కోటి రతనాల వీణను మీటిన దాశరధి


Sun,November 18, 2018 02:21 AM

Daasarathi
తెలంగాణ విమోచనోద్యమంలో, ప్రజల కష్టనిష్ఠురాల్లో తానూ ఒక్కడై ఎముకలు అరిగేలా శ్రమించిన గొప్ప వ్యక్తి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు. స్వాతంత్రోద్యమం, తెలంగాణ పోరాటం, సాయుధపోరాటం, రైతాంగపోరాటం అన్నీ ఆయన కలానికి పదునుపెట్టినవే. ఈ పరిస్థితులన్నీ గ్రహించి, విజృంభించింది ఆయన కవి హృదయం. తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రతిబింబమై, నిజాం నవాబుపై తిరుగుబాటు బావుటై ఎదురుతిరిగినవాడు దాశరథి. జన్మభూమి అయిన తెలంగాణ విముక్తి కోసం తన కవిత్వం ద్వారా గొప్ప కృషి చేసి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించి కారాగార శిక్షను కూడా అనుభవించిన దేశభక్తుడు దాశరథి. ఎన్నో రచనలు, పాటలు, కవితలు ఆయన కలం నుంచి జీవం పోసుకున్నాయి. తెలుగు సినిమా పాటను కొత్తపుంతలు తొక్కించిన ఆయన ఆస్థాన కవిగా నియమితుడై పాలకుల అవమానాలకు గురై ఆ అవమాన భారంతోనే కనుమూసిన అచ్చమైన అభ్యుదయ కవి దాశరథి.
- మధుకర్ వైద్యుల

తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి జూలై 22, 1925న అప్పటి వరంగల్ జిల్లా చిన్నగూడురులో (ప్రస్తుతం మహాబూబాబాద్ జిల్లా) జన్మించాడు. దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు.

కుటుంబ ప్రభావం

దాశరథి తాత, తండ్రి మహాపండితులు. తల్లి సంస్కృతాంధ్రభాషల్లో విదుషీమణి. వీరి ప్రభావం దాశరథిపై బాగా పడింది. సాంప్రదాయ కవిత్వాన్ని వంటబట్టించుకున్నా సమాజ బాధను తన బాధగా భావించి చందోబద్దమైన విప్లవ సాహిత్యానికి పురుడు పోశాడు.

నిజాం వ్యతిరేక ప్రభావంతో

నిజాం వ్యతిరేక పోరాట ఉద్యమ ప్రభావం కవులు సాహితీవేత్తలపై ఎంతగానో పడింది. ఆ ప్రభావానికి చైతన్యపూరితుడైన కవుల్లో అగ్రగణ్యుడు దాశరథి. ఆయన ప్రజల్లో జీవించి ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కవిత్వం రాశాడు. చీకటి నిండిన దోపిడీ వ్యవస్థను శాంతి శరధారతో చీల్చి చెండాడారు. రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్ అంటూ నిజాం నవాబును సూటిగా గద్దించిన ధీరోదాత్తుడు దాశరథి.

కమ్యూనిజాన్ని వదిలి..

దాశరథి బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీషు సాహిత్యంలో బీఏ చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక బయటకు వచ్చి హైదరాబాద్ సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.

ఎన్నెన్నో రచనలు

ఉపాధ్యాయ వృత్తిలో కొన్నాళ్లు రాణించినా ఆకాశవాణిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేసి పేరు పొందాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, మార్పు నా తీర్పు, కవితాపుష్పకం, ధ్వజమెత్తిన ప్రజ, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు, గాలిబ్ గీతాలు తదితర రచనలతో సాహితీలోకాన్నే కాకుండా ప్రజాచైతన్యాన్ని ప్రజ్వలింపచేసిన మహాకవి. దాశరథికి రుబాయిలంటే చాలా ఇష్టం. అమ్జద్ హైదరాబాదీగా ప్రసిద్ధి చెందిన అమ్జాద్ కవి ప్రభావంతో తెలుగులో రుబాయిలను అనువదించాడు. దాశరథి, నారాయణరెడ్డి కలిసి భాగవతం, రామాయణం పిల్లల కోసం రచించారు. తేనెపాటలు, పూలపాటలనీ బాలసాహిత్యం రాశారు. రేడియో నాటికలు, రూపకాలు ఎన్నో రాశారు. కవితా పుష్పకంకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, తిమిరంతో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఆగ్రా విశ్వ విద్యాలయం 1976లో, ఎస్వీ యూనివర్సిటీ 1981లో దాశరథికి గౌరవ డాక్టరేట్ ఇచ్చాయి.

ఉద్యమ సహచరులు

దాశరథి కమ్యూనిజాన్ని వదిలేశాక ఆంధ్ర మహాసభ, స్టేట్ కాంగ్రెస్‌లో చేరారు. స్వామి రామానందతీర్థ, కొండా వెంకటరంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు నాయకత్వంలో పనిచేశాడు. డాక్టర్ చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, పి.వి.నరసింహారావు, జమలాపురంకేశవరావు, హీరాలాల్ మోరియా, కవి రాజమూర్తి, బొమ్మకంటి సత్యనారాయణరావు, హయగ్రీవాచారి తదితరులతో ఉద్యమంలో ముందున్నారు. సురవరం ప్రతాపరెడ్డి దేవులపల్లిరామానుజరావు, ముఖ్దాం మొహియుద్దీన్, షోయాబుల్లా ఖాన్ తదిరుతలంతా దాశరథికి పరిచయస్తులే.

జైలు గాయాలే ఉద్యమ గేయాలై

ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించారు దాశరథి. నిజామాబాద్‌లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసింది. ఆయనతోపాటు వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నారు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో ఓ నిజాము పిశాచమా! కానరాడునిన్ను బోలిన రాజుమాకెన్నడేని తీగెలను తెంపి అగ్నిలో దింపినావునా తెలంగాణ! కోటి రత్నాలవీణ అంటూ ప్రభుత్వాన్నెదిరించడానికి బొగ్గుతో జైలు గోడ మీద రాసి తన ఆవేశాన్నంత ప్రదర్శించేవాడు.

గాయాలపాలై

1948 జనవరి 11న నిజామాబాద్ సెంట్రల్ జైలులోకి రజాకార్లు ప్రవేశించి స్వాతంత్య్ర సమరయోధులైన బందీలను హింసించారు. వాళ్ల దెబ్బలకు చాలామంది చనిపోయారు. దాశరథి మాత్రం బతికి బయటపడ్డారు. ఈ సం ఘటనను అగ్నిధార కావ్యంలో దాశరథి వివరించాడు.

కవులను ఏకం చేసి..

దాశరథి మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని ఎనిమిది జిల్లాల్లోని తెలుగు రచయితలను ఒక్క వేదికపై తీసుకువచ్చి యువ రచయితలను ప్రోత్సహించాడు. పట్నాల్లో పల్లెల్లో కవి సమ్మేళనాలను నిర్వహించారు. దాశరథి ఉద్యమ కవితలు ఆనాడు పోలీసుచర్య తరువాత యువతరాన్ని బాగా ఆకర్షించాయి. గ్రంథాలయ ఉద్యమంలోనూ పాలుపంచుకున్నారు. వృత్తాల్లోనయినా, గేయాల్లోనయినా, వచన కవితలు, వచనంలోనైనా (కథలు, నాటికలు) సమానమైన ప్రతిభ చూపించే బహుముఖ ప్రజ్ఞాశాలి.

సినీ గేయ కవిగా..

1961లో ఇద్దరు మిత్రులు చిత్రం ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు దాశరథి. ఆయన కలం నుంచి జాలువారిన తొలి సినిమా పాట ఖుషీ ఖుషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ, పాడవేల రాధికా అంటూ సాగింది. ఇంచుమించుగా కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవ చేశారు. చిన్నచిన్న పదాలతో, ద్వంద్వార్థాలు లేకుండా స్వచ్ఛమైన తెలుగులో ఆయన రాసిన ఎన్నో పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ అయ్యాయి.

ఆస్థాన కవిగా..

జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాక దాశరథిని 1977లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా నియమించాడు. దీనితో అప్పటి వరకు మద్రాస్‌లో సినిమాలకు పాటలు రాస్తూ ఉన్న దాశరథి 1979లో సినిమాలకు దూరమై హైదరాబాద్‌కు చేరారు. ఇక్కడికి వచ్చాక రాజకీయ సాం స్కృతిక రంగాల్లో పూర్తిగా నిమగ్నమయ్యి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహితి సేవను కొనసాగించారు.

శవసదృశంగా నిదురబోతున్న మన జాతిని మేల్కొల్పడానికి అరుదెంచిన కాంతికేతనమే దాశరథి. అరవై యేండ్లకే శతాబ్దం ముగించుకొని వెళ్లిపోయాడు.

సినిమాల్లో ఆధిపత్య ధోరణి నచ్చక..

దాశరథి సినిమా రంగంలోకి ప్రవేశించడానికి ముఖ్య కారణం ఆర్థిక పరిస్థితులే అంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమమే ఊపిరిగా బతికిన ఆయన తన యవ్వనమంతా తెలంగాణ కోసమే త్యాగం చేశారు. అయితే ఈ క్రమంలో ఆయన ఏనాడూ ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. దాన్నుండి గట్టేక్కడానికి ఆయన సినిమా పాటలు రాయడానికి సిద్ధపడినట్లు చెబుతారు. అయితే సుమారు రెండు దశాబ్ధాల పాటు సినిమా రంగంలో ఉన్న దాశరథి ఆ తర్వాత ఆంధ్రప్రాంత కవుల ఆధిపత్య ధోరణి నచ్చక సినిమా పాటలకు గుడ్‌బై చెప్పి మద్రాస్‌ను వదిలి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
Daasarathi1

అవమాన భారంతో..

దాశరథిని జలగం వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా నియమించారు. దాశరథి ఆస్థాన కవిగా ఉన్న కాలంలో తెలుగు సాహిత్యం తెలుగు నేలంతా పరుచుకుంది. అయితే దాశరథిపై సీమాంధ్ర సర్కార్ కక్ష కట్టింది. తెలుగు భాష, తెలుగు జాతి అంటూ అధికారం చేపట్టిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా ఉన్న కృష్ణమాచార్యున్ని 1984లో ఆ పదవి నుంచి అవమానకరంగా తొలిగించాడు. ఆ అవమానం భరించలేక చిక్కిశల్యమయ్యాడు. యవ్వనాన్నంతా సమాజం కోసం ధారపోసిన దాశరథికి జరిగిన అవమానాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఆయన మంచం పట్టి ఆ బాధతోనే 1987 నవంబర్ 5న శాశ్వతంగా కన్నుమూశారు.

అవమానాలు దిగమింగి

లౌక్యం తెలువక ఆ తరువాత జీవితం గడువడం కోసం అనేక కష్టాలు పడ్డారు దాశరథి. ఒకసారి ఆయన శ్రీకృష్ణాంధ్ర భాషానిలయంలో ప్రసంగిస్తుంటే కొందరు ఆయనను అవహేళన చేశారు. ఉద్యమ సాహిత్యాన్ని వదిలి సినిమా పాటలు రాస్తున్నాడనేది వారి అభియోగం. వారి అవహేళనలు విన్న కాళోజీ లేచి నిలబడి అరే వాడికి మందులకు కూడా డబ్బులు లేవురా.. ఎవరిస్తారు.. ఆనాడు వాడే కనుక నిజాంతో రాజీపడి, కోఠీలో నిలబడి ఇదంతా నాదే అంటే అతడికే చెందేది.. అంటూ గద్దించారు.

362
Tags

More News

VIRAL NEWS