కువలయాశ్వుడు


Sun,April 22, 2018 12:27 AM

మంచితనానికీ, విశ్వాసానికీ గల అవినాభావ సంబంధాన్ని అలుసుగా చేసుకొని మనుషులను వాడుకోవడం, ఆడుకోవడం కొందరికి అలవాటైపోయింది. కానీ ఎవరెంత ప్రోద్బలంతో మనిషి అసలైన మనస్తత్వాన్ని మార్చాలని ప్రయత్నించినా, దాని స్వరూపాన్ని వ్యతిరేకంగా చూపాలని యత్నించినా నీటిలోంచి వచ్చిన ఉప్పు నీటిలో కరిగిపోయే పారదర్శకత మనస్తత్వ స్వాభావికతలోనూ నిక్షిప్తమై ఉంటుంది. అందుకే ఎటువంటి పరిస్థితులూ, విభిన్న అసమానతలూ మనిషి అసలైన మనస్తత్వాన్ని ఇసుమంతైనా సడలించలేవు. మానవత్వం మనస్తత్వంగా మారితే, మంచితనం తన నైజంలో ఇమిడిపోతే, స్వాభావికతను తన గుణంలోనూ, రూపంలోనూ సృష్టీకరిస్తే కువలయాశ్వునిలా చరిత్ర మనకు పరిచయం చేస్తుంది. సంకల్పంతో, ప్రయత్నంతో సాధించలేనిదేదీ లేదని నిరూపించిన కువలయాశ్వుని జీవితగాథ స్వచ్ఛతకు ప్రతీక.శత్రుజిత్తు కుమారుడే కువలయాశ్వుడు. ఈతని అసలు పేరు ఋతధ్వజుడు. గాలవుడనే ఋషి ఇతనికి కువలయాశ్వాన్ని ఇవ్వడం వల్ల ఋతధ్వజునికి ఆ పేరు వచ్చింది. అశ్వతరుడనే నాగేంద్రుని పుత్రులితని ప్రాణ స్నేహితులు. మంచితనానికి, పరోపకారానికి కువలయాశ్వుడు పెట్టింది పేరు. గాలవ మహర్షి ఒకనాడు తపస్సు చేస్తుండగా రాక్షసుడొకడు అక్కడికి వచ్చి ఋషి తపస్సును భంగపరచాలని వివిధ రూపాలతో ప్రత్యక్షమై ప్రయత్నిస్తున్నాడు. రాక్షసున్ని శపిద్దామా! అంటే తపఃఫలం అంతా వృథా అవుతుందని ఆలోచించాడు గాలవ మహర్షి. ఎటూ పాలుపోక ఆకాశానికేసి చూస్తుండిపోయిన గాలవునితో ఆకాశవాణి అశ్వాన్ని ఒకదాన్ని పంపిస్తున్నానని, దానిని శత్రుజిత్తు కుమారుడైన ఋతధ్వజనికి ఇవ్వమని చెబుతుంది. తన సమస్యకు ఇదెలా పరిష్కారమని ఆలోచిస్తుండగా గర్గుడు అశ్వాన్ని తీసుకొచ్చి శత్రుజిత్తు కొడుకుకు ఇచ్చి ఆ రాక్షసుని వెంబడించి సంహరించమనీ, గాలవముని తపస్సు భంగం కాకుండా చూడమనీ చెబుతాడు. ఎవరే సహాయం కోరినా తన శక్తులన్నీ కూడదీసుకొని బయలుదేరడం కువలయాశ్వుని గుణం. గర్గుడు ఇచ్చిన గుర్రాన్ని వాహనంగా చేసుకొని కువలయాశ్వుడు రాక్షసుని వెంట తరుముకుంటూ వెళ్ళాడు. ఆ రాక్షసుడు వరాహరూపంలో భూమిని బొరియలుగా చేసుకొని చొచ్చుకొనిపోయాడు.
Kulayashudu

కువలయాశ్వుడూ భూమిలోకీ చొచ్చుకొని వెళ్లి రాక్షసుని మట్టుపెట్టాడు. అంతలో అక్కడ భూగృహంలో కొందరు స్త్రీలు బందీలుగా ఉండడం చూసాడు. వారిలో మదాలస అనే యువతితో పాటు వివాహితులైన మరికొందరు స్త్రీలనూ పాతాళకేతుడు అపహరించి తీసుకొచ్చాడనీ తెలుసుకొని వారిని విడిపించడానికి పాతాళకేతుని సంహరిస్తాడు. మదాలసను ఇష్టపడతాడు కువలయాశ్వుడు. ఆమె కువలయాశ్వుని ఇష్టపడింది. తన సహాయం ఎవరికి కావలసి వచ్చినా వెనుకంజ వేయడు. కువలయాశ్వుని వేనోళ్ళ కొనియాడారా స్త్రీలంతా. తనతో మదాలసను వెంట బెట్టుకొని తన స్థానానికి చేరుకున్నాడు కువలయాశ్వుడు. అయితే మంచినీ, ధర్మాన్నీ నిలబెట్టే క్రమంలో ఆటుపోట్లు, ఆపదలూ తప్పవన్నట్లు తన తమ్ముడైన పాతాళకేతుని చంపిన కువలయాశ్వుని వంచించాలని కుట్రపన్నాడు తాళకీతుడు.
కువలయాశ్వుడు ఒకనాడు జనపదాలను రక్షించాలని గుర్రంపై బయలుదేరాడు. మార్గమధ్యంలోని అడవిలో పాతాళకేతుని సోదరుడు తాళకేతుడు మునిరూపంలో ఎదురుపడి తాను చేయబోయే యజ్ఞానికి సహాయం కావాలనీ తమ మెడలోని హారం ఇవ్వగలిగితే యజ్ఞం పరిపుష్టిగా జరుగుతుందనీ ప్రాధేయపడతాడు. అడిగిన వారికి కాదనీ, లేదనీ చెప్పడం తెలియని కువలయాశ్వుడు తన మెడలోని హారాన్ని తీసి ఇచ్చేస్తాడు. తాళకేతుడు తాను వచ్చే వరకు తన ఆశ్రమాన్ని కనిపెట్టుకొని ఉండాల్సిందని కువలయాశ్వుని ఒప్పిస్తాడు. అక్కడ మునిరూపంలోని తాళకేతుని మాట విని ఆశ్రమ పరిరక్షణలో ఉంటే, ఇక్కడ తాళకేతుడు రాక్షసమాయతో కువలయాశ్వుని నగరానికి వెళ్ళి తానిచ్చిన హారాన్ని చూపించి కువలయాశ్వుడు చనిపోయాడని ప్రచారం చేస్తాడు. మదాలస ఆ వార్త విని తట్టుకోలేక ప్రాణాలు విడుస్తుంది.
తాళకేతుడు ఏమీ ఎరుగనట్టు ఆశ్రమంలోని కువలయాశ్వుని చేరి ధన్యవాదాలు తెల్పి సెలవు తీసుకుంటాడు. కువలయాశ్వుడూ తన పనిని పరిపూర్తి చేయడానికి జనపదాలకు వెళ్ళి వారం రోజుల తర్వాత నగరానికి తిరిగివస్తాడు. తమ రాజు కుమారుని ప్రాణాలతో చూసిన వారి ఆనందానికి అవధుల్లేవు. విషయం తెలుసుకొని అదంతా రాక్షసమాయని అర్థం చేసుకుంటాడు. కానీ తన ప్రాణానికి ప్రాణమైన మదాలస లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేక విరక్తిలోకి వెళ్ళిపోతాడు కువలయాశ్వుడు. మంచివ్యక్తి, సర్వసమర్థత గల చక్రవర్తి, ప్రజాబంధువు అయిన తమ స్నేహితుడు కువలయాశ్వుని పరిస్థితిని చూసి తట్టుకోలేక నాగపుత్రులు ఇద్దరూ తమ తండ్రిని చేరి విషయం వివరిస్తారు.

లోకంలో మంచివారికి అన్యాయం జరుగరాదనీ, యత్నిస్తే సాధ్యంకానిది లేదనీ వారితో చెప్పిన ఆశ్వతరుడనే నాగేంద్రుడు సరస్వతీ దేవిని మెప్పించి గానం నేర్చుకొని, శివునికై తపస్సు చేసి మదాలసకు పునర్జన్మ కలిగేలా వరం పొందుతాడు. అలా మదాలస అశ్వతరునికే కూతురిగా జన్మిస్తుంది. ఆమెను తన శక్తితో పరిపూర్ణ స్త్రీగా మలిచి కువలయాశ్వునికిచ్చి పునర్వివాహం చేస్తాడు. నలుగురు పుత్రులతో మదాలస కువలయాశ్వులు ఆనందంగా జీవిస్తారు.మంచితనం, సాహసం, పరోపకారం తక్షణ సహాయం, సద్భావన, స్నేహ సౌరభం, మనుష్య ఆదరణ, స్త్రీలంటే గౌరవం.. కువలయాశ్వుని వ్యక్తిత్వంలో ధ్వనించే మహాగుణాలు. అందుకేనేమో తనలోని మానవత్వానికి గౌరవమిస్తూ పరిస్థితులూ తలవంచాయి. ఇలాంటి వ్యక్తిత్వం గల మనుషుల చరిత్రలు సమాజానికి జీవం పోస్తాయి. బతుక్కు సరైన నిర్వచనం చెప్తాయి.

520
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles