చిచ్చ


Sun,September 8, 2019 02:21 AM

Katha
“రాయాలి. ఏదో ఒకటి రాయాలె. ఏదో ఒకటెందుకు? అదేదో మంచిదే రాయాలె. ఆ బద్రీ, కిట్టూ దమ్‌ దమ్‌ జేస్తున్నరు రాయన్నా” అని. కాని ఏం రాయాలె? అసలు రాయొత్తదా? నాకైతే నమ్మకం లేదు. కాని ఒకటే ఎంబడి బడుతున్నరు. వాళ్లకు నామీద గురి ఎక్కువనే ఉన్నట్టుంది. లేకుంటె గింతగనం అడుగుతరా? వాళ్లకోసమన్న ట్రై చెయ్యాలె...
“ఓయ్‌ బండాపు” అందరు పోయేటైంకు వస్తున్నడు ఈడెవర్రా అన్నట్టు సెక్రటేరియట్‌ చెక్‌ పాయింట్‌ ముందు పోలీసాయన. మనిషిని బండి మీదనే ఉన్నగని మనసు మాత్రం బండి మీదలేదు. పోలీసన్న మాటలిన్నంక సోయిలకొచ్చిన. హెల్మెట్‌ తీసిన. మూతికి కట్టుకున్న కర్చీఫ్‌ ఇప్పిన. ఎనకజేబుల నుంచి పర్సు తీసిన. ఈ జీవితంల సాధించిన అతి పెద్ద విజయం అక్రిడేషన్‌ కార్డ్‌ సూయించిన.

“సరే సార్‌. వెళ్లండి” వినసొంపైన ఫ్రెండ్లీ పోలీసింగ్‌. అక్రిడేషన్‌ కార్డును పర్సుల పెట్టిన. ల్యాప్‌ టాప్‌ బ్యాగు ముందు జేబుల ఆ పర్సును సొర్రగొట్టిన. ఆ సీనుగాడు అక్రిడేషన్‌ కార్డిప్పించి పుణ్యం కట్టుకున్నడు. లేకుంటే ఈ సెక్రటేరియట్‌ లోపల్కి రానీకి ఎన్ని తిప్పలు పడేదో అనుకుంట బండి చాల్‌ జేసిన. గాచారం బాలేదు అన్నట్టు నడ్పుకోరా అని ప్రదీప్‌ గాడిచ్చిన యూనికాన్‌ బండి స్టార్ట్‌ గాలే. కిక్‌ కొట్టి చూసిన. సుయ్‌ లేదు బుయ్‌ లేదు. ఇగ్నిషన్‌ సౌండ్‌ కూడా రాలె. దీనమ్మ జీవితం. ఇంజన్‌ బోర్కొచ్చింది. “పదివేలియ్యన్న పంచకళ్యాణి లెక్క ఉర్కిపిత్త నీ బండిని” అన్నడు మెకానిక్‌ పరమేశ్‌. “జర్రాగు! ఎలక్షన్‌ సీజన్‌ల రెండు, మూడు డాక్యుమెంటరీలన్న పట్టనీ, కొత్త బండే తీత్త” అన్న. వాడేమనుకున్నడో ఏమోగని, బండి మాత్రం నారాజ్‌ అయినట్టుంది. అప్పటి సంది దినంల రెండు మూడు సార్లయిన సతాయిస్తున్నది. ఓ పదినిమిషాలు పక్కకు ఆపితే మంత్రం ఏసినట్టు స్టార్ట్‌ అయితున్నది. కాని ఇప్పుడు పక్కకు వెట్టెంత టైం లేదు. కరెక్ట్‌ ఆరింటికి ఉండాలన్నడు వినయ్‌. ఆరున్నరకు ఏదో మీటింగ్‌ ఉందట. ఐదు నిమిషాలల్ల వినయ్‌ని దొరకబట్టాలె. అందుకే చెక్‌ పాయింట్‌ కాడ్నించి నూక్కుంట తెచ్చి పబ్లిసిటీ సెల్‌ ముందు బండి పార్క్‌ జేసిన.
జెప్పన డీ బ్లాక్‌ల సొచ్చిన. చిన్నప్పుడు మా అవ్వ “నీకు గవర్నమెంట్‌ సొమ్ము బాకుందిరా” అనేది. నా కిస్మత్‌ మా అమ్మ చెప్పినట్టే ఉంటే గిదే డీ బ్లాక్‌ల ఏదో ఒక మంత్రి కాడ పీఆర్‌ఓ అయితుండె. డాక్యుమెంటరీల కోసం గిట్ల ఆళ్లఈళ్ల పొంటి తిర్గకపోయేది.

“ఏం హీరో! గావర గావర ఏడికిపోతున్నవ్‌” ఎదురుంగ శ్రీకాంత్‌. మినిస్టర్‌ పీఆర్‌ఓ. ఏడ కనబడ్డ “ఏం హీరో” అంటడు. నిజం చెప్పాలంటె మనోడే హీరో లెక్కుంటడు. మా జర్నలిజం ట్రైనీ బ్యాచ్‌ల మనోడే మన్మథుడు. శ్రీకాంత్‌ ఏదో మాట్లాడుతున్నడు. కాని నేను మాత్రం వినయ్‌ ఉంటడో? ఎటన్న పోతడో అనే ఆలోచిస్తున్న. “సరేలే ఏదో పనిమీద పోతున్నట్టున్నవ్‌. కింద టెన్నిస్‌ ఆడనీకి పోతున్న. నీ పని కాంగనే రా. ఓ గేమ్‌ ఆడదాం” అని చెప్పి శ్రీకాంత్‌ ఎల్లిపోయిండు. శ్రీకాంత్‌ది ఒకప్పుడు మా జిల్లానే. కాని ఇప్పుడది పక్క జిల్లా అయింది. శ్రీకాంత్‌ పోతున్న దిక్కు చూసిన. రాజొస్తున్నడు. బతికిచ్చినవ్‌ రా అయ్య అనుకున్న.
“ఏమన్నా గింత లేటా” ఆడి నుంచే మొత్తుకుంటున్నడు వినయ్‌. “ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ మొత్తం జాం అయింది వినయ్‌” అన్న. “సరే సరే రా” అని పేషీలకు తోల్కపోయిండు. కూసోబెట్టిండు. అటెంటర్ను పిలిచిండు. “అన్నా! గ్రీన్‌ టీ తాగుతవా? ఛాయ్‌ తెప్పియ్యమంటవా?” అని నన్నడిగిండు. అటెంటర్‌ ముఖం మాడింది. ‘నీ అవ్వ ఆరయితాంది. ఇంటికి పోయే టైంల గిప్పుడు ఛాయ్‌ అంటరేంది’ అన్నట్టు సూస్తున్నడు. నేనే షర్తుకు ఛాయ్‌ గ్రీన్‌ టీ అన్న. అటెండర్‌ బయటకుపోయిండు. వినయ్‌ కుర్సీ ముందుకు జరుపుకున్నడు.

“ఏం లేదన్న. ఇంతకుముందే సార్‌కు చెప్పిన. ఓ రెండు మూడు వీడియోలు చేపిచ్చుకుందమని. నువ్వు వాట్పాప్‌ల పంపిన వీడియోలు గూడ సూయించిన. సరే అన్నడు. అబ్బర బిడ్డ పనైందిరా అనుకున్న”. ఇంతల్నే వినయ్‌. “అయితే చిన్న లిటిగేషన్‌ ఉందన్న. ముందు నువ్వు ఓ వీడియో చేసీ. అది మంచిగుంటే ఇంకోటి. రెండింటికీ కలిపి పైసలిస్తం”’ వినయ్‌ చెప్తనే ఉన్నడు. ఆళ్ల మినిస్టర్‌ లెక్క ఈనె గూడ మాటల్తోనే కడుపు నింపుతున్నడు. నాకే ఇనబుద్ది కాలే. ఒక్కమాట గూడ మాట్లాడకుండ ఆడ్నించి బయటకొచ్చిన. వినయ్‌ పిలుస్తున్నడు గని ఇనిపించుకోలే. మెట్లు దిగిన. బండి కాడికొచ్చిన. ఫోన్‌ రింగ్‌ అయింది. ‘సౌమ్య.’ ఎత్తాల్నా? వద్దా? అని జర్రసేపు ఆలోచించిన. ఎందుకన్న మంచిదని అటూ ఇటూ జూసిన. ఎందుకుంటే ఒక్కోసారి ఈ పిల్ల దగ్గర్లనే ఉండి ఫోన్‌ జేత్తది. అప్పుడుగని లేపకుంటే బొండిక్కాయ పిసికినంత పన్జేస్తది. అందుకే ఎందుకొచ్చిన తిప్పలనుకుని ఫోన్‌ ఎత్తిన. ఇంగ చాల్‌ జేసింది.
“ఏమైంది. ఏం మాట్లాడకుండ లేశొచ్చినవట. పిలుస్తున్నా ఇనిపించుకోలేదట. వినయ్‌ నాకు ఫోన్‌ చేసిండు. ‘ఏమైంది మేడం.మంచోడన్నరు. గంత ఫకర్‌ ఉంటే ఎట్ల. కనీసం నేను చెప్పేదన్న ఇనలేదన్నడు’. పిచ్చిలేశిందా? పైసలేడన్న కట్ట కట్టి ఉంచినవా? నేనేం జెప్పిన. నువ్వేం జేసినవ్‌” సౌమ్య ఒర్రుతనే ఉంది. అర్నబ్‌ గో స్వామి షోల కాంగ్రెస్‌ లీడర్‌ లెక్క నేను నోర్మూసుకున్న.

నా ముందు నుంచి ఓ 60 ఏళ్ల ముస్లీం ‘చిచ్చ’ నడ్సుకుంట పోతున్నడు. నీలం, తెల్ల రంగు లుంగి కట్టిండు. పైన లాల్చి తొడుక్కున్నడు. టోపి పెట్టుకున్నడు. సన్నటి ముఖం. చామన ఛాయ. తెల్లగడ్డం. ఓ చేతిలో కవర్‌. ఇంకో చేతిలో కట్టె. కుంటుతున్నడు. కుడికాలుకు సిమెంట్‌ పట్టి. కాలు ఇరిగినట్టుంది. మెల్లమెల్లగ నడ్సుకుంట బయటకు పోతున్నడు. చెక్‌ పాయింట్‌ అవుట్‌ గేట్‌ దగ్గర పోలీసోళ్ల హడావుడి. కార్లను ఆపుతున్నరు. డిక్కీలు లేపుతున్నరు. ఖద్దరు అంగీలేస్కున్న రెండు గొంతులు నా ఎనక పొంటి మాట్లాడుకుంటున్నయ్‌.
“గెలికి మరీ తిట్టించుకున్నర్రా సీఎంతోని ఈ పార్టీలోళ్లు. లేకుంటె పెద్దసార్‌తోనె పెట్టుకుంటర.”
సౌమ్య నాన్‌ స్టాప్‌ లైవ్‌తో నా చెవులు ఎర్రబడ్డయ్‌. అటుకెల్లి మాటలు బందైనయ్‌. ఇంగ నేను...
“ఒర్రుడు ఐపొయిందా? ఇది కూడా బిస్కెట్టే. వాళ్లకట ముందుగాల ఒకటి ఫ్రీగ చేసియ్యాలంట. నచ్చితె ఇంకోటిస్తరట. పైసల్గూడ అటెంకనే ఇస్తరట. సెట్‌ కాదని లేశొచ్చిన”. నేను చెప్పుడు పూర్తికాకుండనే సౌమ్య
“మరిప్పుడేం జేస్తవ్‌” అంది.
“సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడతా. కిశోర్‌ని కలిసి కూడా బాగరోజులైతాంది? పెళ్లయినంక ఇద్దరు అస్సల్‌ కలుస్తనే లేరు”
“సరే సరే. పీసీఆర్‌ నుంచి ఫోనొస్తాంది. తర్వాత చేస్త”. సౌమ్య ఫోన్‌ కట్‌ చేసింది. పదేళ్ల దోస్తానల ఈ పిల్ల ఎప్పుడు ఫోన్‌ల మొత్తం మాట్లాడలేదు. ఎప్పుడుగూడ మధ్యల్నే కట్‌ చేస్తది.

ముఖానికి కర్చీఫ్‌ కట్టిన. హెల్మెట్‌ పెట్టుకున్న. బండి స్టార్ట్‌ చేసిన. అవుట్‌ గేట్‌ దగ్గర లెఫ్ట్‌ తీసుకున్న. ఎదురుంగ ఇంతకుముందు కనిపించిన ముస్లీం చిచ్చ. సడెన్‌గ కట్టె లేపిండు. కొడతడా ఏందని తలకాయ వంచిన. సైడ్‌ మిర్రర్‌ల జూసిన. బండి ఆపమని సైగ చేసిండు. బతిమిలాడుతున్నట్టు ముఖం పెట్టిండు. బ్రేక్‌ కొట్టి కొంచెం ముందు బండాపిన. మళ్ల కాళ్లతోని ఎనకకు అనుకుంట పోయిన. హెల్మెట్‌ తీస్తనే ఉన్న...
“జర ఖైరతాబాద్‌ స్టేషన్‌ తక్‌ ఛోడ్‌ దో బేటా” అన్నడు చిచ్చ.
కాలుకు సిమెంట్‌ పట్టి. సక్కగ నడ్వనే వస్తలేదు. ముసలోడు కదా పోనిలే పాపమనుకుని...
“ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ ఉతర్నే కే బాద్‌ ఛోడ్‌ దూంగ. వాసే చల్‌తె జానా” చెప్తనే ఉన్న...
“షుక్రియా బేటా. బస్‌. వా తక్‌ ఛోడ్‌ దో” అని నన్ను పట్టుకుని మెల్లగా బండెక్కిండు.
నా ల్యాప్‌ టాప్‌ బ్యాగ్‌ను ముందేసుకున్న. చిచ్చ ఫ్రీగ కూసోనికి కాదు. బ్యాగు జేబుల పర్సుంది కదా. అందుకే. అప్పట్ల ఓసారి ఇట్లనే ఎవనికో లిఫ్టిస్తే సల్లగ జేబుల చెయ్యి పెట్టిండు. దాసి దాసి దెయ్యాలకు పెట్టినట్లయింది. అప్పటి సంది ఎవలన్న ఎనక కూసుంటె పర్సు, బ్యాగ్‌ చూస్కునుడు అలవాటైంది.
“జానే దూ క్యా?” అని నేనంటే “ఛలో” అని అన్నడు. రయ్‌ మని బండి కదిలింది. చిచ్చ మాట కలిపిండు.

“మంచి పనులు చెయ్యాలె బేటా. నువ్వు సంపాదించే పైసలు, బంగారం, ఆస్తుల్ని ఆయన (అల్లా) అసలు లెక్కలోకే తీస్కోడు. ఆయన ఒక్కటే అడుగతడు. జీవితంలో ఒక్కలకన్న మంచి చేసినవా? అని. ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. అందుకే చేతనైన కాడికి మంచి చెయ్యాలె” తత్త్వం చెప్పుకుంట పోతున్నడు చిచ్చ.
బండి ప్రసాద్‌ ఐమాక్స్‌ దాటుతున్నది. వచ్చినట్టొచ్చి బిస్కెటైన డాక్యుమెంటరీ టెన్షన్‌ల నేనుంటె ఈ ముసలోడి సోదేందిరా అనుకున్న. ఎట్లయిన ఆ టాపిక్‌ బంద్‌ చేయించాలని...
“ఏ పని మీదొచ్చినవ్‌? సెక్రటేరియట్‌ల ఎవర్ని కల్సినవ్‌?”’ అన్నాను.
“హోం మినిస్టర్ను కల్సిన బేటా”- చిచ్చ చెప్పిండు.
“అబ్బో. ఆయనతోనేం పని?”
“ఏం లేదు బేటా. వారం కిందట ఫలక్‌నుమల నన్నో కారోడు గుద్దిండు. నేను సక్కగనే పోతున్న. వాడిదే తప్పు. కింద పడ్డ. అప్పుడే అనిపించింది. కాలు ఇరిగిందిరా అని. ఆడున్నోళ్లందరు వచ్చిన్రు. లేపి అదే కార్ల పండబెట్టిన్రు. గుద్దినోడ్ని తిట్టిన్రు. ముసలోన్ని దవఖానకు తీస్కపొమ్మన్నరు. ట్రీట్‌మెంట్‌ చేయించమన్నరు. వాడు కూడా సరే అన్నడు. కార్‌ల ఎక్కించుకున్నడు. ఉస్మానియా దవఖానకు పోనిచ్చిండు. కార్‌ సైడ్‌కు పెట్టొస్త ఈడ్నే ఉండు అన్నడు. గంట సేపైనా వాడు రాలె. నొప్పితోని ఆడ్నే కూసున్న. నా అవస్త చూసి దవఖాన బయటున్నోళ్లు లోపలికి తీస్కపోయి డాక్టర్‌కు సూయించిన్రు. డాక్టర్‌ బొక్కిరిగిందన్నడు. సిమెంట్‌ పట్టేసిండు. ఓ పదిహేను రోజులు కాలు కిందపెట్టొద్దన్నడు”.
“మరి ఇట్ల నడ్సుకుంటొచ్చినవ్‌ ఏంది?” ఎందుకో అడగాలనిపించింది. ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ స్టార్టింగ్‌లనే ఫుల్లు ట్రాఫిక్‌. బండి స్లో చేసిన. ముందున్న బండ్లు మెల్లగ కదులుతున్నయ్‌. చిచ్చకూడా మెల్లగనే మాట్లాడుతున్నడు.
“ఏం చెయ్యాలె బేటా. ఆ గుద్దినోడు నన్నట్ల ఇడ్సిపెట్టి పోయినంక ఏం జెయ్యాలె. ఇంట్ల కూసుంటే మందులకు, ట్రీట్‌మెంట్కు పైసల్‌ ఏడినుంచొస్తయ్‌. అందుకే ఫలక్‌నుమా పిఎస్‌ల కేసు పెట్టిన. నా రాత పాడుగాను. వాళ్లు దరఖాస్తయితే తీసుకున్నరు గని ఐదు పైసలమందం కూడా పని చెయ్యలె. ‘అరే భాయ్‌ యాక్సిడెంట్‌ ఐన జాగల సీసీ కెమెరాలున్నయ్‌. జర అండ్ల జూసైనా ఆ కారోన్ని పట్టుకోండ్రా’ అంటే ఇంటలేరు. వాళ్ల సుట్టూ తిరిగీ తిరిగీ యాష్టకొచ్చింది బేటా. అందుకే పోలీస్‌ పటేల్‌ హోం మినిస్టర్‌ సాబ్‌ను కల్శిపోదామనొచ్చిన”.

“మరి దొరికిండా?” ఏదో తెలుసుకోవాలన్న తొందర్ల నేను.
“అరే ఎందుకు కలవడు బేటా. మంచిగ మాట్లాడిండు. నేను చెప్పిందంత ఇన్నడు. నా ముందట్నే ఫలక్‌ నుమ పిఎస్‌కు ఫోన్జేసిండు. ఎస్సైనే అనుకుంట. ఇయ్యర మయ్యర తిట్టిండు. ‘సిగ్గు లేదా మీకు. ముసలోడు కాలిరిగి గోస పడ్తుంటే గింత గూడ పాపం అనిపిస్తలేదా’ అని నాలుగు దులిపిండు. మినిస్టర్‌ సాబ్‌ తిట్టేసరికి పోలీసోళ్లకు బుద్దొచ్చింది. ఆ కారోన్ని పట్టుకుంటమని చెప్పిన్రు. పోలీసులేమన్న హుషార్‌ లెక్కల్‌ జేస్తె ఫోన్జెయ్యమని మంత్రి సాబ్‌ ఆయన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చిండు”.
ఎవడో చిచోర పోరడు. యాక్టీవాతో మా బండికి కట్‌ కొట్టుకుంట పోయిండు. చిచ్చ జల్లుమన్నడు.
ఇంగ నేను-“మరి నువ్వు ఒక్కనివొచ్చినవ్‌. ఎవరూ లేరా నీకు? కొడుకులు...బిడ్డలు...?”
చిచ్చకాండ్రించి ఉమ్మిండు. కోపమచ్చినట్టుంది. నా మీదైతే కాదు. తనమీద తనకే కోపమొచ్చినట్టుంది. అద్దంలకెల్లి ఆయన ముఖం జూసినంక నాకట్లనే అనిపించింది.
“ఉన్నరు. ఇద్దరు కొడుకులు. పెద్దోడు ఈడ్నే గవర్నమెంట్‌ల ఇంజినీర్‌. చిన్నోడు...” ఏదో అన్నడు. అప్పుడే పక్కపొంటి నుంచి ట్రాలీ ఆటో పోవుడుతోని ఆ సౌండ్‌కు చిచ్చ చెప్పింది ఇనిపియ్యలేదు.

“మరింకేంది. వాళ్లను పట్టుకొచ్చుకంటే అయిపోయెది గదా?” అయాకంగా నేను.
“వాళ్లనా? రారు. నా ఇద్దరు కొడుకులు ఖురాన్‌ మొత్తం సద్విన్రు. మగర్‌ క్యా ఫాయిదా? ఖురాన్‌ వాళ్ల దిమాక్‌లనే ఉంది గని దిల్‌ల లేదు. ఉంటే తండ్రి తక్లీఫ్‌ పడుతుంటె ఊకుంటరా? ఖురాన్‌ ఏం చెప్పింది? అయ్యావ్వను మంచిగ చూసుకొమ్మంది. కాని నా కొడుకులు. వాళ్ల అమ్మీ పానం మీదికొస్తెనే పట్టించుకోలేదు. సచ్చినంక పెద్ద పూల చద్దర్‌ తీసుకొచ్చి సమాధిమీద కప్పిన్రు. సచ్చింది సూడనీకి వస్తదా ఏంది? ఇప్పుడు నా జనాజా ఎప్పుడు లేస్తదా అని సూస్తున్నరు. అసలు రాముడు ఎందుకు గొప్పోడయిండో తెలుసా బేటా?”
చిచ్చ సడెన్‌గా రాముడి గురించి తీసేసరికి నాక్కొంచెం చిత్రంగనిపించింది. తెల్వదన్నంక చిచ్చ చెప్పిండు. “తండ్రి మాట ఇన్నందుకే రాముడు గొప్పోడయిండు. ఆ రోజు అడివికి పొమ్మని తండ్రి చెప్పంగనే ఒక్కమాట కూడా ఎదురు చెప్పకుండ రాముడు అడివికి పోయిండు. అట్ల కాకుండా నువ్వెవరు నన్ను పొమ్మననీకి అని ఎదురుతిరిగితే ఇయ్యాల లోకమంత రాముడి గురించి మాట్లాడుకునేదా? ఆయన దేవుడయ్యేటోడా?”
ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ దిగేకాడికి వచ్చినం. రెడ్‌ సిగ్నల్‌ పడ్డది. కార్లు, బైక్‌లు ఒకదాని ఎనక ఒకటి ఆగి ఉన్నయ్‌. నేను రైట్‌ పోవాలె. చిచ్చ లెఫ్ట్‌ పోవాలె రైల్వే స్టేషన్‌కు. ఎందుకో ఆ ట్రాఫిక్‌ల చిచ్చను వదిలిపెట్టి పోబుద్ధికాలె. స్టేషన్‌ కాడ దించుదమని లెఫ్ట్‌ తీసుకున్న. బస్టాప్‌ దగ్గర రెండు బస్సులు ఆగేసరికి, ఎనకున్న బండ్లన్ని ఆగినయ్‌. పక్కపొంటి రైల్వే స్టేషన్‌కు పోయె తొవ్వల గూడ బండ్లు అడ్డమున్నయ్‌. చేసేదేంలేక నేను బండాపిన. చిచ్చ చెప్పుడు ఆపలేదు.
“రాముడైనా, నువ్వయినా, నేనైనా నలుగురు మెచ్చే పనులే చెయ్యాలె. అప్పుడే ఆయన దగ్గర మనం లెక్కలోకొస్తం”.
బస్సులు కదిలినయ్‌. బండిని స్టేషన్‌ లోపలికి,దగ్గర దగ్గర టికెట్‌ కౌంటర్‌ కాడికి తీస్కపోయిన. చిచ్చ మెల్లగ దిగిండు. “షుక్రియా బేటా. ఇయ్యాల నువ్వు చేసిన సాయం ఉత్తగనే పోదు.ఆయన దగ్గర జమైతది. నీకు మంచి జరుగుతది”. ఆశీర్వదించినట్టు నెత్తి మీద చెయ్యి పెట్టిండు చిచ్చ. బండి మీదనుంచే “అసలు నువ్వు ఏడుంటవ్‌? ఏం జేస్తవ్‌” అని అడిగిన.

“నేను పుట్టింది పెరిగింది ఫలక్‌నుమా కాడ్నే బేటా. మా మామ మక్కాలున్న మస్జిదే హరాంల పనిచేసేటోడు. బిడ్డనిచ్చి పెళ్లిచేసినంక నన్నుకూడ ఆడికే తీస్కపోయిండు. అదే మస్జిద్‌ల పనిప్పిచ్చిండు. ఆడ్నే నా కొడుకుల్ని ఖురాన్‌ సద్విచ్చిన. మూడేళ్ల కిందట్నే హైదరాబాదొచ్చిన. రెండేండ్ల కింద నా బేగం సచ్చిపోయింది. కాలు ఇరగకముందు ఫలక్‌ నుమాల్నే ఆ పని ఈ పని జేసుకున్న. ఇప్పుడు చెయ్యస్తలేదు” అన్నడు.
చిచ్చ మాటలు ఇన్నంక అద్దంల కనిపిస్తున్న నా ముఖం నాకే గలీజ్‌ అనిపిచ్చింది. “మక్కాల పనిచేసొచ్చినోన్ని దొంగని అనుమానించినా కదా? థూ” అనుకున్న. చిచ్చ ముందు ఉండబుద్ధిగాలే. “సరే. నేను పోత” అని చేతిల చెయ్యేసిన. ఆయన కూడా చాలా సంతోషంగ నా చేతుల్ని పట్టుకున్నడు. “మేరే లియే ఇత్నా కరే. ఆప్‌ కా నామ్‌ తో బోల్‌ కే జావ్‌ బేటా” అన్నడు.
బండి తిప్పుకుంట “శ్రీరాం” అన్న.
“మాషా అల్లాహ్‌.”
చిచ్చ కండ్లల్ల వెలుగు. ముఖంల బోసి నవ్వు. కోట్లు సంపాదించినోడు గూడ అట్ల నవ్వలేడు. రాసిస్త.
బండి ముందుకు పోనిచ్చిన. చిచ్చ టికెట్‌ కౌంటర్‌ కాడ్కి పోయిండు. నేను రాంగ్‌ రూట్లో ఖైరతాబాద్‌ సిగ్నల్‌ దాటిన...

“ఇగో ఇంతే బద్రీ. ఇదేమన్న పనికొస్తదంటవా?” బీరిపొయ్‌ నన్నే చూస్తున్నరు బద్రీ, కిట్టూ.
“అన్నా... మాకు ఎట్ల చెప్పినవో అట్లనే రాయన్న. బరాబర్‌ పనికొస్తది” అని కుర్చీల నుంచి లేసుకుంట బద్రీ నా దగ్గరికొచ్చిండు. ఆయన చేతులున్న ల్యాప్‌ టాప్‌ను నాకిచ్చి మొదలుపెట్టమన్నట్టు చూసిండు.

అప్పుడే కిట్టు “అన్న! ఆ చిచ్చ అడ్రస్‌ కనుక్కుంటే మంచి షార్ట్‌ ఫిల్మ్‌ తీయచ్చన్నా. మనోడి లైఫ్‌ల పేయిన్‌ ఉంది. దాన్ని మంచిగ విజువలైజ్‌ చేయొచ్చు” అన్నడు. బద్రి కూడా అవునన్నట్టే చూసిండు. అడ్రస్‌ తెల్సుకునేదాక ఇడ్శిపెట్టరని నాకర్థమయింది. ఫోన్‌ తీస్కొని సీనుగాడికి ఫోన్జేసిన. వాడు ఫోన్‌ ఎత్తిండు.
“అరేయ్‌ సీను. చిన్న ఇన్‌ఫర్‌మేషన్‌ కావాల్రా? ఇంతకుముందే ఫలక్‌నుమా నుంచొచ్చి ఓ ముసలాయన హోంమినిస్టర్‌ను కల్సిండు. ఆయన డీటైల్స్‌...
పిచ్చిలేశిందా? పైసలేడన్న కట్ట కట్టి ఉంచినవా? నేనేం జెప్పిన. నువ్వేం జేసినవ్‌” సౌమ్య ఒర్రుతనే ఉంది. అర్నబ్‌ గో స్వామి షోల కాంగ్రెస్‌ లీడర్‌ లెక్క నేను నోర్మూసుకున్న. నా ముందు నుంచి ఓ 60 ఏళ్ల ముస్లీం ‘చిచ్చ’ నడ్సుకుంట పోతున్నడు. నీలం, తెల్ల రంగు లుంగి కట్టిండు. పైన లాల్చి తొడుక్కున్నడు. టోపి పెట్టుకున్నడు. సన్నటి ముఖం. చామన ఛాయ. తెల్లగడ్డం. ఓ చేతిలో కవర్‌. ఇంకో చేతిలో కట్టె. కుంటుతున్నడు. కుడికాలుకు సిమెంట్‌ పట్టి. కాలు ఇరిగినట్టుంది.
-యాకుబ్‌ అలీ, 87909 99975

664
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles