కదిలె పాపహరీశ్వర క్షేత్రం


Sun,September 16, 2018 03:19 AM

Kadile-Papahareshwar
సహ్యాద్రి పర్వత సానువుల్లో ప్రకృతి అందాల మధ్య లోయలో కొలువు దీరిన పరమ శివుడు.. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలోని కదిలి పాపహరీశ్వరుడు. కదిలే పాపన్నగా భక్తుల కొంగు బంగారమై పూజ లందుకుంటున్నాడు. మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై వెలసిన స్వయంభువు. తండ్రి ఆజ్ఞపై తల్లి తల నరికిన పరశురాముడి మాతృహత్యా పాతకాన్ని తొలగించిన పరమ పావన క్షేత్రమిది. అదే కదిలె పాపహరీశ్వర క్షేత్రం.
-మధుకర్ వైద్యుల, 9182777409

ఎక్కడ ఉంది: నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి మొత్తం 21 కిలోమీటర్ల దూరంలో కదిలె ఆలయం ఉంది. మండల కేంద్రమైన దిలావర్‌పూర్‌నుండి ఎత్తైన గుట్టలపై వంపులతో కూడిన ఘాట్‌రోడ్లు, లోయవంటి ప్రదేశంలో చుట్టూ దట్టమైన అడవిలో పాపహరేశ్వరాలయం ఉంటుంది.

ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుంచి నాగపూర్ వైపు వెళ్లే 44వ నంబరు జాతీయ రహదారిపై 250 కి.మీ. దూరంలో నిర్మల్ జిల్లా కేంద్రం ఉంటుంది. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ల నుంచి నేరుగా నిర్మల్ జిల్లాకేంద్రానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. నిర్మల్ నుంచి కదిలె ఆలయం 21 కి.మీ. దూరం వస్తుంది. నిర్మల్ నుంచి భైంసావైపు వెళ్లే 61 నం. జాతీయరహదారిపై గల దిలావర్‌పూర్ మండల కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి 7 కి.మీ. దూరంలోని కదిలెకు చేరుకోవచ్చు. ఆ పేరెలా వచ్చింది?: మాతృహత్యా పాతకం నుంచి తనను విముక్తుని చేయాలంటూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు పరశురాముడు. ఈ క్రమంలో దేశమంతటా పర్యటిస్తూ... 31 శివలింగాలను ప్రతిష్ఠించి పూజలు చేశాడు. కదిలేలో స్వయంభువుగా వెలసిన శివుణ్ణి గుర్తించిన పరశురాముడు 32వ లింగంగా పూజించాడు. ఆయన చేసిన ఘోరతపస్సుకు లింగాకారంలో ఉన్న శివుడు కదిలాడు. దీంతో పరశురాముడుశివయ్య కదిలె... శివయ్య కదిలె...అంటూ పరవశించిపోయాడు. దీంతో ఈ ఆలయానికి, ప్రాంతానికి కదిలెగా... ఇక్కడి శివయ్యకు పాపహరేశ్వరుడిగా పేరొచ్చింది. ఇప్పటికీ భక్తులు కదిలె పాపన్నగా పిలుస్తారు. 400 ఏళ్ల క్రితం నిమ్మల పాలకులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.

ప్రత్యేకతలు: ఈ ఆలయంలో ఎత్తైన కొండలపై బండరాళ్లలో ఏడాది పొడవునా ఎండిపోకుండా ఒకే లాంటి జలధారతో ఉండే ఋషిగుండం ప్రధానమైంది. ఇందులోనే పరశురాముడు నిత్యం స్నానమాచరించి పాపన్నను పూజించాడు. పక్కపక్కనే ఉన్నా ఒక దాంట్లో వేడిగా, మరోదాంట్లో చల్లగా ఉండే సూర్య, చంద్ర గుండాలు.. పాలవలె తెల్లని నీళ్లతో గల పాలగుండం, ఎంతటి శత్రుత్వం ఉన్నా.. తనలో ఒక్కసారి మునిగితే అత్తాకోడళ్లను కలిపేసే అత్తాకోడళ్ల గుండం... తీర్థాన్ని తలపించే నీళ్లుగల తీర్థగుండం వీటన్నింటితో పాటు ఆవు మూతి నుంచి జలధార వచ్చే ఆవుమూతి గుండం (గో పుష్కరిణి) ఇక్కడి సప్తగుండాలు. ఎత్తయినా కొండపై బండరాయి మీదుగా ఏడాది పొడవునా నీరు ధారగా ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత. మూడు కాలాల్లోనూ ఒకే నీటిమట్టం కలిగి ఉండే రుషిగుండం ఎంతో పవిత్రమైంది.

శనీశ్వరుడి నుంచి రక్షణ: సాధారణంగా దేవాలయాలు తూర్పు, ఉత్తర దిశ ముఖ ద్వారాలను కలిగి ఉంటాయి. కానీ కదిలె పాపహరీశ్వర స్వామి పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శమిస్తాడు. పశ్చిమ దిశకు శని అధిపతి. తనను దర్శించుకునేందుకు వచ్చే భక్తులను పీడించవద్దని శనీశ్వరుణ్ని ఆదేశించేందుకే పరమేశ్వరుడు పశ్చిమాభిముఖంగా కొలువుదీరినట్లు చెబుతారు. శివుడే కాదు, బ్రహ్మ, విష్ణువు, వరాహస్వామి, నటరాజస్వామి ఇక్కడ కొలువుదీరారు. స్వామి వారి సన్నిధిలోనే 18వృక్షాలతో మిళితమైన మహావటవృక్షం ఉంది.

అపమృత్యు దోషాలు తొలగించే అన్నపూర్ణ

కదిలె పాపహరీశ్వరుడు మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై కొలువయ్యాడు. అయ్యవారి ఆలయం వెనుకభాగంలోనే అమ్మవారు కొలువయ్యారు. మాతాన్నపూర్ణేశ్వరి దక్షిణాభిముఖంగా ఉండటం ఇక్కడి విశేషం. యమస్థానమైన దక్షిణం వైపు ఉన్న అమ్మవారిని పూజిస్తే అకాల, అపమృత్యుదోషాలు, అన్ని సమస్యలూ తొలగిపోతాయని స్థల పురాణం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో త్రిమూర్తులూ దర్శనమిస్తారు. పాపన్న ఆలయానికి కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు నటరాజ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక గర్భగుడికి కుడివైపు వరాహస్వామి, ఎడమవైపు విష్ణుమూర్తి ఉండటం ఆలయ శిఖరంపై పంచముఖ శివుడి విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు ఇక్కడ ఏకశిలలో కొలువయ్యాడు. నల్లని ఏకశిలతో అందమైన అభరణాలతో నందీశ్వరుడు ఆకట్టుకుంటాడు.

390
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles