ఆదిలాబాద్‌ అడవుల్లో సప్తగుండాల జలపాతం!

Wed,November 18, 2015 11:25 AM

ఆకాశం అంచులనుంచి నేల ఒడిలోకి జారే ఒక్క జలపాతం చూస్తేనే... మనసు నిండుతుంది!
అలాంటిది ఏడు జలపాతాలు అక్కచెల్లైళ్లె చెంగుచెంగున దివినుంచి భువికి దూకుతుంటే ఆ సొగసు చూడతరమా!

ఆదిలాబాద్‌జిల్లా అడవుల్లో ఆ అందం కళ్లారా చూడొచ్చు..
మదినిండా నింపుకోవచ్చు.. జీవితానికి సరిపడా పరవశాన్ని పొందొచ్చు!
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ అడవుల్లో దాదాపు 20 కిలోమీటర్ల పొడవున దట్టమయిన అడవిలో ఉండే ఈ సప్తగుండాల జలపాతాలను వీక్షించాలంటే కాస్త సాహసం చేయకతప్పదు. సిర్పూర్(యు) మండలంలోని పిట్టగూడ దాటిన తరువాత అడవిబాటలో ఈ జలపాతాలున్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. తొలుత రామగుండం, భీమగుండం జలపాతాలవరకు కాలినడక వెళ్లొచ్చు. ఆ తరువాతి గుండాలను చూడాలంటే దట్టమైన అడవిలో గుట్టలు, రాళ్లు ఎక్కువగా ఉండే దారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఈ జలపాతాలకు ఎలాంటి పౌరాణిక నేపథ్యం లేదు. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.

ఏడు గుండాలు...
ప్రతిసంవత్సరం వర్షాకాలంలో సప్తగుండాల జలపాతాలు కనువిందుచేస్తాయి. రామగుండం, భీమగుండం, లక్ష్మణ గుండం, సీతా గుండం, సామగుండం, స్వాతి గుండం, సవతి గుండాలని పిలిచే ఏడు గుండాలున్నాయి. ఈ జలపాతాలు దాదాపుగా జనవరివరకు జాలువారుతూనే ఉంటాయి. ఈ గుండాల్లో తొలి రెండు గుండాలను అందరు చూసే అవకాశం ఉంది. రామగుండం జలపాతాన్ని పెద్దమిట్టె జలపాతమనికూడా అంటారు. దాదాపు 200 అడుగుల ఎత్తుపైనుంచి వర్షపునీరు కదంతొక్కుతూ పూర్తిగా నురగలా పారుతుంది. భీమ గుండంలోకూడా దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి నీరు పారుతుంది. ఈరెండు జలపాతాలవరకు పిల్లలుకూడా నడుస్తూ వెళ్లవచ్చు. లక్ష్మణ, సీతా, సామ జలపాతాలు సాధారణస్థాయిలో పారుతాయి. వీటివరకు కాలినడకన వెళ్లాలంటే కాస్త కష్టమే. వీటి తరువాత ఉండే స్వాతి, సవతి జలపాతాలను చూడడం అత్యంత క్లిష్టమని చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతారు.

saptagundalu

ఆదరణ కరువు...
ఆదిలాబాద్ ఏజెన్సీ అడవుల్లో ఉండే ఈ జలపాతాలు సుందరంగా ఉన్నప్పటికీ ఆదరణకు నోచుకోవడంలేదు. జన్నారం అటవీ రేంజ్ కిందకు వచ్చే ఈ జలపాతాలను అటవీశాఖవారుకూడా పట్టించుకోవడంలేదు. ఈ జలపాతాలవద్దకు వచ్చే పర్యాటకులకు కనీస ఏర్పాట్లుకూడాలేవు. జలపాతంవద్ద స్టాళ్ల ఏర్పాటుకూడా లేదు. జలపాతానికి వెళ్లే దారిని మెరుగుపర్చడంలేదు. జలపాతంవద్ద ప్రమాదాల నివారణచర్యలు, జాగ్రత్తబోర్డులూ ఏర్పాటు చేయలేదు. దీంతో పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పర్యాటకశాఖవారైనా ఈ జలపాతాలను తమ ఆధీనంలోకి తీసుకుని కనీస ఏర్పాట్లు చేయాల్సిన అవసరముందని జిల్లావాసులు కోరుతున్నారు.

ఇలా వెళ్లాలి...
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంనుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్పూర్ (యు) మండలకేంద్రం వరకు ఆర్టీసీ బస్సులుంటాయి. అక్కడినుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిట్టగూడవరకు ఆటోలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి. అక్కడినుంచి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. తొలుత మూడుకిలోమీటర్ల దూరంలో రామగుండం జలపాతం వస్తుంది. మరో కిలోమీటర్ దూరంలో భీమగుండం జలపాతం, ఇలా ప్రతి కిలోమీటర్ దూరంలో ఒక్కో జలపాతం వస్తుంది. సామ జలపాతంవరకు కాలినడకన వెళ్లచ్చు. ఆతరువాత వచ్చే స్వాతి, సవతి జలపాతాలు మాత్రం నడవడం కష్టం. కొండలదారిగుండా 15 కిలోమీటర్ల దూరంవరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ దారిని కాస్త పునరుధ్ధరిస్తే పర్యాటకులు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది.

- నూకల దేవేందర్, టీ మీడియా ప్రతినిధి, ఆదిలాబాద్
ఫోటోలు: ఆత్మరాం, సిర్పూర్ (యు)

11316

More News

Featured Articles

Health Articles