తిన్నా తినకున్నా తిప్పలే..!


Sun,September 9, 2018 02:40 AM

Food
శరీర బరువు చేదుగా మారుతున్నది. కడుపు నిండా భోజనం కలగా మారుతున్నది. తూకమేసి తినడం.. కొలుచుకొని తాగడం.. అంతా మితం పరిమితం. అర్ధాకలికి తట్టుకోలేక.. ప్రాణం ఆగక ఓ ముద్ద ఎక్కువ తింటే ఎన్ని కిలోల బరువు పెరుగుతామో అనే ఆందోళన. ఎన్ని ప్రొటీన్లు తీసుకున్నాం? కార్బోహైడ్రేట్లెన్ని? క్యాల్షియమెంత? మెగ్నీషియమెంత? బరువెంత? భరోసా ఎంత? దునియా మొత్తం ఇలానే జరుగుతున్నది. తిన్నా తిప్పలే.. తినకున్నా తిప్పలే. బతులేక తింటూ.. తినలేక బతుకుతూ బరువుతో ఏకరువు పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల గురించి ఈ తిండీ తిప్పల కథనం.
Food1
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. ఇండియాలో 18-49 ఏళ్ల వయసున్న ఆడవాళ్లు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

బరువు పెరుగకముందు కూజాలా ఉన్న శరీరం ఒక్కసారి కుండలా మారిపోవడంతో జనాల్లో ఆందోళన మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఇండియాలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. ఇండియాలో 52.4% ప్రజలు ఒబేసిటీతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 40% మంది ఏదో ఒక రకంగా ఈ అధిక బరువు సమస్య నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నారు. డైటింగ్‌లనే ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.
దాయి శ్రీశైలం సెల్: 8096677035

Food2
సమస్య ఏంటి?: : అధిక బరువుకు ముఖ్య కారణం జీవనశైలి. దాంట్లో మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. జీవనశైలికి సంబంధించిన ప్రధాన లోపాలను తీసుకుంటే ఆహారం ముందు వరుసలో ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే బరువు పెరుగుదల.. తగ్గుదల ఆధారపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 75% మంది ప్రజల్లో ఒబేసిటీ లాంటి సమస్యలు వస్తున్నట్లు న్యూ వరల్డ్ సిండ్రోమ్ అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థ తాజాగా మానవ జీవనశైలి-వ్యాధులు అనే అంశంపై అధ్యయనం చేపట్టగా వాటిలో ప్రధానమైన లోపం ఆహార నియమాలు సక్రమంగా లేకపోవడమే అని తేలింది.

పరిష్కారమేంటి?: ఒబేసిటీ నుంచి బయటపడాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నపళంగా తిండి తిప్పలు మానేస్తున్నారు. కొద్దిగా తినాలనీ.. అసలు తినడమే మానేయాలనీ ఇలా రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆహారం తీసుకునే వేళల్లో మార్పులు చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చనీ.. అధిక బరువు తగ్గించుకోవచ్చని సర్వేలు కూడా చెప్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్‌కు చెందిన సర్రే యూనివర్సిటీ ఈ అంశంపై అధ్యయనం చేసింది. మనకు తోచినప్పుడు కాకుండా ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకొని ఆహారం తీసుకోవాలని సూచించింది. ఆరోగ్యకరమైన డైటింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గొచ్చని తాజాగా అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు చెప్పారు. హార్ట్ హెల్దీ డైట్ నియమం పెట్టుకొని ఎక్కువగా ఫైబర్.. తక్కువ సాచురేట్ ఫ్యాట్స్ ఉన్న ఆహారం తీసుకుంటే అధిక బరువు తగ్గుతామన్నారు.

డైటింగ్ పోటీలా?: నిపుణులు చెప్పేది కరెక్టే. సర్వేలు వెల్లడించేవీ సబబే. కానీ వాటిని పాటించే విషయానికి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోతుంది. త్వరగా తగ్గాలనీ.. అద్భుతమైన మార్పు సొంతం చేసుకోవాలనే ఉత్సుకతతో కొందరు డైటింగ్‌ను పాటించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నియమాలను పట్టించుకోకుండా సొంత ప్రణాళికలు వేసుకుంటూ ఆరోగ్య ముప్పు కొని తెచ్చుకుంటున్నారు. బరువుపై ప్రజలకు ఉన్న ఆసక్తిని పసిగట్టి రకరకాల డైటింగ్ విధానాలు మార్కెట్లోకి రావడంతో అన్ని రకాల డైట్లు పాటిస్తూ దేనిలో మార్పు సాధించక.. ఫలితం లేక కథను మళ్లీ మొదటికి తీసుకొస్తున్నారు.

ఏ డైట్ మంచిది?: పద్ధతి ప్రకారం చేసే ఏ డైట్ అయినా మంచిదే అంటున్నారు నిపుణులు. మహిళలకైనా.. పురుషులకైనా న్యూట్రిషియన్ బేస్డ్ డైట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అమెరికాకు చెందిన బింగ్‌హమ్‌టన్ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ డైట్‌ను బ్యాలెన్స్‌డ్‌గా చేయడం వల్ల 48% పురుషుల్లో 52% స్త్రీలలో మంచి మార్పులు వచ్చినట్లు వాళ్లు చెప్పారు. పద్ధతి లేకుండా ఇష్టమొచ్చినట్లు ఏ డైటింగ్ పాటించినా వృథానే అవుతుందన్నారు. పైగా అది ప్రాణం మీదికొచ్చి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నవాళ్లవుతారని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

డైటింగ్ డేంజరా?: అధిక బరువుకు సత్వర నివారణా చర్యలలో భాగంగా తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తున్నాయి. నిజానికి ఏ డైటూ 100% ఫలితాలు ఇవ్వదు. శారీరక, మానసిక ఆరోగ్యాలు, అలవాట్లు, శరీరతత్వం, నివసించే ప్రాంతం, జన్యు సంబంధ సమస్యలు, సంక్రమణ వ్యాధులు మొదలైన అనేక అంశాలను పరిగణనలోనికి తీసుకొని డైట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. డైట్ల విషయంలో జరుగుతున్న మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఎవరికో ఒకరికి ఫలానా డైట్ పాటించడంతో మంచి ఫలితాలు వచ్చాయనీ తాము కూడా ఫాలో అవుదామనే ధోరణి ప్రజల్లో ఎక్కువైంది.

ఏ డైటింగూ లేని కాలంలో: ఇప్పుడు తినే తిండి.. తాగే నీరు.. పాలు అన్నీ విషతుల్యమే. ఆహారంలో నాణ్యత లోపించింది. పైగా ప్రతీదీ ప్రాసెసింగ్. కానీ ఒకప్పుడు ఇవేవీ లేని కాలంలో మన ముందుతరం వాళ్లు ఎలా ఉండేవారు? వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? సహజంగా లభించే ఆహారం తీసుకొని సంతోషకరమైన జీవితాన్ని గడిపారు వాళ్లు. బియ్యం అసలు వాళ్ల మెనూలో ఉండకపోయేది. జొన్నలు.. రాగులు.. సజ్జలు ఇలా ఆరోగ్యానికి అవసరమైన ఆహారం ఎవరూ చెప్పకుండానే తీసుకునేవారు. ఎలాంటి రోగాలు.. నొప్పులు రాకుండా వందేండ్లు బతికేవాళ్లు. తిండి కూడా ఒక్కొక్కరు కిలో తినేది. ఎంత తింటే అంత ఆరోగ్యం అన్న సిద్ధాంతం వారిది.

వెనుకటి నియమాలు: అస్తవ్యస్తమైన ఆధునిక జీవన విధానం, ఆహార నియమాల వల్ల విసుగు చెంది కొంతమంది వెనుకటి నియమాలను వెతుక్కుంటున్నారు. మన ముందు తరం వాళ్లు ఎలాంటి ఆహార నియమాలు పాటించారు? వాళ్ల సంపూర్ణ ఆరోగ్యంతో ఎలా ఉండగలిగారు? వంటి విషయాలపై అధ్యయనం చేసి సహజసిద్ధమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వంటచేసేందుకు మట్టి పాత్రలు.. వడ్డించేందుకు కంచు పాత్రలు వాడుతున్నారు. నీళ్లు కూడా ప్లాస్టిక్, స్టీల్ బాటిల్స్‌లో కాకుండా రాగి చెంబుల్లో పోసుకొని తాగుతున్నారు. ఎక్కువ మోతాదులో తిన్నా సరేగానీ.. ఏది తింటున్నామనే దానిపై అవగాహనతో వెళ్తున్నారు.

ఇవేవీ పాటించనివాళ్లు: ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని.. ఎవరో ఒకరికి పని చేసిందనే అవగాహనా రాహిత్యంతో రకరకాల డైటింగ్‌లు పాటిస్తున్నారు. నిజానికి కొన్ని తాత్కాలికంగా పని చేసినప్పటికీ, భవిష్యత్తులో జీవక్రియలకు ఆటంకంగా మారి ఆరోగ్య సమస్యలు తెచ్చే ప్రమాదాలు లేకపోలేదనే విషయం డైటింగ్ భ్రమలో పడినవాళ్లు గమనించడం లేదు. కొందరంటారు.. ఆకలితో ఉన్నప్పుడు కూడా ఆహారం తీసుకోవద్దని. కొందరంటారు పుష్టిగా భోజనం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటామని. కొందరు కీటో అంటారు.. మరికొందరు వీరమాచినేని అంటారు. ఏది పాటించాలి? ఏది మంచి ఫలితాలను ఇస్తుంది? ఇవేవీ పూర్తిస్థాయిలో తెలుసుకోకుండా ఏ డైటూ సక్రమంగా పాటించక దీర్ఘకాలిక సమస్యలను తెచ్చుకుంటున్నారు కొందరు.

ఎవరేమంటున్నారు?: కీటోడైట్ కొత్తదేమీ కాదనీ.. ఇది పాత పద్ధతేననీ.. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తే.. అవి సమస్యలు కావు.. శరీరం డైటింగ్‌కు అలవాటు పడేదాక చూపించే కొన్ని ప్రతికూల లక్షణాలు మాత్రమే అని కీటో వంటి డైట్స్ పాటించేవాళ్లు చెప్తున్నారు. కీటోవల్ల ప్రధానంగా తలనొప్పి, అలసట, జ్వరం వస్తాయట. దీనినే కీటో ఫ్లూ అంటారు అని డాక్టర్లు అంటున్నారు. పిండి పదార్థాలను అతి తక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పి, అలసట, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఆహారం తీసుకోవడం ఆలస్యం అయితే చికాకు, కోపం కూడా వస్తాయి. సాధారణంగా పిండి పదార్థాలే మనకు కావాల్సిన ఫ్యూయల్‌ను ఇస్తాయి. శరీరం సాధారణ రీతిలో పనిచెయ్యడానికి పిండిపదార్థాలు చాలా అవసరం. కానీ, కీటో డైట్‌లో కొవ్వును ఫ్యూయల్‌గా ఉపయోగిస్తాం కాబట్టి, ఈ ప్రాసెస్ ఎడ్జస్ట్ అయ్యే వరకు మొదట్లో తలనొప్పి, అలసట తప్పవు. ఇవి పెద్ద సమస్యేం కావు అంటున్నారు కీటోజెనిటిక్ డైటీషియన్లు.

ఔనంటే కాదనిలే: పద్ధతి ప్రకారం చేస్తే ఏ డైట్ అయినా ఫలితాలు రాబట్టొచ్చు అంటున్నారు నిపుణులు. అది వీరమాచినేని కావచ్చు.. కీటోజెనిటిక్ డైట్ కావచ్చు.. ఇంకేదైనా కావచ్చు. వ్యతిరేకించేవాళ్లు వ్యతిరేకిస్తున్నా సరే వీరమాచినేని డైటింగ్‌ను ప్రొఫెషనల్ డాక్టర్లు కూడా సమర్థిస్తుండడాన్ని బట్టి ఇది చెప్పవచ్చు. పలు సందర్భాల్లో డిబేట్లు పెట్టి మరీ ఈ విషయాన్ని తెలియజేశారు. వీరమాచినేని డైటింగ్ నిస్సందేహంగా పాటించవచ్చని.. దీనివల్ల 90% శరీర బరువును తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఒక్కోసారి న్యూరాలజిస్ట్‌లకు కూడా వీరమాచినేని డైట్ ఫాలోయింగ్ ఆశ్చర్యంగా అనిపిస్తుందట. అందుకే అందరూ దీనిని కరాఖండిగా వ్యతిరేకించకుండా ఏది పాటించినా పద్ధతిగా పాటిస్తే సరిపోతుందంటున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా రోగులు కీటోడైట్ పాటిస్తే కిడ్నీలు పాడవుతాయని.. షుగర్ లెవల్స్ పెరుగుతాయని డాక్టర్లు అంటున్నారు. ఒక్కొక్కరి శరీరస్థితి.. వ్యాధి నిరోధకత ఒక్కోలా ఉంటుంది. కాబట్టి ఇంకొకరు చేశారనో.. లేదా సోషల్‌మీడియాలో అద్భుతంగా చెప్తున్నారనో గుడ్డిగా పాటించకుండా మీ స్థితి ఏంటి? ఏదైతే సూట్ అవుతుందో డాక్టర్ సలహా మేరకు పాటిస్తే బాగుంటుంది.
dieting-hard
డాక్టర్లు చెప్పేదేంటంటే?: కీటో డైట్ వంటివి ఆరంభిస్తే తీవ్ర సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఆహారం మొదలుపెట్టిన తర్వాత శరీరంలోని కొవ్వు ఎక్కువగా కరిగిపోతుంటే కీటోన్ బాడీస్ తయారై వాటి స్థాయిలు పెరిగి స్పృహ తప్పడం వంటి కీటోసిస్ సమస్యలు తలెత్తే ముప్పు ఉందంటున్నారు వైద్యులు. కొవ్వు చాలా ఎక్కువగా తింటుంటే వాళ్ల శరీరం నిల్వ ఉన్న కొవ్వులు, ప్రొటీన్ల నుంచి గ్లూకోజును తయారు చేసుకోవడం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో యూరియా, క్రియాటినైన్, యూరిక్ యాసిడ్, పొటాషియం వంటివన్నీ పెరుగుతాయి. ఇవన్నీ ఒక మోస్తరు వరకూ మూత్రంలో వెళ్లిపోతుంటాయి గానీ, ఒకస్థాయి దాటితే వీటితో తీవ్ర దుష్ప్రభావాలు మొదలవుతాయి. ప్రాణహాని కూడా జరుగొచ్చు. ముఖ్యంగా గుండె, లివర్, కిడ్నీలు దెబ్బతినొచ్చు. ప్రొటీన్లనేవి మన ఒంట్లో రోగనిరోధక శక్తికి కూడా అత్యంత కీలకమైనవి. ఇవి తగ్గిపోతే రోగనిరోధక శక్తి తగ్గి, రకరకాల జబ్బులు, ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కీటోడైట్ వంటివి తీసుకోవాలని అనుకుంటుంటే ముందు వైద్యులను సంప్రదించి గుండె, లివర్, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు బాగుందని నిర్ధారించుకున్న తర్వాతే ప్రయత్నించడం మంచిదంటున్నారు డాక్టర్లు.
Prashanthi

సమతుల్యత పాటించాలి:

డైట్ చెయ్యడం వరకు బాగానే ఉంటుంది. కానీ దీన్ని ఆపేసిన తర్వాత మళ్లీ బరువు పెరుగుతారు. దీనివల్ల రెసిస్టెంట్ కొవ్వు పెరుగుతుంది. ఏ డైట్ అయినా సరే మూడు నెలలు తప్పనిసరిగా చెయ్యాలి. ఫలితంగా బరువు తగ్గుతారు. అప్పుడు ఆ తగ్గిన బరువునే కనీసం ఏడాదిన్నర పాటు మెయిన్‌టెయిన్ చెయ్యాలి. అలా చెయ్యగలిగితే మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉండదు. సమతుల్యత లోపించడం వల్ల బరువు పెరుగడం.. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యంగా.. ఉత్సాహంగా ఉండాలంటే సమతులాహారం.. మన జీవన విధానంలో మార్పులు అవసరం.
డాక్టర్ ప్రశాంతి, డైటీషియన్, యశోదా హాస్పిటల్స్, సోమాజీగూడ
Madhurima-Sinha

టార్గెట్ కావద్దు:

యువత ఎక్కువగా ఈ డైట్ పట్ల ఆకర్షితులవుతున్నది. ఇంటర్నెట్‌ను వేదికగా చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా సొంత ప్రయోగాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నది. ఏదైనా ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం దానికి సంబంధించిన నిజా నిజాలేంటో తెలుసుకోవాలి. మీ శరీరతత్వానికీ అవసరమైన ఆహారం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం డైట్ ప్లాన్ చెయ్యాలి. బరువు తగ్గటమన్నది ఆరోగ్యకరంగా తగ్గాలి. దానివల్ల ఇంకో సమస్య ముంచుకొచ్చేలా ఉండొద్దు. కీటో డైట్‌గానీ.. ఇంకేదైనా కానీ బరువు తగ్గాలనే ఉత్సుకతతో దానికి టార్గెట్ కావద్దు.
-డాక్టర్ మధురిమ సిన్హా, క్లినికల్ న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్, నాంపల్లి
Keto

కీటోడైట్ మంచిదేనా?

ఈ మధ్య కాలంలో కీటోడైట్ ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో మనందరికీ తెలుసు, పైగా అనేకమంది ఈ ఆహార ప్రణాళిక ద్వారా ప్రయోజనం పొందుతున్నామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా కార్బోహైడ్రేట్లను ఆహారప్రణాళిక నుంచి తొలిగించడం ద్వారా, అతి తక్కువకాలంలో అధిక బరువుకు స్వస్తి పలుకవచ్చన్న అంశంతో ముందుకు వచ్చింది ఈ కీటోడైట్. ఈ విధానంలో ఆహారంలో అధిక శాతం కొవ్వు పదార్థాలు, నార్మల్ లెవెల్‌లో ప్రొటీన్స్, అతి తక్కువ పిండి పదార్థాలు ఉంటాయి. అన్నం, చపాతీలు తినొద్దు. పండ్లకు కూడా దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్స్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇవి ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. అలాగే కొవ్వు కరుగడం మొదలవుతుంది.

వ్యాయామమే కీలకం

డైట్‌ను ఫాలో కావాలంటే ముందుగా మనకున్న ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. బరువు తగ్గే డైట్‌ను ఎంతకాలం తీసుకోవాలి? ఆ తరువాత ఎలా బరువును అదుపులో ఉంచుకోవాలి? అన్నవి తప్పనిసరిగా తెలుసుకోవాలి. డైట్ చెయ్యడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారు. దాన్ని అలాగే కొనసాగించకపోతే కొద్ది కాలానికే మళ్లీ బరువు పెరుగుతారు. వాస్తవానికి కీటో వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పేందుకు దీర్ఘకాలిక అధ్యయనాలు సైతం ఏవీ చేపట్టలేదు. అలా అని కీటో డైట్ ఒక్కటి చేస్తేనే బరువు తగ్గిపోతామనీ పస్తులుండి ఎలాంటి వ్యాయామం చేయకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే. మితాహారం తీసుకుంటూనే వ్యాయామం చేస్తే బరువు తగ్గడం.. ఆరోగ్యంగా ఉండడం అనేది సాధ్యపడుతుంది. అంతేగానీ తిండీ తిప్పలు మానేసి.. తిష్టవేసి కూర్చుంటే ప్రయోజనం ఉండదు.

వీరమాచినేని డైట్ ఏంటి?:

కార్బోహైడ్రేట్లు వద్దు.. కొవ్వులు తినండి అని చెప్పే డైట్ వీరమాచినేనిది. కొవ్వును కొవ్వుతోనే కరిగించాలనేది ఈ డైట్ ఉద్దేశం. షుగర్ వ్యాధిగస్ర్తులకు పరిష్కారం చూపెడుతూ ప్రాచుర్యం పొందిన వీరమాచినేని డైటింగ్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. బరువు తగ్గాలనుకున్నవారిలో దాదాపు 45% ఇప్పుడు వీరమాచినేని గురించే ఆలోచిస్తున్నారట. అతను చెప్పేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. డాక్టర్ల దగ్గరకి వెళ్లొద్దంటారు. మెడిసిన్ తీసుకోవద్దంటారు. కేవలం ఫ్యాట్‌తో మాత్రమే బరువు తగ్గొచ్చంటారు. సాలీడ్ డైట్ చేస్తే కొంచెం నెమ్మదిగా.. లిక్విడ్ డైట్ చేస్తే కొంచెం వేగంగా బరువు తగ్గి సన్నబడతారనేది ఆయన చెప్పే మాట. షుగర్‌తో పాటు శరీర బరువు, ఇతర రుగ్మతల నుంచి ఉపశమనానికి ఈ ఆహార పద్ధతులు మేలు అని చెప్పడంతో పాటించేవారు ఎక్కువయ్యారు. వీరమాచినేనితో ఏకంగా సదస్సులు, సభలు నిర్వహించే పీక్‌కి వెళ్లింది.
Food3

టాప్ 9 డైటింగ్స్

1 రా ఫుడ్ డైట్:

తినే ఆహారం.. తాగే పానీయాలు అన్నీ నేచురల్‌గా ఉండాలి. ఎలాంటి ప్రాసెసింగ్ చేయొద్దు. ఒకరకంగా ముడి ఆహారం మాత్రమే తీసుకోవడం ఈ డైటింగ్ విధానం.

2 సౌత్ బీచ్ డైట్:

ఇన్సులిన్ స్థాయిలను తగ్గించేందుకు ఈ డైటింగ్ ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు అనేది దీని ఉద్దేశం.

3 మెడిటెరేనియన్ డైట్:

అలవాట్లపై ప్రభావితం చేసే విధానం ఇది. బీన్స్.. నట్స్.. తాజా పండ్లు.. ఉడుకబెట్టని ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చని మెడిటేరియన్ డైటింగ్ సూచిస్తుంది.

4 ఆట్కిన్స్ డైట్:

శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలో భాగంగా తక్కువ మోతాదు కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

5 వేగాన్ డైట్:

గుడ్డు.. పాలు.. తేనె తినొచ్చు. వీటితో పాటు శాకాహారం తీసుకోవాలి. ఈ డైటింగ్ విధానాన్ని ఫిలాసఫీతో పోలుస్తుంటారు నిపుణులు. ప్లాంట్‌బేస్డ్ ఫుడ్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి.

6 వెయిట్ వాచర్ డైట్:

చాలా పురాతనమైన విధానం. 1960 నుంచే ఇది వాడుకలో ఉంది. తిండి కన్నా వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శరీర బరువు తగ్గాలంటే కచ్చితంగా నిర్దిష్టమైన వ్యాయామం అవసరమేది ఈ డైటింగ్ ఫార్ములా.

7 జోన్ డైట్:

పౌష్టికాహార సమతుల్య విధానం ఇది. ఆహారంలో 40% కార్బోహైడ్రేట్స్, 30% కొవ్వులు, 30% ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తూ, శరీర బరువును తగ్గిస్తుంది.

8 కీటోజెనిటిక్ డైట్:

దశాబ్దాలుగా పరిచయమున్న డైటింగ్ విధానమిది. కార్బోహైడ్రేట్లను తక్కువ మోతాదులో తీసుకొని.. కొవ్వులను పుష్కలంగా తీసుకోవాలన్నదే ఈ డైటింగ్ ఫార్ములా. దీంట్లో భాగంగా నాన్‌వెజ్ తీసుకోవచ్చు.. నూనెలు వాడొచ్చు.

9 వెజిటేరియన్ డైట్:

కూరగాయలు తింటూ కడుపు నింపుకొనే డైట్ ఇది. కనీసం గుడ్డు.. పాలు.. తేనె కూడా తీసుకోవద్దు. అన్నీ కూరగాయలే. దీంట్లో లాక్టో వెజిటేరియన్, ఫ్రూటేరియన్ వెజిటేరియన్, లాక్టో ఓవో వెజిటేరియన్, లివింగ్ ఫుడ్ డైట్ వంటి రకాలుంటాయి.

1269
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles