అత్తా కోడలు


Sun,September 17, 2017 12:01 AM

బడిగంట మోగలేదు. ఊరంతా విషాదం. ఎక్కడి వాళ్ళక్కడ గుంపులుగా ముచ్చట్లు. విద్యార్థుల నిశ్శబ్దపు చూపులు. ఉపాధ్యాయుల కనుసైగలతో తరగతి గదిలోకి పోయి కూర్చున్నారు. కొబ్బరి పలారం, సమ్మక్క బెల్లం బడిలకొచ్చి పంచిన లలిత ఊపిరి ఆగిపోయిందనే విషయం తెలువని వయసు.జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న గ్రామం అది. మానేరు కాలువ ఊల్లె నుంచి పోతది. వ్యవసాయ కుటుంబమైన వెంకట్‌రెడ్డిని వివాహమాడింది లలిత. కొత్త కోడలున్న నెలరోజులు సుఖంగ ఉండనిచ్చింది అత్త కాంతమ్మ. నీ మొగడు ఏం నౌకరి జేత్తాండని తెల్లారదాకా పన్నవు, కోడల్ని లేపింది కాంతమ్మ. నోట్ల నాలిక లేని వెంకటరెడ్డి ఏం మాట్లాడలేక పోయాడు. పనిచేయడం తప్పితే ఏమీ తెలియని వాడు. తల్లి ఇంటిమీద కాకిని వాలనియ్యది. ఒంటిమీద ఈగను వాలనియ్యది. ఆ ఊరి పాఠశాల ఇంటిని ఆనుకొని ఉన్నా ఆడపిల్లలకు చదువెందుకని తేల్చి పారేసింది కాంతమ్మ.

అన్నన్న..! కాలు వాయరా.....
ఎవడ్రా వాడు బాలు ఇసిరేసినోడుఎగపోసుకుంట పెద్ద పంతులుకు ఫిర్యాదు చేసింది కాంతమ్మ. పేపర్లు, చెప్పులు తన పెరట్ల పడొద్దని వార్నింగ్ ఇచ్చింది.
అది వర్షాకాలం. ఎడతెరిపి లేని వాన. తెల్లారితే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు. పోలీసోల్లు ముందుగానే బడికి చేరుకున్నరు. బడి మైదానంల నీళ్లు నిండినయి. అవి ప్రహరీ గోడకున్న రంధ్రం నుండే కాంతమ్మ పెరట్లకు పోవాలె. తెరువనిత్త లేదు. పోలీసాయన గుడ్లురిమి అన్నడు వాన నీళ్లు ఎక్కడికి పోతయే ముసల్దాన, తెరువు నువ్వే.కిక్కురు మనకుండా తెరిచింది కాంతమ్మ.రెండ్లేండ్లయినా వెంకట్‌రెడ్డి లలితకు సంతానం కలుగలేదు. చెల్లె బిడ్డను సాదుకుంటనని లలిత వద్దని అత్త. తల్లి ఏది చెపితే అదే మారు మాట్లాడడు. ఉలుకడు పలుకడు. భార్యాభర్తలకు సొంత ఆలోచనా విధానాలు లేనప్పుడు అత్తల పెత్తనాలు కొనసాగుతూనే ఉంటాయి. సంతానం లేకపోయెసరికి మరింత ఆగడాలు మొదలయినయి. తినేకాడ తిననియ్యది, ఉండేకాడ ఉండనియ్యది. ఎవరితో మాట్లాడనియ్యది. తన కోడలు మందితో మాట్లాడితే కొత్త విషయాలు నేర్చుకుంటదని ఆమె బాధ. మెల్లగ వేరు కాపురం పెట్టించింది వెంకటరెడ్డికి. సౌమ్యుడయిన భర్తను ఇబ్బంది పెట్టకుండా సంతానం గురించి బాధ పడేవాళ్ళు.
AtthaKodalu

చూస్తుండగానే పదేండ్లు గడిచినయి. రొమ్ము క్యాన్సర్‌కు గురైంది లలిత. ఆపరేషన్ జేయించుకొచ్చిండు. తానే అన్నై సేవలు చేసిండు ఎంకన్న. ఎవర్ని సాదుకోనీయక పాయేనని తెలుసుకున్నంక తల్లిమీద కోపం పెరిగింది. తల్లి మొఖం చూడలేదు. దగ్గరికి రానీయలేదు. కోడలు చావుకు దగ్గరవుతుందని తెలుసుకున్న కాంతమ్మ కొడుకింటికిపోయి ఊడ్వవట్టింది. విరక్తితో ఉన్న కొడుకు ఊడ్వనియ్యలేదు, మాట్లాడలేదు. చేతిల చీపురు గుంజుకున్నడు.

చివరి దశలో ఉన్న లలిత భర్తతో తన కోరిక తీర్చమని వేడుకున్నది. మన పాలుకు వచ్చిన భూమిని పాఠశాలకు దానం చేయాలని కోరింది. బడిపిల్లలే మన పిల్లలు. బడి ఉన్నంత కాలం పిల్లలు కేరింతలు కొడ్తూ మన భూమిలో ఆడుకోవాలి. భార్యపై అమితమైన ప్రేమ ఉన్న వెంకన్న ఆమె మాట కాదనలేదు. లలిత జీవితం బడిగంటతో బడిపిల్లలతో ముడిపడి పోయింది. ఒకరోజు పొద్దటి గంట కొట్టే సమయానికే ప్రాణాలు విడిచింది. రోజూ చూసే ఉపాధ్యాయులకు విద్యార్థులకు గుండె చెరువయ్యింది. ప్రతీ సోమవారం రోజూ కొబ్బరి ఫలహారాన్ని పిల్లలకు పంచినట్టే ఐదు గుంటల భూమిని లలిత పేరుమీద దానంగా పొందారు బడిపిల్లలు.దయామూర్తి వెంకటరెడ్డిని ప్రధానోపాధ్యాయులు సన్మానం చేద్దామన్నా రాడు. తల్లితో మాట్లాడడు. ఎక్కడ ఉంటాడో, ఏమి తింటాడో, ఏం చేస్తాడో ఎవరికీ తెలువది.కాంతమ్మ కాలు విరిగి మంచాన పడింది. నేను సంపాదించిన భూమిని భార్య పేరుమీద దానం జేసిండు తండ్రి పేరు మీదనన్న జేయకపాయె కాకులను కొట్టుకుంట, కోళ్ళను కొట్టుకుంట, కుక్కలను కొట్టుకుంట మంచానికే అతికి వల్లించుకుంటూ ఉన్నది.
బడికిచ్చిన భూమిల లలిత స్మారక మైదానమని తెల్లారే వరకు ఫ్లెక్సి కట్టి ఉన్నది.

1661
Tags

More News

VIRAL NEWS