జలఝరి..బొగత జలపాత సవ్వళ్లు..

Wed,November 18, 2015 11:31 AM

గంగ సిగ విప్పి కురులు జారవిడిస్తే... జలపాతం!
మహోధతితో ఆమె శిరసునుంచి వీపుమీదుగా దూకి
నడుందాటాక నెమ్మదించి చెల్లాచెదురైన కేశాలు
ఒక్కటిగా చేరి.. ఎక్కడలేని ఒద్దికను తెచ్చుకొని శాంత ప్రవాహంలా మారి.. సాగిపోతున్నట్టుండే
ఆ దశ్యమే బొగత! కన్నార్పనివ్వని
ఆ నీటిసిరుల అందం దాని సొంతం!

తెలంగాణ జలభాగ్యం బొగత గురించే ఈ డిస్కవరీ...
ఖమ్మంజిల్లా, వాజేడు మండలంలోని బొగత.. ఖమ్మానికి 240 కిలోమీటర్లు. భద్రాచలం నుంచి 120కి.మీ., హైదరాబాద్‌కైతే 440 కిలోమీటర్ల దూరం. దీన్ని చేరుకునే ప్రయత్నంలో పదిహేను కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకతి సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు, ఆస్వాదించొచ్చు. ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. ప్రకతి సష్టించిన అద్భుతమైన అందాల్లో ఒకటి. ప్రచారానికి దూరంగా, కేవలం స్థానికులే సేదతీరే ప్రాంతంగా ఈ జలపాతం మిగిలిపోయింది. చుట్టూ కొండలు.. వాటిపై ఆదివాసీల ఆవాసాలు.
బొగత జలపాత సవ్వళ్లు. ఇవి తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ. ఆ ప్రశాంత వాతావరణాన్ని చేరుకోవడానికి కాలినడక తప్ప మరో మార్గంలేదు. ఖమ్మంజిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాజేడు మండలం కేంద్రానికి ఐదు కిలోమీటర్లు, చత్తీస్‌గఢ్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అత్యద్భుత బొగత జలపాతం. జూలై నుంచి నవంబర్ వరకు భారీగా నీటి దూకుడు కనిపిస్తుంది ఇక్కడ. కొండకోనలనుంచి జాలువారే నీటి పొంగు బొగత జలనిధిగా సాక్షాత్కరిస్తుంది. అక్కణ్నుంచి చీకుపల్లి వాగుగా మారి పొంగిపొర్లి అంతలోకే శాంతించిన ప్రవాహమై గోదావరిలో నిక్షిప్తమవుతుంది. వర్షాకాలంలో ఉధతి పెరిగినా ఏడాదికి 365 రోజులూ బొగత జలపాతం సడిచేస్తూనే ఉంటుంది.

నరసింహస్వామి పుణ్యక్షేత్రం..
బొగత జలపాతం వద్దనే నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ప్రతి అదివారం ఇక్కడికి వందలాదిమంది భక్తులు వస్తుంటారు. మామూలు రోజుల్లో విహారయాత్రికుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా సెలవుదినాల్లో రద్దీ ఎక్కువ. వివిధ దేవుళ్ల మాలలు ధరించిన భక్తులు ఈ నరసింహస్వామి సన్నిధిలోనే పూజలు చేసుకుంటారు. మహిమగల దేవుడిగా ఈ నరసింహస్వామి ప్రసిద్ధి. స్థానికుల కొంగు బంగారంగా కీర్తి గడించాడు. ఈ ప్రాంత ప్రజల పిక్నిక్ స్పాట్‌గా కూడా గుర్తింపు పొందిందీ ఆలయం. స్కూల్ విద్యార్థులు, ఉద్యోగుల నుంచి అధికారులు సైతం ఈ బొగత జలపాతాన్ని సందర్శించడానికి, నరసింహస్వామిని దర్శించుకోవడానికి క్యూ కడుతుంటారు. రోజంతా గడిపి పరవశించి పోతుంటారు.

వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్..
వర్షాకాలం వచ్చిందంటే బొగత జలపాతం ఉధతికి చీకుపల్లి కాజ్‌వే నీటిమయమవుతుంది. కాజ్‌వే చిన్నది కావడంతో కొన్ని దశాబ్దాలుగా ఇదే సమస్య. ఒక్కోసారి వారం, పదిరోజుల మొదలుకొని నెలరోజుల వరకు చీకుపల్లి కాజ్‌వేపై వరద ఉధతి తగ్గదు. ఆ వరద తగ్గనన్ని రోజులూ వాజేడు మండలంలోని సుమారు 30 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. చీకుపల్లి కాజ్‌వే మునిగినప్పుడున్న ఏకైక ప్రత్యామ్నాయం నాటుపడవలు. తెలంగాణలో ఇలాంటి అందాలు తెరమరుగుగా ఉండడానికి సీమాంధ్ర సర్కారే కారణమనుకోక తప్పదు. చీకుపల్లి కాజ్‌వే పై ఎత్తయిన వంతెన నిర్మించకపోవడంవల్లే ఈ తిప్పలు. ప్రపంచానికి బొగత పరిచయంకాకపోవడానికి కారణమూ అదే!

అభివద్ధికి ఆమడ దూరంలో బొగత..
బొగత జలపాతాన్ని అభివద్ధిపరచడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వాజేడు నుంచి చీకుపల్లి కాజ్‌వే మీదుగా చత్తీస్‌గఢ్ వెళ్లేందుకు తారు రోడ్డు ఉంది. చీకుపల్లి కాజ్‌వే ఒక కిలోమీటర్ దాటిన తరువాత బొగత జలపాతానికి పోయేందుకు రెండు కిలో మీటర్ల మేర డొంక దారే. ట్రాక్టర్లు, ఆటోలు అతికష్టమ్మీద వెళ్తుంటాయి. బొగత జలపాతం చూసేందుకు కుటుంబసమేతంగా వెళ్లే ఉన్నతాధికారులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీకావు. అయినా ఈ దారి అభివద్ధిపై వారు సైతం అశ్రద్ధ చూపిస్తున్నారు. బొగత అందాలను ఆస్వాదించి మురిసిపోవడమే తప్ప రోడ్డును అభివద్ధి చేద్దామన్న ఆలోచన ఇసుమంతైనా లేకపోవడం దౌర్భాగ్యమే. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వ వివక్షకి బొగత జలపాతం ఉదాహరణ. టూరిజం శాఖ దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించి పర్యాటకుల సౌకర్యార్థం కాటేజీ నిర్మాణం చేపడితే భవిష్యత్‌లో బొగత జలపాతం మినీ నయగరాగా వర్ధిల్లుతుందనడంలో సందేహంలేదు. భద్రాచలం, పర్ణశాల ప్రాంతాల్లో బొగత జలపాతం కటౌట్లను ఏర్పాటుచేస్తే ఇక్కడకు వచ్చే భక్తులు, పర్యాటకులు బొగత జలపాతాన్ని సందర్శించే ఆస్కారం ఉంటుంది.

గోదావరిపై బ్రిడ్జీ నిర్మాణ పనులు..
గోదావరి నదికి ఇవతల వాజేడు మండలం. అవతల వరంగల్ జిల్లా ఏటూరునాగారం. వాజేడు వద్ద గోదావరిపై బ్రిడ్జీనిర్మాణ పనులు పూర్తయితే వాజేడు, చర్ల, వెంకటాపురం మండలాల ప్రజలకు ఇక్కట్లు తొలగుతాయి. హైదరాబాద్, చత్తీస్‌గఢ్ వెళ్లేందుకు మార్గాలూ దగ్గరవుతాయి. వాజేడు నుంచి గోదావరి దాటితే ఏటూరునాగారం 15 కిలోమీటర్లే! అక్కణ్నుంచి హైదరాబాద్ 250 కిలోమీటర్లు మాత్రమే. ఇప్పుడున్న రూటు ప్రకారం వాజేడు, వెంకటాపురం, చర్ల మండలాల ప్రజలు భద్రాచలం, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లాలన్నా, హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు బొగత చేరుకోవాలన్నా 440 కిలోమీటర్ల ప్రయాణం చేయక తప్పదు.

బొగత జలపాతానికి వెళ్లేందుకు రూట్ ఇదీ..
హైదరాబాద్ నుంచి పర్యాటకులు రైలు, రోడ్డు మార్గం ద్వారా బొగత జలపాతానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం వరకు సౌకర్యం ఉంది. కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడు మండల కేంద్రానికి రోడ్డు మార్గాన చేరుకోవాలి. అక్కణ్ణుంచి 5కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్‌వే ఉంటుంది. అక్కడి నుంచి మరో కిలోమీటరు ముందుకు వెళ్లాలి. ఎడమవైపు తిరిగి రెండు కిలోమీటర్లు మట్టిరోడ్డున వెళ్తే అందాల బొగత దర్శనమిస్తుంది.

పొనుగోటి రవీందర్
టీ మీడియా ప్రతినిధి, ఖమ్మం
ఫోటోలు : గంట సర్వేశ్వర్‌రావు

12790

More News

Featured Articles

Health Articles