భూదాన గంగోత్రి.. పోచంపల్లి!


Sun,September 17, 2017 12:34 AM

లోకం తీరు ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు. కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి. ఆ మార్పు సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి. అలా అయితేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. మనిషిగా పుట్టినందుకు సార్ధకత లభిస్తుంది. అలాంటి జన సమూహం కలిగిన గ్రామమే భూదాన్ పోచంపల్లి. గ్రామీణ నేపథ్యమున్నప్పటికీ ప్రపంచస్థాయి గుర్తింపుతో మెట్రో నగరాల్ని సైతం తన వెంట తిప్పుకుంటున్న ఆధునిక పోకడల గ్రామంగా రికార్డు సృష్టిస్తున్నది పోచంపల్లి. ఇది ఒకప్పటి వలస గ్రామం. ఇప్పుడు వస్ర్తానికి సుస్థిర స్థానం. నాటి పోచమ్మపల్లి నుంచి గాజుల పూసల పల్లి.. తర్వాత రుమాళ్ల పోచంపల్లి.. ఇప్పుడు భూదాన్ పోచంపల్లిగా ప్రపంచఖ్యాతి గడించింది.గ్రామ స్వరూపం

ఊరు: భూదాన్ పోచంపల్లి
మండలం: భూదాన్ పోచంపల్లి
జిల్లా: యాదాద్రి భువనగిరి
జనాభా: 12972
పురుషులు: 6574
స్త్రీలు: 6398

సరిహద్దులు

తూర్పున: కనుముక్కుల
పడమరన: జగత్‌పల్లి
ఉత్తరాన: రేవన్‌పల్లి
దక్షిణాన: జలాల్‌పూర్
Pochampally

ఎక్కడ ఉన్నది? : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రం. హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలోని రామోజీ ఫిల్మ్‌సిటీ దాటగానే కొత్తగూడెం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిలోని బీబీనగర్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ప్రత్యేకత ఏంటి? : చేనేత వస్ర్తాలకు ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతి కలిగిన గ్రామం పోచంపల్లి. గ్రామ జనాభాలో 50 శాతానికి పైగా చేనేత కార్మికులు ఉండడం విశేషం.

పేరెలా వచ్చింది? : భూదానోద్యమ ఉద్యమకర్త వినోబా భావే భూదానోద్యమం ఇక్కడి నుంచే ప్రారంభించారు కాబట్టి ఈ గ్రామానికి భూదాన్ పోచంపల్లి అనే పేరొచ్చింది.
Pochampally1

పోచమ్మ గుడి పేరుతో:

భూదాన్ పోచంపల్లి పేరు వెనక పెద్ద కథనే ఉన్నది. ఒక్కో దశలో ఒక్కో పేరు మార్చుకుంటూ వచ్చింది పోచంపల్లి. తొలుత ఈ ఊరిపేరు పోచమ్మ పల్లి. అది ఎలా వచ్చిందంటే.. అది మహబూబ్‌నగర్ జిల్లా వంగూరి గ్రామం. కరువు.. కలరా ఒక్కసారే వచ్చాయి. ప్రజల్ని పీడిస్తుండడంతో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు ప్రజలు. అలాంటి వారిలో కరణం కుటుంబం కూడా ఒకటి. వాళ్లు వలస వచ్చిన గ్రామమే ఇప్పటి పోచంపల్లి. అప్పుడు దట్టమైన కారడవిగా ఉండేదట. ప్రయాణం ఇక్కడే ఆపేసి రాత్రి బస చేశారట కరణం కుటుంబం. ఆ రాత్రికి కలలో పోచమ్మ తల్లి వచ్చి నీవు రావాల్సిన ప్రాంతం వచ్చేసింది. స్థానికంగా ఉన్న ఆలయంలో ధూపదీపాలు పెట్టండి. మిమ్ములను ఈ ప్రాంత ప్రజలను సల్లంగా చూస్తారు. ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని పోచమ్మతల్లి చెప్పిందట. ఇక అక్కడే నివాసం ఏర్పరుచుకున్నదట కరణం కుటుంబం. తర్వాత కొన్ని కుటుంబాలు కూడా అక్కడకు చేరాయి. గ్రామాన్ని ఏర్పాటు చేసి దానికి పోచమ్మపల్లి అనే పేరు పెట్టారట.

గాజుల పోచంపల్లిగా:

పోచంపల్లిలో గాజులు తయారుచేసే కుటుంబాలు ఉండేవి. నవాబ్ సాలార్‌జంగ్ కుటుంబానికి.. బంధువులకు వాళ్లు గాజులు తయారుచేసేవారు. ఊళ్లో చాలావరకు గాజుల పూసల బట్టీలు ఉండేవి. వీరు చేసిన గాజులు.. పూసలు అరబ్‌దేశాలు కూడా వెళ్తుండేవట. దీంతో ఈ గ్రామాన్ని కొద్దికాలం గాజుల పూసలపల్లిగా కూడా పిలిచేవారు. తదనంతర కాలంలో గాజుల పోచంపల్లిగా పేరు పొందింది. ఈ పేరుతో ఇప్పటికీ పోచంపల్లి ప్రసిద్ధి. ఇప్పటికీ పాత పోచంపల్లిలో ఎక్కడ తవ్వకాలు జరిపినా గాజులు, పూసలు బయల్పడుతాయి. తనకు ఇష్టమైన తేలియా రుమాళ్లను కూడా నవాబులు ఇక్కడి నుంచే తీసుకెళ్లేవారట. మగ్గాలపై నేసిన తేలియా రుమాళ్లకు ఆ కాలంలో భలే డిమాండ్ ఉండేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పటికీ కొందరు పోచంపల్లిని రుమాళ్ల పోచంపల్లి అని పిలుస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.
Pochampally2

ఉద్యమ ఖిల్లా:

స్వాతంత్య్రానంతరం భాగ్యనగరంలో భారతదేశ సర్వోదయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి రామకృష్ణ దూత కోరిక మేరకు మహాత్మాగాంధీ ప్రియ శిష్యుడు ఆచార్య వినోబా బావే హాజరయ్యారు. అనంతరం పోచంపల్లికి వచ్చారు. సమావేశాన్ని ఏర్పాటుచేసి పేదల జీవితాల్లో కొత్తవెలుగుతు నింపడానికి ఎవరైనా కొంత భూమిని వారికి ఇవ్వగలరా? అని అడిగారు. గ్రామానికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి తన తండ్రి వెదిరె నర్సింహారెడ్డి పేరున ఉన్న వంద ఎకరాలు దానంగా ఇస్తానని తెలుపడంతో ఆశ్చర్యానికి లోనైన వినోబాబావే పదే పదే అతణ్ణి అడిగాడు. ఒక మహోద్యమానికి ఈ గ్రామం శ్రీకారం చుడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేసిన వినోబా బావే ఇక్కడి నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారు. పోచంపల్లిలో పురుడు పోసుకున్న భూదానోద్యమం ద్వారా ప్రేరణ పొందిన వినోబా భావే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తృతపరిచి సుమారు 42 లక్షల ఎకరాలను సేకరించి భూదాన్ బోర్డును స్థాపించారు. ఈ గ్రామాన్ని తన రెండవ జన్మస్థలంగా వినోబాభావే పేర్కొనడం తమ గ్రామం గొప్పదనంగా భావిస్తారు గ్రామస్తులు. భూదానోద్యమానికి జవసత్వాలిచ్చిన ఈ గ్రామం నేడు పోచంపల్లి ఇక్కత్ డై అండ్ డై వస్ర్తాలతో ప్రపంచ ప్రఖ్యాతిని గాంచింది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ గ్రామాన్ని గ్రామీణ పర్యాటక కేంద్రంగా మార్చుతుంది. ఇక్కడికి ప్రతీ రోజు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ పోతుంటారు. పోచంపల్లిలో పురాతన కట్టడం ఉంటుంది. దీనికి అప్పట్లో 101 దర్వాజలు ఉండేవట!
Pochampally3

పోచంపల్లి అంటే దానగుణం:

పోచంపల్లి గ్రామం వలసతో ఏర్పడినప్పటికీ ఇది ఎంతో పవిత్ర స్థలం. ఇక్కడ బతుకుదెరువుకు వచ్చిన ప్రతీ ఒక్కరిని ఈ గ్రామం హక్కున చేర్చుకోని వారికి ఉపాధి కల్పిస్తుంది. ఇది ఒక దానత్వానికి ప్రతీకగా నిలిచింది. వెదిరె రామచంద్రారెడ్డి ఇచ్చిన వంద ఎకరాలతో భూదాన గంగోత్రిగా వాసికెక్కింది. ఇక్కడ నాటి నుంచి గాజుల, పూసలు తయారు చేసే కళాకారులు మొదలుకొని తేలియా రుమాళ్ళు, ఆసియా రుమాళ్ళు, పట్టు చీరలు తయారు చేసే రకరకాల కళాకారులకు నిలయం ఈ గ్రామం అమ్మ పోచమ్మ తల్లి కరుణతో దేశ విదేశాల్లో ఎంతో పేరున్న గ్రామంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం.

Pochampally4

1106
Tags

More News

VIRAL NEWS