దెయ్యాలను చూడాలనుందా?!


Sun,September 15, 2019 01:02 AM

గ్రహాలపై ఇళ్లు కట్టడానికి స్థలాలు కూడా కొంటున్న ఈ రోజుల్లో.. దెయ్యాలు, భూతాలు ఏంటి బాస్ అని కొట్టిపారేస్తున్నారా? ఆత్మలున్నాయని, అవి మన మధ్యే తిరుగుతున్నాయని, పాడుబడ్డ బంగ్లాలు, ఇళ్లలో తిష్ట వేశాయని.. చెప్పే మాటలను కాకమ్మ కథలుగా నిరూపించాలనుకుంటున్నారా? అయితే మీకో అవకాశం. మీకు దెయ్యాలని చూపించి, వీలైతే వాటితో ముచ్చటించే ఏర్పాట్లు చేశారు. మీరు ఆత్మలను చూడడానికి సిద్ధమేనా?
GHOST
అదొక అందమైన కల. తన ప్రేయసితో కలిసి ఏకాంతంగా గడుపుతున్నట్లు కలగంటున్నాడు సందీప్.. ఆ కలలో లీనమైన సందీప్‌కు ఇంట్లో కరెంట్ పోయినట్లు అనిపించింది. కిటికీ తెరిచి చూస్తే జోరుగా గాలివాన కురుస్తుంది. టపటపా కొట్టుకుంటున్న కిటికీలు మూసేసి, మళ్లీ నిద్రకు ఉపక్రమించాడు. ఈసారి వెంటనే నిద్రపట్టింది. మళ్లీ తన ప్రేయసి ఊహల్లోకి వెళ్లిపోయాడు. అలా గాఢనిద్రలోకి జారుకున్న సందీప్‌కు ఎవరో దుప్పటి లాగేసినట్లు అనిపించింది. ఆపై ఎవరో తనపైకి వస్తున్నట్లు తెలుస్తున్నది. తన మీదపడి గొంతు పిసుకుతున్నట్లు అనిపిస్తున్నది. గట్టిగా అరవాలనుకుంటున్నాడు కానీ.. గొంతు పెగలడం లేదు. కాళ్లతో తన్నుతూ, చేతులు ఊపుతున్నాడు కానీ.. సందీప్‌కే దెబ్బ తగులుతుంది. తన ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. ఎవరైనా కాపాడాలని కేకలు వేస్తున్నాడు. గొంతులోంచి మూలుగులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎలాంటి ఫలితం లేదు. చివరిగా తన బలాన్నంత కూడగట్టుకొని.. తన గొంతు పిసుకుతున్న వ్యక్తిని నెట్టివేశాడు. దిగ్గున లేచి ఒక్కసారిగా కళ్లు తెరిచి చూశాడు. చుట్టూ అంధకారం. తన ఫోన్‌లో టార్చ్ ఆన్ చేసి చూశాడు. ఎవ్వరూ లేరు. డోరు, కిటికీలు లాక్ చేసే ఉన్నాయి.

బెడ్ దిగి వెళ్లి, కిటికీలు తీశాడు. లోఓల్టేజ్‌లో వీధి దీపం.. వెలగలేక, ఆరిపోలేక కొట్టుమిట్టాడుతుంది. టైం చూస్తే.. అర్ధరాత్రి ఒంటిగంటైంది. అంతకు ముందురోజే తల్లిదండ్రులు ఊరెళ్లారు. ఆ ఘటన తలుచుకుంటే భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. దెబ్బకు నిద్రమొత్తం తేలిపోయింది. వాన చప్పుడు తగ్గుతున్న కొద్దీ.. ఎక్కడో గజ్జెల శబ్దం సందీప్‌కు వినిపిస్తుంది. ఆ శబ్దానికి అతని గుండె లయ తప్పింది. లబ్ డబ్..లబ్‌డబ్ అంటూ కొట్టుకోవాల్సిన గుండెలో.. ఘల్‌ఘల్.. ఘల్ ఘల్ శబ్దాలు వినిపిస్తున్నాయి. కొంచెం ధైర్యం చేసి.. రాత్రంతా జాగారం చేశాడు సందీప్. ఇలాంటి సందర్భాలు కొంతమందికి నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. సందీప్‌లా.. తమకు దెయ్యం పట్టిందని కొందరంటుంటే.. కాదు స్లీప్ పెరాలసీస్ అని అంటుంటారు మరికొంతమంది. దీంతో నమ్మకం లేక ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టిస్తుంటారు. అయితే.. సందీప్‌లాంటి అనుభవమే మీకూ కావాలా? మీరూ దెయ్యాలను చూడాలనుకుంటున్నారా? ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు కొందరు. ఏకంగా వెబ్‌సైట్ల ద్వారా ఓ తేదీని బుక్ చేసుకొని పాడుబడ్డ బంగ్లాలు, జైళ్లు, ఇళ్లలో ఓ రాత్రి దెయ్యాలతో గడిపే అవకాశం ఇస్తున్నారు.

ఈనెల 16న గ్లౌసెస్టర్‌షైర్‌లో..

అది.. ఇంగ్లండ్ దేశంలోని గ్లౌసెస్టర్‌షైర్‌లోని వోటన్ అండర్ ఎడ్జ్ గ్రామం. ఇందులో ది ఎనిసెంట్ రామ్ ఇన్ అని ఓ పాడుబడ్డ చర్చీ ఉన్నది. ఇది సెయింట్ మేరీ కోసం కట్టిన మొదటి చర్చి. ఇక్కడ 1500వ సంవత్సరంలో ఓ మంత్రగత్తెను కాల్చివేశారు. అప్పటి నుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతుందనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికీ ఆ ఆత్మ అక్కడే ఉన్నదట. ఆత్మలే లేవని వాదించేవారు.. అక్కడికి వెళ్లి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. మరికొంతమంది ఒక్క రాత్రి కూడా గడపలేక అర్ధరాత్రే పారిపోయిన సందర్భాలూ ఉన్నాయట. ఆ చర్చీలోని ది విచ్ రూమ్ అనే గదిలో ఆ ఆత్మ ఉందని నమ్ముతున్నారు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే www.bitnparanormal.co.uk అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ చర్చిలో ఒక రాత్రి గడిపేందుకు ఓ తేదీని బుక్ చేసుకోవచ్చు. బంప్ ఇన్ ది నైట్ పారానార్మల్ యూకే వెబ్‌సైట్ ఈనెల 16న ది ఎనిసెంట్ రామ్ ఇన్ చర్చిలో ఓ రాత్రి గడిపేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఇందుకోసం మీరు 30 యూరోలు (రూ.2,632) చెల్లించాలి.

ghost-of-the-highway

ఆత్మలను చూడాలనుకుంటే..

మీకు ఆత్మలు ఉన్నాయని నమ్మకం ఉన్నా, లేకపోయినా.. వాటిని చూడాలనుకుంటే www.bitnpara normal.co.uk అనే వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సిందే. ఆత్మలను చూసేందుకు ఇష్టపడే వ్యక్తులు, సందర్శకుల కోసం ఈ వెబ్‌సైట్ ప్రపంచవ్యాప్తంగా దెయ్యాలు తిరిగే ప్రదేశాల్లో ప్రవేశం కల్పిస్తున్నది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే.. ఘోస్ట్ హంట్ అనే విభాగంలో మరిన్ని వివరాలు ఉంటాయి. ఎక్కడెక్కడ భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి? బస ఏర్పాట్లు? చెల్లించాల్సిన మొత్తం వివరాలు కనిపిస్తాయి. మీకు అనుకూలమైన రోజులో మీకు నచ్చిన ప్రదేశాన్ని బుక్ చేసుకుంటే, అక్కడ ఒక రాత్రి గడిపేందుకు అవకాశం కల్పిస్తారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6.30 వరకూ గడపవచ్చు. అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా? శబ్దాలు, కనిపించే ఆకారాల వెనుక దాగిన మిస్టరీని ఛేదించే ఆసక్తి ఉంటే మీరు కూడా ఓ ప్రయత్నం చేయండి.

షరతులు వర్తిస్తాయి..

బంప్ ఇన్ ది నైట్ పారానార్మల్ యుకె ద్వారా దెయ్యాలు ఉండే ప్రదేశాలకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా షరతులు పాటించాలి. 18 ఏళ్లలోపు వారికి ప్రవేశం లేదు. ఆనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు, గర్భిణులకు, మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ అలవాటు ఉన్నవారికి అనుమతి లేదు. ఔత్సాహికులకు బీమా సదుపాయం కూడా ఉన్నది. నిర్వాహకుల అనుమతితోనే కెమెరాలు తీసుకెళ్లాలి. ఆ వీడియోలను అనుమతి లేకుండా ప్రదర్శించకూడదు. మరింకెందుకు ఆలస్యం.. మీకు ధైర్యం ఉంటే ఓసారి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్.

ది ఎనిసెంట్ రామ్ ఇన్ చర్చి

ANCIENT-RAM-INN

525
Tags

More News

VIRAL NEWS