నాన్నకు ప్రేమతో...


Sun,June 17, 2018 02:45 AM

fatherDAY
అమ్మ వాస్తవం, నాన్న నమ్మకం. నవ మాసాలూ మోసి ప్రసవ వేదననుభవించి ఒక శిశువుకు తల్లి జన్మనిస్తే, ఆ శిశువు యుక్తవయసుకు వచ్చే వరకూ, ప్రయోజకంగా తీర్చిదిద్ది కంటికి రెప్పలా కాపాడి భరోసానిచ్చేది తండ్రి. అమ్మ లాలించి.. లాలపోసి..బువ్వ పెడితే నాన్న అడుగులేయించి.. అక్షరాలు పలికించి అన్నీ తానై తోడూ నీడగా ఉంటాడు. నాన్న సముద్రంలా గంభీరంగా ఉంటాడు. అయితే మనసు మాత్రం వెన్న. క్రమశిక్షణతో ఉండాలంటాడు. కాలాన్ని వృథా చేయొద్దు అంటాడు. కార్యశీలతకు ప్రాధాన్యం తన ముఖం మీద ఎలాంటి బాధ కనిపించకుండా సంక్షోభ సమయాలను పరిష్కరించి కుటుంబ గౌరవాన్ని కాపాడుతాడు.నాన్న ప్రశాంతత నిండిన నీలాకాశం. అమృతం నింపుకున్న కలశం. ఆయన మనసు హిమాచలం. ఆయనది తొణకని వ్యక్తిత్వం. అతనొక నిలువెత్తు గాంభీర్యం. అతనొక నడిచొచ్చే జ్ఞాపకం. నాన్న.. ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక చెరగని జ్ఞాపకం. నాన్న అంటే నాన్న మాత్రమే కాదు.. క్రమశిక్షణ మొదలు కార్యశీలత వరకు.. ఉన్నత విలువలకు బలమైన ప్రతీక. అలాంటి నాన్నకు ప్రేమతో.. ఈవారం ముఖచిత్ర కథనం..
మధుకర్ వైద్యుల, సెల్: 91827 77409

Father-Daughter

ఫాదర్స్ డే ఇలా

తండ్రి పాత్రకు తగిన గుర్తింపు కోసం ఒక కూతురు పడిన తపన నుంచి పుట్టిందే ఈ ఫాదర్స్ డే (పితృ దినోత్సవం). ఆ దిశగా ప్రయత్నాలు చేసింది వాషింగ్టన్‌కు చెందిన సొనారా. వాషింగ్టన్‌లోని స్పోక్యాన్ అనే గ్రామంలో నివాసముండే హెన్నీ జాక్సన్ స్మార్ట్, విలియమ్ స్మార్ట్ దంపతులకు ఆరో సంతానం సొనారా. సొనారాకి 6 నెలల వయసున్నప్పుడే తల్లి మరణించింది. అయినా మళ్లీ పెళ్లి చేసుకోకుండా వ్యవసాయం చేస్తూ తన బిడ్డలకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచారు. ఆరు నెలల పసిపాపకు పాలు పట్టడం, స్నానం చేయించడం, జోలపాడి నిద్ర పుచ్చడం.. ఇలా అన్నీ విలియం చేశారు. ఇలా పెరిగిన సొనారాకి 27 ఏళ్ల వయసులో ఒక ఆలోచన వచ్చింది. తన తండ్రి జన్మించిన జూన్‌లో తండ్రులందరి జన్మదినంగా జరపాలని ఆమె భావించింది. ఈ ఆలోచన గ్రామస్తులకు కూడా నచ్చడంతో అప్పటి నుంచి వారు ఆ గ్రామంలో ఈ వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు. 1910 జూన్ 19న ప్రపంచంలోనే తొలిసారిగా అధికారికంగా అమెరికాలో ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. తర్వాత అది ప్రపంచ వ్యాప్తమైంది.

నాన్న..బాపు..తండ్రి..ఆ పదానికి ఎన్నో నిర్వచనాలు. అమ్మ అనే పిలుపులో ఎంత మాధుర్యముందో నాన్న పిలుపులో అంతే భరోసా ఉంటుంది. ఆయన ప్రేమ మనసుకు అందని నిర్వచనం. భయం వెనుక భవిష్యత్తును తీర్చిదిద్దాలనే బాధ్యత. కనురెప్పచాటున కన్నీటిని దాచుకుని తప్పుచేస్తే గుడ్లురుమి చూసే వ్యక్తిత్వం ఆయన స్వంతం. అందుకే ఆయన మనసు అర్థం కాని అంతరిక్షం. అంతుచిక్కని పాతాళం. ఆయనను అర్థం చేసుకోవాలంటే ఆయనలా పుట్టాల్సిందే. బతుకు నావ వ్యసనాల గాలికి కొట్టుకు పోకుండా క్రమశిక్షణల తెరచాపలను పైకెత్తి గమ్యం వైపు నడిపించే దీప స్థంభం నాన్న.
fathersday

కనిపించని సూర్యుడు

సూర్యుడు ప్రతిరోజు ఉదయాన్నే ప్రత్యక్షమవుతాడు. కానీ తండ్రి సాయంకాలమే దర్శనమిస్తాడు. సూర్యోదయానికి ముందే లేచి ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లే నాన్న ఎప్పడో సూర్యాస్తమయం తర్వాతే ఇంటికి చేరుకుంటాడు. పిల్లల్ని లాలించి, ఆడించి, బుజ్జగించి నిద్రపుచ్చి తనెప్పుడో ఓ ముద్ద తిని నిద్రపోతాడు. కంటినిండా నిద్రలేకున్నా, కడుపునిండా బువ్వ లేకు న్నా కనుపాపల్లాంటి పిల్లలకు కనురెప్ప తానై కాపాడుతుంటాడు. ఇంటి బాధ్యతలన్నింటిని తన భుజస్కందాలపై మోస్తూ, తన శ్రమను, సంపాదనను కుటుంబానికే వెచ్చిస్తాడు. చిన్నతనంలో ప్రేమతో ముద్దులాడినా, పెద్దవుతుంటే క్రమశిక్షణ పేరుతో కటువుగా ఉన్నా అనురాగానికీ, ఆప్యాయతలకు ప్రతీక నాన్న. తన పిల్లల బంగారు భవితకు బాటలు వేయడం కోసం నిరంతరం శ్రమిస్తూ, తపిస్తూ వారికి మార్గదర్శకుడిగా ఉంటారు. అందుకే ఆయన చీకటివెనుక తన పిల్లలకు వెలుగును పంచే కనిపించని సూర్యుడు.
father-and-daughter

ఆడపిల్లలకు ఎక్కువ ఇష్ట్రం

పిల్లలకు తల్లి అవసరం ఎంతనో తండ్రి తోడు కూడా అంతే. తల్లి తన బిడ్డలను పొత్తిళ్లలో పొదివి పట్టుకుని ఉగ్గుపాలతో అత్త.. అమ్మ అంటూ తొలిపలుకులు నేర్పుతుంది. తండ్రి తన చిటికిన వేలు అందించి నడకతో పాటు తప్పటడుగులు వేయకుండా నడవడికను నేర్పుతాడు. ఒక వయస్సు వరకు తల్లిచాటు పిల్లలుగా పెరిగినప్పటికీ పెద్దవుతుంటే తండ్రినే అనుసరిస్తారు. ముఖ్యంగా మగపిల్లలు పెద్దయ్యాక కూడా తమ అవసరాలను తల్లి ముందు పెట్టి నెరవేర్చుకుంటే, ఆడపిల్లలు మాత్రం తండ్రితోనే నేరుగా తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఒక రకంగా మగపిల్లలు తల్లినుండి, ఆడపిల్లలు తండ్రి నుండి ఎక్కువ ప్రేమను పొందుతారు.

అమ్మను మరిపించేలా..

మారుతున్న జీవన ప్రమాణాల నేపథ్యంలో అమ్మ బాధ్యతలు కూడా నేడు నాన్న నెరవేర్చగలుగుతున్నాడు. ఇద్దరూ ఉద్యోగస్తులై ఉండే ఇంట్లో తల్లితో పాటు తండ్రి కూడా ఇంటి పనులన్నింటిలోనూ భాగస్వామిగా ఉంటున్నాడు. వంటపనిలోనూ తాను భాగమవుతున్నాడు. తల్లి కూరవండాలంటే తండ్రి కూరగాయలు కోయడం, తల్లి వంట చేస్తే తండ్రి పిల్లలను పట్టుకోవడం, బ్రెష్, స్నానాలు చేయించడం, వారిని స్కూలుకు రెడీ చేసి తినిపించడం, స్కూల్‌కు తీసుకువెళ్లి వదిలి రావడం వంటి పనులన్నీ తండ్రే చేస్తున్నాడు. దీంతో తల్లి కంటే తండ్రే పిల్లలకు దగ్గరవుతున్నాడు. కొన్ని సందర్భాల్లో తల్లి బీజీగా ఉన్నా, ఉద్యోగానికి వెళ్లినా తండ్రే తల్లవుతున్నాడు. పిల్లలకు వంట చేసి పెట్టడం, లంచ్‌బాక్సులు సర్దడం, ఆడపిల్లలుంటే జడలు వేయడం కూడా నాన్నే చేస్తున్నాడు. తల్లి దగ్గర బిడియంగా ఉండే పిల్లలు కూడా తండ్రి దగ్గర స్వేచ్ఛగా తమ మనోభావాలను పంచుకుంటున్నారు. తరగతి గదిలో తమ తోటి స్నేహితులతో ఎలాగైతే తమ అభిప్రాయాలను, ఇష్టాయిష్టాలను పంచుకుంటారో తండ్రితోనూ అంతే చనువుగా తమ అభిప్రాయాలను వెల్లడించగలుగుతున్నారు. పిల్లలను బయటకు తీసుకువెళ్లడం, వారితో కలిసి ఆడడం, వారిని ప్రోత్సహించడం, సబ్జెకుల విషయంలో సలహాలు ఇవ్వడం, సందేహాలను నివృత్తి చేయడం వంటి పనులతో ఒక రకంగా తండ్రి పిల్లలకు తల్లిని మరిపించగలుగుతున్నాడు.

తండ్రీ మారుతున్నాడు.

ఒకప్పుడు తండ్రి అంటే పిల్లలకు భయం ఉండేది. కానీ ఆధునిక యుగంలో ఆ పరిస్థితి ఎంతో మారింది. తండ్రి పిల్లల మనోభావాలకు అనుగుణంగా మారుతున్నాడు. పిల్లల అభిరుచులు, అభిప్రాయాలను గౌరవించినప్పుడు మేలే జరుగుతుందన్న విషయాన్ని నాన్నలు గ్రహిస్తున్నారు. చదువు విషయంలో గానీ, పెళ్ళి విషయంలో గానీ పిల్లల మనోభావాలను గుర్తించేందుకు తండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వారి ఇష్టప్రకారం అనువైన కోర్సులు చదివించడం, అనుకున్న ఉద్యోగం దక్కేలా ప్రోత్సహించడం, యుక్తవయసుకొచ్చి ప్రేమలో పడితే నిండుమనసుతో అంగీకరించడం, నచ్చిన వారితో పెళ్ళి జరిపించడం...ఈ బాధ్యతలన్నీ తండ్రులు నేడు మనస్ఫూరిగా నిర్వహిస్తున్నారు. తన కళ్లతో పిల్లలకు ప్రపంచాన్ని చూపడంలో, తాను కష్టపడుతూ పిల్లల శ్రేయస్సే ధ్యేయంగా పిల్లల్ని సాకడంలో అమ్మకంటే తానేమీ తీసిపోలేదని ఇప్పటి నాన్న నిరూపిస్తున్నాడు.

బాధ్యతలతో పాటే ప్రేమ

తండ్రికి పిల్లల పట్ల ఎంతటి బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువే ప్రేమ ఉంటుంది. తండ్రి బాధ్యతలను వ్యక్తీకరించినంత సూటిగా ప్రేమను వ్యక్తికరించలేడు. కారణం ప్రేమ శృతిమించితే బాధ్యతలు మరిచి పోతాననే భావన కావచ్చు. తండ్రికి కొడుకు కంటే కూతురంటేనే కొంత ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందుకే కొడుక్కు బాధ్యతలు పంచి, కూతురుకు ప్రేమను పంచి పెంచుతాడు. దానివల్ల రేపు తన కొడుకు తన లాగే తన పిల్లల బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాడన్న నమ్మకం. నిజానికి ప్రతి తండ్రి చిన్నప్పటి నుంచి పిల్లల్ని ముద్దు చేసి, చదువు చెప్పి, వారు జీవితంలో స్థిరపడే వరకూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు. అయితే కూతురు విషయంలో మరింత ఎక్కువ బాధ్యతగా వ్యవహరిస్తాడు. మరో ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన కూతురు తమ కుటుంబ గౌరవాన్ని కాపాడేలా ఉండాలని కోరుకుంటాడు. అలాగే పెళ్లి చేసుకుని ఒకింటికి వెళ్లే కూతురుకు ఎటువంటి కష్టం కలగకుండా కలకాలం సంతోషంగా ఉండాలనీ తండ్రి కోరుకుంటాడు.

నాన్నే హీరో...

చిన్నతనం నుండి కూడా పిల్లలు తమ తండ్రులనే హీరోలుగా ఊహించుకుంటారు. తనను భుజాల మీద ఎక్కించుకుంటే తన తండ్రి హనుమంతుడంతా బలవంతుడనుకుంటారు. ఆయన చేసే వృత్తి చిన్నదైనా, పెద్దదైనా తమ తండ్రికంటే మరెవ్వరూ అంత అంకితభావంతో చేయరని తలుస్తారు. ఆయన చేసే వృత్తి ఉన్నతమైనదైతే వారు తమ తండ్రినే ఆదర్శంగా ఎంపిక చేసుకుని అనుసరించడం సహజం. అలాంటి ఆదర్శ వ్యక్తిగా నాన్నే కనిపించగలిగితే ఆ పిల్లలకు అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. కుటుంబాన్ని నడిపించడంలో తండ్రి పాత్రను పిల్లలు గమనిస్తుంటారు. కుటుంబానికి ఎదురయ్యే సామాన్య సమస్యలు మొదలు, ఆర్థిక, సామాజిక సమస్యలన్నింటిని ఆయన పరిష్కరిస్తున్న విధానం వారిని ఆకట్టుకుంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యం చెడనివ్వకుండా కుటుంబాన్ని నడిపించే తీరు పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. తల్లిని ప్రేమగా చూసుకునే తండ్రి నుంచే ఆడపిల్లలు ప్రేమను పొందగలుగుతారు. స్కూల్‌కు వెళ్లింది మొదలు పెళ్లయ్యేంత వరకు తన తండ్రి తన వెనుక ఉన్నాడనే మనోధైర్యమే వారిని ముందుకు నడిపిస్తుంది. అందుకే అమ్మాయిలు తరుచుగా తమ తండ్రినే తమ బెస్ట్ ఫ్రెండ్‌గా అభివర్ణిస్తుంటారు.
map

52 దేశాల్లో

ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో నాన్నల గౌరవార్థం జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని పితృ దినోత్సవం (ఫాదర్స్ డే)గా పాటిస్తున్నారు. మాతృత్వానికే కాక పితృత్వానికి కూడా విలువనిస్తూ... తమ ఎదుగుదలకు అహర్నిశలూ పాటు పడుతున్న తండ్రికి తమ ప్రేమ కానుకగా పిల్లలందరూ ఈ ఫాదర్స్ డేని జరుపుకుంటున్నారు.

నాన్నకు బహుమతులు

నాన్నలను, తాతలను సంస్మరించుకునేందుకు 20వ శతాబ్దం ప్రారంభం నుంచే ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల తేదీలలో ఫాదర్స్ డేని జరుపుకున్నా, మన దేశంలో మాత్రం ప్రతి ఏడాది జూన్ 18వ తేదీన జరుపుకుంటున్నాం. ఈ రోజున పిల్లలు తమ నాన్నలకు బహుమతులు ఇస్తా రు. అలాగే కుటుంబ సభ్యులందరూ ఇళ్ళల్లో ప్రత్యేకమైన విందులు ఏర్పాటు చేసి, తండ్రితో సంతోషంగా గడుపుతారు.
father-and-daughter2

ది గ్రేట్ నాన్న

అతని పేరు క్వియాన్ క్జయోఫెంగ్. ఉండేది చైనాలోని షాంఘైలో. అతను మార్కెటింగ్ బిజినెస్ చేసేవాడు. ఆయనకు కూతురు పుట్టింది. అతని ఆనందానికి అవధుల్లేవు. తన గారాల పట్టికోసం చేస్తున్న బిజినెస్‌లన్నీ మానేసాడు. ఫుల్ టైం ఇంటికే పరిమితమయ్యాడు. ఆ బంగారుతల్లిని రాజకుమారిలాగా పెంచాలనుకున్నాడు. కూతురి మీదున్న ప్రేమతో తను ధరించే ప్రతీ డ్రెస్సు ప్రత్యేకంగా ఉండాలని అనుకున్నాడు. కూతురుకోసం ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. ఒక్కో డ్రెస్సు కోసం నెలల టైం వెచ్చించి స్పెషల్ డ్రెస్సులు స్వహస్తాలతో కూతురికోసం కుట్టుతున్నాడు. బిడ్డకోసం ఇప్పటి వరకు 100 పైగా హ్యాండ్ మేయిడ్ డ్రెస్సులు కుట్టాడట. ప్రతీ వారం తన కూతురిని ఒక కొత్త డ్రెస్ తో సర్‌ప్రైజ్ చేస్తాడట. ఎందుకింత కష్టం అని ఎవరైనా అంటే.. 5 సంవత్సరాల వయసున్న తన కూతురు ఆనందమే నా ఆనందం. నాబిడ్డ చిన్నతనం మొత్తం ఆనందంగా గడవాలి. తను ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చెయ్యాలి. అదే నాక్కూడా ఆనందం అని చెప్తాడట క్వియాన్. కూతురి ఆనందం కోసం ఇంత చేస్తున్న ఈ తండ్రి నిజంగా గ్రేట్ కదా.

కొడుకు ఫెయిల్ తండ్రి పండుగ

ఏ తండ్రైనా తన కొడుకు ఫెయిల్ అయితే నాలుగు తిట్లు తిడతాడు మహా అయితే కొడతాడు.. కానీ విచిత్రంగా ఓ తండ్రి కొడుకు ఫెయిల్ అయ్యాడని స్వీట్లు పంచి, క్రాకర్లు కాల్చి పండగ చేశాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌కు చెందిన సురేంద్ర వ్యాస్ కుమారుడు అయుష్ వ్యాస్ 2018 పదవతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు చెప్పాడు అయుష్.. దీంతో వెంటనే బజారుకెళ్ళిన సురేంద్ర వ్యాస్.. స్వీట్స్ , కాల్చడానికి క్రాకర్లు తెచ్చాడు. ఇంటివద్ద టెంటు వేసి పలువురికి స్వీట్స్ పంచుతూ క్రాకర్లు కాల్చాడు. ఇదేంటని సురేంద్రను ప్రశ్నిస్తే పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. పైగా ఆత్మహత్యలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థులందరికీ నేను చెప్పదలిచేదేంటంటే బోర్డు పరీక్షలే అంతిమం కాదు. ఇలాంటివి జీవితంలో ఎన్నో వస్తాయి వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి అని ఉద్బోధించాడు.
nagarjuna

మీరే మాకు స్ఫూర్తి...

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి నటించిన అరుదైన చిత్రం మనం . 2014 మే 23న విడుదలైన ఈ మూవీ గత ఏడాది నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా అక్కినేని నాగార్జున తన తండ్రి నాగేశ్వరరావును స్మరించుకుంటూ నాన్నా.. మనం అంతా కలిసి నటించిన మనం మూవీ విడుదలై నేటితో నాలుగేళ్లు. మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాం.. ఆ జ్ఞాపకాలతో నవ్వుతూనే ఉంటాం. జీవితాన్ని మరణాన్ని ఎలా ఎదుర్కోవాలో మిమ్మల్ని చూసి స్పూర్తి పొందాం. మరణం ముంచుకొస్తున్నా మీ ముఖంలో చిరునవ్వు చెరిగిపోలేదు. ఏడుపు అనేది దరికి చేరనివ్వలేదు. నాన్నా.. అనుక్షణం మీ నవ్వులతోనే మనం అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు నాగార్జున.
Aamir-Khan

నాన్నంటే చచ్చేంత భయం

మా నాన్న హిట్లర్ కంటే చాలా డేంజర్, ఆయన అంటే చచ్చేంత భయం అని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ దంగల్ చిత్రం ప్రచార కార్యక్రమం సందర్భంగా చెప్పుకున్నాడు. అయితే తను మాత్రం నిజ జీవితంలో తన పిల్లలతో కఠినంగా ఉండనని కూడా చెప్పుకున్నాడు. నేను అలా ఉండను కానీ, మా నాన్న హిట్లర్ కంటే చాలా డేంజర్. మాకు ఆయనంటే చాలా భయం అని సమాధానమిచ్చాడు. ఈ కాలంలో పిల్లలు ఏమవ్వాలని అనుకుంటున్నారో వారే నిర్ణయించుకుంటున్నారని, వారిని సపోర్ట్ చేస్తే చాలని, వారు ఎంచుకున్న రంగంలో లాభనష్టాల గురించి వారికి వివరించాలని అమీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
sasi-kiran

నాన్న కూతురిగా ఒక్క హిట్

నాన్న ఎప్పుడూ ఒక్క మాట చెప్పేవారు. పనిని నమ్ముకున్నవారికి ఎప్పుడు అపజయం ఉండదు అని. నాన్న నటనను ప్రేమించేవారు. అందుకే ఆయన 700 సినిమాల్లో విలక్షణమైన పాత్రలను వేసి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పరిశ్రమలో ఆయన స్థానాన్ని ఎవరూ పూర్తి చేయలేరని ఎంతో మంది ప్రముఖులు చెప్పారు. నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఆయన కూతురుగా ఒక్క మంచి హిట్ సాధించాలని ఉంది. నాకు డైరెక్షన్ అంటే ఇష్టం ఉన్నా.. నాన్నతో ఎప్పుడూ చెప్పలేదు. ఆయన మమ్మల్ని పరిశ్రమకు, సినీ వాతావరణానికి చాలా దూరంగా పెంచారు. ఆయన సినిమాలు చూడటమే తప్ప.. ఎప్పుడూ షూటింగుకు వెళ్లేవాళ్లం కాదు. నాన్న నటించిన మా నాన్నకు పెళ్ళి సినిమాకు నంది అవార్డు వచ్చింది. అదే సమయానికి నాకు పాప పుట్టింది. పాపకు ఆయనే నైరుతి అని పేరు పెట్టారు. తన సినీ జీవితంలో తొలకరి జల్లును తీసుకువచ్చిందని పాపను ఎంతో ఆప్యాయంగా చూసేవారు. అందుకే కచ్చితంగా మానాన్నే నాకు ఆదర్శం నా ఎదుగుదలకు అభివృద్ధికి ఆయనెంతో కారణం ఆయనే నాకు స్పూర్తి. ఎప్పటికీ ఆయన బాటలోనే నడుస్తా అంటూ తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఎం.ఎస్. నారాయణ కూతురు శశికిరణ్.
punam

నాన్న త్యాగమే ఈ విజయం

మా నాన్న నా కోసం ఎంతో త్యాగం చేశాడు. డబ్బు ఎప్పుడూ నిలవదు. మనం విజయం కోసం పోరాడుతున్నప్పుడు డబ్బే మన వెంట పరుగులు తీస్తూ వస్తుంది. నేను ఈ స్థాయికి రావడానికి మా నాన్నే కారణం అంటున్నారు పూనమ్ యాదవ్. కామన్వెల్త్‌లో మహిళల వెయిట్ లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ స్వర్ణపతకం కైవసం చేసుకుని, వార్తల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన పూనమ్ యాదవ్ బాల్యం నుంచే వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రాక్టీస్ చేశారు. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి కైలాస్ యాదవ్ ఆ దిశగా ఆమెను ప్రోత్సహించారు. వెయిట్ లిఫ్టింగ్ గేమ్ ఎందుకు, మరో క్రీడను ఎంచుకోవచ్చుకదా? అన్నవారూ ఉన్నారు. ఆడవారికి ఇదేం ఆట అని నోటిపై వేళ్లు పెట్టుకుని, ఆశ్చర్యం వ్యక్తం చేసిన వారందరికీ పూనమ్ తన స్వర్ణపతకంతో సమాధానం చెప్పారు.
Shruti_Haasan

మా నాన్న బెస్ట్ ఇన్ వరల్డ్

మా నాన్నగారు బెస్ట్ ఇన్ ది వరల్డ్ అనొచ్చు. పిల్లల్ని ఎలా పెంచాలో ఆయనకు బాగా తెలుసు. పిల్లలు వేసే ప్రతి అడుగునీ గమనించాలి తప్ప, వాళ్లను అసలు అడుగులే వేయనీయకుండా అన్నీ తల్లిదండ్రులే సమకూర్చేస్తే పెద్దయ్యాక వారు ఇబ్బంది పడతారు. అందుకే మా నాన్నగారు మా తప్పుల్ని మమ్మల్ని చేయనిచ్చారు. ఆ తప్పుల్లోంచి ఒప్పులు నేర్చుకునేలా గైడ్ చేశారు. మా అడుగులు మేమే వేశాం. జీవితానికి ఏది సరైనదో తెలుసుకోగలిగాం అని శృతీహాసన్ అన్నారు. నా చిన్నప్పుడు నాన్న ఓ పెద్ద బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి బాగా డబ్బు కావాల్సి వచ్చింది. అప్పుడు నాన్న నాతో నేను చేస్తున్న ఈ సినిమాకి చాలా డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఉంటున్న ఈ పెద్దింటికి బదులు చిన్న ఫ్లాట్లో ఉండాల్సి వస్తుందేమో. నీకు ఓకేనా? అనడిగారు. మీరుంటే చాలు.. నాకు ఓకే అని నాన్నతో అన్నాను. నాన్న హానెస్ట్ పర్సన్. జెంటిల్మేన్. చిన్నప్పుడు ఆయన గురించి పెద్దగా అర్థం కాకపోయినా మంచి వ్యక్తి అని మాత్రం తెలిసింది. పెద్దయ్యాక పూర్తిగా తెలిసింది. అందుకే నాన్నంటే ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది అని ఒక సందర్భంలో తన తండ్రి గురించి శృతీహాసన్ చెప్పారు.
father-and-daughter1

సినిమా నాన్న

వాస్తవికమైనా, తెరమీదైనా అమ్మకు ఇచ్చినంత ప్రాధాన్యం నాన్నకు లేదనే చెప్పాలి. అందుకే నాన్న ప్రేమతో వచ్చిన సినిమాలు తక్కువే. అయితే కాలం మారుతుంది. నాన్న ప్రేమను సినిమాగా తీయడానికి, నాన్న మీద పాటలు తీయడానికి కొంతమంది దర్శకులు ధైర్యం చేస్తున్నారు. నాన్న జ్ఞాపకాలను సీరియల్‌గా తప్ప సినిమాగా తీయడం సాధ్యంకాదేమో. అందుకే ఆయనపై సినిమాలు అంతగా రాలేదనుకుంటా. అలాగని నాన్నప్రేమ వెండితెర నెక్కలేదా అంటే అదేం లేదు. పాతతరం నుంచి వర్తమానం వరకూ ఎన్నో సినిమాలు కుటుంబంలో, సమాజంలో నాన్నకు గల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ వచ్చాయి. నాన్న, ఆకాశమంతా, నాన్నకు ప్రేమతో, హైపర్, సన్నాఫ్ సత్యమూర్తి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు, రాజాబాబు... ఇలా ఎన్నో సినిమాలు నాన్నతో ఉన్న అనుబంధాన్నీ, ఆత్మీయతనూ వివరిస్తూ వచ్చాయి. ఇంకా రావాలి కూడా.

1031
Tags

More News

VIRAL NEWS

Featured Articles