గాంధారి ఖిల్లా


Sun,November 18, 2018 02:06 AM

గోండు రాజుల కోటలు - రెండో భాగం
Gandhari
నగేష్ బీరెడ్డి
ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ
సెల్ : 80966 77177

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలో గాంధారి ఖిల్లా ఉంది. మందమర్రి, మంచిర్యాల మధ్యన నాగ్‌పూర్, హైదరాబాద్ రహదారి పక్కనుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతం నుంచి తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కేంద్రం నుంచి పాలవాగు దాటి వెళితే కనిపించే పెద్ద గుట్టనే గాంధారి ఖిల్లాగా పిలుస్తారు. గిరిజన శిల్పులు, కళాకారులు చెక్కినవిగా చెప్పే అద్భుతమైన శిలారూపాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. చారిత్రక ఆధారాల ప్రకారం ఇది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలుస్తున్నది. గోండు రాజులు ఈ గాంధారి ఖిల్లాను కేంద్రంగా చేసుకొని చుట్టు పక్కల ప్రాంతాలను చాలా సంవత్సరాల పాటు పాలించారు. కొంతకాలం వడ్డె రాజులు, రెడ్డి రాజులు కూడా ఈ ఖిల్లా కేంద్రంగా పాలన సాగించారు. ముస్లిం రాజులు, కాకతీయ రాజుల దాడుల ప్రభావంతో ఆ రాజులు ఈ కోటలోనే తలదాచుకున్నట్లు చరిత్ర చెబుతున్నది. మహాభారతం ఆధారంగా ఈ కోటకు గాంధారి కోట అని పేరు వచ్చిందని కొందరు చెబుతారు. గాంధారి మైసమ్మ కోటకు మూల దేవతగా పూజలందుకుంటున్నందు వల్ల ఈ కోటకు ఆ పేరొచ్చిందని ఇంకొందరు చెబుతారు.
Gandhari1
కోటలో ఎన్నో అపురూప రాతి నిర్మాణాలు, ఆలయాలు ఉన్నాయి. కోటలోకి వెళ్లడానికి పెద్ద రాతి కొండను తొలిచి ప్రవేశ ద్వారం నిర్మించారు. పటిష్టమైన ఈ ద్వారానికి కుడివైపున రాతిగోడపై గిరిజనుల ఆరాధ్య దైవం గాంధారి మైసమ్మతో పాటు, కాలభైరవుడు, విఘ్నేశ్వరుడు, శివుడు, ఆంజనేయుని విగ్రహాలు కొలువై ఉన్నాయి. వివిధ దేవాలయాలతోపాటు శత్రువుల రాకను పసిగట్టే విధంగా ప్రత్యేకమైన ప్రహరీగోడ నిర్మాణం కూడా ఉంది. కోటపై రక్షణ కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలలో 8 మీటర్ల పొడవైన నగారా గుండు కూడా ఉంది. అప్పటి నిర్మాణ కౌశలానికి, వారి చాతుర్యానికి ఇదొక ఉదాహరణ. కోటకు మూడు వైపులా రాతిద్వారాలు ఎత్తయిన కొండను తొలిచి నిర్మించారు. కోటపైన మూడు గుహలు కనిపిస్తాయి. ఒక గుహలో ఒకేసారి వేయి మంది సమావేశం అయినా సరిపోయేంత విశాలమైన మందిరం ఉంది. సహజసిద్ధంగా అందులోకి సూర్యకాంతి వస్తుంది. కోటలోని ప్రజల అవసరాల కోసం గుట్టపైనే విశాలమైన చెరువును తవ్వారు. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం ఆకర్షణీయంగా ఉంటుంది. సుమారు 8 అడుగుల ఎత్తులో 12 అడుగుల నాగశేషుని విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం పక్కనే మూడు బావులుంటాయి. వీటినే సవతి బావులంటారు. రెండు సంవత్సరాలకు ఒకసారి నాయక్‌పోడ్ తెగకు చెందిన గిరిజనులు ఈ ఖిల్లాపై జాతర జరుపుతారు.

678
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles