున కల్యాణం, పుట్టిన రోజు రావడం అరుదని, ఆ శుభదినం రాముడికి మాత్రమే ఉందని చెప్పారు. లోక కల్యాణార్థం ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహం్న 1గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయం భక్తులనే కాకుండా సినీప్రముఖులను ఆకట్టుకుంటోంది. ఈ గుడి సినిమావారికి ఓ సెంటిమెంట్‌గా మారింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. భారీ బడ్జెట్ సినిమాల కీలక సన్నివేషాలను ఇక్కడే చిత్రీకరిస్తుంటారు. అయితే ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నాటు బాంబులు పేలి ప్రహరీ కూలడంతో అప్పటినుంచి ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మందిరం సంరక్షణకు తగుచర్యలు తీసుకోవాలని స్థానికులు, గ్రామపెద్దలు అభ్యర్థిస్తున్నారు. ఆదాయం భారీగానే వస్తున్నా వసతులు కల్పించడం లేదని వాపోతున్నారు.

తెలంగాణ షిర్డీ.. ధర్మగిరి ఆలయం...

templeఎత్తైన ప్రదేశంలో నందీశ్వరుడు.. అందులో సాయినాథుడు.. అదే ధర్మగిరి ఆలయం. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపాన రెండుమూడు కిలోమీటర్లదూరంలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి సాయినాథుడు షిర్డీసాయినాథుడిని పోలి ఉంటాడు. కోవెల లోపలికి ప్రవేశించగానే ఆధ్యాత్మిక భావనలో మునిగిపోవాల్సిందే. ప్రదక్షిణలు చేస్తే కొత్త అనుభూతికి లోనుకావాల్సిందే! ధరణిమాత అనే సాయిబాబా భక్తురాలికి బాబా కలలో వచ్చి ఆలయాన్ని నిర్మించాలని సూచించడంతో శంషాబాద్ నుంచి మామిడిపల్లి వెళ్లే దారిలో ఆలయ నిర్మాణం జరిపిందని స్థానికుల కథనం. 1994లో అప్పటి మాజీ గవర్నర్ కష్ణకాంత్ దీన్ని ప్రారంభించాడు. నాటి నుంచి నేటీవరకు భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రముఖులు చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్ ఇలా ఎంతోమంది ఆలయాన్ని సందర్శించారు. ప్రతీ గురు, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహిస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే సాయినాథుడిగా భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. ధర్మం అనే త్రాసును ధరించడం వల్ల ధర్మగిరిగా పేరొందింది ఇది. ఇక్కడ పనిచేసే సిబ్బంది మొక్కుబడిగా కాకుండా పనినే దైవంగా భావించి ఆలయాభివద్ధికి పాటుపడుతున్నారు. ఆలయం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, అనాథలకు ఆశ్రమాలు, పిల్లలకు చదువులు చెప్పించడానికి కషి చేస్తామని కమిటీ మెంబర్ ధర్మసాయి పేర్కొన్నారు.

మహిమాన్వితం వెండికొండ సిద్ధేశ్వరాలయం

templeచుట్టూ పచ్చని ప్రకతి.. ఎత్తైన కొండలు.. ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను ఆకట్టుకుంటోంది వెండికొండ సిద్ధేశ్వరాలయం. ప్రతీ శివాలయానికి పైకప్పు ఉంటుంది. కానీ ఇక్కడ శివుడు పైకప్పు లేకుండా ఉంటాడు. వర్షాలు కురిసినప్పుడు సాక్షాత్తూ ఆ గంగే శివుడికి అభిషేకం చేస్తుందని భక్తులు పేర్కొంటుంటారు. పూర్వం శంషాబాద్ మండలంలోని పలు గ్రామాలు ప్లేగు వ్యాధి బారిన పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు వర్షాలు కూడా కురవకపోడంతో గ్రామస్తులు కరువుకాటకాలతో అల్లాడిపోయారు. ఆ సమయంలో సిద్ధులు అనే మహర్షి కాశీయాత్ర చేస్తున్నప్పుడు గ్రామస్తులు కొందరు ఆయన్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వెండికొండ గుట్టపై శివుడిని ప్రతిష్ఠించి పూజలు చేయమని సూచించాడట ఆయన. దీంతో గ్రామస్తులు శివుడిని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో రోగాలు నయమయ్యాయని, సకాలంలో వర్షాలు కురవడం మొదలయ్యాయని స్థల పురాణం. అప్పటినుంచి అలా వెండికొండమీద విరాజిల్లుతున్నాడు ఆ పరమశివుడు. ఎంతో మహిమ గల సిద్ధులగుట్టను భక్తులు నిత్యం దర్శిస్తుంటారు. దీంతో ఆ గ్రామంలో చాలామందికి సిద్ధులు అనే పేరు సెంటిమెంట్‌గా మారి అదే పేరును నామకరణం చేస్తుంటారు. ప్రతిఏటా శివరాత్రి ఉత్సవాలను కనులపండువగా నిర్వహిస్తుంటారు!

hitechcity
ఈ మూడు గుళ్లకు దారిలా...

హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ గుళ్లున్నాయి. నగరంలోని అఫ్జల్‌గంజ్ నుంచి 251 బస్సు ద్వారా శంషాబాద్ వెళ్లవచ్చు. మెహిదీపట్నం నుంచి ప్రైవేట్ వాహనాలు కూడా ఉంటాయి. శంషాబాద్ నుంచి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాలకు చేరుకోవచ్చు. షాద్‌నగర్ నుంచి 251 బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆటోల ద్వారా కూడా ఈ ఆలయాలకు వెళ్లొచ్చు.

9549

More News

Featured Articles

Health Articles