ప్రతిసృష్టి సాధ్యమా..!?


Sun,April 15, 2018 03:21 AM

-రెండు కిడ్నీలు.. ఒక గుండె.. ఎంతకిస్తావ్?ఒక్కో కిడ్నీ 50 వేల చొప్పున రెండూ లక్ష రూపాయలు, గుండె మాత్రం లక్షా 80 వేలకు తక్కువ రాదు...ఒకేసారి ఓ పది గుండెలు తీసుకుంటే డిస్కౌంట్ ఏమన్నా ఉందా...? ఓ పదివేలు తగ్గించుకో..

-నగరంలోనే అతిపెద్ద మెడికల్ షాపు అది. ఒక్కో జబ్బుకు సంబంధించిన మందులు ఒక్కో విభాగంగా విభజితమై ఉన్నాయి. మరోపక్క ఒక స్టోరేజీ గది. పెద్ద పెద్ద బాక్సులు వరుసగా పేర్చి ఉన్నాయి. కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, పాంక్రియాస్.. ఇలా ఆ బాక్సుల ముందు, లోపల ఏముందో పేర్లు రాసి ఉన్నాయి. ఎవరికి కావాల్సిన అవయవాన్ని వాళ్లు కొనుక్కెళ్తున్నారు. అచ్చం పారాసిటమాల్ టాబ్లెట్ల లాగానే..!

-ఏంటీ అర్థం పర్థం లేని మాటలు అనుకుంటున్నారా? ఇవి నిజం సంభాషణలే. ఇదేదో ఫాంటసీ సినిమా కాదు. సైన్స్ ఫిక్షన్ నవల అసలే కాదు.. రాబోయే రోజుల్లో కనిపించే పరిస్థితికి అద్దం పడుతున్న విజన్. తలనొప్పి టాబ్లెట్స్ కొనుక్కున్నంత తేలిగ్గా గా అవయవాల్ని కూడా కొనుక్కోగలిగే రోజులు రానున్నాయ్! హార్ట్ ఫెయిల్యూర్, లివర్ సిర్రోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలున్న వాళ్లు అవయవ దానం చేసే దాతల కోసం ఇక వెతకనక్కరలేదు. బ్రెయిన్ డెడ్ అయిన కెడావర్ డోనర్ల కోసం వేచి చూడక్కర్లేదు. చాలా ఆశ్చర్యకరంగా అరిగిన కీళ్లకు చేసే కీళ్ల మార్పిడి ఆపరేషన్ పాత చింతకాయ పచ్చడి కానుంది. కార్టిలేజ్‌ని పునర్నిర్మించడం, కొత్త కీలును పుట్టించడం సాధ్యమవనుంది. సృష్టికి ప్రతిసృష్టి చేసి శరీరంలోని ఏ అవయవాన్నైనా కొత్తగా పుట్టించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
వీటన్నింటి వెనుక ఉన్న మంత్రదండం ఒకటే.. మూలకణం (స్టెమ్ సెల్).మూలకణాలు.. ఇప్పుడు వైద్యరంగ నిపుణులు, శాస్త్రవేత్తల వేదమంత్రం ఇది. గత కొన్నేళ్లుగా దీర్ఘకాలిక జబ్బుల చికిత్స కోసం కొత్త ఆశలు పుట్టిస్తున్న కణాలివి. వివిధ రకాల కారణాల వల్ల పాక్షికంగా దెబ్బతిన్న శరీర భాగాలను మరమ్మతు చేయడం దగ్గరి నుంచి కొత్త కణాలను పుట్టించడం దాకా ఇవి చేయని పని లేదని నిపుణులు అంటున్నారు. వయసు రీత్యా ఏర్పడ్డ ముడుతలకు బొటాక్స్ బదులు మూలకణాలతో పునర్యవ్వనం కల్పించవచ్చునని అంటున్నారు. అందుకే, మూల కణ చికిత్స ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది!
STEMCELL-RESEARCH

ఏమిటివి?

మూలకణం అని వాటి పేరులోనే ఉంది. శరీరంలోని కణాలన్నింటికీ మూలమైనవి ఇవి. వీటిని అర్థం చేసుకోవాలంటే ఇంత పెద్ద శరీరం మనకు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. తల్లిదండ్రుల్లోని రెండు చిన్న కణాలైన అండం, వీర్యకణాలు కలిసిపోయి పిండకణం ఏర్పడుతుంది. అది ఒకటి రెండుగా, రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా.. ఇలా విభజన చెందుతూ కణాల సముదాయంగా రూపొందుతుంది. ఈ కణాల సముదాయం వివిధ రకాల కణజాలాలుగా, అవయవాలుగా, అవయవ వ్యవస్థలుగా, చివరికి ఇంతటి శరీరంగా ఏర్పడుతుంది. మొదట ఏర్పడిన కణాల సముదాయం (పిండం) వివిధ రకాల కణజాలాలుగా విభజితమై వేర్వేరు విధులను నిర్వర్తించే అవయవాలుగా ఏర్పడుతాయి. ఇలా పిండంలోని మూల కణాల మాదిరిగానే పెద్దవాళ్లలోని మూలకణాలు కూడా కణాల సముదాయాన్ని ఏర్పరిచి వాటిని వేర్వేరు రకాల కణజాలాలుగా విభేదనం చెందించగల శక్తిని కలిగివుంటాయి. అంటే, మూల కణాలను చర్మంలోకి పంపిస్తే చర్మకణాలుగా, గుండెలోకి పంపితే గుండె కండర కణాలుగా, రక్తంలో రక్త కణాలుగా... ఇలా వివిధ రకాల అవయవాలకు చెందిన కణాలుగా అవి మార్పు చెందగలుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మూలకణాలు పరిణతి చెందని కణాలు. వాటిని ఏ అవయవానికి పంపిస్తే దానికి సంబంధించిన కణాలుగా పరిణతి చెందుతాయి. అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకెళ్లి ఏ ప్రాంతంలో వదిలేస్తే, ఆ ప్రాంత సంస్కృతితోనే పెరిగినట్టుగా అన్నమాట.

ఉపయోగం ఎలా?

మూల కణాలను సేకరించిన తరువాత వాటిని ప్రయోగశాలలో కల్చర్ చేస్తారు. తరువాత అవసరమున్న చోటుకి ప్రవేశపెడితే అవి ఆయా కణాలుగా పరిణతి చెందుతాయి. ఉదాహరణకు బట్టతల మీద వెంట్రుకలు పెరిగేట్టు చేయవచ్చు. దెబ్బతిన్న భాగాలను మరమ్మతు చేయవచ్చు. చర్మంపై ఎక్కడైనా చిన్న గాయమైందనుకోండి. చాలా కొద్దిరోజుల్లోనే అది మానిపోతుంది. మానిపోవడం అంటే.. అక్కడి చర్మ కణాలు విభజన చెంది మరిన్ని కొత్త కణాలను పుట్టిస్తాయి. తద్వారా దెబ్బతిన్న చర్మ భాగం కొత్త కణాలతో భర్తీ అయి గాయం మానిపోతుంది. గాయం మానడం కష్టం అయిన వాళ్లకు మూలకణాలు ఎక్కిస్తే అవి చర్మ కణాలుగా పరిణతి చెంది కొత్త చర్మాన్ని ఏర్పరుస్తాయి. ఏ శరీర భాగంలో సమస్య ఉన్నా ఈ మూల కణ చికిత్స ద్వారా మరమ్మతు చేయవచ్చన్నమాట. మూలకణాలను అనేక రకాల వ్యాధుల చికిత్సల్లో ఇప్పటికే వాడుతున్నారు. వెన్నుపాము, గుండె, కీళ్ల చికిత్సల్లో మూలకణాలు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. దెబ్బతిన్న గుండె కణాల పునరుజ్జీవనానికి, వెన్నుపాము మరమ్మతులకు, కీళ్లలో కార్టిలేజ్‌ను పునరుత్పత్తి చెందించడంలో మూలకణ చికిత్సలు ఇటీవలి కాలంలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇకపోతే, బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో మూలకణ మార్పిడి అనేక మందిని బతికించింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న మూలకణ చికిత్సలే కాకుండా త్వరలోనే మరిన్ని చికిత్సలూ అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు, అవయవాల తయారీలోనూ ఇవి ఉపయోగపడి అవయవ మార్పిడిలోనూ నవ శకానికి నాంది పలుకబోతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

ఎక్కడుంటాయి?

మూల కణాలు (స్టెమ్ సెల్స్) ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అంటే బిడ్డ పుట్టక ముందు పిండదశలో ఉన్నప్పటి మూల కణాలు. రెండో రకం పెద్దవాళ్లలో ఉండేవి. ఇవి పిండంలోనే కాకుండా బొడ్డు తాడు (అంబిలికల్ కార్డ్), పాల దంతాలలో కూడా ఉంటాయి. ఇక పెద్దవాళ్లలో ముఖ్యంగా ఎముక మజ్జ (బోన్ మ్యారో)లో ఎక్కువగా ఉంటాయి. మెదడు, రక్తనాళాలు, దంతాలు, చర్మం, గుండె, కాలేయం, గట్, ఎముక కండరాలు, పెరిఫెరల్ బ్లడ్‌లో కూడా మూల కణాలుంటాయి. అవసరం అయినప్పుడు ఎవరి మూల కణాలు వాళ్లకే తీసి పెట్టవచ్చు. పిండం నుంచి తీసిన మూలకణాలను భద్రపరుచుకునే వెసులుబాటు కూడా ఉంది.
STEMCELL-RESEARCH1

కొత్త రెటినా..!

కంటి చికిత్సల్లో కూడా మూలకణాలు విప్లవాత్మక మార్పును తేనున్నాయి. దెబ్బ తిన్న రెటినాను ఆరోగ్యకరంగా మలచడానికి కూడా స్టెమ్‌సెల్స్ ఉపయోగపడుతాయని అమెరికాలోని నేషనల్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు నిరూపించారు. రెటినాలో కాంతిని గ్రహించే గ్రాహకాలను వారు ఆరోగ్యవంతంగా తయారుచేశారు. కంటిలో వెనుక భాగంలో రెటినల్ పిగ్మెంట్ ఎపిథీలియమ్ (ఆర్‌పిఇ) అనే ఒక పొర ఉంటుంది. ఈ కణాల పైన సన్నని దారాల్లాంటి నిర్మాణాలుంటాయి. వీటిని సీలియా అంటారు. రెటినాలోని ఫొటో రిసెప్టార్లు (కాంతిని గ్రహించే గ్రాహకాలు) సరిగా పనిచేయాలంటే ఈ సీలియా కీలకమైనవి. కాబట్టి రెటినా ఆరోగ్యంగా ఉండి, మన చూపు బాగుండడానికి మూల కారణం ఈ ఆర్‌పిఇ అన్నమాట. ఈ రెటినల్ పిగ్మెంట్ ఎపిథీలియమ్ (ఆర్‌పిఇ)ని నిపుణులు మూలకణాలను ఉపయోగించి తయారుచేయగలిగారు. మూలకణాల నుంచి తయారుచేసి ఆర్‌పిఇని మాక్యులర్ డీజనరేషన్ (ఎఎండి) ఉన్న పేషెంట్లకు మార్పిడి చేస్తే మంచి ఫలితాలుంటాయని నేషనల్ ఐ ఇనిస్టిట్యూట్‌కి చెందిన సైంటిస్టులు అంటున్నారు. వయసు పెరిగిన వాళ్లలో సాధారణంగా కనిపించే సమస్య మాక్యులర్ డీజనరేషన్ డిసీజ్. ఈ పరిశోధన పై పేషెంట్లలో కొత్త ఆశలు కలిగిస్తున్నది.
STEMCELL-RESEARCH2

పరిశోధనలు ఇంకా జరుగాలి

మన శరీరంలోని ఏ కణాలైనా దెబ్బతింటే తిరిగి మరమ్మతు చేసుకునేందుకు కొత్త కణాలు పుట్టుకొస్తాయి. ఉదాహరణకి ఏ చర్మానికో గాయమైందనుకోండి. కొన్నాళ్లకు కొత్త కణాలు పెరిగి గాయమైన చోట బాగు చేస్తాయి. కానీ నాడీకణాలు అలా పునరుత్పత్తి చెందలేవు. ఒకసారి దెబ్బతింటే ఇక అవి అంతే. అందుకే వెన్నుపాములోని నాడీకణాలు దెబ్బతిని పక్షవాతం వచ్చినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెన్నుపాముకు దెబ్బలు తగిలి దానిలోని నాడులు డ్యామేజి అవుతుంటాయి. ఇలాంటప్పుడు వాళ్లు పూర్తిగా కోలుకోవడమనేది జరగని పని. కాని స్టెమ్ సెల్ థెరపీ ఇలాంటి వాళ్లకి కొత్త ఆశలు కల్పిస్తున్నది. ఇలా యాక్సిడెంట్ల పాలబడి, వెన్నుపాము దెబ్బతింటున్నవాళ్లలో ప్రొడక్టివ్ వయసులో వాళ్లు అంటే ఇరవైలలో ఉండేవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. వీళ్లు పక్షవాతం వచ్చి ఏ పనీ చేయలేకపోతే అటు కుటుంబానికి నష్టం. మొత్తంగా దేశానికే నష్టం. అందుకే ఇందుకు పరిష్కారంగా రీజనరేటివ్ థెరపీ మీద ఆశలు పెరిగాయి. రీజనరేటివ్ థెరపీలో జన్యు చికిత్స, కణ చికిత్స అని రెండు రకాలున్నాయి. కణ చికిత్సలో మళ్లీ రెండు రకాలు. మూలకణాలే కాకుండా ముక్కులో ఉండే అల్‌ఫ్యాక్టరీ ఎన్‌షీటింగ్ కణాలను కూడా దెబ్బతిన్న వెన్నుపాము మరమ్మతు కోసం ప్రయత్నం చేశారు. అయితే రిజల్ట్స్ అంత బాగా లేవు. మూలకణాలను సాధారణంగా బోన్‌మ్యారోలో నుంచి తీస్తారు. అంతేగాకుండా కొవ్వు కణజాలంలో ఉండే అడిపోస్ డిరైవ్‌డ్ స్టెమ్‌సెల్స్‌ను కూడా వాడుతారు. అన్నింటికన్నా మేలైనవి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. వీటిని ప్రయోగాల్లో వాడడానికి మన దేశంలో అనుమతి లేదు. విదేశాల్లో మాత్రం ఐవిఎఫ్ ప్రక్రియలో వాడకుండా మిగిలిపోయిన ఎంబ్రియో (పిండం)లను ఇందుకోసం వాడుతున్నారు. అయితే మూలకణ చికిత్స కూడా కొందరిలో విజయవంతం అవుతున్నది. కొందరిలో సక్సెస్ కావడం లేదు. కనీసం 70-80 శాతం సక్సెస్ అయినా ఉంటే పూర్తిస్థాయిలో రెగ్యులర్ చికిత్సగా వాడొచ్చు. మూలకణ చికిత్సపై ఇంకా మరిన్ని ప్రయోగాలు జరగాల్సి ఉంది.

హెచ్‌ఐవీ చికిత్స కోసం..

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ చికిత్సలో భాగంగా యాంటివైరల్ మందులను ఇస్తూ వస్తున్నారు. ఇవి హెచ్‌ఐవి కణాల సంఖ్యను చాలావరకు తగ్గించేస్తాయి. కానీ, వైరస్‌ను మొత్తంగా తొలగించాలంటే శక్తివంతమైన, సమర్థవంతమైన ఇమ్యూన్ (వ్యాధినిరోధక) చర్యలు ఉండాలి. ఈ దిశగా చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు జన్యు ఇంజినీరింగ్ మూలకణాల రూపంలో దానికో మార్గం దొరికింది.
మూలకణాలే కొత్త చికిత్సలకు మార్గం వేస్తూ అద్భుతాలను చూపిస్తుండగా, ఇప్పుడు జన్యు ఇంజినీరింగ్ ద్వారా ఆరోగ్యకరమైన మూలకణాలను కూడా పుట్టిస్తున్నారు. రక్తాన్ని ఉత్పత్తి చేసే మూలకణాలను (హీమోపాయిటిక్ స్టెమ్ సెల్స్)ను శాస్త్రవేత్తలు ఈ విధంగా ఉత్పత్తి చేయగలిగారు. ఇవి కైమెరిక్ యాంటిజెన్ రీసెప్టార్‌ను కలిగిన జన్యువుతో ఉంటాయి. ఇవి హెచ్‌ఐవి ఇన్‌ఫెక్ట్ అయిన కణాలను గుర్తించి నశింపచేయగలుగుతాయి. అంతేకాదు రెండేళ్ల వరకూ అవి అలాగే ఉండిపోతాయి. తద్వారా ఎయిడ్స్ వైరస్‌కి వ్యతిరేకంగా దీర్ఘకాల ఇమ్యునిటీ ఉంటుంది. కాబట్టి, వారిలో హెచ్‌ఐవి పూర్తిగా నశించడమే కాకుండా మళ్లీ ఇన్‌ఫెక్షన్‌కు అవకాశం కూడా గణనీయంగా తగ్గిపోతుందన్నమాట.
STEMCELL-RESEARCH3

కొత్త గుండె కణాలు..!

మూలకణాల నుంచి గుండెకు సంబంధించిన కణాలను ఒకే దశలో ఉత్పత్తి చేయగల పద్ధతిని కనుగొన్నారు సాక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు. కొన్ని సందర్భాల్లో గుండె చికిత్సల్లో మూలకణాలను వాడుతున్నారు గానీ, ఇది చాలా సంక్లిష్టమైంది. పిండం నుంచి సేకరించిన మూలకణాలను గుండెకణాలుగా అభివృద్ధి చెందించడం చాలా కష్టతరమైన పని. కనీసం 200 జన్యువులు అనేక పరమాణు స్థాయిలో చర్యలు జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు సాక్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు మూలకణాలను గుండె కణాలుగా మార్చేందుకు ఒకే ఒక జన్యువుకు సంబంధించిన చర్యలు చాలని అంటున్నారు. వైఏపీ అనే జన్యువును వివిధ రకాల పద్ధతుల్లో మానిప్యులేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా మొదట సిఆర్‌ఐఎస్‌పిఆర్-కాస్9 అనే ప్రొటీన్‌ను జన్యుకత్తెరగా వారు ఉపయోగించారు. దీనికి ప్రభావితమైన కణాలన్నీ ఆశ్చర్యకరంగా మూలకణ స్థాయి నుంచి స్పందించే హృదయ కణాలుగా మారిపోయాయి. అయితే, ఈ పరిశోధన ఇంకా ప్రయోగదశలోనే ఉంది. మరిన్ని లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది.
STEMCELL-RESEARCH4

పక్షవాతంలో విజయం

ఒకసారి పక్షవాతానికి గురైన శరీర భాగాన్ని మొన్నటి వరకూ అయితే పునరుద్ధరించలేక పోయేవాళ్లం. కానీ, మూలకణ చికిత్స పక్షవాతానికి కూడా మేలు చేస్తున్నది. ఇటీవలే యాక్సిడెంట్ వల్ల పక్షవాతానికి గురైన ఓ వ్యక్తిలో చలనం కలిగించారు కాలిఫోర్నియా డాక్టర్లు. రోడ్డు ప్రమాదంలో గాయపడి తల తప్ప, మిగిలిన భాగాలన్నీ చచ్చుబడ్డాయి క్రిస్టోఫర్ బోసెన్‌కి. ఇలా పక్షవాతానికి గురైన భాగాలకు మామూలుగా అయితే, ఎటువంటి చికిత్స అందించలేరు. ఫిజియోథెరపీ ద్వారా కొంతవరకు ఫలితం ఉంటుంది. అయితే, అనూహ్యంగా క్రిస్టొఫర్ మాత్రం చేతులు కదిలించి ఎన్నో పనులు చేయగలిగాడు. ఇందుకు ఉపయోగపడిందే మూలకణ చికిత్స. మూలకణ చికిత్స ఇలాంటి మరెన్నో వ్యాధుల విషయంలో కొత్త ఆశలు కలిగిస్తున్నది. మూలకణాలపై పరిశోధనలు కేవలం పక్షవాతం విషయంలోనే కాదు, పార్కిన్‌సన్స్ నుంచి డయాబెటిస్, క్యాన్సర్ల దాకా నడుస్తున్నాయి.
STEMCELL-RESEARCH5

అస్థిపంజర కండరాల సృష్టి

కండరాలు క్షీణింపజేసే వ్యాధి అయిన మస్కులర్ డిస్ట్రోఫీతో ఓ దశాబ్ద కాలం క్రితం వెంకటేశ్ అనే బాలుడు మరణించడం అప్పట్లో సంచలనం. జన్యువ్యాధి అయిన దీనికి చికిత్స లేదు. కండర కణాలు క్షీణించిపోయి, చివరికి శరీరం మొత్తం పనిచేయకుండా అవుతుంది. ఇలాంటి కండర వ్యాధుల విషయంలో కొత్త చికిత్సలకు ఆస్కారం కలిగిస్తున్నాయి మూలకణ పరిశోధనలు. క్యాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అస్థిపంజరం తాలూకు కండరాలను సృష్టించారు. డుచినె మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్నవాళ్లలో కండర కణాల్లోని కండర ఫైబర్లలోని డిస్ట్రోఫిన్ అనే ప్రొటీన్ లోపిస్తుంది. ఈ ప్రొటీన్ లోపం లేని, ప్రొటీన్‌తో కూడిన కండర కణాలను ఈ మూలకణాలను ఉపయోగించి తయారుచేయగలిగారు. ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ నుంచి అస్థిపంజర కండరాలను ఉత్పత్తి చేసి, ట్రాన్స్‌ప్లాంట్ చేయగలిగారు. కండర క్షీణత వ్యాధులకు మూలకణ మార్పిడి చికిత్సలో ముందడుగుకు నాంది పలికాయీ పరిశోధనలు. ఈ పరిశోధన నేచర్ పత్రికలో ప్రచురితమైంది.
STEMCELL-RESEARCH6

ఆర్థోపెడిక్స్‌లో మంచి ప్రత్యామ్నాయం

కొన్ని రకాల సమస్యలకు స్టెమ్ సెల్స్ చాలా ఉపయోగపడతాయి. మోకాలు, తుంటి కీళ్ల మరమ్మతులో మూలకణ చికిత్స మంచి ఫలితాలను ఇస్తున్నది. సాధారణంగా క్రీడాకారుల్లో ఫుట్‌బాల్, క్రికెట్ లాంటి ఆటలు ఆడేటప్పుడు ఇవి డ్యామేజి అవుతుంటాయి. మనదేశంలో మాత్రం ఎక్కువగా రోడ్డు ప్రమాదాల వల్లనే మోకాలు, తుంటి కీళ్లు డ్యామేజి అవుతున్నాయి. కీలు దగ్గర కార్టిలేజ్ అనే మెత్తని పదార్థం ఉంటుంది. ఇది కీలు ఆరోగ్యానికి చాలా అవసరం. యాక్సిడెంట్ల వల్ల ఈ కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు చిన్న వయసులో వాళ్లకే ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి కార్టిలేజ్‌ను రీప్లేస్ చేయడానికి మూలకణ చికిత్స మంచి ప్రత్యామ్నాయంగా ఉంటున్నది. అయితే ఆర్థరైటిస్ రాకముందే వీలైనంత తొందరగా చికిత్స ఇవ్వాలి. ఇలా యాక్సిడెంట్‌లో దెబ్బల వల్ల వచ్చే ఆర్థరైటిస్‌ను సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. మూడు పదుల వయసులో ఉన్నవాళ్లకి కీలుమార్పిడి చేస్తే మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం కలుగుతుంది. కాబట్టి వాళ్లకి అది ఉపయోగకరం కాదు. అందుకే సకాలంలో కీలు గాయాలను గుర్తించి మూలకణ చికిత్స చేయాలి. ఇలాంటివాళ్లలో కార్టిలేజ్ పాడయిందీ లేనిదీ ప్రత్యేకమైన కార్టిలేజ్ మ్యాపింగ్ ఎంఆర్‌ఐ స్కాన్‌లో మాత్రమే తెలుస్తుంది. ఇందుకోసం మోకాలు నుంచి కొంత కార్టిలేజ్‌ను తీసుకుని ల్యాబ్‌లో ప్రత్యేక పరిస్థితుల మధ్య 4-6 వారాల పాటు పెంచుతారు. అలా వచ్చిన కార్టిలేజ్ మూలకణాలను కాండ్రోబ్లాస్ట్‌లు అంటారు. కాండ్రోబ్లాస్ట్‌ల నుంచి తయారైన కార్టిలేజ్‌ను కాండ్రాన్ అంటారు. ఇప్పుడు రెండోసారి ఆపరేషన్ చేసి మూలకణాలతో కూడిన కాండ్రాన్‌ను ఫైబ్రిన్ గ్లూతో అతికిస్తారు. అదేవిధంగా కొందరికి తుంటి జాయింట్‌కి అనేక కారణాల వల్ల రక్తప్రసరణ ఆగిపోతుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, స్టిరాయిడ్స్ అతిగా వాడడం, కొన్ని రకాల పరిస్థితుల వల్ల ఇలా రక్తప్రసరణ ఉండదు. దీన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫ్యుమరల్ హెడ్ అంటారు. ఇలాంటప్పుడు కూడా బోన్ మ్యారో కణాల నుంచి ఆస్టియో బ్టాస్ట్ కణాలను తయారుచేసి ఎక్కిస్తే రీజనరేట్ అవుతాయి. చిన్న వయసులోనే తుంటి నొప్పి వస్తున్నదంటే అనుమానించి స్పెషల్ ఎంఆర్‌ఐ చేసి, అవసరమైతే మూలకణ చికిత్స ఇవ్వాలి. కాండ్రాన్ ఇంప్లాంటేషన్ గానీ, ఆస్టియోబ్లాస్ట్ ఇంప్లాంటేషన్ గానీ ఆర్థోపెడిక్స్‌లో విజయవంతంగా ఫలితాలనిస్తున్నది.

1100
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles