మనిషి మృత్యుంజయుడవుతాడా?


Sun,November 18, 2018 02:45 AM

MAN
మనిషి పక్షిని చూసి గాలిలో ఎగురడం నేర్చుకున్నాడు.చేపని చూసి నీటిలో ఈదడం నేర్చుకున్నాడు.కానీ, ఈ భూమి మీద మాత్రం మనిషిగా బతుకడం మర్చిపోయాడు. అందుకే తన ఆయుష్షు కోల్పోతున్నాడు. రోజు రోజుకూ మనిషి సగటు జీవితకాలం తగ్గుతూ పోతున్నది. కానీ.. ఈ భూమి మీద అన్నింటికంటే తెలివైన జీవి అయిన మనిషి.. తనకంటే ఎక్కువ కాలం బతికే..జీవులున్నాయని తెలిశాక.. ఊరుకుంటాడా? వాటికి అంత ఆయుష్షు ఎలా సాధ్యం..?నాకెందుకు అసాధ్యం అని పరిశోధనలు మొదలెట్టాడు. వయస్సు మీద పోరాటం.. ఆయుష్షు కోసం ఆరాటంతో చేస్తున్న పరిశోధనలు మనిషి మరణానికి మరణశాసనం రాస్తాయా? మనిషి వృద్ధాప్యాన్ని జయించి నిత్యయవ్వనం కోసం చేస్తున్న నిరీక్షణ ఫలిస్తుందా?

నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77177

MAN2
సమద్రపు క్వాహగ్ అనే ఆల్చిప్ప జీవిత కాలం ఎంతో తెలుసా? సగటున 400 సంవత్సరాలు.. పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా కనిపించే రెడ్ సీ ఆర్చిన్ అనే జీవి సగటున 200 యేండ్లు జీవించగలదు.
అందంగా కనిపించే అమేజాన్ ప్యారెట్ ఆయుష్షు 104 సంవత్సరాలు.. అంటే దాదాపు మనిషితో సమానం. అంటే.. మనిషి సగటు జీవితకాలం.. నూరేళ్లు అంటారు కదా. కానీ, ఇప్పుడతనికి నూరేళ్లు కాదు.. జస్ట్ 60 యేండ్లకు పడిపోయింది అతని సగటు జీవితకాలం. ఈ ప్రపంచంలో నేనే తెలివైనవాడిని అని విర్రవీగే మనిషి సగటు జీవిత కాలం ఇంతేనా? తనకంటే ఎక్కువకాలం జీవించే ప్రాణులు ఈ భూమ్మీదే తనతోపాటు నివసిస్తున్నాయని తెలుసుకున్న మనిషి.. ఊరుకుంటాడా? ఊరికే ఉంటాడా? వాటికి సాధ్యమైనది.. నాకెందుకు సాధ్యం కాదు!? ఆఫ్ట్రాల్ ఒక బల్లి.. తన తోక తెగితే మళ్లీ సృష్టించుకుంటుంది.. ఇది నాకెందుకు సాధ్యం కాదు.. నేను అలా చేయకూడదా? చేయలేనా? అనేది అతని తపన. ఆ తపన నుంచే అమరత్వం కోసం ఆరాటం మొదలైంది. ఆ ఆశ నుంచే మరణాన్ని జయించాలనే పోరాటం పురుడు పోసుకున్నది.

పుట్టిన ప్రతీ జీవి ఏదో ఒకరోజు గిట్టక తప్పదని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఈ భూమి మీద ఒక జీవి ఎప్పటికీ మరణం లేకుండా జీవిస్తున్నది. అదేమైనా అమృతం తాగిందా? దానికా వరం ఎవరిచ్చారు? శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఆ జీవి పేరు.. జెల్లీఫిష్. యస్.. మరణం అనేది దీని డిక్షనరీలో లేనే లేదు. టురిటోప్సిన్ అనే జాతికి చెందిన ఈ జెల్లీఫిష్ సముద్ర జలాల్లో జీవిస్తుంది. దీని జీవిత చక్రమే చిత్రంగా ఉంటుంది. మిగిలిన అన్ని జీవులలాగే ఇదీ పెరుగుతుంది. పెద్దదవుతుంది. కానీ ఆ తర్వాతే విచిత్రం జరుగుతుంది. వృద్ధాప్యం రాగానే ఇది అన్ని ప్రాణుల్లా మరణించదు. తిరిగి యవ్వనంలోకి వెళ్లిపోతుంది. మళ్లీ పెద్దదవుతుంది. దీన్నే సైంటిఫిక్‌గా చెప్పాలంటే.. అడల్ట్ స్టేజ్ నుంచి పాలిప్ స్టేజ్‌కు వెళ్లిపోతుందన్నమాట. అంటే.. ఈ రెండు దశలు ఒక దాని దర్వాత మరొకటి చక్రంలా తిరుగుతాయి. ఫలితంగా ఈ ప్రాణికి చావన్నదే రాదు. ఇదే లక్షణం కొన్ని జీవుల్లో స్వల్ప స్థాయిల్లో ఉంటుంది. ఈ కారణంగానే బల్లిలా ఉండే సాలమండర్స్ విరిగిపోయిన కాళ్లను మళ్లీ తెప్పించుకోగలవు. బల్లి కూడా తెగిన తోకను మళ్లీ వృద్ధి చేసుకోవడానికి కూడా కారణం ఇదే. ఇది కూడా కొంత మేర అమరత్వాన్ని సాధించడమే.

ఒక చిన్న జెల్లీఫిష్ అమరత్వాన్ని సంపాదించుకుంటే ఇంత తెలివితేటలున్న మనుషులమైన మనం ఈ విషయంలో ఎందుకు వెనుకబడిపోయాం? పూర్తిగా జెల్లీఫిష్‌లాగా జీవిత చక్రాన్ని నియంత్రించుకోలేమా??.. ఇదే ప్రశ్న తరతరాలుగా మనుషుల్ని వేధిస్తున్నది. అందుకే అమరత్వ సాధన కోసం నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మృత్యువును జయించాలనే కోరికతో అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. వృద్ధాప్యాన్ని గెలువాలనే తపనతో నిత్య పోరాటం చేస్తూనే ఉన్నాడు.

వృద్ధాప్యం.. ఒక పరిణామక్రమం..
మరణం.. ఒక రహస్యం..
ఈ రెండింటినీ జయిస్తే..
అమరత్వం.. ఒక అద్భుతం!
మరి.. వృద్ధాప్యం.. మరణం వేర్వేరా?
వృద్ధాప్యం.. వయసుకు సంబంధించినది..
మరణం.. ఆయుష్షుకు సంబంధించినది..

వయస్సు తగ్గించుకోవడానికి.. ఆయుష్షు పెంచుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? 50 యేండ్ల వాళ్లు.. ముప్పై, నలభై యేండ్ల వారిగా కనిపించడం.. వయస్సు తగ్గించుకోవడం.. డెబ్బయ్ ఎనభై ఏండ్లు బతికేవాళ్లు.. వంద నూటయాభై యేండ్లు బతికేలా చేయడం.. ఆయుష్షు పెంచుకోవడం. దీన్నిబట్టి వృద్ధాప్య పరిణామక్రమమే మరణానికి దారితీస్తుంది కదా.. మరి.. వృద్ధాప్యాన్ని జయిస్తే.. మరణాన్ని గెలిచినట్లేనా? వృద్ధాప్యానికి, మరణానికి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసాన్ని పొడిగించుకుంటే.. అదే దీర్ఘాయుష్షు. దీన్ని కొంత మేరకు పెంచుకోగలిగితే అమరత్వం వైపు అడుగులు పడినట్లే.
MAN3

మనిషి దీర్ఘాయుష్షు పొందడం సాధ్యమా?

ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం నుంచే జన్యుశాస్త్రం అభివృద్ధి చెందింది. మానవ దేహం మాత్రమే కాదు, ఏ జీవి అయినా అనేక జీవకణాలతోనే రూపొందుతుంది. ఆ కణాల్లో జన్యువులు ఉంటాయి. అవి డీఎన్‌ఏ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి. మన శరీర ఎదుగుదలకు ఈ జన్యువులు, డీఎన్‌ఏలే కారణమని చాలా అధ్యయనాల్లో తేలింది. దీంతో డీఎన్‌ఏ గుట్టు రట్టు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో జీవపదార్థం నుంచి జన్యువులను వేరు చేయగలిగారు. వాటిని ఒక జీవి నుంచి మరో జీవిలోకి మార్చగలిగారు. అంతేకాదు జీవుల్లో కొన్ని జన్యువులు నిద్రాణంగా ఉండిపోతాయని, మరికొన్ని ఉత్తేజితమవుతాయని కూడా గుర్తించారు. నిద్రాణంగా ఉండే జన్యువులను ఉత్తేజితం చేస్తే గతించిపోయిన మనిషి వయస్సు పెంచొచ్చు. దీని ఆధారంగా మనిషికి దీర్ఘాయుష్షును ప్రసాదించాలని మనిషి ప్రయత్నిస్తున్నాడు.

ఒక కణం మరో రకం కణంగా మారడం వల్లే జీవుల వయస్సు, ఆయుష్షు ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్పు చెందిన కణాలను తిరిగి యథాస్థితికి మార్చితే మనిషి మళ్లీ యవ్వన దశకు చేరుకోవచ్చు. కణాలు మార్పు చెందే స్థాయి ఒక్కో జీవిలో ఒక్కో విధంగా ఉంటుంది. ఈ స్థాయిపై ఆ జీవుల జీవితకాలం ఆధారపడి ఉంటుంది. మనిషి శరీరంలో కణాల మార్పు స్థాయిని పెంచితే అతని ఆయుష్షును ఇట్టే పెంచేయొచ్చు. దీని ఆధారంగా చేస్తున్న ప్రయత్నాల్లో, ప్రయోగాల్లో మనిషి దీర్ఘాయుష్షును పొందేందుకు టెక్నాలజీ ఎంతో సహకరిస్తున్నది. కృత్రిమ అవయవాల్ని తయారు చేసుకోవడం.. అత్యాధునిక టెక్నాలజీతో అవయవాల్ని బాగు చేసుకోవడం. అవసరమైతే.. శరీరంలో మార్పులకు కారణమైన డీఎన్‌ఏని సైతం ఆల్ట్రేషన్ చేసుకోవడం.. ఇవన్నీ భవిష్యత్తులో మనిషి ఆయువుకు ఆయువు పెంచడంపై ఆశ కలిగిస్తున్నాయి.
MAN4

పురాణాలు ఏం చెబుతున్నాయి?

ఒకసారి హిందూ పురాణాలు తిరగేస్తే ఎంతోమంది పుణ్యపురుషులు వేలాది సంవత్సరాలు జీవించినట్లుగా తెలుస్తున్నది. రావణాసురుడు వేలాది సంవత్సరాలు జీవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ కోసం రావణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడట. అదే నిజమైతే రావణ బ్రహ్మ ఎంత కాలం జీవించి ఉండాలి?
విశ్వామిత్రుడు ఒక సందర్భంలో దక్షిణ దిక్కుకు వెళ్లి పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడనీ, మరోసారి పశ్చిమానికి వెళ్లి మరో పది వేల సంవత్సరాలు తపస్సు చేశాడనీ పురాణాలు చెబుతున్నాయి. తపస్సుకే 20 వేల సంవత్సరాలు వెచ్చిస్తే ఆయన జీవితకాలమెంత?
దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అమృతం తాగిన దేవతలకు అమరత్వం సిద్ధించిందనీ మనకు తెలుసు.
రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవని మొక్కని తీసుకురావడం కోసం బయలుదేరి చివరకు దాన్ని గుర్తించలేక మొత్తం పర్వతాన్ని తీసుకొని వెళతాడు. నేటి శాస్త్రవేత్తలు అలాంటి మొక్కను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతకణాల్లో జీవలక్షణాలను తీసుకురాగల శక్తి కొన్ని మొక్కల్లో ఉన్నట్లు వారు చెబుతున్నారు. కొత్త కణాన్ని సృష్టించిన మానవుడు అమరత్వాన్ని కూడా సంపాదించాలనీ తపన పడుతున్నాడు. ఎప్పటికైనా మృత్యువును జయించి, వృద్ధాప్యం నుంచి తిరిగి యవ్వనాన్ని సంపాదించాలని ఆశపడుతున్నాడు.

అనేక కారణాల వల్ల కోల్పోయిన జీవన ప్రమాణాన్ని తిరిగి సంపాదించుకోవాలని మానవుడు ఆరాటపడుతున్నాడు. ఈ భూమి మీదనే అమరత్వం సాధించిన ప్రాణి జెల్లీఫిష్ ఉన్నప్పుడు మరికొన్ని వేలాది సంవత్సరాలు జీవిస్తునప్పుడు తాను ఎందుకు అమరుడు కాకూడదని మనిషి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.
MAN5

మరణానికి మరణం (డెత్ ఆఫ్ డెత్)

మృత్యువుని జయించడం, వృద్ధాప్యాన్ని గెలువడం.. ఈ రెండూ ఎప్పటికీ నెరవేరవనీ ఇప్పటి వరకు చాలామంది భావిస్తున్నారు. కానీ మరణానికి సంబంధించిన ఈ రెండు విషయాల గురించి ఇటీవలే సంచలన విషయాలు తెలియజేశారు ఇద్దరు ఫ్రొఫెసర్లు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ జాస్ లూయిస్ కార్డిరో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రవేత్త డెవిడ్ వుడ్ కలిసి రాసిన పుస్తకం డెత్ ఆఫ్ డెత్. మరణానికి మరణం దగ్గర పడిందని ఈ ఫ్రొఫెసర్లు అమరత్వంపై కొత్త ఆశలు తమ పుస్తకం ద్వారా కలిగించారు. మనుషులు ఇక నుంచి కేవలం ప్రమాదాల వల్ల తప్ప సహజ కారణాలతో, అనారోగ్యంతో చనిపోయే ప్రసక్తే లేదు. అలాగే వృద్ధాప్యాన్ని కూడా ఒక అనారోగ్యంగా పరిగణించగలిగితే.. దానికీ చికిత్స చేసి నయం చేసుకోవచ్చు.. ఆ దిశగా పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. జన్యు మార్పిడి పద్ధతులతో పాటు నానోటెక్నాలజీ పరిశోధనలకు ఎంతగానే ఉపయోగపడుతున్నాయి. పాడైన కణజాలాన్ని తిరిగి ఉత్తేజపరచడం, మృతకణాలను శరీరం నుంచి తొలిగించడం, చెడు జన్యువులను ఆరోగ్యవంతంగా మార్చడం, అలాగే ముఖ్యమైన అవయవాలను 3డీ ప్రింటింగ్ ద్వారా పునఃసృష్టించడం వంటి చర్యలు ఈ పరిశోధనల్లో అంతర్భాగాలు. జన్యుమార్పిడి ప్రయోగాలపై పెద్దగా చట్టాలు లేని కొలంబియాలో ఈ పరిశోధనలు జరుగుతున్నట్లు ఈ ప్రొఫెసర్లు తమ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు.
MAN6

3డీ బయోప్రింటింగ్

3డీ బయోప్రింటింగ్.. అంటే మనకు కావాల్సిన అవయవాల్ని మనమే ముద్రించుకోవడం. అవయవాల ఉత్పత్తి కోసం.. ఆధునిక సాంకేతికత అందిస్తున్న ఒక విప్లవాత్మకమైన మార్పు ఇది. 3డీ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే మనకు అందుబాటులో ఉంది. మనకు కావాల్సిన వస్తువులను మనమే ఈ ప్రింటర్స్ ద్వారా ముద్రించుకోవచ్చు. వాస్తవానికి ఇది ముద్రణే కానీ.. దీన్ని తయారీగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వస్తువుని ముద్రణ ద్వారా తయారు చేస్తుంది కాబట్టి. మామూలు ప్రింటర్లలో అయితే క్యాట్రిడ్జ్ ఇంక్ నింపుతాం. కానీ 3డీ ప్రింటర్లలో మనకు వస్తువు ఏ మెటీరియల్‌తో కావాలో దాన్ని క్యాట్రిడ్జ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ ఆ ప్రింటర్‌లో ఉంటాయి. సరే.. 3డీ ప్రింటింగ్.. వస్తువులు తయారు చేయడానికి పనికొస్తుందంటే నమ్మొచ్చు. కానీ మనం మాట్లాడుకుంటున్నది అవయవాలు తయారు చేయడం గురించి కదా. ఇప్పటి వరకు మీరు ఎక్స్‌రే, ఈసీజీ, ఫొటో స్కాన్ లాంటి మెషీన్లు చూసి ఉంటారు. 3డీ బయోప్రింటింగ్ కోసం కూడా అలాంటి యంత్రాలు ఉంటాయి. అవి మీకు కావాల్సిన అవయవాన్ని స్కాన్ చేసి అచ్చు అలాంటిదే ఒక 3డీ ఇమేజ్‌ను డిజైన్ చేస్తాయి. ఇక అవయవాన్ని ముద్రించడం కోసం కావాల్సింది.. లివింగ్ ఇంక్. ఒక వ్యక్తికి కావాల్సిన అవయవం నుంచి కణజాలాలను సేకరిస్తారు. వాటితోనే ఈ లివింగ్ ఇంక్‌ను తయారుచేస్తారు. ఒక్కో అవయవానికి ఒక్కో రకమైన విధానం ఉంటుంది. 3డీ డిజైన్‌ను కంప్యూటర్ ద్వారా ప్రింటర్‌కు పంపిస్తే కావాల్సిన ఆర్గాన్ ప్రింట్ అవడం మొదలవుతుంది. ఇదే 3డీ బయోప్రింటింగ్. చెడిపోయిన మనిషి ఎముకలోని మృదులాస్తిని రికవరీ చేయడంలో ఈ 3డీ బయోప్రింటింగ్ టెక్నాలజీ వాడకం ఇప్పటికే అందుబాటులో ఉంది.
MAN9

నానో టెక్నాలజీ

నానో విప్లవం.. మనిషి ఆయుష్షు పెంచే మరో అద్భుతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ సాంకేతిక పరిజ్ఞానం బయోలాజికల్‌గా కూడా విప్లవం సృష్టించనుంది. ఎన్నో సూక్ష్మ పరికరాలు మానవుడు ఆయుష్షును పెంచడానికి సాయపడనున్నాయి. నానో టెక్నాలజీ సాయంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు మాత్రమే కాదు, శరీరంలోకి ప్రవేశించి వ్యాధులతో యుద్ధం చేసే నానో రోబోలను కూడా శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నారు. మెడికల్ టెక్నాలజీలో వాడే పరికరాలను సాధ్యమైనంత తక్కువ సైజులోకి తగ్గించాలన్న ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. అవి ఎంతగా అంటే.. కంటికి కనిపించనంత పరిమాణంలో కూడా రోబోలు రూపొందుతున్నాయి. మన శరీరంలో వెళ్లి సర్జరీలు చేసేందుకు అవి రెడీ అయిపోతున్నాయి.
రక్తకణాల కంటే చిన్నవైన నానోపిల్స్ వీడియో కెమెరాలతో పాటు ఫ్లాష్‌లైట్, రేడియో ట్రాన్స్‌మీటర్, బ్యాటరీ, కంప్యూటర్ చిప్‌లను కూడా కలిగి ఉంటాయి. మనిషి శరీరంలో వ్యాధి సోకిన ప్రాంతాన్ని గుర్తించి దాన్ని నయం చేయగల సత్తా ఈ రోబోలకు ఉంది. నానో టెక్నాలజీ ఆధారంగా డీఎన్‌ఏ పరీక్షలు కూడా ఇప్పుడు చాలా సులువైపోయాయి. దీని ద్వారా క్యాన్సర్‌ను ముందే గుర్తించి నయం చేసే టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతున్నది. ఇలా నానో టెక్నాలజీ మనిషి జీవితం సుఖమయం చెయ్యడమే కాకుండా.. దీర్ఘకాలిక ఆయుష్షుకి కూడా తోడ్పడనున్నాయి. బహుశా మరో పది ఇరవై, ముప్పై యేండ్ల కాలంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
MAN8

యాంటీ ఏజింగ్ ఎంజైమ్స్

మానవ జీవితంలో జన్యుపటం ఆవిష్కరణ ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఈ జన్యుపటం ద్వారా క్రోమోజోమ్‌లలో టెలిమీర్ల స్థితిని బట్టి జీవితకాలాన్ని అంచనా వేయొచ్చు. టెలిమీర్ అంటే.. ఒక క్రోమోజోమ్ చివర పునరుక్తి అయ్యే డీఎన్‌ఏ అన్నమాట. ఈ టెలిమీర్‌లు బాగా క్షీణించినప్పుడు కణాలు చనిపోతాయి. దీన్ని బట్టి వృద్ధాప్యం వస్తుంది. ఈ టెలిమీర్ అంతరించకుండా నిలువరిస్తే మానవుని జీవితకాలాన్ని కొంత పెంచొచ్చు.
జీవ శాస్త్రంలో వృద్ధాప్యం అనేది.. జన్యు ప్రభావిత లక్షణాలలో ఒక ప్రక్రియ మాత్రమే. జన్యువులలో మార్పులు చేసి వృద్ధాప్యం దరి చేరకుండా చేయొచ్చు. వృద్ధాప్యం మీద జన్యువుల ప్రభావం ఆధారంగా జన్యు మార్పిడి ఔషధాలను తయారు చేసే దిశగా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలను సమన్వయ పరిచి దీన్ని సాధించాలన్న ప్రయోగాలు ఈ పాటికే ముమ్మరంగా సాగుతున్నాయి. అంటే.. మన సమీప భవిష్యత్తులోనే ఈ మందులు అందుబాటులోకి రానున్నాయన్నమాట. వీటి ద్వారా ఆయుష్షు కేవలం వందేళ్లు మాత్రమే కాదు.. 150 యేండ్ల వరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మనిషి వయసు పెరుగుదలకు కారణమైన వ్యవస్థను నెమ్మదించేందుకు ఒక ఎంజైమ్‌ను తయారు చేయాలని కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇది వయస్సుతో పాటు వచ్చే వ్యాధులను నిరోధించడంతో పాటు, తద్వారా మన ఆయుష్షు పెరగనుందని అంటున్నారు. ఈ ఎంజైమ్ మీద పనిచేసే మందుల ఆవిష్కరణ కోసం కొలంబియా, మెల్‌బోర్న్‌లలో భారీ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి.
MAN7

2045 ఇనిషియేటివ్

యంత్రుడే చిరంజీవి అవుతాడు- ఇది రష్యన్ కోటీశ్వరుడు డిమిత్రీ ఇట్సుకోవ్ అన్నమాట. దీర్ఘాయుష్షు పొందాలని ఎన్నో యేండ్లుగా ఎదురుచూస్తున్న మనిషి కల ఈయన నిజం చేస్తానంటున్నాడు. ఈయన చెబుతున్నది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది ఆయన చేపట్టిన డ్రీమ్ ప్రాజెక్ట్. 2011లో మొదలుపెట్టిన ఈ మహా మానవ పథకానికి ఆయన 2045 ఇనిషియేటివ్ అని పేరు పెట్టాడు. సగం మనిషి, సగం యంత్రం కలబోతగా ఉండే యంత్రుడిని సృష్టించాలని డిమిత్రీ కలగంటున్నాడు. ఈ కల 2045 నాటికి సాధ్యం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ 2020 నాటికి ఓ కృత్రిమ శరీరంలోకి మానవ మెదడును ప్రవేశపెట్టి అవతార్‌ను సృష్టించాలని డిమిత్రీ కోరుకుంటున్నాడు. బ్రెయిన్ మెషీన్ ఇంటర్‌ఫేస్‌గా పిలిచే ఈ సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే ఇందులో మరింత ఆధునాతన ప్రక్రియలను డిమిత్రీ పొందుపరచాలనుకుంటున్నాడు. 2035కల్లా ఆ బ్రెయిన్ వల్ల రోబోలో కదలికలు తెస్తారట. 2045 నాటికి మానవుడు పూర్తిగా యంత్రుడిగా జీవించగలుగుతాడు. ఇక ఆ మానవార్థ యంత్రుడికి దీర్ఘాయుష్షు సొంతమవుతుంది. మరణం అతని దరికి చేరదు అంటున్నాడు డిమిత్రీ. ఈ ప్రాజెక్టు కోసం ఇట్సుకోవ్ 30 మంది శాస్త్రవేత్తల బృందాన్ని నియమించుకున్నాడు. అవతార్-ఎ, బీ, సీ, డీ పేర్లతో నాలుగు దశల్లో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇక మనం దీర్ఘాయుష్షు గల మనుషుల్ని చూడొచ్చన్నమాట.
MAN10

881
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles