22 యేండ్లు.. 4 లక్షల కిలోమీటర్లు


Sat,March 23, 2019 10:02 PM

భూమండలం నుంచి చంద్రమండలానికి ఎంత దూరమో తెలుసా? 3,84,400 కిలోమీటర్లు.. భూమండలం నుంచి చంద్రమండలానికి చేరుకోవడానికి పట్టే సమయమెంతో తెలుసా? 27 రోజులు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఈ కథనానికి, దానికి దగ్గరి సంబంధం ఉన్నది. 22 యేండ్లలో నాలుగు లక్షల కిలోమీటర్ల దూరం సైకిల్ ప్రయాణం చేసిన ఓ రైల్వే ఉద్యోగి కథ ఇది.

భిన్నంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అది ఆచరణలో కొందరితోనే సాధ్యమవుతుంది. సృజనాత్మకంగా ఆలోచించి అందరూ రాణించాలనుకుంటారు. అది కొందరు మాత్రమే సాధిస్తారు. భిన్నరంగంలో సృజనాత్మకంగా ఆలోచించి ఆచరణలో పెట్టి రాణించడమే విజయం సాధించడం. బైలాహలి రఘనాథ్ జనార్ధన్ బెంగళూరుకు చెందిన రైల్వే ఉద్యోగి. రిటైర్‌మెంట్ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతి తక్కువమందిలో ఆయన ఒకడు. తన వయసు వాళ్లు చేయలేని ఎన్నో సాహసాలు చేసి రికార్డులు సృష్టించాడు. ఆయన ఒక సైక్లిస్ట్, ఒక ట్రెక్కర్, ఒక అథ్లెట్ అంతేకాదు.. జీవితాన్నే ప్రయాణంగా మార్చుకున్న ఆ నిత్యసంచారి ఎందరికో ఆదర్శం.

రఘునాథ్ సైకిల్ రేసింగ్‌లు చేస్తాడు. హిమాలయాల్లో కూడా ట్రెక్కింగ్ చేశాడు. చాలామంది ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ఏమీ లేదనుకుంటారు. కానీ ఈయన మాత్రం ఉద్యోగ విరమణ తర్వాత ఒక కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అరవై యేండ్ల తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, విజ్ఞాన విహార యాత్రలు చేయడం వంటి పనులు చేస్తుంటారు. 86 యేండ్ల వయసులో తన అభిరుచులను, అలవాట్లను సునాయాసంగా పాటిస్తున్నాడు. రైల్వే శాఖలో ఉద్యోగిగా ఉండి ఎన్నో సేవలందించాడు. ఉద్యోగం చేస్తూనే వందల మారథాన్‌లలో పాల్గొని వేల కిలోమీటర్లు నడిచాడు. 64 యేండ్ల వయసులో సైక్లింగ్ ప్రారంభించి 22 యేండ్లలో నాలుగు లక్షల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. సైక్లింగ్ చేయడం అంటే కష్టం కాదు. నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవడం అంటాడు రఘనాథ్ జనార్థన్. ఇవే కాదు మెట్లు ఎక్కే పోటీల్లో కూడా పాల్గొంటాడు. దేశంలో పెద్ద వయసుగల సైక్లిస్ట్ ఈయనే. గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో తొక్కుతాడు.
Bylahalli-Rag

హిమాలయాల్లో సుమారు 20సార్లు ట్రెక్కింగ్ పూర్తి చేశాడు. 265 నెలల వ్యవధిలో దాదాపు 4 లక్షల కిలోమీటర్లు సైకిల్ తొక్కడమంటే దాన్ని మించిన విజయం ఉండదని అంటున్నాడు. అందరిలాగా పోషకాహరంతో కూడిన ఖరీదైన ఆహారం కూడా ఏమీ తీసుకోడు. శాఖాహారం మాత్రమే తింటాడు. తప్పని పరిస్థితుల్లో తప్ప బయటి ఆహారం తీసుకోడు. ఉదయం లేవగానే టీ గానీ కాఫీ గానీ తప్పనిసరి తాగుతాడు. ఆ తర్వాత డీప్ ఫ్రైడ్ ఫుడ్ తింటాడు. తనకు ముఖ్యంగా ఎక్కువ బలాన్నిచ్చేది నీళ్లే అంటాడాయన. మొలకెత్తిన విత్తనాలు, పచ్చి కూరగాయలు, ఆకుపచ్చ రంగులో ఉండే అరటిపండ్లను మాత్రమే తీసుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అంతర్జాతీయ మారథాన్‌లలో పాల్గొని భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. దుబాయి, సిడ్నీ వంటి నగరాల్లో ముంబై, బెంగళూరులతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నో పరుగుల పోటీల్లో పాదం కదిపాడు.

ఎక్కడ ఏ చిన్న పని ఉన్నా మనం బైక్, కారు వాడతాం. జనార్థన్ మాత్రం ఎంత దూరం పని ఉన్నా సైకిల్ మాత్రమే వాడతాడు. నగరంలోనే కాదు.. చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు వెళ్లాలన్నా సైకిల్ మీదనే వెళ్తాడు. రోజుకు సగటుగా 55 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. కర్ణాటక ప్రభుత్వం రెండేండ్ల్ల క్రితం ప్రతిష్టాత్మక కెంపెగౌడ అవార్డుతో సత్కరించింది. తన చిత్రంతో ప్రత్యేక స్టాంప్‌ను తయారు చేయించింది తపాలా శాఖ. బెంగళూరులోని జయనగర్ పోస్ట్ ఆఫీస్‌లో ఈ స్టాంప్‌ను విడుదల చేశారు. 62 హాఫ్ మారథాన్స్, 60 10కె ఈవెంట్స్, 32 వర్టికల్ రన్స్, 3.5గంటల్లో 30 కిలోమీటర్ల సైక్లింగ్, రెండుసార్లు 60 కిలోమీటర్ల సైక్లోథాన్, మైసూర్ టు బెంగళూరు 300కిలోమీటర్లు నడిచాడు. 32అంతస్థుల భవనం నాలుగు సార్లు, 52 అంతస్థుల భవనం ఒకసారి, 64 అంతస్థుల భవనం ఒకసారి మెట్లపై వేగంగా ఎక్కి రికార్డు సృష్టించాడు. గత 23 ఏండ్లలో ఒక్కసారి కూడా డాక్టర్ వద్దకు పోలేదని మరణించేంత వరకు డాక్టర్ వద్దకు వెళ్లడం గానీ మందులు తీసుకోవడం వంటి పనులు చేయనని చాలెంజ్ చేస్తున్నాడు. ఆరోగ్యకరమైన జీవనవిధానం తనను ఇప్పటికీ ప్రశాంతంగా ఉంచుతుందని చెప్తాడు. మరో 10 నుంచి 12 ఏండ్ల వరకు సైక్లింగ్ చేయగలనన్న నమ్మకాన్ని వెలిబుచ్చాడు.

390
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles