400 ఏండ్లుగా అఖండజ్యోతి వెలిగే.. అగస్త్యేశ్వరాలయం!


Sun,September 3, 2017 01:36 AM

తెలంగాణ చరిత్రకు ఇక్కడ స్థాపితమై ఉన్న ఆలయాలకు ప్రత్యేకానుబంధం ఉంది. ఒక రాజు ఒక రాజ్యాన్ని పాలించిన ఆనవాళ్లను కాలాన్ని నిర్ణయించే స్థాయిలో మన ఆలయాలు ఉన్నాయి. కొన్ని స్థల పురాణాన్ని తెలిపితే.. మరికొన్ని చరిత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తాయి. ఆయా పాలకుల అభురుచి, ఆసక్తి, నమ్మకం దృష్ట్యా కొన్ని వింత ఆలయాలు. విశిష్ట నేపథ్యాలను కలిగి ఉంటాయి. అలాంటివాటి గురించి ఇక నుంచి ప్రతీవారం చెప్పుకుందాం. దాంట్లో భాగంగా మొదటగా 400 ఏండ్లుగా అఖండజ్యోతిలా వెలుగుతున్న ఆలయం గురించి తెలుసుకుందాం. అదే అగస్త్యేశ్వరాలయం.

-కోల అరుణ్‌కుమార్, 91827 77003

ఎక్కడ ఉంది?: మంచిర్యాల జిల్లా చెన్నూరులో.
ఎలా వెళ్లాలి?: మంచిర్యాల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.
విశిష్టత ఏంటి?: 400 ఏండ్లుగా నిరంతరం వెలుగుతున్న అఖండజ్యోతి.
Temple

అగస్త్య మహాముని:

సత్సంగ సంపన్నుడైన అగస్త్యుడి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఆలయం ఇది. నిష్టాగరిష్టుడు, తపస్సంపన్నుడు అయిన అగస్త్యుడు దక్షిణాదిన పర్యటిస్తూ బాసర జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకుని గోదావరి తీరంలోని చెన్నూరుకు చేరుకున్నారట. చాలాకాలం ఇక్కడ కఠోర తపస్సు చేశారట ఆయన. ఈ ప్రాంత ప్రాశస్త్యం గుర్తించిన ఆయన శివలింగాన్ని ప్రతిష్టించి ఆలయానికి అగస్త్యాలయం అని పేరు పెట్టారట. ప్రతాపరుద్ర గణపతి 12వ శతాబ్దంలో ఈ శివలింగానికి ఒక ఆలయం, తపోవనం నిర్మించారట. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ ఆలయంపై దాడిచేసి ప్రాకారాన్ని ధ్వంసం చేశారు. తర్వాత కాలంలో శ్రీ కృష్ణదేవరాయలు ఇక్కడకు వచ్చినప్పుడు ఆలయాన్ని పునర్‌నిర్మించారని చెప్పుకుంటారు.

తిమ్మరుసు సంతకం:

ఆలయానికి సంబంధించి పలు అంశాలు ఆలయంలోని శాసనంపై చెక్కబడి ఉన్నాయి. ఈ విషయం ఆలయంలో ఉన్న శాసనంపై చెక్కబడి ఉంది. ఈ శాసనంపై మహా మంత్రి తిమ్మరుసు సంతకం చెక్కి ఉంది. తెలుగు, కన్నడ మిశ్రమ భాషలో చెక్కబడి ఉన్న శాసనాన్ని బనారసీ హిందూ యూనివర్సిటీ విద్యార్థులు కొందరు అనువదించారు. ఆలయ ప్రాకారం నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా ఈ శాసనం బయటపడింది. ఆలయం గర్భగుడిలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన శివలింగం ఉంది. ఆలయం ఎదుట నిర్మితమైన మందిరంలో నందీశ్వరుని పెద్ద విగ్రహం, దాని వెనుకాల వినాయకుని విగ్రహం ఉన్నాయి. శివాలయంలోని ముందు మండపంలో ఒకపక్క సూర్య భగవానుని విగ్రహం, మరోపక్క నాగదేవత విగ్రహం, పాలరాతితో కూడిన శివలింగం ఉన్నాయి.

అఖండ దీపం:

ఆలయంలో అఖండ దీపం దాదాపు 400 ఏండ్ల నుంచి వెలుగుతూనే ఉంది. ఆలయ అర్చకుడు జకెపల్లి సదాశివయ్య మొదట 1795లో ఆలయంలో అఖండ దీపాన్ని వెలిగించారు. ఈ దీపం ఇప్పటికీ ఆలయంలో వెలుగుతూనే ఉంది. ఆలయ ఆర్చకులు తమ వంశపారపర్యంగా వస్తున్న ఈ ఆచారాన్ని పాటిస్తూ దీపాన్ని వెలిగిస్తున్నారు. దీపం ఆరిపోకుండా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె పోస్తుంటారు. ఈ దీపం నాలుగు వందల ఏండ్ల నుంచి వెలుగుతూనే ఉందని చెన్నూరు గ్రామస్థులు చెబుతుంటారు. ఈ అగస్త్యేశ్వర ఆలయం సందర్శించేందుకు ఇక్కడి ప్రాంతం వారే కాకుండా, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

వారసత్వంగా:

అగస్త్య ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. గోదావరీ తీరం కావడంతో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటారు. 400 ఏండ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి ఇక్కడి ప్రాధాన్యం. 50 ఏండ్లుగా నేనిక్కడ పూజ చేస్తున్నాను.
-జక్కేపల్లి హిమాకర్, ఆలయ పూజారి

1960
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles