D/O. ప్లవంగాచారి

Sun,March 19, 2017 01:12 AM

కూతురు రాంరెడ్డి, 9000415353
610 జీవో అమలు కోసం ఉద్యోగుల సర్వీసు పుస్తకంలో నమోదు చేసిన స్థానికత నిర్ధారణకు స్కూలు స్టడీ సర్టిఫికేట్లు అర్జెంటర్జెంటని పరుగులు పెట్టించిండు మా ఎక్సైజ్ సూపరింటెండెంటు. తెలంగాణ పది జిల్లాల ఉద్యోగులందరికీ అత్యవసరమైంది. ప్రభుత్వం విధించిన గడువులోగా ప్రతీ ఉద్యోగి అది తప్పనిసరిగా సమర్పించి తీరాలి.

storyఉదయం 6 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నుండి బయలుదేరిన నా ఊరు.. నా ఊరు 37 ఏళ్ళ నా ఉద్యోగ ప్రస్థానంలో నా తల్లి ఊరును దర్శించుకున్న సందర్భాలు కొన్నిసార్లు మాత్రమే. కానీ చదువుల ఒడిగా బడిని మాత్రం అవకాశం చిక్కక అనేకంటే అలక్ష్యం చేశాననే ఒక భావన నా మనసుకు సురకంటిస్తుండేది.
ఇప్పటికి తప్పని పరిస్థితిలో నేను చదువుకున్న బడిలో అడుగు పెట్టబోతున్నందుకు తనువు పులకించింది. 1 నుండి 10వ తరగతి మెట్లు అధిరోహించిన నిండిపోతుంది. ఉదయం కాబట్టి నా ఊరికి ప్రయాణ సమయం రెండు గంటలలోపే.
మడికొండ దాటినంక ఛాయ తాగుదమా సార్.. డ్రైవరు శ్రీను.

అశుభ్రత అనుమానంతో నాకు తాగాలని మనసొప్పలేదు. కానీ డ్రైవరుకు కాస్త నిద్రమత్తున్నా ప్రమాదమని సరేనన్నాను.
రోడ్డు పక్కనున్న తోపుడుబండి దగ్గర ఆపిండు జీపును. బండి మీద బొగ్గుల పొయ్యిమీద ఇత్తడి గిన్నెలో ఛాయ మసల్తుంటే కమ్మటి వాసన బండి చుట్టూ వ్యాపిస్తుంది. శ్రీను బండి దగ్గరికి వోయి ఏదో మాట్లాడి నా దగ్గరికి వచ్చి సార్.. ఇలాయిచీ ఛాయనా, లంసా చాయనా అనడిగిండు.
బండి చుట్టు నలుగురైదుగురు కూలీలు పారలు, గడ్డపారలు వట్టుకొని బీడీలు, సిగరెట్లు దాక్కుంట ముచ్చట్లలో మునిగిపోయిండ్రు. శ్రీను అడిగిన దానికి సమాధానంగా బండి దిక్కు జూసిన. కొన్ని చిట్టి గాజు గిలాసలు, కొన్ని డిస్పోజేబుల్ గిలాసలు కనబడుతున్నాయి. తాగిచ్చిన గాజు గిలాసలను బండి యజమాని భార్య కావచ్చు వేడినీటి బక్కెట్టులో వేసి బాగా కడుగుతుంది. శుభ్రత, ఆరోగ్య సూత్రాలు ఆమెకు బాగా వంటబట్టినట్టున్నాయి. ఆమె చిత్తశుద్ధికి ముచ్చటపడి మనసులోనే మెచ్చుకున్న శ్రీనూ.. గాజు గిలాజల అల్లం, ఇలాయి ఛాయ, పేపర్ గిలాసల లంసా టీ ఆర్డరేశిన. నా అంతరంగ ఇష్టాన్ని అర్ధం చేసుకున్న అతడు సంబరంతో సంకలెగరేసుకుంట పోయి మరో నిమిషంలో రెండు ఛాయగ్లాసులు పట్టుకొనొచ్చిండు. ఛాయలు తాగాక జీపు బయలుదేరింది. కండ్లు మూసుకుని గతంలోకి వెళ్ళిన చిన్నప్పటి విషయాలు ఎన్నెన్నో యాదికచ్చినయి.

కానిగీ బడి... బట్టు పంతులు.. ఎక్కాలు, సుమతి, దాశరథి, వేమన శతకాలు, శతకపద్యాలు కట్టెపలుక, దానికి పెట్టే గట్టి, బలుపం, గోడకుర్చీ, ఈతబరిగె వాయింపులు.. ఇత్యాది దేహశుద్ధి జరిగితే గాని, చదువు వంటబట్టదని నమ్మే అమాయకపు కాలమది. పంతులు దండనను ప్రశ్నించే, ఖండించే ధైర్యం ఎవరికీ లేని రోజులు..
తర్వాత సర్కారు బడి ప్రార్థన తర్వాత స్కూలు గేటు దగ్గర అరగంట సేపుండి కొట్టకుండా బెత్తెంతో బెదిరించిన హెడ్మాస్టరు చక్రపాణి సారు, బడి అయిపోయినంక క్రమం తప్పకుండ ఆటలాడించిన డ్రిల్లు సారు యాకయ్య అట్లాగే అటెండరు మైబెల్లి మరీ మరీ మదిలో మెదిలిండ్రు. ఎందుకంటే పరీక్షలప్పుడు సైక్లో స్టయిలు తీసిన ప్రశ్నాపత్రం అవశేషాలు కంటబడకుండా స్కూలు వెనుక కాలబెట్టేవాడు మైబెల్లి. అవి కొన్ని కాలి, కొన్ని కాలక ఉండిపోతే మేం దోస్తులం కొందరం దొంగల్లెక్కపోయి వాటిని పదిలంగా, చితికిపోకుండా చూస్తే చూచాయగా కొన్ని ప్రశ్నలు తెలిసేవి. మమ్మల్ని గమనించిన మయిబ్బెలి పాపం..! పిల్లలు పోనీయని దయదలచి ఏమీ అనకుండ చూసీ చూడనట్టుండేటోడు. మేం చేసిన పని తప్పని తెలిసినా దయాగుణంతో ఏయ్! పిల్లలూ మల్లా ఇటుదిక్కొస్తే మీపేర్లు పెత్సారుకు చెప్పి వంద భస్కీలు తీపిత్త..! ఇక్కన్నుంచి పోండ్రి జప్పన! అని సున్నితంగా బెదిరించేటోడు. నెత్తిపై తెల్లటి జాలిటోపి, తెల్లటి గడ్డం, తెల్లటి లాల్చీ పైజామా, తెల్లటి సిప్పర్లు ఎప్పుడూ ధరించే మైబ్బెల్లి మాకు అల్లా లెక్క కనబడేటోడు.
సార్ హుజూరాబాద్ వచ్చింది. ఎటు దిక్కు బోవాలె సార్..?డ్రైవరు శ్రీను మాటలతో కనులపై మూసుకొన్న రెప్పలు విచ్చుకున్నయి. చూస్తే బస్టాండు సమీపాన గల నాలుగురోడ్ల కూడలి మధ్యనున్న అంబేడ్కర్ విగ్రహం సమీపాన జీపు ఆగి ఉంది.
ఇంకొద్ది ముందుకు పోనీ..

నెమ్మదిగా పోతుంది జీపు.. శ్రీను, గిటు.. అన్నాను ప్రభుత్వ వసతి గృహం, కుడిదిక్కు సబ్‌కోర్టు మధ్యనున్న తారురోడ్డు వైపు చూపిస్తూ.
తొమ్మిది కిలో మీటర్ల దూరం.. ఇంకొద్ది సేపట్ల నా ఊరు చేరుకుంట. ఊరి పోలిమేర దాటినంక హరిజనవాడ స్వాగతం పలుకుతుంది. దాని తర్వాత ఇంటిముందో వాకిట్లల్ల కల్లుకుండలతోని గౌండ్లవాడ, హనుమాండ్లగుడి, గుడి పక్కన మసీదు.. కోమట్ల వాడ.. ముచ్చటయిన మూడు తొవ్వల పక్కన తీరొక్క సరుకు దొరికే పుల్లూరోల్ల పెద్దదుకాణం.. ఇంక అక్కడి నుండి స్కూలు వరకు పద్మశాలి, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి అరొక్క కులాల కలగలిపిన ఇండ్లు మనసుల మెదిలినయి. అట్లాగే ముఖ్యంగా నా జిగ్రీదోస్త్ అవుసుల ప్లవంగాచారిని చూడాలని మనసు ఆరాటపడింది.
జీపు ఊర్లోకడుగు పెట్టినంక మెల్లగా పోనిమ్మన్న, కుడి ఎడమలను నిశితంగా పరిశీలిస్తున్న. ఊహకందని విధంగా అన్నీ మారిపోయినయి. రోజుకు రొండు ట్రిప్పులు కొట్టే అశోకా బస్ సర్వీసు, పరుగులు కనుమరుగై దాని స్థానంలో లెక్కకు మించి ఆర్‌టీసీ బస్సులు, జీపులు, ఆటోలు పరుగులు తీస్తున్నయి. ఇంక మోటార్ సైకిల్లయితే లెక్కేలేదు.
ఎదురు చూస్తున్న నా చదువులమ్మ గుడి సమీపానికి చేరుకున్న, అప్పటికి సరిగ్గా సమయం 9 గంటలు స్కూలు పరిసరాలన్నీ మారిపోయినయి.
స్కూలు ముందు జీపు ఆగింది. అప్పుడే జనగణమనప్రారంభమయింది. జీపు దిగి అటెన్షన్లో నిలబడ్డ. పిల్లల ఏకాగ్రతకు భంగం కలగకూడదని ప్రార్ధనయిపోయి పిల్లలందరూ క్లాసుల్లోకి పోయినంక స్కూలు ఆవరణలోకి అడుగు పెట్టిన. పావన పుడమి తాకిడికి ఆపాదమస్తకం పులకించి పోయింది. మనసు సరస్వతీ దేవి మళ్ళీ నన్ను ఆశీర్వాద హస్తంతో ఆహ్వానించిన అనుభూతి నరనరాన హంసధ్వని రాగ తరంగాల తీపి పరుగుల ఆనందం.

ఆశ్చర్యం..! అప్పటి ఆటస్థలం లేదు! దాంట్లో జూనియర్ కళాశాల కట్టారు. ఆ కారణంగా అప్పుడెంతో విశాలమైన స్కూలు చిన్నగా కనబడింది.
నా ఆగమనాన్ని గమనించి హెచ్.ఎం. గారు నన్ను సాదరంగా ఆహ్వానించి తన పేరు ఆంజనేయులు అని పరిచయం చేసుకున్నడు. నేను నా గురించి చెప్పి వచ్చిన పని గురించి వివరించిన.
చెబుతుండగా హెచ్.ఎం. గారికి అంతా అర్థమయింది.. ఇది చాలా పాత హై స్కూలు.. మీక్కూడా తెలుసు.. ఊరి.. మన ఊరి చుట్టు పక్కల పది గ్రామాలకు ఇదే పెద్ద స్కూలు. ఈ స్కూలులో చదివిన విద్యార్థులు ఎంతో మంది మేధావులయ్యారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ రంగాలలో ఈ దేశంలోనే కాక వివిధ దేశాలలో స్థిరపడి సేవలందిస్తున్నారు. ఇది నా ఊరు కాకపోయినా నాకెంతో గర్వంగా ఉంది. ఈ మాట లెందుకంటున్నానంటే నేను హెచ్.ఎం.గా ఈ ఊరికొచ్చి మూడేళ్ళవుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది వచ్చి మీలాగానే నా చేతుల మీదుగా స్టడీ సర్టిఫికేట్లు తీసుకెళ్తున్నారు. నాకదెంతో గర్వంగా, ఆనందంగా ఉంది అంటూ తన కుడి పక్కనున్న పెద్ద స్టీలు అల్మారా తలుపులు తెరచి లావుపాటి వెడల్పయిన రిజిస్టరొకటి బయటికి తీసాడు. నా పుట్టిన తేది అడిగి పుటలు తిరిగేసిండు. అడ్మిషన్ తేదీ అడిగితే యాదికి లేదన్న. ఓపిగ్గా పేజీలు తిరిగేసి నాపేరు చూసి దొరికింది సార్..! అడ్మిషన్ సీరియల్ నంబర్ చెప్పి రిజిష్టర్ నా ముందుంచాడు హెచ్‌ఎం.

పసితనంలో అందులో నమోదయిన నా పేరు చూసుకొని చెప్పలేనంత ఆనందపడిపోయిన. కనులు మరింత పెద్దగ చేసి కాసేపు చూస్తుండిపోయిన. ఎప్పటి నుండి ఏ క్లాసు వరకు చదువుకున్నది చివరిగా హెచ్‌ఎస్‌సి తర్వాత టీసీ తీసుకున్న వివరాలన్నీ అందులో పొందుపరచి ఉన్నయి. నా పేరు తర్వాత చూసిన. ప్లవంగాచారి పేరు ఉంది.
క్లర్కుతో చెప్పి స్టడీ సర్టిఫికేట్లు తయారు చేయించి ఆకుపచ్చ ఇంకు పెన్నుతో సంతకం పెట్టి చిరు నవ్వుతో నా చేతికందించిండు. పెద్దసారు మోములోకి ధన్యవాదపూర్వకంగా చూసి సర్టిఫికేటు అందుకొని మెరిసే కన్నులతో మనసారా చూసుకుని థాంక్స్ చెప్పి లేచాను.
జీపెక్కి తిరిగి వస్తుండగా నా చిన్నప్పుడు జిగ్రీ దోస్త్ ప్లవంగాచారి మరోసారి మదిలో మెదిలిండు. స్కూలుకు దగ్గరే వాళ్లిల్లు. డ్రైవరుకు చెప్పి అటు దిక్కు పోనీమన్న.
ఇన్నేళ్ల తర్వాత చూస్తే ఊరు రూపురేఖలు చాలా మారిపోయినయి. నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా కనపబడిన ఊరు, వాడలు, ఇప్పుడు చిన్నగా కనబడుతున్నయి. దుమ్ము రేగే మట్టిల ఇరుకు తొవ్వలు తారుతో నిగనిగలాడే విశాలమైన రహదారులైనయి. గూనపెంకలిండ్లు సిమెంటు భవనాలయినయి.
ప్లవంగాచారి ఇంటి ఆనవాలు గుర్తించి జీపు దిగి అటు ఇటు చూసి ఓ పెద్దాయన్ని అడిగిన. కళ్ళమీదున్న ఆయన బూతద్దాలను సవరించుకొని నన్ను ఆపాదమస్తకం చూసి, ఆలోచించి, ఆలోచించి, ఓ.. గాయినె అవుసుల నర్సిమ్మశారి కొడుకు ప్లవంగచారి గురించేనా నువ్వడిగింది అనడిగిండు.
అవును.. గురించే.. అన్న.
పెద్దాయన కుడిచేతిని జెగ్గూపినట్లు ఊపి తర్వాత చెయ్యిని పైకి కిందికి ఆడించి అయ్యో..! వాల్ల నాయిన కాలం జేశినంక సదువు బందుజేసిండుగదా.. బంగారం పనిరాక ఇల్లమ్ముకొని పిల్లల్తోని పట్నంబోయిండు గదా..! గాయిన గురించి గింత అడుగుతాన్నవ్.. అని ఇంకేదో అడుగుతుండగా జీపెక్కిన.
ప్లవంగాచారి... ఆరో తరగతి నుండి నాకు దోస్తయిండు. అటు స్కూలు అడ్మిషన్ రిజిష్టరులో ఇటు అటెండెన్సు రిజిష్టరులో నా పేరు తర్వాత తన పేరు ఉండడంతో ప్లవంగాచారితో నా స్నేహం బాగా ముడివడి పోయింది. ప్రతి తరగతి గదిలో ఒకటే బేంచి. వాళ్ల నాయిన స్వర్ణకారుడు. మా బాపు వ్యవసాయదారుడు. తూటు పైసలు పోయి నయా పైసలు వస్తున్నకాలం. పైస దొరకాలంటే పడరాని కష్టాలు పడేవారు. ఛాయ్ కోసం పూల్, ఛాయపత్తీ పొట్లం, బట్టలు ఉతుకుటకు నీల్‌కాట్ సబ్బు కొనుడే గగనమయ్యేది. చిరుతిండి తినాలని బుద్ది పుడితే గిలాసెడు బియ్యం దీసుకొని చంద రామలింగం దుకాణానికి వోయిసరికి సరి పుట్నాలు దెచ్చుకొనేటోల్లం. బియ్యపన్నంతో తింటే సామాన్యుడు ఎరగాలు పంట ఎర్ర బియ్యపన్నం, జొన్నగట్క తినెటోల్లు.

ప్లవంగాచారి పొట్టిగా, దిట్టంగా ఉండెటోడు. కబడ్డీ ఆటలో కూతకు పోయిండంటే కనీసం ఒక్క పాయింట్‌నైనా కూతకు పోతే మాత్రం అతికష్టం మీద డెడ్‌లైనును కుడికాలు బొటనవేలుతో ముట్టిచ్చుకొని పనైపోయినట్టు పరుగెత్తుకొచ్చేవాడిని. కానీ మా కోర్టులోకి కూతకచ్చిన వాడిని అదును చూసి వాడి కాలో, చెయ్యో పట్టి గట్టిగా నా దిక్కు లాక్కునేటోన్ని. నా ఉడుంపట్టు నుంచి వాడు బయటపడలేక కూత ఆపేవాడు. టోర్నమెంటుల్లో నేను, ప్లవంగాచారి లేకపోతే కబడ్డీ ఆటే లేదు. పరీక్షలముందు వాళ్లింట్లనో మా ఇంట్లనో వారం రోజులు రాత్రి 10 గంటల వరకు సదువుకునేటోల్లం.

తులం బంగారం ధర 150 రూపాయలు ఉన్నరోజులవి (1970). ఆస్తిపాస్తులేమీ లేని ప్లవంగాచారి తండ్రి నర్సింహాచారి బంగారం పనిలోనే కుటుంబాన్ని పోషించేటోడు. ఆయనకు ఇద్దరు తమ్ములు, వారు కూడా అదే పని. ఆ మూడు కుటుంబాలకు పెండ్లిల్ల సీజన్లలోనే పని. ఆ 150 రూపాయలు పెట్టి తులం బంగారం కొనాలంటే జొన్నలో, వడ్లో అధిక మొత్తంలో అమ్మవలసి వచ్చేది.
హెచ్‌ఎస్‌సి కొచ్చినంక బోర్డు ఎగ్జామినేషన్ ఫీజు కట్టలేని పరిస్థితిలో నా వేలికున్న గురిజెత్తు బంగారు ఉంగరం వాళ్ళనాయినకిచ్చి కబడ్డీ ఆటలో పోయిందని మా బాపుకు అబద్ధం చెప్పిన.
అయ్యా..! బంగారం పని చేసుకుని పొట్టపోసుకునే మాకు నీ బంగారమిచ్చి నా కొడుకు బంగారు భవిష్యత్తుకు బాటవేసిన నీకు దండాలయ్యా..! నీ ఋణం తీర్చుకోలేను.. కానీ నా కొడుకు ప్లవంగం తప్పక తీర్చుకుంటాడయ్యా..! అంటూ నీళ్లునిండిన కళ్ళతో నాకు దండంపెట్టిండు నర్సింహాచారి.

నా కండ్లల్ల కూడా గిర్రున నీళ్లు తిరిగినయి. ఇగ నువ్వు తప్పకుండ ప్లవంగాచారికి పరీక్ష ఫీజుకట్టు.. బాగా చదివి పరీక్షలు రాసి పాసయితం..
హుజురాబాద్ సెంటర్లో హెచ్‌ఎస్‌సి పరీక్ష రాసినం. ఏ క్లాసయితేనేం మొత్తానికి ఇద్దరం థర్డ్‌క్లాసులో పాసయినం. ఫేలయిన కొంతమందిని పోల్చుకొని సంబరపడ్డం.. ఇంకేం ఆ కాలంలో హెచ్‌ఎస్‌సి పాసవుడే గ్రేట్.! విద్యార్థి దశకు ఫులుస్టాప్ పెట్టినం. ఇక ఉద్యోగం.. చేతికందగానే కరీంనగర్ ఎంప్లాయ్‌మెంటు ఆఫీసుకు పోయి ఇద్దరం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, నౌకర్ల కోసం.
అగో.. (1969) ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యింది. నేను ప్లవంగాచారి ఇంక ముందు చదివేదిలేదు. స్వేచ్ఛా పక్షులమైపోయినం. టిక్కెట్టు తీసుకోకుండా తెలంగాణ అటు కరీంనగర్ ఇటు హన్మకొండకు పుక్యానికొచ్చిందిగదా అని తిప్పలయినా తిండిలేకుండ తిరిగినం. సంబరంతో నిండిన మనసు సద్దికూడును గూడ మరిసి పొద్దన్నట్టు మేమిద్దరమే కాదు.. బస్సులో ఎవర్ని చూసినా గదే మాట, గదే పాట.. ఎక్కడబడితే అక్కడ పొట్టి కాకి నెక్కర్లేసుకున్న కానిస్టేబుల్లు కీశిపెట్టలూది బస్సులనాపడం.. తర్వాత పొడుగులాగు అమీన్‌సాబ్‌లు వచ్చి బస్సుకు బస్సు సమీప పోలీసు స్టేషనుకు తీసుకపోయి ఘాటయిన మాటల తూటాలతో, లాఠీ దెబ్బలు తగిలించి ఏవో పేపర్లలో సంతకాలు తీసుకొని పంపించేవారు.
ఉద్యమం చల్లబడలేదు. ఇంకా ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో నాకు వ్యవసాయశాఖలో ఉద్యోగం దొరికింది, అదీ జగిత్యాలలో..
కొద్ది రోజులకి ప్లవంగాచారి నాయిన కాలం చేశాడనీ ఉన్న ఇల్లు అమ్ముకొని బతుకుదెరువు కోసం ఊరు విడిచిపోయినట్టు తెలిసింది..

మరో మూడు మాసాల్లో రిటైరవుతాననగా నాకు చికెన్ గున్యా వచ్చింది. జ్వరం, తీవ్రంగా కాళ్ళనొప్పులు. తాగే నీటిగ్లాసు ఎత్తలేనంతగా చేతివేళ్లు నొప్పితో బలహీనపడిపోయి, డ్యూటికీ 10 రోజులు సెలవుపెట్టి హైదరాబాదు ఇంటిలోనే ఉండిపోయిన.
జ్వరం తగ్గుముఖం పట్టినంక ముక్కుతూ మూల్గుతూ హన్మకొండ మా హెడ్ ఆఫీసుకుపోయి రిపోర్టు చేసిన. ఆఫీసులో పెన్షన్ పేపర్ల వ్యవహారం చూసుకునే సరికి సాయంత్రమైంది. ఆటో పట్టుకొని స్టేషనుకొచ్చిన.
ఖాజీపేట రైల్వే స్టేషన్ ఎప్పట్లెక్క రద్దీగానే ఉన్నది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎప్పుడూ వచ్చినిలిచే ప్లాట్‌ఫాం-2 ఫుల్లు జనమున్నది.
5.15కు రావలసిన రైలు అరగంట ఆలస్యమని అనౌన్సు జేసిండ్రు. అంతకంతకు రద్దీ పెరిగిపోతాంది. మరో పదినిమిషాలు ఆలస్యం కొసరేసుకొని బండి వచ్చింది. అతికష్టం మీద పెట్టెలో దూరిన. ఒంటికాలుమీద నిలబడ్డానికే చోటులేనప్పుడు ఇంక సీటెక్కడ దొరుకుతుంది? కిటికీ పక్కనున్న రెండుసీట్ల మధ్య నిలుచున్న. సీట్లలో ఒకదిక్కు అమ్మాయి, మరొదిక్కు పెద్దమ్మ కూచుని ఉంది. బలహీనంగా ఉన్న కాళ్లతో నిలుచోవడం కష్టంగా ఉండి కిటికీ ఊచలు ఆసరాగా తీసుకున్న. జనగాం స్టేషన్ సమీపిస్తుండగా సీట్లో కూచున్న అమ్మాయి నా అవస్త గమనించి జాలిపడి. రండంకుల్ ఇలా కూచోండి.. జరిగి కాస్త చోటిచ్చింది.
వద్దమ్మా.. ఇబ్బంది పడతాం.. అన్న.

పెద్దవారు ఏదో ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు.. కూచోండి.. సీట్లోంచి లేచింది.
దయాగుణం నిండిన అమ్మాయి ఆదరణ కాదనక ధన్యవాదం తెలిపి కూచున్నాను.
ప్రాబ్లం ఏంటంకుల్? అమ్మాయి.
చికెన్ గున్యా వచ్చిందమ్మా! చాలా వరకు తగ్గింది గానీ కాళ్ళలో బలం లేదు.. చాలా ఇబ్బందిగా ఉంది
అప్పటికి రైలు ఆలేరు సమీపించి అవుటరులో అయిదు నిమిషాలాగింది. అమ్మాయి అదేపనిగా నా మొహంలోకి చూస్తూ ఏదో ఆలోచనలో పడిపోయినట్టనిపించింది.
బండి కదిలి స్టేషన్లో ఆగింది.. అంకుల్.. అంకుల్.. ఇక్కడి చాయ్ చాలా బాగుంటుంది.. ఆలేరు స్టేషను చాయ తాగని ఎంప్లాయ్ ఉండరు అంకుల్.. అమ్మాయి అంటుండగా కిటికీలో నుండి చాయ్‌వాలా రెండు చాయ గ్లాసులందించిండు. అమ్మాయి చెప్పినట్లు చాయబాగుంది. నా గురించి పరిచయం చేసుకున్న. అమ్మాయి ఫిజియోథెరపిస్టునని చెప్పింది. బండి కదిలింది. మాటల్లో సికింద్రాబాద్ స్టేషన్ రానే వచ్చింది.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నరు. ఔటర్‌లో ఆగకుండా మెల్లగా పాకుతున్న పాములా సాగిపోయి 10 నంబరు ప్లాట్ ఫాంపై ఆగింది. అమ్మాయి చేతి సాయంతో పెట్టెలోంచి దిగి మెల్లెమెల్లెగా మెట్లవరకు చేరుకున్న. అతి కష్టంతో నాలుగైదు మెట్లు ఎక్కానో లేదో కళ్ళు తిరిగి పడిపోయిన. స్పృహ తప్పిన తర్వాతేమయిందో నాకే తెలువది.
స్పృహలోకి వచ్చి కళ్ళు తెరచి చూస్తే ఆకుపచ్చ పరదా పక్కనున్న బల్లపై పడుకొని ఉన్న.. పరిచయమైన అమ్మాయి.. రెండు కాళ్ళను ఏదో తైలంతో మర్దన చేస్తాంది.. అయ్యో! ఏందమ్మా ఇది..! నాకేమైంది..!? నెనిక్కడెందుకున్న!? నా కాళ్లెందుకట్టా వత్తుతున్నవు..! ఆశ్చర్యంతో లేచి కూర్చొని పరిసరాల్ని పరిశీలించిన..
స్టేషన్లో పడిపోయారంకుల్.. ఎవరూ పట్టించుకోలేదు.. నాకెందుకో మిమ్మల్ని అలాంటి పరిస్థితిలో వదిలిపెట్టి రావడానికి మనసొప్పలేదంకుల్..
చాలా థాంక్సమ్మా..! నీ రుణం తీర్చుకోలేనమ్మా..!

తెలిసిన విద్య కాబట్టి మీకీ మాత్రం సేవ చేయగలిగాను. ఇక మీరు ఓకే..! మీ దగ్గరున్న టాబ్లెట్స్ మాత్రం వేసుకోండి అంకుల్..
సరేనమ్మా...! ఇక నేను వెళ్తా..
అమ్మో! ఇప్పుడు పది దాటింది. ఇంతరాత్రప్పుడు మీరు ఒంటరిగా..!
ఫర్వాలేదమ్మా.. దగ్గరేగా.. మా వాళ్లు నా కోసం ఎదురుచూస్తరు.. వెళ్తానులే.. అంటూ నా జేబులో ఉన్న టాబ్లెట్లు వేసుకున్న.
అమ్మాయి తెచ్చిచ్చిన గ్లాసులోని నీళ్ళు తాగి థాంక్స్ చెప్పి బయటకొచ్చిన.


వారం రోజులు గడిచినయి. డాక్టర్లను సంప్రదించి ఎన్ని మందులు వాడినా జ్వరం పూర్తిగా తగ్గిందిగానీ కాళ్ళు, చేతులు బలహీనత తగ్గలేదు. అడుగు తీసి అడుగు వేస్తే పడిపోతానేమోనన్న భయం. ఒక్క చేతితో నీళ్లగ్లాసు లేపలేక పోతున్న. మరేదైనా కొత్త జబ్బేమోనన్న భయంతో మళ్లీ డాక్టర్ను సంప్రదిస్తే అన్ని పరీక్షలు చేసి భయపడాల్సిన కొత్త జబ్బేమి లేదుగానీ కాళ్ళు చేతులు బలపడడానికి కొంత సమయం పడుతుందనీ, అప్పటివరకు ఫిజియోథెరపీ తప్పనిసరి అని చెప్పాడు.
ఫిజియోథెరపీ అనేసరికి రైల్లో పరిచయమైన అమ్మాయి జ్ఞాపకం వచ్చింది. ఎక్కడికో వెళ్ళడం ఎందుకని అక్కడికే వెళ్ళాను.
ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఉన్నా గంటన్నర రెండు గంటలు రెండుమూడో తైలాలతో కాళ్ళు చేతులేకాక వెన్నెముకకు కూడా మర్దన చేసేసరికి మూడు రోజుల్లో 80% నొప్పులు మాయమైపోయినయి. హాయిగా ఉంది. చక్కగా నడవగలిగాను.

అమ్మాయి చాలా ఓపికస్తురాలు. ఎప్పుడూ చిరునవ్వుతో పలుకరిస్తూ చేసే పనిపై చిత్తశుద్ధి చూపుతుంది. వరుసగా మూడు రోజులయ్యే సరికి చాలా సన్నిహితురాలయింది. మనసు విప్పి మాట్లాడింది. ఆమె భర్త సోషల్ వెల్ఫేర్‌లో సీనియర్ అసిస్టెంటుగా ఆదిలాబాదులో పనిచేస్తున్నాడనీ పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని చెప్పింది.
నాలుగో రోజు ఫిజియోథెరపీ అయిన తర్వాత చూడమ్మా.. ఫీజు ఇస్తానంటే తీసుకోకుండా తర్వాత తీసుకుంటానంటున్నావ్.. మనసొప్పుత లేదు, కొంతయినా తీసుకో.. అంటూ పర్సు తీసిన.
వద్దంకుల్.. మిమ్మల్ని ఒక్కటడుగాలను కుంటున్నాను. మిమ్మల్ని చూస్తే ఎక్కడో చూసినట్లు, మీరు మా కుటుంబానికి అతి సన్నిహితుల్లెక్క అనిపిస్తుంది.
మానాన్న ఉన్నప్పుడు ఒక ఫొటోలో ఆయన పక్కనున్న వ్యక్తిని చూపిస్తూ.. ఈయన సాయం లేకపోతే నేనింతటివాడ్ని కాకపోయేది.. ఋణం ఎలా తీర్చుకోవాలో ఏమో..!? అంటూ బాధపడేవాడు..

అలాగా అమ్మా..! ఎవరో ఆ ధర్మాత్ముడు..
చూపిస్తానుండంకుల్.. అని లోపలికి వెళ్లి ఫొటో ఒకటి పట్టుకొచ్చి ఇతనే అంకుల్!
ఆ ఫొటో దిక్కు తదేకంగా పరిశీలించిన. సంభ్రమాశ్చర్యాలతో దృశ్యాదృశ్యంగా కనబడుతున్న ఫొటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులను కళ్లింతచేసి మరింత పరిశీలించి చూసిన.. తరగతిలో ఉన్నప్పుడు హుజూరాబాద్‌లో ప్లవంగాచారి, నేను కలిసి దిగిన ఫొటో అది.
ఈయన.. ఈయన మానాన్న అంకుల్..! తన తండ్రి ఫొటోపై చూపుడు వేలు పెట్టి.
అంబరాన్ని అంటిన ఆనందంతో దోస్తు... మేరా దోస్తును మళ్ల కలుసుకున్నట్టు అనిపించింది.
ఆయన పక్కన్న ఉన్నది.. నేనేనమ్మా..! మెరిసే కళ్లతో అటు అమ్మాయిని ఇటు ఫొటోను చూస్తుండిపోయిన.

1342
Tags

More News

మరిన్ని వార్తలు...