భగ్నహృదయాల మేడ - వికార్ మంజిల్


Sun,June 5, 2016 12:30 AM

shaharnama
ప్రేమకోసం తాజ్‌మహల్ వెలిసింది. ఒక ప్రియుడు, తన ప్రియురాలికి ఇచ్చిన ప్రేమ కానుకగా హైద్రాబాద్ నగరం అవతరించింది. అసలు హైద్రాబాదే ఒక ప్రేమనగరం. కొడుకుమీద ప్రేమతో ఒక ముసలి తండ్రి నిర్మించిన వంతెన పురానాపూల్. తన ముస్లిం భార్యమీద ప్రేమతో ఒక ఆంగ్లేయుడు కట్టించిన భవనమే కోఠిలోని రెసిడెన్సీ. ప్రస్తుతం ఇది ఉమెన్స్ కాలేజీగా చెలామణి అవుతోంది. ఒక ముస్లిం ప్రేమికుడు తన ఫార్సీ భార్యకోసం కట్టించిన మహల్ వికార్ మంజిల్. అతను ఎవరో కాదు ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాత వికారుల్ ఉమ్రా. ఈ ప్రేమలన్నీ విభిన్న మతాల మధ్యన సామరస్యతకు సంకేతాలుగా నిలిచాయి.

మనం నెక్లెస్ రోడ్‌లో జలవిహార్ దాటి సంజీవయ్య పార్కు వైపు వెళుతుంటే ఎడమ వైపు రైలు లైను వెనుక ఒక పెద్ద బంగళా కనబడుతుంది. అదే వికార్ మంజిల్. ఆ ఏరియా బేగంపేట్ ప్రకాశ్‌నగర్ వెనుకభాగం కిందికి వస్తుంది. శిథిలావస్థలో, నిర్మానుశ్యంగా, ఒంటరిగా బిక్కుబిక్కుమని నిల్చున్న ఆ వికార్ మంజిల్ ఒక బూత్ బంగ్లాగా ఇప్పుడు కనబడుతుంది గాని, ఒకప్పుడు వైభవోజ్వలంగా వెలిగిన మహల్. తర్వాత కాలంలో అదొక విషాదకావ్యంగా ఒంటరొంటరిగా మిగిలిపోయింది.
వికారుల్ ఉమ్రా మంచి వయస్సులో చేసుకున్న రెండు పెళ్లిళ్లు కూడా పెద్దలు నిర్ణయించినవే. అందులో ఒకామె నవాబు చెల్లెలు. నిఖాకు ముందు వీరి ముఖాలైనా అతను చూడలేదు. చివరికి జీవితం చరమదశలో ఒక ఫార్సీ చిన్నదాని ప్రేమలో చిక్కుకున్నాడు.

ముజే ఫూచే బినా దిల్ మే ఆనే లగే
మీఠీ నజ్రోంకీ బిజిలీ గిరానే లగే.
ముంబైలో జరిగిన ఒక విందులో ఆ విద్యుల్లత అతనికి తటిల్లున తారసపడింది. ఆమెది కూడా హైద్రాబాద్ నగరమే. పేరు గులాబీ. ఆమె వికాజీ అనే ఒక ఉన్నత ఫార్సీ కుటుంబానికి చెందిన స్త్రీ. వారిద్దరూ కలుసుకునే నాటికే ఆమె హైద్రాబాద్ నగరంలో డాక్టరుగా పనిచేస్తోంది. అదేగాక ఆమెకు వంశపారంపర్యంగా లభించిన ఆస్తి బోలెడు ఉంది. ప్రథమ వీక్షణంలోనే వారిద్దరూ ఒకరినొకరు మనసుల్ని దోచుకున్నారు. నిఖా జరిగాక గులాబీ ఇస్లాం మతం స్వీకరించి నూర్జహాన్‌గా పేరు మార్చుకుంది. తన వైద్యవృత్తిని పూర్తిగా వదిలి పర్దాను పాటించి ఇంటికే పరిమితమయ్యింది.
వికారుల్ ఉమ్రా కార్యదర్శి పేరు రజాక్ అలీబేగ్. ఇతను కూడా ఉన్నత వంశీకుడు. ధనిక కుటుంబానికి చెందినవాడు. ఇతను ఒక ఎత్తయిన కొండ ప్రాంతంలో అందమైన భవనాన్ని నిర్మించసాగాడు. ఆ ఖర్చు తలకు మించిన భారమైంది. ఇంకా సగం పని కూడా పూర్తి కాలేదు. ఆ భవనం ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉండటం వల్ల నిర్మాణానికి అవసరమైన నీళ్లు పైకి ఎక్కించటం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. చారానా ముర్గీకో బారానా మసాలా అన్నట్లయ్యింది. ఏం చేయాలో దిక్కుతోచలేదు. బాగా ఆలోచించగా చివరికి ఒక చిట్కా దొరికింది.

ఒక పండు వెన్నెల, పున్నమి రాత్రి వికారుల్ ఉమ్రాను ఆ అసంపూర్తి భవనంలోనే విందుకు ఆహాన్వించాడు. గానా బజానాలతో, ధావత్ ధూమ్ ధాంగా జోరుగా హుషారుగా కొనసాగుతోంది. అతిథి ఆ అందమైన వాతావరణానికి పరవశించి ముగ్ధుడైపోయాడు.
ఎదురుగా హుస్సేన్‌సాగర్... దాని అలల మీద నుండి వీస్తున్న శీతల పవనాలు. గాలి కూడా సడిచేయని ప్రశాంతమైన ప్రకృతి. ఆకాశం పందిరి కింద కొలువు తీరిన కొత్త భవనం. అట్లాంటి సరైన సమయంలో సరైన బాణాన్ని వదిలాడు రజాక్ అలీ బేగ్.

నవాబ్‌సాబ్... ఈ మహల్ మీ కోసమే నిర్మించాను. దయచేసి దీనిని నా నజరానాగా స్వీకరించండి.
బహుత్ ఖూబ్. కాని, ఉచితంగా తీసుకోవటం ధర్మం కాదు అని, అప్పటి వరకు అయిన ఖర్చు అణా పైసలతో సహా ఖరీదు చేసి ఆ అసంపూర్తి భవనాన్ని అన్ని సౌకర్యాలతో ఆధునీకరించి దానికి వికార్ మంజిల్ అని నామకరణం చేసి తన ముద్దుల భార్య నూర్జహాన్‌కు ప్రేమ కానుకగా సమర్పించాడు. అక్కడ ప్రతి రాత్రి రాత్ పూలోంకీ, బాత్ పూలోంకీలా గుభాళించింది.
ఆమె నయన శయనాగారంలో వారిద్దరూ రెండు వసంతాలు రెండు క్షణాలుగా జీవించి 1902లో వికారుల్ ఉమ్రా హఠాత్తుగా అల్లాకు ప్రియమైనాడు. అతని మరణానంతరం ఆమె తన ప్రాణం పట్ల కీడును శంకించి పనిమనిషి వేషంలో కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీకి పారిపోయి వారి ఆశ్రయంలో తలదాచుకుంది. ఆమె నివసించిన వికార్ మంజిల్‌లోని గదులకు వికారుల్ ఉమ్రా రెండవ భార్య తాళం వేసింది. ఆస్తికోసం భార్యల మధ్య తగాదాలు జరిగాయి. ఉమ్రా రెండవ భార్య 5వ నిజాంకు కూతురు, 6వ నిజాంకు చెల్లెలు. తన స్వార్థం కోసం ఎవర్నైనా హత్య చేసే మొగలుల రక్తం ఆమెలో ప్రవహిస్తూ ఉండేది. తనకు ఇష్టం లేని వారిని ఆమె సులువుగా పరలోకానికి పంపిస్తుందని కథలు వినబడుతుండేవి. ఒక పనిమనిషిని ఆమె రహస్యంగా చంపించిందని అందరూ అనుకునేవారు. ఈ నేపథ్యంలో ఆ ఫార్సీ యువతి ప్రాణభయంతో గిజిగిజలాడినప్పటికీ తమ ప్రేమ నిలయమైన వికార్ మంజిల్‌కోసం పోరాటం ఆపలేదు.
పది సంవత్సరాల చట్ట పోరాటం చేసి కోర్టు ద్వారా విజయం సాధించిన నూర్జహాన్ వికార్ మంజిల్‌కు తిరిగి వచ్చింది. అప్పటికే ఆ గదులలోని విలువైన వస్తువులన్నీ మాయమైనాయి. ఆమె ప్రాణప్రదంగా పెంచుకున్న పూలతోట కూడా ధ్వంసం చేయబడింది. వికార్ మంజిల్‌లోని ఆమె కలల ప్రపంచం కుప్పకూలిపోయింది.

జ్ఞాపకాల గాయాలు ఆమెను బాధిస్తుంటే ఆమె ఆ వికార్ మంజిల్‌ను వదిలేసి ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారి దర్గ్ హీ దర్ద్ కా దవా హై అన్నట్లు 30 సంవత్సరాలు అక్కడే గడిపింది. కాలక్షేపం కోసం అనేక చిత్రాలు వేసేది. చివరికి 1931లో నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించగా ఆమె ఆ వ్యాధిసోకి మరణించింది.
మధురమైన జీవితాల కథ ఇంతేనా అన్నట్లు ఆ వికార్ మంజిల్ ఒంటరిగా మిగిలిపోయి దయ్యాల మేడగా మారిపోయింది. రాత్రుళ్లు అందులో ఫార్సీ దయ్యం తిరుగుతుందని ఇప్పటికీ బేగంపేట ప్రకాశ్‌నగర్ ప్రజలు నమ్ముతారు. దరిదాపు లేని అనంతమైన ఇసుక ఎడారిలో కాళ్లు విరిగిన ఒంటరి ఒంటెలా ఆ మహలు పాడుబడి పోయి గబ్బిలాలకు నిలయమైంది.
అన్నట్టు, నేటి వికారాబాద్ ఒకప్పుడు వికారుల్ ఉమ్రా స్వంత జాగీరు ప్రాంతం. అందుకే ఆ జాగీరుకు వికారాబాద్ అని పేరు వచ్చింది. అక్కడి అనంతగిరి మలయమారుతాలు చాలా ఆరోగ్యకరమైనవి. నైజాం కాలంలోనే అక్కడ టి.బి. శానిటోరియం ఏర్పడింది. కాళోజీ ఒకప్పుడు అక్కడ కొద్దిరోజులున్నాడు. వికారాబాద్ కీ హవా ఏక్ లాఖ్ కీ దవా అన్న సామెత అందరికీ తెలిసిందే. చరిత్ర పునరావృతం అన్నట్లు ఎర్రగడ్డ టి.బి. దవాఖానాను మళ్లీ అక్కడికే తరలించాలన్న ఆలోచన కూడా ఉంది.
మరి, మీకు వీలైతే ఎప్పుడన్నా నెక్లెస్‌రోడ్డుకు వెళ్ళి రైలు కట్టకు అవతల కనబడే వికార్ మంజిల్‌ను చూసి వికారుల్ ఉమ్రాను, ఆ ఫార్సీ యువతిని క్షణకాలం జ్ఞాపకం చేసుకోండి.
ఆషిక్ మర్‌తే నహీఁ
వో జిందా దఫ్నాయే జాతేహైఁ
కబర్ ఖోద్‌కర్ దేఖో
వో ఇంతెజార్‌మే రహతే హైఁ.
ప్రేమికులు మరణించరు
వారిని సజీవంగా సమాధి చేస్తారు
సమాధి తవ్వి చూడండి
వారొకరి కోసం మరొకరు నిరీక్షిస్తునే ఉంటారు.

పరవస్తు లోకేశ్వర్, 91606 80847

1507
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles